దుక్కి దున్నకుండా మక్కజొన్న సాగు

Thu,January 3, 2019 12:54 AM

maize
యాసంగిలో మక్కజొన్నను నేలను దున్నకుండానే పంటను (జీరోటిల్లేజ్ పద్ధతి) సాగు చేయవచ్చు. రైతులు వాన కాలంలో వరి సాగు తర్వాత యాసంగి లో ఆరుతడి పంటగా మక్కజొన్నను పండించవచ్చు. ఆరుతడి పంటగా యాసంగిలో మక్కజొన్న లాభదాయకం. నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో పొలం దున్ని నేలను తయారు చేసి మక్కజొన్నను విత్తుకునే బదులు జీరోటిల్లేజ్ విధానం ద్వారా వరి మాగాణాల్లో దుక్కి దున్నకుండా మక్కజొన్న ను తక్కువ ఖర్చుతో, తక్కువ సమయం లో సులభంగా సాగు చేయవచ్చని పొలా స పరిశోధనా స్థానం సేద్య విజ్ఞాన విభా గ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.నవత తెలిపారు. వరి మాగాణాల్లో పొలం దున్నకుండా మక్కజొన్నను సాగు చేసే పద్ధతుల గురించి ఈ కింది విధంగా రైతులకు వివరించారు.

సాగు యాజమాన్యం : వానకాలంలో వరి కోసేటప్పుడు పూర్తిగా తేమ ఆరిన తర్వాత కోయాలి. తడిగా ఉన్న పొలాన్ని హార్వెస్టర్‌తో కోసినప్పుడు హార్వెస్టర్ పొలంలో దిగబడి పొలం అంతా ఎగుడు, దిగుడుగా మారుతుం ది. అప్పుడు మక్కజొన్న పెరుగుదల సరిగా ఉండదు. వరి కోసేటప్పుడు సాధ్యమైనంత మేరకు నేలకు దగ్గరగా వరిని కోయాలి. మక్కజొన్నలో ఏ రకం విత్తనం అయినా శూన్య దున్నడం పద్ధతిలో విత్తుకోవచ్చు. వరి కోసిన తర్వాత ఒక నీటి తడి ఇచ్చి సరైన తేమ ఉన్నప్పుడు తాళ్ళ సహాయంతో వరుసకు వరుస కు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. ఉండేలా విత్తుకోవాలి. విత్తడానికి ముందు సిఫార్సు చేసిన మొత్తం భాస్వరం ఎరువును, నాలుగవ వంతు నత్రజని ఎరువు, సగం పొటాష్ ఎరువును తేమ ఉన్నప్పుడు విత్తనపు సాళ్ళలో వేసుకోవాలి. విత్తనానికి 5 సెం.మీ. దూరంలో మట్టిలో కప్పిపెట్టాలి. విత్తిన తర్వాత సరైన తేమ లేకపోతే 1 నుంచి 2 రోజుల్లో మరొక తేలిక పాటి తడి ఇవ్వాలి.

మక్కజొన్న విత్తనాన్ని విత్తిన తర్వాత సరైన తేమ ఉన్నప్పుడు 24 నుంచి 48 గంటల్లోపు అట్రాజిన్ అనే కలుపు మందును 1 కిలో, పారాక్వాట్ అనే కలుపు మందును లీటరును ఎకరం పొలానికి 200 లీటర్ల నీటి లో కలిపి పిచికారీ చేయాలి. అట్రాజిన్ అనేది కలుపును మొలకెత్తకుండా చేస్తుంది. అలాగే పారాక్యాట్ అంతకు ముందున్న వరి కాడలను నిర్మూలిస్తుంది. ఒకవేళ విత్తిన తర్వాత కలుపు మొలిస్తే సోడి యం సాల్ట్ 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి లేదా ఇతర కలుపు మొక్కలు ఉంటే అట్రాజిన్ 1 కిలోకు 200 లీటర్ల నీటిలో కలిపి మక్కజొన్న సాళ్ళ మధ్యలో కలుపుపై పడేటట్లు పిచికారీ చేసి కలుపు మొక్కలను నివారించవచ్చు. విత్తనం పెట్టిన తర్వాత నుంచి పంట కోసే వరకు ఎటువంటి అంతరకృషి అవసరం లేదు.

ఎరువుల నిర్వహణ : సాధారణంగా యాసంగిలో 100 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను, 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను ఎకరానికి వేయాలి. విత్తనం విత్తేటప్పుడు మొత్తం భాస్వరం ఎరువును, సగం పొటాష్, నాలుగవ వంతు నత్రజని ఎరువులను వేయాలి. మిగిలిన నత్రజని ఎరువులను 25 నుంచి 30 రోజుల తర్వాత నాలుగవ వంతు 40 నుంచి 45 రోజుల తర్వాత నాలుగవ వంతు, 60 నుంచి 65 రోజుల తర్వాత నాలుగవ వంతు వేయాలి. మిగిలిన సగం పొటాష్ ఎరువులను 60 నుంచి 65 రోజుల తర్వాత వాడాలి. పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు సరైన తేమ ఉన్నప్పుడు చాళ్ళ వెంట వేసి మొక్కకు 5 సెంటీ మీటర్ దూరంలో మట్టి తీసిపెట్టాలి. జింక్ లోప నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

నీటి నిర్వహణ : మక్కజొన్నకు పూతకు ముందు, పూత దశ లో, గింజ పాలు పోసుకునే దశలో నీరు తప్పనిసరి. 30-40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు ఎక్కువ నీరు పెట్టడం హానికరం. విత్తిన తర్వాత చేల్లో నీరు నిలిస్తే విత్తనం మురిగిపోయి మొలకెత్తదు. దుక్కి దున్నకుండా మక్కజొన్న సాగులో తక్కువ నీటి తడులు అవసరం. అలాగే ఎక్కువగా నీరు పెడితే వరి మాగాణాల్లో కాబట్టి నీరు నిలిచి మొక్క ఎర్రబడి చనిపోతుంది. మక్కజొన్నలో ఆకులు చుట్టుకుంటే నీటి ఆవశ్యకత ఉన్నట్లు గమనించి నీటితడి ఇవ్వాలి.

పంట కోత : పంట కోతకు వచ్చినప్పుడు బుట్టలపై పొరలు ఎండినట్లు గమనించి, కండెల్లోని గింజలను వేలిగోరుతో నొక్కినప్పుడు పాలుగారే స్థితిలో లేక గట్టిగా ఉన్నప్పుడు పంట కోతకు వచ్చినట్లు గమనించాలి.

సమయం, ఖర్చు ఆదా : ప్రధాన పొలం తయారీకి అయ్యే ఖర్చును, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. నేల స్వభావాన్ని బట్టి 2-3 తడులు ఆదా చేసుకోవచ్చు. అంతరకృషి చేయాల్సిన అవస రం కూడా లేదు. మొక్క మొలకెత్తినప్పటి నుంచి వేరు వ్యవస్థ బలంగా ఉండి గాలికి పడిపోదు. మొక్కల ఎత్తు ఒకే రకంగా ఉండి కంకి కూడా ఒకే సైజులో ఉన్నట్లయితే దిగుబడి పెరిగే అవకాశం ఉన్నది. వరి కోయలు భూమిపై పరుచుకొని కలుపును తగ్గించడమే కాకుండా, తేమ తొందరగా పోకుండా ఉండి మొక్కకు నిరంతరం పోషక పదార్థాలను అందించడం వల్ల దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది.
-బానుక శ్రీనివాస్
జగిత్యాల టౌన్, 9490530001

navatha

1246
Tags

More News