జామ తోటలో జాగ్రత్తలు

Wed,August 8, 2018 11:13 PM

Guava
రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ : అధిక పోషకాలు, నోరూరించే జామ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నది. మన ప్రాంతంలో పండి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నది. తెలంగాణలో ఆపిల్‌గా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. దీంతో జామ సాగు పెరుగుతున్నది. రాష్ట్రంలో 6530 హెక్టార్లలో జామ తోటలు ఉన్నాయి. దీనిద్వారా 90.190 టన్నుల పంట దిగుబడి వస్తున్నది. రాష్ట్ర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికంగా దిగుబడినిచ్చే జామ సాగులో మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులు, లాభాలు సాధించవచ్చని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇతర పంటల కంటే జామ నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. మహబూబ్‌నగర్ , నల్గొండ, రంగారెడ్డితో పాటు ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ ,వికారాబాద్ జిల్లాల్లో వేడితో కూడిన పొడి వాతావరణం ఉన్నందున బాగా దిగుబడి వస్తున్నది. ఇతర ప్రాంతాలకన్నా ఈ ప్రాంత పండులో ఎక్కువ పోషకాలు రుచిగా ఉంటుంది. పండు పక్వదశలో ఉన్నప్పుడు నీటి తడులు అందిస్తే సరిపోతుంది. నారింజ పండు కంటే రెండు రెట్లు అధికంగా సి, ఎ, విటమిన్లు కల్గి ఉండి అధిక రుచిగా ఉంటుంది. ప్రస్తుతం కోత దశలో ఉన్నాయి. తోటలలో అక్కడక్కడ సస్యరక్షణ చర్యలు , చీడ పీడలను నివారిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు .

సస్యరక్షణ చర్యలు

ప్రస్తుతం పండు ఈగ ఎక్కువగా ఉంటుంది. ఉధృతిని బట్టి 3 గ్రా. కార్బోప్యూరాన్, 3 జి గుళికలను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా ప్లాస్టిక్ సీసాల్లో 60 ఇథైల్ ఆల్కాహాల్, 40 మి.లీ మిథైల్ యూజీనాల్, 20 మి.లీ మలాథియాన్ కలిపిన మిశ్రమాన్ని ప్లాస్టిక్ సీసాలో పోసి తోటలోఅక్కడక్కడ చెట్ల కొమ్మలకు వేలాడదీయాలి. ఇలా చేస్తే మగ ఈగలు ఆకర్షించబడి మందు ద్రావణంలో పడి చనిపోతాయి. తెల్ల దోమ కనిపిస్తే తగిన చర్యలు తీసుకోవాలి. పిల్ల పురుగులు ఆకులపై తెల్లని దూది వంటి మెత్తని పదార్థంతో కప్పి రసం పీలుస్తాయి. వీటి ప్రభావం వల్ల ఆకులు ఎర్రబడి ముడతలు పడుతాయి. పూత పట్టక ముందు కనిపిస్తే కొమ్మలను కత్తిరించాలి. 5 మి.లీ వేపనూనెను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి వీటి తీవ్రతను తగ్గించవచ్చు . మరీ ఉధృతి ఎక్కువగా ఉంటే ఫాస్పోమిడాన్ లేదా డైక్లోరోవాస్ 1మి.లీ చొప్పున నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

నులి పురుగు, పిండినల్లి కనిపిస్తే ..

చెట్టు ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోవడం, కొమ్మలు ఎండిపోవడం, పంట తక్కువ దిగుబడి రావడం లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఉంటే 100 కిలోల పశువుల ఎరువులు, 250 గ్రా. వేపపిండి, పేసిలోమైసెస్ లిలాసినస్ 25 గ్రా. లతో పాటు 60 గ్రా.కార్బోప్యూరాన్ గుళికలను చెట్టు పాదుల్లో వేయాలి. దీనిద్వారా వీటి ఉధృతిని అరికట్టవచ్చు. పిండినల్లి పురుగు కొమ్మల చివర కాయలను ఆశించి రసాన్ని పీల్చుతాయి. కాయలు, ఆకులు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మసి తెగుళ్లు ఆశిస్తుంది. ఆశించిన కొమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. ఎసిఫేట్ 1గ్రా. లేదా 1మి.లీ డైక్లోరోపాస్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

Guava2

తెగుళ్లు..

ఎండు, కాయకుళ్లు , గజ్జి తెగుళ్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఎండు తెగుళ్లు సోకితే ఆకులు పసుపు పచ్చరంగుకు మారుతాయి. కొమ్మలు పై నుంచి కిందికి ఎండుతాయి. ఆకులు రాలిపోతాయి. చెట్టు మోడు బారుతుంది. నివారణకు జిప్సం,పచ్చిరొట్ట, లేదా పశువుల ఎరువు వాడటంతో పాటు 10 కిలోల వేప పిండి, 2 కి. ట్రైకోడెర్మావిరిడి , కార్బండిజిమ్ లేదా బెనొమిల్ 1గ్రా, పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. లేత కొమ్మలు, ఆకులు కాయలు గోధుమ రంగుకు మారి నల్లగా మారడంతో పాటు కొమ్మలు ఎండిపోతే మాగిన పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు చిన్న , చిన్న గుంతలు ఏర్పడితే ఇలా అయ్యి రెండు రోజుల్లో పండు కుళ్లిపోతుంది, నివారణకు 3 గ్రా. ైబ్లెటాక్స్ పిచికారీ చేయాలి. చిన్న తుప్పు రంగులో లేదా గోధుమ రంగులో ఉన్న మచ్చలు పగులకుండా కనిపిస్తాయి. కాయ సైజు పెరిగే కొద్దీ మచ్చలు పెరిగి కాయలు పగిలిపోతాయి. కాయ పెరుగక గిడసబారి పోయి కట్టిగా ఉండి రాలిపోతుంది. నివారణకు ైబ్లెటాక్స్ 3 గ్రా. లీటర్ నీటిలో కలిపి వారానికో సారి పిచికారీ చేయాలి.

మెళకువలు పాటిస్తే మంచి లాభాలు

ప్రస్తుత పరిస్థితుల్లో జామలో మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. నాణ్యత గల పండ్లు పండించి మంచి ధర పొందవచ్చు. ఏవేనా సందేహాలు ఉంటే ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు , అధికారులను సంప్రదించాలి. అంతేగాని మూస పద్ధతిలో సాగు చేయరాదు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ ధరకు సబ్సిడీపై డ్రిఫ్, స్పింక్లర్స్ పొంది తక్కువ నీటితో పండించే తోటలు పెంచి అధిక లాభాలు పొందవచ్చు .
-డాక్టర్ రాజాగౌడ్, 9848864275
శాస్త్రవేత్త, ఉద్యాన కళాశాల రాజేంద్రనగర్

683
Tags

More News