తీగజాతి కూరగాయల్లో సస్యరక్షణ

Wed,August 8, 2018 11:16 PM

kakara
రాష్ట్రంలో పండించే తీగజాతి కూరగాయలను వానకాలం పంటలుగా జూలై నుంచి అక్టోబర్ వరకు సాగు చేసుకోవచ్చు. ఆలస్యంగా అయితే వానకాలంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలల్లో బీర, కాకర సాగు చేసుకోవచ్చు. అయితే ఈ పంటలు చీడపీడలకు గురికావడం వల్ల ఎక్కువగా నష్టం జరుగుతుంది. కాబట్టి రైతులు వీటిని సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టి తెగుళ్లను నివారించుకోవచ్చు.

తీగజాతి కూరగాయ పంటలను ముఖ్యంగా బూజు తెగుళ్లు, ఆంత్రాక్నోస్ ఆకుమచ్చ, ఎండుతెగులు, తుప్పు తెగులు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, పల్లాకు తెగులు మొదలైనవి ఆశిస్తాయి.

donda-powdery-mildew

బూడిద తెగులు:

ఈ తెగులు సోకినప్పుడు ఆకుల పై భాగాన, అడుగు భాగాన తెల్ల ని బూడిదరంగు మచ్చలు ఏర్పడుతాయి. ఆకు అంతా తెల్లని బూడిద వంటి పదార్థంతో కప్పబడి ఉంటుంది. ఇది తీగ మీద కూడా కన్పిస్తుంది. దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారి వడలినట్టు కన్పిస్తాయి. తర్వాత రాలిపోతాయి. తీగలు సరిగ్గా ఎదుగక గిడసబారి చిన్నపరిమాణంలో ఉంటాయి. పూత సరిగ్గా రాదు. కాయలు కూడా గిడసబారి చిన్న సైజులో ఉంటాయి.

నివారణ:
పొలాన్ని శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. తెగుళ్లు సోకిన ఆకులను ఎప్పటికప్పుడు తీసివేసి దూరంగా తగులబెట్టాలి. కెరాథేన్ మందును లీటరు నీటికి ఒక మి.లీ చొప్పున కలిపి పంటపై తడిచేలా పిచికారీ చేయాలి. ఈ విధంగా వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు చేయాలి.

బూజు తెగులు:

ఈ తెగులు సోకినప్పుడు ఆకుల అడుగు భాగాన తెల్లని బూజు వం టి పదార్థం ఏర్పడుతుంది. ఆకుల పైభాగాన మాత్రం పసుపు రం గు మచ్చలు ఏర్పడుతాయి. దీనివల్ల కాయల నాణ్యత లోపిస్తుంది.

నివారణ:
దీన్ని నివారించడానికి ఇండోఫిల్ యం-45 లేదా ఇండోఫిల్ జెడ్-78 మందును లీటరు నీటికి 2.5 గ్రాముల చొప్పున కలిపి ఆకుల అడుగు భాగాన బాగా తడిచేలా పిచికారీ చేయాలి. ఈ విధంగా వారం రోజుల వ్యవధిలో 2-3సార్లు చేయాలి. అయితే పొలంలో తెగులు సోకిన నాడులను గమనించి ఆకులను ఎప్పటికప్పుడు తీసి దూరంగా తగులబెట్టాలి.

పల్లాకు తెగులు:

ఈ తెగులు సోకితే ఆకులు, ఈనెలు పసుపు రంగులోకి మారిపోతాయి. తర్వాత ఆకులపై బుడిపెల వలె ఏర్పడుతాయి. ఈ తెగులు సోకిన నాడులు పూత పూయవు. కాయలు కూడా ఏర్పడవు.

నివారణ:
ఈ తెగులు సోకినప్పుడు ఆ పంట నుంచి విత్తనాన్ని సేకరించరాదు. పాదులలోనూ, పంట చుట్టూ కూడా కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచడం చాలా అవసరం. ఈ తెగులు పేను బంక ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి పేను బంకను నివారించడానికి మెటాసిస్టాక్స్ మందును లీటరు నీటికి 2 మి.లీ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. దీనివల్ల పేనుబంక ఉధృతి తగ్గి పల్లాకు తెగులు వ్యాప్తి తగ్గుతుంది.

ఫ్యుజేరియం వేరుకుళ్లు తెగులు:

దీన్ని ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు భూమి లో ఉండే ఫ్యుజేరియం అనే శిలీంధ్రం వల్ల సోకుతుంది. తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి. ఆకులు వాడిపోతాయి. వేరు లోపల శిలీంధ్రం ఆశించడం వల్ల ఇలా జరుగుతుంది.

నివారణ:
ఈ శిలీంధ్రం భూమిలో ఉంటుంది. కాబట్టి నివారించడానికి పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. పంటకు ముందు భూమిలో వేప పిండి వేసి కలియదున్నాలి. అలాగే పంట వేసే ముందు పచ్చిరొట్ట పంటలను పండించి భూమిలో కలియదున్నాలి. పంట వేసిన తర్వాత ట్రైకోడెర్మా విరిడి అనే కల్చర్‌ను భూమిలో పాదుల దగ్గర వేయాలి. దీన్ని పంట కాలంలో రెండుసార్లు అయినా వాడాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి ఆ ద్రావణాన్ని మడులలో నారు వేర్లకు అందేలా భూమిని తడుపాలి. పదిరోజుల వ్యవధి ఇస్తూ 2 నుంచి 3 సార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు:

ఈ తెగులు సోకినప్పుడు ఆకుల మీద, తీగల మీద, కాయల మీద మచ్చలు ఏర్పడుతాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కాయలపై బ్యాక్టీరియా వల్ల జిగురు ఏర్పడుతుంది. ఈ జిగురు ఎండినప్పుడు గట్టిపడి రాలిపోతుంది. ఈ తెగులు విత్త నం ద్వారా వ్యాపిస్తుంది. అయితే వర్షం చినుకులు పడ్డప్పుడు ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

నివారణ:
విత్తనాన్ని సేకరించేటప్పుడు తెగులు సోకని పంట నుంచి సేకరించాలి. తెగులు సోకి రాలిన ఆకులను ఎప్పటికప్పుడు ఏరివేసి దూరంగా కాల్చివేయాలి. పాదులపై రాగి ధాతు సంబంధిత మందులైన కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు పిచికారీ చేయాలి.

కాయకుళ్లు తెగులు:

మొక్కలను నేలపై పాకించి పెంచినప్పుడు మాత్రమే ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు సోకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నేలను తాకిన కాయలపై బాగా కప్పబడి తెల్లగా, దూది లాగా కన్పిస్తుంది. ఇలా తెగులు సోకిన కాయలు కుళ్లి మెత్తగా తయారవుతాయి.

నివారణ:
దీన్ని నివారించడానికి కాయలు నేలను తాకకుండా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం నారును పందిళ్లపై పాకించాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి తీగ మొత్తం కాయలతో సహా బాగా తడిచేలా పిచికారీ చేయాలి. వారం రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు ఈ మందును పిచికారీ చేయాలి.

పెంకు పురుగులు:

తొలిదశలో ఈ పురుగులు ఆశించి ఆకుల నుంచి పత్రహరితాన్ని తింటాయి. వీటి పిల్ల పురుగులు భూమిలో ఉండి వేళ్లను కొరికి తింటాయి.

నివారణ:
దీన్ని నివారించడానికి కార్బరిల్ 2 గ్రాముల పొడి మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.

కాయతొలుచు పురుగు నివారణ:

వీటి పిల్ల పురుగులు కాయ లోపలికి ప్రవేశించి గుజ్జును తినడం వల్ల కాయలు కుళ్లిపోతాయి. వీటిని నివారించడానికి మలాథియాన్ మందును లీటరు నీటికి 2 మి.లీ చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి. కాయలు, పిందె దశలో ఉన్నప్పుడే పిచికారీ చేయడం మంచిది.
dr-m-vijaya

1501
Tags

More News