'ట్రూకాలర్ నుంచి మీ ఫోన్ నంబర్‌'ను తీసేయండిలా..!


Thu,February 4, 2016 12:31 PM

'ట్రూకాలర్'... స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న వినియోగదారులకు చిరపరిచితమైన పేరిది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్... ఇలా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఈ యాప్ ఉంటే చాలు, యూజర్లు తమకు వచ్చే కాల్స్‌లో ఉండే తెలియని ఫోన్ నంబర్లను, వాటిని వాడుతున్న వారి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ట్రూ కాలర్‌ను వాడేవారి వివరాలు మాత్రమే ఈ విధంగా లభిస్తాయనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే దీన్ని మీరు వాడకపోయినప్పటికీ మీ వివరాలు ట్రూకాలర్‌లో ఉండేందుకు అవకాశం ఉంది.

అదెలాగంటే మీకు తెలిసిన వారెవరైనా మీ ఫోన్ నంబర్‌ను తమ డివైస్ కాంటాక్ట్ లిస్ట్ లేదా అడ్రస్‌బుక్‌లో సేవ్ చేసుకుని వారు ట్రూ కాలర్‌ను వాడుతుంటే అప్పుడు ఆ కాంటాక్ట్ లిస్ట్, అడ్రస్‌బుక్‌లలోని ఫోన్ నంబర్లు, వాటికి ఇచ్చిన పేర్లు ఇతర వివరాలు ట్రూ కాలర్ డేటాబేస్‌లోకి ఆటోమేటిక్‌గా వెళ్లిపోతాయి. అప్పుడు ఎవరికైనా మీ సమాచారం మొత్తం ఇట్టే తెలిసిపోతుంది. ఇలా కాకుండా ఉండాలన్నా, మీ పేరు, ఇతర వివరాలు ట్రూ కాలర్‌లో కనిపించకుండా చేయాలన్నా అందుకు ఓ సింపుల్ టిప్‌ను పాటిస్తే చాలు.

కింద పేర్కొన్న సూచనల ద్వారా యూజర్లు తమ వివరాలను ట్రూ కాలర్ నుంచి పూర్తిగా తొలగించుకోవచ్చు.ఆండ్రాయిడ్ వాడుతుంటే...
ట్రూకాలర్ యాప్‌లోకి వెళ్లి ఎడమవైపు పైభాగంలో మూలన ఉన్న పీపుల్ ఐకాన్‌ను ఓపెన్ చేసి Settings > About > Deactivate account ను ట్యాప్ చేయాలి.

ఐఫోన్‌లో...
యాప్‌లోకి వెళ్లి కుడి వైపు పైభాగంలో మూలన ఉన్న గేర్ ఐకాన్‌ను ఓపెన్ చేసి About Truecaller > Scroll down > Deactivate Truecaller ను ట్యాప్ చేయాలి.

విండోస్ మొబైల్...
ట్రూకాలర్ యాప్‌లోకి వెళ్లి కుడివైపు కింది భాగంలో మూలన ఉన్న 3 చుక్కలను ఓపెన్ చేసి Settings > Help > Deactivate account ను టచ్ చేయాలి.

ఇలా చేసిన తరువాత ట్రూకాలర్ అకౌంట్ డీ యాక్టివేట్ అయిపోతుంది. అనంతరం ట్రూకాలర్ డేటాబేస్ నుంచి ఫోన్ నంబర్‌ను తీసేయాల్సి ఉంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

true-caller-name-removal

1. పీసీలో ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి ట్రూ కాలర్ అన్‌లిస్ట్ సైట్ http://www.truecaller.com/unlist లోకి వెళ్లాలి.

2. అందులో ఫోన్ నంబర్‌ను కంట్రీ కోడ్‌తో సహా ఎంటర్ చేయాలి. ఉదా: +911140404040 లేదా +919999999999.

3. దాని కిందే మీరు ఫోన్ నంబర్‌ను ఎందుకు తీసేయాలనుకుంటున్నారో చెప్పండంటూ కొన్ని ఆప్షన్‌లు ఉంటాయి. వాటిలో ఏదైనా ఒక దాన్ని దానికి ఎదురుగా ఉన్న బాక్స్‌లో టిక్ చేసి ఎంపిక చేసుకోవాలి. ఒక వేళ ఆ ఆప్షన్‌లలో ఏదీ సూటవకపోతే కిందే ఉండే Other అనే ఫీల్డ్ బాక్స్‌లో మీకు ఇష్టం వచ్చిన విధంగా ఫీడ్‌బ్యాక్‌ను ఇవ్వవచ్చు.

4. అనంతరం కాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

5. వెరిఫికేషన్ పూర్తయితే కింద ఉండే Unlist బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు, మీ ఫోన్ నంబర్ అప్పటి నుంచి 24 గంటల్లోగా ట్రూ కాలర్ నుంచి తొలగించబడుతుంది.

అయితే ఈ విధంగా యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను తీసేసినా మళ్లీ ఎవరైనా పైన పేర్కొన్న విధంగా తమ అడ్రస్‌బుక్‌లో సేవ్ చేసుకుంటే అప్పుడు తిరిగి నంబర్ కనిపిస్తుంది. సో, ఎప్పటికప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఫోన్ నంబర్‌ను తొలగించుకోవాల్సి ఉంటుంది.

14813
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS