వరిలో తెగుళ్ల నివారణ

Wed,January 9, 2019 11:03 PM

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గతంలో కంటే భిన్నంగా ఉన్నాయి. రాత్రివేళ కనిష్ఠ, పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రభావం వరిపంటపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వరి నారులో చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. సకాలంలో వీటిని గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. లేకపోతే పంట నష్టం జరిగే ప్రమాదం ఉందని ఖమ్మం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
paddy

ఉల్లికోడు(గొట్టపు రోగం)

నారుమడిలో, పిలక దశలో అంకురం ఉల్లికాడవలే లేత ఆకుపచ్చని పొడగాటి గొట్టంగా మార్పు చెందుతుంది. తల్లిపురుగు తెల్లని లేదా ఎరుపు, గులాబీ రంగులో ఉన్న గుడ్లను పెడుతుంది. విడివిడిగా కానీ ఆకుల అడుగు భాగాన కాని గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి పొదిగి వచ్చిన లార్వా ఎదిగే మొగ్గను ఆశించి నష్టపరుస్తుంది. తల్లి రెక్కలు పురుగు గోధుమ రంగులో దోమ ఆకారంలో ఉంటుంది.

ఉధృతికి కారణాలు

ఉల్లికోడు తట్టుకోని రకాలు సాగు చేయడం, ఆలస్యంగా నాట్లు వేయడం, గాలిలో అధిక తేమశాతం(82-88శాతం) కలిగి ఉండటం ఈ పురుగు ఉధృతికి కారణం. పిలకదశలో 5 శాతం ఉల్లి గొట్టాలు, దుబ్బకు 1ఉల్లికోడు ఉన్నట్టు గమనిస్తే తక్షణం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

నివారణ పద్ధతులు

నారు మొలకెత్తిన 10-15 రోజుల్లోపు 2 గుంటలకు (200 చ.మీ) 200 గ్రాములు కార్బోప్యూరాన్ గుళికలు ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి. లేదా ఫోరేట్ గుళికలు 5 కిలోలు వేసుకోవాలి.

అగ్గితెగులు

అగ్గితెగులు పైరీక్యులేరియా గ్రిజియా అనే శిలీంధ్రం ద్వారా ఆశిస్తుంది. తెగు లు లక్షణాలు వివిధ దశల్లో కనిపిస్తాయి. నారుమడిలో నాటు వేసిన తరువాత, పైరు తొలిదశలో ఆకులపైన, మచ్చలు ఏర్పడుతాయి. క్రమేణా ఇవి పెద్దవిగా మారి మచ్చల చివర్లు మొన దేలుతాయి. ఈ మచ్చల అంచులు ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగులోకి వస్తాయి. మచ్చల మధ్యభాగం బూడిద, తెలుపు రంగులోకి మారుతాయి. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి. తెగులు సోకిన ఆకులు దూరం నుంచి చూస్తే తగులబడిపోయినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఈ తెగులును అగ్గితెగులు అంటారు. పిలక దశలో ఉన్న మచ్చలు క్రమేపీ మొక్కలకు సోకడం వల్ల ఆ భాగం ముదురు గోధుమ రంగు లేదా నల్లగా మారి చివరికి కుళ్లిపోతాయి. ఈనిక దశలో మెడపైన నల్లని మచ్చలు ఏర్పడటం వల్ల కంకులకు పోషకాలు అందకుండాపోతాయి. దీంతో గింజలు తాలుగా మారిపోయే అవకాశం ఉన్నది.

ఉధృతికి కారణాలు

నత్రజని అధిక మొతాదులో వాడటం, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువ ఉండటం, పగటి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలపైన ఉన్నప్పుడు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా గాలిలో తేమశాతం 90 శాతం కంటే ఎక్కువ, మబ్బులు, జల్లులతో కూడిన వాతావరణం, పొగమంచు ఉండటం కూడా కారణం. పొలం గట్లపై ఉన్న గడ్డిజాతి మొక్కలు ఉండటం కూడా అగ్గితెగులు వ్యాప్తికి కారణం.

యాజమాన్య పద్ధతులు

ఈ తెగులు తరుచూ అశించే ప్రాంతాల్లో తెగులు తట్టుకునే రకాలను మాత్రమే సాగు చేసుకోవాలి. అదేవిధంగా నారుమడి పోసే ముందు విత్తనశుద్ధి చేసుకోవాలి. పంటపై తెగులు లక్షణాలు గమనించిన వెంటనే ట్రైసైక్లోజోల్ 0.6గ్రా, ఐసోఫ్రోథయోలేన్ 1.5 మి.లీ లేదా కాసుగమైసిన్ 2.5 మి.లీ. లీటర్ నీటికి కలుపుకుని తెగులు ఉధృతిని బట్టి 10- 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.
-మద్దెల లక్ష్మణ్, 9010723131
ఖమ్మం వ్యవసాయం

886
Tags

More News