క్రీడాపాత్రికేయ గురువు ఇకలేరు


Sat,April 4, 2015 03:50 AM

tnpillay11


హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఖేల్ ప్రతినిధి: క్రీడాపాత్రికేయ లోకానికి గురువుగా ఖ్యాతికెక్కిన టీఎన్ పిైళ్లె కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వెటరన్ పాత్రికేయుడు నగరంలోని ఓ దవాఖానలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. క్రీడాపాత్రికేయునిగానే గాకుండా అందరికీ అత్యంత సన్నిహితునిగా పేరుతెచ్చుకున్న 85ఏండ్ల పిైళ్లె స్వస్థలం చెన్నై. అయితే చిన్నప్పుడే కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడడంతో ఇక్కడే పాత్రికేయ వృత్తిని మొదలుపెట్టారు. ఆంగ్ల పత్రిక దక్కన్ క్రానికల్‌లో సుదీర్ఘంగా నాలుగు దశాబ్దాలు పనిచేసిన పిైళ్లె పాత్రికేయవృత్తిలో తొలి క్రీడాసంపాదకునిగా రికార్డు సృష్టించారు. క్రీడాపాత్రికేయ సలహాదారుగానూ సేవలందించిన పిైళ్లె..అఖిల భారత పాత్రికేయ సమాఖ్య, ఏపీ క్రీడాపాత్రికేయ సంఘాలను స్థాపించి వాటికి మార్గనిర్దేశనం చేశారు.

ఏపీ మహిళా క్రికెట్ సంఘం ఏర్పాటులో ఎనలేని కృషిచేసిన పిైళ్లె..ఆ సంఘానికి కార్యదర్శిగా సుదీర్ఘకాలం కొనసాగారు. జాతీయ మహిళల జట్టు మాజీ కెప్టెన్ పూర్ణిమారావు, ప్రస్తుత కెప్టెన్ మిథాలీరాజ్, వేణుగోపాలరావులాంటి క్రికెటర్ల ఎదుగుదలలో పిైళ్లె పాత్ర మరువలేనిది. 1990లో బీజింగ్ నుంచి ఆసియా క్రీడల వార్తలను పిైళ్లె రిపోర్ట్ చేసిన తీరు అద్భుతం. పిైళ్లె మృతిపట్ల క్రీడాపాత్రికేయులు సంతా పం వ్యక్తం చేశారు. ఎంపీ వీ. హనుమంతరావు, మాజీ మహిళా క్రికెటర్లు పూర్ణిమారావు, విద్యా యాదవ్, జ్యోతి జోషితో పాటు తెలుగు, ఆంగ్ల క్రీడాపాత్రికేయులు పిైళ్లె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. పిైళ్లె పార్థివదేహానికి అంత్యక్రియలను అల్వాల్ శ్మశానవాటికలో నిర్వహించారు.

క్రీడాపాత్రికేయులకు వేగుచుక్క: కేసీఆర్


సీనియర్ పాత్రికేయులు పిైళ్లె మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. యువ క్రీడా పాత్రికేయులను తయారుచేయడంతోపాటు క్రీడాసంఘాల అభివృద్ధికి పిైళ్లె ఎంతో దోహదం చేశారని సీఎం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పిైళ్లె క్రీడాపాత్రికేయలోకానికి వేగుచుక్కలాంటి వారని సీఎం కేసీఆర్ కొనియాడారు. పిైళ్లె మరణం క్రీడాపాత్రికేయలోకానికి తీరని నష్టమని క్రీడామంత్రి పద్మారావు గౌడ్, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ అన్నారు.

405

More News

VIRAL NEWS