క్రేజ్ పెంచుతున్న వన్ ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్..!


Tue,November 14, 2017 03:05 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 5టీని ఈ నెల 16వ తేదీన విడుదల చేయనున్న విషయం విదితమే. కాగా ప్రస్తుతం ఈ ఫోన్ మొబైల్ ప్రియుల్లో క్రేజ్‌ను పెంచుతూ రోజు రోజుకీ ఆసక్తిని కలిగిస్తున్నది. ఎందుకంటే వన్‌ప్లస్ తయారు చేసే ఫోన్లలో ఉండే ఫీచర్లు శాంసంగ్, ఎల్‌జీ, హెచ్‌టీసీ కంపెనీలకు చెందిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఉండే ఫీచర్లకు సమానంగా ఉంటాయి. కానీ ఆ కంపెనీ ఫోన్లతో పోలిస్తే వన్‌ప్లస్ ఫోన్ల ధరే చాలా తక్కువగా ఉంటుంది. కనుకనే మొదటి నుంచి వన్‌ప్లస్ ఫోన్ల పట్ల యూజర్లు ఆసక్తిని కనబరుస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మరో రెండు రోజుల్లో విడుదల కానున్న వన్‌ప్లస్ 5టీ పట్ల కూడా యూజర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ ఫోన్ విడుదలపై ఆసక్తిగా ఉన్నారు.

5 సిటీల్లో లైవ్ స్ట్రీమింగ్...


వన్ ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ మెయిన్ ఈవెంట్ మొదటి సారిగా న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జరుగుతుండగా అదే సమయంలో ఆ ఈవెంట్‌ను భారత్‌లోనూ 5 సిటీల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, పూణె నగరాల్లోని పీవీఆర్ థియేటర్లలో వన్ ప్లస్ 5టీ లాంచ్ ఈవెంట్‌ను లైవ్ షో వేయనున్నారు. ఇందుకు గాను ఇప్పటికే బుక్‌మైషోలో టిక్కెట్లను విక్రయించగా అవి హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 16వ తేదీన గురువారం భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు వన్‌ప్లస్ 5టీ ఈవెంట్ జరగనుంది. లాంచ్ సందర్భంగా వన్‌ప్లస్ 5టీలో ఉండే ఫీచర్లను ఆ కంపెనీ ప్రతినిధులు వివరిస్తారు.

వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌లో 6.01 ఇంచ్ ఆప్టిక్ అమోలెడ్ 2.5డి కర్వ్‌డ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, బెజెల్ లెస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉండనున్నట్టు సమాచారం. ఇక ఈ ఫోన్ ధర వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

2342

More News

VIRAL NEWS