భారత్, కొరియా మ్యాచ్ డ్రా


Mon,March 25, 2019 01:53 AM

hockey
ఇపో (మలేసియా): అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో ఆదివారం భారత్, కొరియా మధ్య జరిగిన రెండో లీగ్ మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఆఖరి నిమిషంలో డిఫెన్సివ్‌లో చేసిన తప్పిదంతో టీమ్‌ఇండియా మూల్యం చెల్లించుకుంది. భారత్ తరఫున మన్‌దీప్ సింగ్ (28వ ని.) గోల్ చేయగా, జోంగ్‌హున్ జాంగ్ (60వ ని.) కొరియాకు గోల్ అందించాడు. భారీ వర్షం వల్ల నాలుగో క్వార్టర్‌లో మ్యాచ్‌ను కాసేపు ఆపేశారు.

దీంతో ఎనిమిది నిమిషాల సమయం వృథా అయ్యింది. ఆరంభం నుంచే అటాకింగ్ ఆడిన భారత మిడ్‌ఫీల్డర్ వివేక్ సాగర్ ప్రసాద్ తొలి నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని సృష్టించాడు. కానీ కొరియా డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. ప్రతీకారంగా కొరియన్లు దూకుడు చూపెట్టినా డిఫెండర్ సురేంద్ర కుమార్ నిలువరించాడు. బేస్‌లైన్ గేమ్‌తో అదరగొట్టిన మన్‌ప్రీత్ 10వ నిమిషంలో తొలి పెనాల్టీ సాధించినా.. గోల్ చేయలేకపోయాడు.

రెండో క్వార్టర్ చివరి నిమిషాల్లో భారత్‌కు రెండో పెనాల్టీ లభించినా కొరియా గోలీ అడ్డుకున్నాడు. వెంటనే దీటుగా స్పందించిన కొరియన్లు ఎదురుదాడులు మొదలుపెట్టినా.. కిమ్ హెంగోజిన్, జిహన్ యంగ్, లీ నమయోంగ్‌లు గ్రీన్‌కార్డ్‌కు గురయ్యారు. దీంతో 8 మందితోనే మిగతా మ్యాచ్‌ను ఆడింది. దీనిని సద్వినియోగం చేసుకున్న భారత్ 28వ నిమిషంలో తొలి గోల్ సాధించింది. మూడో క్వార్టర్‌లో టీమ్‌ఇండియా డిఫెన్స్ తప్పిదంతో కొరియాకు తొలి పెనాల్టీ లభించినా..

అమిత్ రొహిడాస్ డేంజర్ ఏరియా నుంచి బంతిని నిలువరించాడు. తర్వాత ఇరుజట్లకు పెనాల్టీలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాయి. ఆట మరో 53 సెకండ్లలో ముగుస్తుందనగా కొరియాకు పెనాల్టీ లభించింది. జాంగ్ కొట్టిన బలమైన డ్రాగ్‌ఫ్లికర్‌ను భారత గోలీ శ్రీజేశ్ అడ్డుకున్నాడు.

కానీ కొరియా రిఫరల్‌కు వెళ్లి మరో పెనాల్టీని సాధించింది. 22 సెకండ్లలో ఫైనల్ విజిల్ మోగుతుందనగా జాంగ్ రెండో ప్రయత్నంగా కొట్టిన సూపర్ షాట్ భారత్ గోల్ పోస్ట్‌ను ఛేదించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

254

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles