కందిలో శనగపచ్చ పురుగు నివారణ

Wed,September 19, 2018 11:35 PM

రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో సాగు అవుతున్న అపరాల పంటల్లో కందిపంట ఒకటి. నల్లరేగడితోపాటు ఎర్రనేలల్లో సైతం సాగు చేసుకునేందుకు అనువుగా ఉండే పంట ఇది. అయితే ఈ పంటను కూడా అనేకరకాల పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉన్నది. దీనివల్ల పంట నష్టపోయే ప్రమాదం ఉన్నది. వీటిలో ప్రధానమైనవి కాయతొలిచే పురుగు, శనగపచ్చ పురుగులు. ఈ శనగపచ్చ పురుగు కంది పంటతో పాటు ఇతర పంటలపై సైతం ఆశించి నష్టపరుస్తుంది. అయితే ఈ పురుగు లక్షణాలు, నష్టపరిచే విధానం, తద్వారా చేపట్టే నివారణ చర్యల గురించి ఖమ్మం డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ కే నాగస్వాతి వివరించారు.
kmm1
శనగపచ్చ పురుగు తల్లిపురుగు లేత చిగుళ్లపై, లేత పిందలపై విడివిడివిగా లేత పసుపురంగు గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వెలువడిన లద్దెపురుగులు మొగ్గలను, పూత, పిందెలను తింటూ పంటకు నష్టం కలుగజేస్తుంది. ఇది తర్వాత దశలో మొగ్గల్ని తొలిచి కాయలోకి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయట ఉంచుతుంది. తద్వారా లోపల ఉన్న గింజలను తిని డొల్లగా చేస్తాయి. పురుగు తిన్నకాయకు గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి. భారీ వర్షం లేదా చిరుజల్లులు పడినప్పుడు, రాత్రి వేళ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినప్పుడు ఈ పురుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా పంట మొగ్గ, పూత, కాయదశల్లో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. పురుగుల నివారణకు సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టాలి. లేకపోతే పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది.


తొలిదశలో జాగ్రత్తలు..

ఎండాకాలంలో లోతు దుక్కులు దున్నుకోవాలి. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. లోతు దుక్కుల వల్ల భూమిలో కోశస్థదశలో ఉన్నపురుగు బయటపడటం వలన పక్షులు ఏరుకొని తింటాయి. దీనివల్ల పురుగు ఉధృతి తగ్గుతుంది. జొన్న, సోయచిక్కుడు, పెసర, మినుములు, నువ్వులు, మెట్టవరిపంటలకు కూడా శనగపచ్చ పురుగు ఆశిస్తుంది. ఈ పంటల్లో పంటల మార్పిడి చేసుకుంటే పురుగు ఉధృతి తగ్గుతుంది. కందిలో అంతరపంటగా వానకాలంలో 7 సాళ్లు, యాసాంగిలో 3సాళ్లు పెసర లేదా మినుము పంటలను వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పరాన్నజీవులు వృద్ధి చెందుతాయి. శనగపచ్చ పురుగు గుడ్లను తిని అదుపులో ఉంచుతాయి. పొలం చుట్టూ నాలుగు సాళ్లు జొన్న పంటను రక్షిత పంటగా వేసుకుంటే సైతం శనగపచ్చ పురుగును అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా కందిరీగలు కూడ వృద్ధి చెందే అవకాశం ఉన్నది. కంది రకం ఎంచుకునే సమయంలో శనగపచ్చ పురుగును తట్టుకునే రకంను ఎంచుకోవాలి. పైరు విత్తిన 90-100 రోజులలో చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరిస్తే పురుగు గుడ్లు పెట్టడం తగ్గిస్తుంది.

పూత దశలో సస్యరక్షణ చర్యలు...


kmm
-ఎకరానికి నాలుగు లింగార్షక బుట్టలను పెట్టాలి. పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
-అదే విధంగా ఎకరానికి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల పురుగులను తినే పక్షులను ఆకర్షించేందుకు వీలు కలుగుతుంది.
-పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించాలి. వెంట నే 5శాతం వేపగింజల కషాయాన్ని 5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీనివల్ల పురుగు పెరుగుదల, గుడ్లు పెట్టడం తగ్గుతుంది.
-ఎకరానికి ఎన్‌పీవీ ద్రావణాన్ని 200 మిల్లీ లీటర్లు లేదా, 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారంరోజుల వ్యవధిలో రెండు సార్లు సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి.
-బాగా ఎదిగిన పురుగుల మీద రసాయిన మందులు పనిచేయవు. కాబట్టి చెట్లను బాగా కుదుపాలి. గోనె సంచులపై పడిన పురుగులను ఏరివేసి నాశనం చేయాలి.
-ఎట్టి పరిస్థితుల్లో రసాయనక మందులను విరివిగా వాడకూడదు. పైన చెప్పిన విధంగా చేసిన చర్యలతో పురుగులు తగ్గకపోతే అవసరమైన చర్యలు చేపట్టాలి. పైరు మొగ్గదశలో, పూత దశలో ఉన్న సమయంలో క్వినాల్‌ఫాస్ 2మిల్లీ లీటర్లు లేదా, ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
-ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్సాకార్బ్ 1 మి.లీ, క్లోరాట్రానిక్ ప్రోల్ 0.3 మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
--పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో తొలి పూతను రక్షించుకోవాలి. కాబట్టి గుడ్లను, మొదటి దశ పురుగులను సమర్థవంతంగా నివారించుకోవాలి.

-మద్దెల లక్ష్మణ్, ఖమ్మం వ్యవసాయం,9010723131

112
Tags

More News