100 రోజుల్లో


Tue,February 19, 2019 02:06 AM

kohli2

మెగాటోర్నీకి కౌంట్‌డౌన్ మొదలు

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రపంచకప్ టోర్నీకి సమయం దగ్గర పడింది. నాలుగేండ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్‌కు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ మివ్వబోతున్నది. తమ కలల కప్‌ను కైవసం చేసుకునేందుకు పది జట్లు కదన రంగంలోకి దూకుతున్నాయి. 11 వేదికల్లో జరిగే ప్రపంచకప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. సరిగ్గా 20 ఏండ్ల తర్వాత వరల్డ్‌కప్ టోర్నీకి ఇంగ్లండ్ వేదిక కాబోతున్నది. ఐదుసార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు భారత్, ఇంగ్లండ్ టైటిల్ ఫేవరెట్లలో ముందంజలో కొనసాగుతున్నాయి. తామేం తక్కువ కాదన్నట్లు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ గట్టిపోటీనిచ్చేందుకు తహతహలాడుతున్నాయి. ఇరవై ఏండ్ల తర్వాత ఇంగ్లండ్ వేదికగా జరుగబోతున్న ప్రపంచకప్ టోర్నీకి సరిగ్గా 100 రోజులు మిగిలున్న నేపథ్యంలో జట్ల బలబలాలపై ఓ కథనం.
లండన్: క్రికెట్ ప్రపంచకప్‌ను ఆస్వాదించే సమయం రానే వచ్చింది. వంద రోజుల వ్యవధిలో మెగా టోర్నీ అభిమానుల ముందుకు రాబోతున్నది. తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు జట్లన్నీ అస్త్రశస్ర్తాలను ఎంచుకుంటున్నాయి. తమ బలగాన్ని పటిష్ఠం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థి బలాలు, బలహీనతలను అంచ నా వేస్తూ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆతిథ్యమివ్వబోతున్న ప్రపంచకప్‌లో పది జట్లు పోటీకి దిగుతున్నాయి. మే 30న మొదలై జూలై 14న ముగిసే మెగా టోర్నీలో జట్లన్నీ రౌండ్‌రాబిన్ పద్థతిలో తలపడుతాయి. టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశిస్తాయి. సెమీస్ విజేతలు క్రికెట్ మక్కాగా పేరుగాంచిన చారిత్రక లార్డ్స్ మైదానంలో ఫైనల్ ఫైట్‌లో ఆడుతాయి.

ఆస్ట్రేలియా
వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాది అగ్రభాగం. ఏకంగా ఐదు సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన కంగారూలు డిఫెండింగ్ చాంపియన్‌గా మరోమారు టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆసీస్ క్రికెట్ భారీ కుదుపునకు లోనైంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, భారత్ చేతిలో సిరీస్ పరాజయాలతో కంగరూలు డీలా పడ్డారు. దీనికి తోడు స్టీ వ్‌స్మిత్, వార్నర్‌పై నిషేధం ఆ జట్టు గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. ఇదిలా ఉంటే జట్టుకు మూడు ప్రపంచకప్‌లు అందించిన దిగ్గజ రికీ పాంటింగ్‌ను సహాయక కోచ్‌గా నియమించడం ఆసీస్ గతిని మార్చే అవకాశముంది.

ఇంగ్లండ్
1975 మొదలు ప్రతి ప్రపంచకప్‌లో పోటీపడ్డ ఇంగ్లండ్ ఇప్పటి వరకు తమ టైటిల్ కలను నెరవేర్చుకోలేకపోయింది. 1979, 1992 టోర్నీల్లో ఫైనల్‌కు చేరినా కప్‌ను దక్కించుకోలేకపోయిన ఇంగ్లిష్ జట్టు గత టోర్నీలో గ్రూపు దశలోనే నిష్క్రమించి నిరాశపరిచింది. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో సొంతగడ్డపై పోటీకి దిగుతున్న ఇంగ్లండ్..బట్లర్, రాయ్, రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్ లాంటి ఆటగాళ్లతో బలంగా కనిపిస్తున్నది. వీరు స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తే..తమ చిరకాల కలను సాకారం చేసుకోవచ్చు.

దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా జట్టుకు ప్రపంచకప్ టోర్నీ ఏనాడు కలిసి రాలేదనే చెప్పాలి. 1992 నుంచి మొదలుపెడితే..2015 వరకు ఏ టోర్నీలోనూ సఫారీలు ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. జట్టు ఆల్‌రౌండర్లతో కనిపిస్తున్నా..ఒత్తిడికి చిత్తై ప్రత్యర్థికి తలొగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏబీ డివీలియర్స్, మోర్నీ మోర్కెల్ లాంటి కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం జట్టు గెలుపు అవకాశాలపై ప్రభావం చూపనుంది. 2018 మొదలు నుంచి వన్డేల్లో 12 గెలిచిన దక్షిణాఫ్రికా..పదింటి లో ఓటమిపాలైంది. డేవిడ్ మిల్లర్ మ్యాచ్ ను మలుపు తిప్పే ఆటగాళ్లలో ఒకడు.

పాకిస్థాన్, న్యూజిలాండ్
పాకిస్థాన్ అనిశ్చితికి ఆలవాలమైతే..ఆల్‌రౌండర్లు ఉన్నా..న్యూజిలాండ్‌కు ప్రపంచకప్ ఇప్పటికీ అందని ద్రాక్షగా ఊరిస్తూనే ఉన్నది. రెండేండ్ల క్రితం ఇంగ్లండ్‌లో భారత్‌పై చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకున్న పాక్..సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నది. మరోవైపు న్యూజిలాండ్ ఈసారైనా తమ కప్ ఆశలు నెరవేర్చుకోవాలన్న తలంపుతో ఉన్నది. కెప్టెన్ విలియమ్సన్‌కు తోడు గప్టిల్, టేలర్, సౌథీ, ఫెర్గుసన్‌తో బలంగా కనిపిస్తున్నది.

ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్
తామెంత మాత్రం పసికూనలం కాదని నిరూపించిన ఆఫ్ఘనిస్థాన్..మెగా టోర్నీలో పోటీకి సిద్ధమైంది. జింబాబ్వేపై ఉత్కంఠ విజయంతో ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన ఆఫ్ఘన్ సంచలనాలు సృష్టించేందుకు తహతహలాడుతున్నది. యువ స్పిన్నర్ రషీద్‌ఖాన్ ఆ జట్టు ప్రధాన అస్త్రం. మేటి జట్లకు సవాలు విసిరే స్థాయికి ఎదిగిన బంగ్లా తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. తమీమ్ ఇక్బాల్, షకీబల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, మొర్తజాతో బంగ్లా బలంగా ఉన్నది. ఇక శ్రీలంక, వెస్టిండీస్ తమ గతానికి భిన్నంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు జట్లు టెస్ట్‌ల్లో సంచలన విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాయి.

హాట్ ఫేవరెట్ భారత్


ప్రపంచకప్ హాట్ ఫేవరెట్లలో భారత్ ఒకటి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న టీమ్ ఇండియా ఈసారి కప్‌ను ఎలాగైనా ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నది. ఇటీవలి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరుస వన్డే సిరీస్ విజయాలతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న కోహ్లీసేన ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నది. సూపర్ ఫామ్‌మీదున్న కోహ్లీ జట్టును ముందుండి నడిపించే అవకాశముండగా, రోహిత్, ధవన్, ధోనీ, రాయు డు, జాదవ్‌తో బ్యాటింగ్ పటిష్ఠంగా కనిపిస్తున్నది. భువనేశ్వర్, బుమ్రా, షమీకి తోడు స్పిన్ ట్విన్స్ కుల్దీప్, చాహల్..ప్రత్యర్థి పనిపట్టేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు. హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్ రూపంలో జట్టుకు నిఖార్సైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఇంగ్లండ్ పరిస్థితులకు తగ్గట్లు మనోళ్లు రాణిస్తే.. ముచ్చటగా మూడోసారి కప్‌ను మద్దాడవచ్చు.

621

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles