గూగుల్ ఎర్త్..! చుట్టేద్దాం రండి..!


Thu,April 20, 2017 01:48 PM


ఎర్త్ సాఫ్ట్‌వేర్‌కు వెబ్ వెర్షన్‌ను విడుదల చేసిన గూగుల్
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ఎర్త్‌ను వీక్షించే వీలు
పర్సనల్ సెట్టింగ్స్ కావాలంటే సైనిన్ అవ్వాలి
ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాలను చూపించే కొత్త ఫీచ‌ర్ వాయేజర్
గైడెడ్ టూర్‌తో 3డీ ఇమేజ్‌లను చూడవచ్చు
ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ రూపంలోనూ ఎర్త్ లభ్యం
త్వరలో ఇతర బ్రౌజర్లలోనూ అందుబాటులోకి రానున్న గూగుల్ ఎర్త్

గూగుల్ ఎర్త్... సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ గత 15 ఏళ్ల క్రితం విడుదల చేసిన సాఫ్ట్‌వేర్ ఇది. దీని సహాయంతో భూమిని 3డీ రూపంలో చూడవచ్చు. భూమిపై ఉన్న ప్రాంతాలను అన్వేషించవచ్చు. ఆయా ప్రాంతాలకు చెందిన వివరాలను, అక్కడికి వెళ్లే మార్గాలను సులభంగా తెలుసుకోవచ్చు. అదంతా మనకు కావాలనుకుంటే 3డీ రూపంలో కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు గూగుల్ ఎర్త్ కేవలం పీసీల్లో సాఫ్ట్‌వేర్ రూపంలో లభ్యమయ్యేది. ఆ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటేనే గూగుల్ ఎర్త్‌ను వీక్షించేందుకు వీలు కలిగేది. కానీ ఇప్పుడలా కాదు. పీసీలో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయకుండానే నేరుగా ఇంటర్నెట్ బ్రౌజర్ నుంచే గూగుల్ ఎర్త్‌ను చూడవచ్చు. అందుకు గాను గూగుల్ తన ఎర్త్ అప్లికేషన్‌కు చెందిన వెబ్ వెర్షన్‌ను తాజాగా విడుదల చేసింది. అయితే ఇది కేవలం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడుతున్న యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
google-earth
google-earth

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో గూగుల్ ఎర్త్ వెబ్ వెర్షన్...


విండోస్ పీసీల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడుతున్న యూజర్లు గూగుల్ ఎర్త్‌ను అందులో ఓపెన్ చేయవచ్చు. అందుకు వారు ఆ బ్రౌజర్ అడ్రస్ బార్‌లో https://www.google.com/earth/ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే చాలు అప్పుడు గూగుల్ ఎర్త్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో భూమికి చెందిన 3డీ ఇమేజ్ వస్తుంది. దాన్ని జూమ్ ఇన్, ఔట్ చేయడం ద్వారా భూమిపై ఉన్న ఏ ప్రాంతాన్నయినా వీక్షించవచ్చు. అయితే అలా జూమ్ ఇన్, ఔట్ చేసేందుకు మౌస్ స్క్రోలింగ్ వీల్ ఉపయోగపడుతుంది. మౌస్‌కు చెందిన లెఫ్ట్, రైట్ బటన్ల ద్వారా ఎర్త్ ఇమేజ్‌ను అటు, ఇటు మూవ్ చేయవచ్చు.
google-earth
google-earth

జీమెయిల్‌తో సైనిన్ అయితే...


గూగుల్ ఎర్త్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ఫీచర్లలో ముఖ్యమైన ఫీచర్లు ఈ వెబ్ వెర్షన్ గూగుల్ ఎర్త్‌లో లభిస్తున్నాయి. యూజర్లు తమ జీమెయిల్‌తో సైనిన్ అయితే తమ తమ ప్లేస్‌లను సేవ్ చేసుకోవచ్చు. మ్యాప్స్ స్టైల్స్ ను కూడా మార్చుకోవచ్చు. మ్యాప్ ఎంత వేగంగా లోడ్ అవ్వాలో సెట్టింగ్స్ ఆప్షన్‌లో సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్లను గూగుల్ ఎర్త్ వెబ్‌సైట్‌లో ఎడమ వైపు యాక్సెస్ చేయవచ్చు. అదేవిధంగా కుడివైపు కింది భాగంలో యూజర్లకు 3డీ/2డీ వ్యూ, స్ట్రీట్ వ్యూ, నావిగేషన్, లొకేషన్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి.
google-earth

ప్రముఖ ప్రదేశాలు చూసేందుకు వాయేజర్ ఫీచర్...


గూగుల్ సంస్థ తన ఎర్త్ అప్లికేషన్‌కు చెందిన వెబ్ వెర్షన్‌ను విడుదల చేయడంతోపాటు యూజర్లకు కొత్తగా Voyager పేరిట మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో ప్రపంచంలో ఉన్న ప్రముఖ ప్రదేశాలకు చెందిన వివరాలను తెలుసుకోవచ్చు. ఆయా ప్రాంతాలను 3డీలో గైడెడ్ టూర్ సహాయంతో వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కింద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 20వేలకు పైగా ప్రముఖ ప్రాంతాలు 3డీ వ్యూ రూపంలో అందుబాటులో ఉన్నాయి. వాటిని 3డీ స్ట్రీట్ వ్యూలో చూడవచ్చు. దీంతో ఆయా ప్రదేశాల్లో ఉండి వాటిని వీక్షిస్తున్న భావన కలుగుతుంది. ఇకపై వారానికి 50 ప్రదేశాల చొప్పున వాయేజర్‌లో అందిస్తామని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లకు గూగుల్ ఎర్త్ ఓ గొప్ప బహుమతిగా నిలుస్తుందని వారు పేర్కొంటున్నారు.
google-earth

వాయేజర్ సెక్షన్‌లో మరిన్ని విభాగాలు...


గూగుల్ ఎర్త్ వెబ్ వెర్షన్‌లో ఉన్న వాయేజర్ ఫీచర్‌లో ఎడిటర్స్ పిక్స్, ట్రావెల్, నేచర్, కల్చర్, హిస్టరీ అనే విభాగాల కింద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రదేశాల వివరాలు లభిస్తున్నాయి. వాటిని యూజర్లు వీక్షించవచ్చు. అందుకు గాను వెబ్ వెర్షన్‌లో ఎడమ వైపు భాగంలో ఉన్న మెనూను క్లిక్ చేసి అందులో వచ్చే వాయేజర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం దాంట్లో ముందు చెప్పిన విభాగాలు వస్తాయి. వాటిలో దేన్ని ఎంపిక చేసుకుంటే ఆ విభాగానికి చెందిన ప్రదేశాలను చూడవచ్చు. ఇదే సెక్షన్‌లో త్వరలో మరిన్ని ప్రదేశాలను అందివ్వనున్నారు.
google-earth

త్వరలో ఇతర బ్రౌజర్లలో...


గూగుల్ ఎర్త్ వెబ్ వెర్షన్ ఇప్పటికైతే క్రోమ్ బ్రౌజర్‌లోనే లభిస్తోంది. త్వరలోనే మొజిల్లా ఫైర్‌ఫాక్స్, ఓపెరా వంటి బ్రౌజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. అయితే గూగుల్ ఎర్త్‌కు చెందిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ఇప్పటికే సంబంధిత యాప్ స్టోర్‌లలో లభిస్తున్నాయి. వాటిని యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుని తమ తమ డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీంతో గూగుల్ ఎర్త్‌ను ఆయా యాప్స్‌లో వీక్షించవచ్చు. కాగా గూగుల్ ఎర్త్ ఆండ్రాయిడ్ యాప్ ప్రస్తుతానికైతే భారత్‌లోని యూజర్లకు అందుబాటులో లేదు. త్వరలో దీన్ని మన దగ్గర కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ యూజర్లు తమ పీసీల్లోని క్రోమ్ బ్రౌజర్‌లలో గూగుల్ ఎర్త్‌ను వీక్షించవచ్చు.

3215

More News

VIRAL NEWS

Featured Articles