పతకాల పంట


Tue,December 3, 2019 02:02 AM

-భారత్‌కు ఒకే రోజు 16పతకాలు.. దక్షిణాసియా గేమ్స్‌
Kho-kho
కఠ్మాండు : దక్షిణాసియా గేమ్స్‌ (ఎస్‌ఏజీ)లో భారత ప్లేయర్లు సత్తాచాటారు. సోమవారం ఒక్క రోజే మొత్తం 16 పతకాలు (5 స్వర్ణాలు, 8రజతాలు, 3 కాంస్యాలు) కైవసం చేసుకొని అదరగొట్టారు. తైక్వాండోలో పది, ట్రైయథ్లాన్‌లో నాలుగు, బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు దక్కాయి. భారత పురుషుల, మహిళల బ్యాడ్మింటన్‌ జట్లు ఫైనల్లో శ్రీలంక జట్లను చిత్తుచేసి స్వర్ణ పతకాలు సాధించాయి. పురుషుల జట్టు 3-1తో లంక జట్టును మట్టికరిపిస్తే.. మహిళల టీమ్‌ 3-0తో అజేయంగా అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల తుదిపోరులో తొలుత బరిలోకి దిగిన స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 17-21, 21-15, 21-11తో దినుక కరుణరత్నెపై గెలిచాడు. సిరిల్‌వర్మ 21-17, 11-5తో ముందంజలో ఉన్న సమయంలో ప్రత్యర్థి సచిన్‌ దియాస్‌ వైదొలగడంతో భారత్‌ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అరుణ్‌ జార్జ్‌ - సాన్యం శుక్లా జోడీ లంక ద్వయం చేతిలో ఓడింది. అనంతరం గారగ కృష్ణ ప్రసాద్‌ - ధృవ్‌ కపిల జోడీ 21-14, 21-18తో లంక ద్వయం కరుణరత్నె - హసిత చనకపై గెలువడంతో ఫైనల్లో 3-1తో భారత్‌ విజయం సాధించింది. అంతకు ముందు సెమీస్‌లో భారత్‌ 3-0తో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. మహిళల సెమీస్‌లో 3-0తో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత ప్లేయర్లు సాయి ఉత్తేజిత రావు, గాయత్రి గోపీచంద్‌, సిక్కిరెడ్డి - జక్కంపూడి మేఘన... ఫైనల్లోనూ శ్రీలంకను 3-0తోనే చిత్తుచేశారు. బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత విభాగం పోటీలు మంగళవారం నుంచి జరుగనున్నాయి.

తైక్వాండోలో పది పతకాలు

తైక్వాండో పోటీల్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. రెండు స్వర్ణాలు సహా మొత్తం పది పతకాలు కైవసం చేసుకొని అదరగొట్టారు. డేనియల్‌ లాల్‌హుంతాంగ, లాలాఫక్జువాలా, లాల్‌త్లమునాపుయాతో కూడిన భారత త్రయం తొలుత పురుషుల టీమ్‌ పూమ్‌సే విభాగంలో పసిడి పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత గౌరవ్‌ సింగ్‌, హర్ష సింఘా ద్వయం పూమ్‌సే విభాగంలో స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. దీంతోపాటు పురుషుల, మహిళల టీమ్‌, వ్యక్తిగత విభాగాల్లో భారత అథ్లెట్లు ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలను చేజిక్కించుకున్నారు. ట్రయథ్లాన్‌ పోటీల్లో భారత అథ్లెట్లు ఓ స్వర్ణం సహా రెండు రజతాలు, ఓ కాంస్యాన్ని చేజిక్కించుకున్నారు. ఆదర్శ ఎంఎన్‌ సినిమోల్‌ పురుషుల వ్యక్తిగత ట్రయథ్లాన్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించగా.. ఇదే పోటీలో బిస్వర్‌జిత్‌ శ్రీకోమ్‌ రజతాన్ని కైవసం చేసుకున్నాడు. ఆదర్శ మూడు పోటీలను గంటా 2నిమిషాల 51సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలువగా, బిశ్వర్‌జిత్‌ (1:02:59) కాస్త వెనుకబడ్డాడు. మహిళల వ్యక్తిగత విభాగంలో తౌదమ్‌ సరోజినీ దేవి (1:14:00) రజతం, మోహన్‌ ప్రజ్ఞా (1:14:57) కాంస్య పతకాలను సాధించారు.

సెమీస్‌లో ఖో-ఖో జట్టు

రెండు విజయాలతో అదరగొట్టి భారత పురుషుల ఖో-ఖో జట్టు సెమీఫైనల్‌కు చేరింది. తొలుత నేపాల్‌ను ఇన్నింగ్స్‌ 12పాయింట్ల(17-5) తేడాతో మట్టికరిపించిన భారత్‌... ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను ఇన్నింగ్స్‌ రెండు పాయింట్ల(12-10)తో ఓడించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన మన జట్టు... చిట్టచివరన ఉన్న శ్రీలంకతో సెమీస్‌ను మంగవారం తలపడనుంది.

332

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles