ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్‌లో చెన్నై టాప్.. హైదరాబాద్‌కు 3వ స్థానం..


Tue,March 13, 2018 04:10 PM

మన దేశంలో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను వాడుతున్న సిటీల్లో అత్యధిక వేగవంతమైన నెట్ స్పీడ్‌ను చెన్నై వాసులు పొందుతున్నారని ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేసే ఊక్లా సంస్థ తాజాగా వెల్లడించింది. ఫిబ్రవరి 2018లో ఆ సంస్థ చేసిన సర్వే ప్రకారం ఈ విషయం తెలిసింది. మన దేశంలో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను వాడుతున్న సిటీల్లో వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తున్న సిటీగా చెన్నై మొదటి స్థానంలో నిలవగా అక్కడి యూజర్లకు యావరేజ్‌గా 32.67 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తున్నది. ఇక ఈ జాబితాలో బెంగుళూరు రెండో స్థానంలో (31.09 ఎంబీపీఎస్ స్పీడ్), హైదరాబాద్ (28.93 ఎంబీపీఎస్) మూడో స్థానంలో నిలిచాయి. తరువాత వరుసగా విశాఖపట్నం, ఢిల్లీ, కోల్‌కతా, థానె, ముంబై, వడోదర, సూరత్‌లు నిలిచాయి. ఈ జాబితాలో బీహార్‌లోని పాట్నా ఆఖరి స్థానంలో నిలిచింది. అక్కడి బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు లభిస్తున్న యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 7.80 ఎంబీపీఎస్ మాత్రమే.

ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో మన దేశం 67వ స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా యావరేజ్‌గా యూజర్లకు లభిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 20.72 ఎంబీపీఎస్‌గా ఉంది. ప్రపంచం మొత్తం మీద అత్యధిక వేగవంతమైన ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్‌ను పొందుతున్న దేశంగా సింగపూర్ నిలిచింది. అక్కడ యూజర్లకు యావరేజ్‌గా 161.53 ఎంబీపీఎస్ నెట్ స్పీడ్ వస్తున్నది. ఈ జాబితాలో తరువాతి స్థానాల్లో ఐస్‌ల్యాండ్ (157.73 ఎంబీపీఎస్ స్పీడ్), హాంగ్‌కాంగ్ (129.64 ఎంబీపీఎస్), సౌత్ కొరియా (117.49 ఎంబీపీఎస్), రొమేనియా (105.74 ఎంబీపీఎస్), స్వీడన్ (93.24 ఎంబీపీఎస్), హంగేరీ (90.94 ఎంబీపీఎస్), మకావు (87.92 ఎంబీపీఎస్), యూఎస్‌ఏ (84.66 ఎంబీపీఎస్), నెదర్లాండ్స్ (83.41 ఎంబీపీఎస్)లు టాప్ 10 స్థానాల్లో నిలిచాయి.

ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ వస్తున్న దేశంగా వెనెజులా (3.56 ఎంబీపీఎస్ స్పీడ్) నిలిచింది. ప్రపంచ జాబితాలో ఈ దేశానికి 130వ స్థానం దక్కింది. ఇక మన పొరుగు దేశమైన పాకిస్థాన్ ఈ జాబితాలో 122వ స్థానంలో నిలిచింది. అక్కడి బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు యావరేజ్‌గా వస్తున్న నెట్ స్పీడ్ 6.50 ఎంబీపీఎస్‌గా ఉంది.

2131

More News

VIRAL NEWS