'ఈ ఫోన్‌'కు సులువుగా మంటలు అంటుకుంటయ్..!


Thu,December 31, 2015 06:40 PM

'ఐఫోన్'... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లలో అధిక శాతం మందిని నయా ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. దీంట్లో 'ఐఫోన్ 6' పేరిట ఇటీవలే పలు మోడల్స్ కూడా విడుదలయ్యాయి. అయితే ఈ మోడల్స్‌లో 'ఐఫోన్ 6 ప్లస్' డివైస్‌కు సులువుగా మంటలు అంటుకునే స్వభావం ఉందని తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌నను గురించి తెలుసుకున్న టెక్ నిపుణులు చెబుతున్నారు.

మనలో అధిక శాతం మంది నిద్రించే సమయంలో స్మార్ట్‌ఫోన్లను పక్కన పెట్టుకుంటారు. ఇంకా కొందరైతే రాత్రి ఫోన్‌కు చార్జింగ్ పెట్టి పడుకుని ఉదయాన్నే తీసేస్తారు. అయితే ఈ రెండు పద్ధతులు అంత సురక్షితం కాదని హ్యాండ్‌సెట్ తయారీదార్లు చెబుతున్నారు. యూఎస్‌ఏ అట్లాంటాకు చెందిన డేవిడ్ గ్రిమ్‌స్లే అనే వ్యక్తి కూడా పైన చెప్పిన విధంగానే నిద్రించే ముందు తన 'ఐఫోన్ 6 ప్లస్‌'కు చార్జింగ్ పెట్టాడు. కాగా అర్ధరాత్రి సమయంలో తనకు ఒక ఫోన్ రింగ్ లాంటి సౌండ్ వినపడింది. కాల్ వచ్చిందేమోనని లేచి చూశాడు. కానీ అది ఫోన్ కాల్ మాత్రం కాదు, చార్జింగ్‌లో ఉన్న అతని ఐఫోన్‌కు చిన్నపాటి మెరుపులు, మంటలతో వస్తున్న శబ్దాలు.

ఇది గమనించిన డేవిడ్ వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేశాడు. లేదంటే పెద్ద అగ్ని ప్రమాదమే సంభవించి ఉండేదని అతను ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే ఈ విషయాన్ని అతను యాపిల్ సంస్థ ప్రతినిధులకు చేరవేయగా వారు ఆ కాలిపోయిన డివైస్‌ను తీసుకుని కొత్త ఫోన్‌ను ఇచ్చారు. కాగా కొత్త ఫోన్ ఇచ్చినప్పటికీ తనకు సంతృప్తి లేదని, ఒక వేళ మళ్లీ నూతన డివైస్‌కు కూడా అలాగే జరిగితే అప్పుడు తన పరిస్థితి ఏమిటని అతను ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా సదరు ఐఫోన్ 6 ప్లస్‌కు అకస్మాత్తుగా మంటలు ఎందుకు అంటుకున్నాయో కారణాలు మాత్రం తెలియలేదు. డివైస్‌తో వచ్చిన బ్యాటరీలో లోపం ఉన్నా, దానికి ఇచ్చిన చార్జర్ కాకుండా వేరేది ఉపయోగించినా ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుందని ఉత్పత్తిదారులు తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటి ఐఫోన్ 6 ప్లస్‌కు వీటిలో ఏదీ కారణం కాదని, అయినా మంటలు ఎందుకు వ్యాపించాయో తెలియడం లేదని వారు సెలవిస్తున్నారు.

13282
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS