చిక్కుడులో సస్యరక్షణ చర్యలు

Wed,August 22, 2018 10:45 PM

చిక్కుడులో వివిధ తెగుళ్లు ఆశిస్తాయి. కాబట్టి ఈ పంట సాగు చేసే రైతులు సరైన సమయంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనివల్ల చీడపీడల వల్ల కలిగే నష్టాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు.
Lablab-purpureus
ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు వల్ల మొదటగా ఆకులపై గుండ్రటి ముదురు ఎరుపు రంగులో ఏర్పడుతాయి. తర్వాత ఈ ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలు ఆకుల తొడిమలు, కాండం, కాయలపై కూడా కన్పిస్తాయి. కాయలు వంకర తిరిగి ఉండటం గమనించవచ్చు.
నివారణ: ఈ తెగులు విత్తనం ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి తెగులు సోకని పంట నుంచి విత్తనాన్ని ఎన్నుకోవాలి. విత్తనాన్ని ఇండోఫిల్‌యం-45 (కిలో విత్తనానికి 2.5 గ్రాముల చొప్పున) మందుతో విత్తనశుద్ధి చేయాలి. పంటపై మచ్చలు కన్పించిన వెంటనే ఇండోఫిల్ యం-45 (లీటరు నీటికి 2.5 గ్రాముల చొప్పు న) లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ (లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున )మందులను పంటపై బాగా తడిచేలా పిచికారీ చేయాలి.

బూడిద తెగులు: ఈ తెగులు సోకినప్పుడు ఆకులు తెల్లని బూడిద వంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి. ఇది తీగలపై కూడా ఏర్పడుతుంది. తెగులు సోకిన ఆకులు రాలి వాడిపోతాయి. దీనివల్ల తీగపై ఏర్పడిన పూత, పిందె కూడా రాలిపోతాయి.
నివారణ: దీన్ని నివారించడానికి కాలిక్సిన్ లేదా నీటిలో కరిగే గంధకం పొడిని లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పంట బాగా తడిచేలా పిచికారీ చేయాలి.

ఆకు ఎండు తెగులు: ఈ తెగులు సోకితే ఆకులు పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. తీగపై కూడా ఈ తెగులు ఆశిస్తుంది. తీగను తాకినప్పుడు తీగ గరుకుగా ఉండటం గమనించవచ్చు.
నివారణ: పంటపై మచ్చలు కన్పించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ ను లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పంట బాగా తడిచేలా పిచికారీ చేయాలి. వారం రోజుల వ్యవధిలో ఈ మందును 2-3 సార్లు పిచికారీ చేయాలి.

తుప్పు తెగులు లేదా కుంకుమ తెగులు: ఈ తెగులు ఆశించడం వల్ల ఆకులపై చిన్న, గుండ్రని, కుంకుమ రంగులో ఉన్న మచ్చలు ఏర్పడుతాయి. ఇవి కొంచెం ఉబ్బెత్తుగా ఉండటం వల్ల ఆకును తాకినప్పుడు గరుకుగా ఉంటుంది. తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎండి రాలిపోతాయి.

నివారణ: దీన్ని నివారించడానికి డైథేన్ జెడ్-78 మందును లీటరు నీటికి 2.5 గ్రాముల చొప్పున కలిపి పంట బాగా తడిచేలా పిచికారీ చేయాలి. ఈ మందును వారం రోజుల వ్యవధిలో ఇచ్చి 2-3 సార్లు వాడాలి.

పల్లాకు తెగులు: ఈ తెగులు మొదట లేత ఆకులపై పసుపు, ఆకుమచ్చ రంగులు కలిసినట్లుగా కన్పిస్తుంది. తర్వాత ఆకులన్నింటి పై ఈ పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ పెద్దవై చివరికి ఆకు అంతా పసుపుగా కన్పిస్తుంది. ఈ తెగులు విత్తనం ద్వారా, తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది.

నివారణ: ఈ తెగులు విత్తనం ద్వారా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి తెగులు సోకని పంట నుంచి విత్తనాన్ని సేకరించాలి. ఈ తెగులును వ్యాప్తి చేసే తెల్ల దోమను నివారించడానికి లీటరు నీటికి 2 మి.లీ మలాథియాన్ లేదా ఒక మి. లీ డైక్లోరోవాస్ మందును 3 నుంచి 4 సార్లు 10 రోజుల వ్యవధిలో పంట బాగా తడిచేలా పిచికారీ చేయాలి.
dr-m-vijaya

490
Tags

More News