భారత మార్కెట్‌లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్8..!


Wed,April 19, 2017 02:17 PM

శాంసంగ్ సంస్థ తన ప్రతిష్టాత్మక ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్8ను ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. గత కొద్ది రోజుల కిందటే ఈ ఫోన్ అమెరికాలో విడుదల కాగా, ఆ దేశంతోపాటు దక్షిణ కొరియాలోనూ గెలాక్సీ ఎస్8 కోసం ప్రీ ఆర్డర్లు ఇప్పటికే షురూ అయ్యాయి. ఈ క్రమంలో ఆ ఆర్డర్లు ఇప్పటికే 10లక్షలు దాటినట్టు తెలిసింది. ఇది గతంలో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎస్7 కన్నా అధికం కావడం విశేషం. కాగా గెలాక్సీ ఎస్8తో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్‌ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్‌లో విడుదలయ్యాయి. న్యూ ఢిల్లీలో జరిగిన ఈవెంట్‌లో శాంసంగ్ ఈ రెండు ఫోన్లను అట్టహాసంగా విడుదల చేసింది.

ధరలివే...
శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ధరను రూ.57,900గా నిర్ణయించింది. అలాగే ఎస్8 ప్లస్ ధర రూ.64,900గా ఉంది. మే 5వ తేదీ నుంచి ఈ ఫోన్లు ఇండియన్ మార్కెట్లో అమ్మనున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్రధాన ఆకర్షణలివే...


డిజైన్ అండ్ డిస్‌ప్లే...
గతంలో ఏ స్మార్ట్‌ఫోన్ రాని విధంగా స్టన్నింగ్ లుక్‌తో గెలాక్సీ ఎస్8 ను శాంసంగ్ రూపొందించింది. ఇన్ఫినిటీ డిస్‌ప్లే పేరిట ఓ కొత్త తరహా డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అమర్చింది. ఈ టెక్నాలజీ వల్ల ఫోన్‌లో అంచుల చివరి దాకా డిస్‌ప్లేనే ఉంటుంది. అంటే ఫోన్‌ను పట్టుకుంటే ఓ గ్లాస్‌ను పట్టుకున్న అనుభూతి కలుగుతుంది. ఫోన్ డిస్‌ప్లేకు, బాడీకి ఉన్న నిష్పత్తి శాతం 83.6. ఈ ఫోన్‌ను ఒక మూల నుంచి మరో మూలకు డయాగోనల్‌గా చూస్తే డిస్‌ప్లే సైజ్ 5.8గా ఉంటుంది. సూపర్ అమోలెడ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ డిస్‌ప్లే కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్‌ను కూడా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో అందిస్తున్నారు. దీని వల్ల ఫోన్‌కు ముందు భాగంలో స్క్రీన్ గార్డ్, వెనుక భాగంలో బ్యాక్ కేస్ వేసుకోవాల్సిన పని ఉండదు. అదేవిధంగా గెలాక్సీ ఎస్8 స్క్రీన్ 1440 x 2960 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. దీంతో ఫోన్ డిస్‌ప్లే చాలా క్వాలిటీ కలిగి ఉంటుంది. ఇమేజ్‌లు, వీడియోలు చక్కగా కనిపిస్తాయి. ఐపీ68 డస్ట్, వాటర్ ప్రూఫ్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది.
galaxy-s8-s8-plus
హార్డ్‌వేర్...
శాంసంగ్ గెలాక్సీ ఎస్8లో అధునాతన ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా 4 జీబీ ర్యామ్ కూడా ఉంది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో లభిస్తోంది. 256 జీబీ స్టోరేజ్ వరకు ఎస్‌డీ కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలను అమర్చారు. బ్యాక్ కెమెరా ద్వారా 4కే అల్ట్రా హెచ్‌డీ వీడియోలను తీసుకోవచ్చు. ఈ కెమెరాకు ఫ్లాష్ కూడా ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉండడం వల్ల సబ్జెక్ట్ కదులుతున్నా ఫొటోలు ఫాస్ట్‌గా, ఎలాంటి షేక్ లేకుండా తీసుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్...
లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 7.0 నూగట్‌ను ఇందులో అందిస్తున్నారు. దీంతోపాటు శాంసంగ్‌కు చెందిన పలు యాప్స్ కూడా ఇన్‌బిల్ట్‌గా వస్తున్నాయి. శాంసంగ్ పే, ఎస్ హెల్త్ వంటి యాప్స్‌తోపాటు బిక్స్‌బీ అనే కొత్త తరహా డిజిటల్ అసిస్టెంట్‌ను శాంసంగ్ తన గెలాక్సీ ఎస్8 ఫోన్‌లో అందిస్తున్నది. అయితే తొలి దశలో విడుదల చేసే ఫోన్లలో ఇది రావడం లేదు. దీన్ని అప్‌డేట్ రూపంలో కొన్ని రోజులకు అందించనున్నారు.

కనెక్టివిటీ...
యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, ఎల్‌టీఈ క్యాట్ 16, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు గెలాక్సీ ఎస్8లో ఉన్నాయి. యూఎస్‌బీ టైప్ సి పోర్టు 3.1 వెర్షన్‌ను కలిగి ఉంది. దీంతో డేటా స్పీడ్‌గా ప్రసారమవుతుంది. దీనికే చార్జర్‌ను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎల్‌టీఈ క్యాట్ 16 ఉండడం వల్ల 4జీని మించిన స్పీడ్ ఈ ఫోన్‌లో వస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై వల్ల వైఫై హాట్ స్పాట్‌ను దీని ద్వారా ఎక్కువ దూరంలోనూ ఉపయోగించుకోవచ్చు.
galaxy-s8-s8-plus
ఇతర ఫీచర్లు...
గెలాక్సీ ఎస్8 వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. అదేవిధంగా ఈ ఫోన్ బ్యాటరీ 3000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగి ఉంది. చార్జర్‌తో దీన్ని వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. అందుకు కావల్సిన ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఈ ఫోన్‌లో ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ను వైర్‌లెస్‌గా కూడా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా కళ్లను స్కాన్ చేసే ఐరిస్ స్కానర్ ఉంది. దీంతో ఫేస్ పాస్‌వర్డ్ సెట్ చేసుకోవచ్చు. కంపాస్, బారో మీటర్, హార్ట్‌రేట్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి.

గెలాక్సీ ఎస్8 ప్లస్‌లో...


శాంసంగ్ గెలాక్సీ ఎస్8లో ఉన్న అన్ని ఫీచర్లు ఇందులోనూ ఉన్నాయి. కాకపోతే ఈ ఫోన్‌కు చెందిన డిస్‌ప్లే సైజ్, బ్యాటరీల్లో మాత్రమే తేడా ఉంది. ఈ ఫోన్ 6.2 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌ను కలిగి ఉండగా, ఇందులో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇవి రెండు మాత్రమే ఎస్8 ప్లస్‌లో తేడా ఉన్నాయి. మిగిలిన ఫీచర్లన్నీ ఎస్8లోనివే ఉన్నాయి.

2989

More News

VIRAL NEWS