గోరుచిక్కుడు సాగుకు అనుకూల కాలం

Thu,August 2, 2018 12:12 AM

రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా ఉన్న పంట గోరుచిక్కుడు. వర్షాల మధ్య విరామం ఎక్కువగా ఉన్నప్పటికీ తట్టుకుని దిగుబడిని ఇచ్చే పంట ఇది. కాయగూరగ, పశుగ్రాసంగా, జిగురు ఉత్పత్తి కోసం దేశవ్యాప్తంగా సాగులో ఉన్న పంట ఇది. ప్రత్యేకించి కేవలం వర్షాధారంగా అంతగా సారవంతం కాని భూముల్లో సైతం బాగా పండుతుంది. నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. గింజలో 18 శాతం ప్రోటీన్, 32 శాతం పీచు పదార్థాలు, 30-33 శాతం జిగురు ఉంటుంది. భారత్ నుంచి విదేశాలకు ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో గోరు చిక్కుడు జిగురు ప్రధానమైనది. అలాగే రాజస్థాన్ లాంటి నీటి ఎద్దడి రాష్ర్టాల్లో రైతులకు మేలైన ఆదాయాన్ని ఇస్తున్న పంట. రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో ఈ పంట సాగుకు అపార అవకాశాలున్నాయి.
Gokarikaya
వాతావరణం: గోరు చిక్కుడు ఉష్ణమండల పంట. సాగుకు వేడి వాతావరణం అవసరం. తొలిదశలో ప్రత్యేకించి మొలకెత్తే సమయంలో పంటకు 30-35 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. శాఖీయ దశలో 32-38 డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. పూత దశలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పంట పొడవుగా పెరుగుతుంది. గాలిలో అధిక తేమతో ఆకు మాడు, వేరు కుళ్లు సమస్య ఎక్కువవుతుంది.

నేల: ఉదజని సూచిక 7-8.5 మధ్య ఉండి మధ్యస్త, తేలికపాటి నుంచి నేలల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. నీటి నిల్వ ఉండే భూములు, నల్లరేగడి భూములు ఈ పంటకు అంతగా అనుకూలం కాదు. అధికంగా గాలిలో తేమ ఉండే నేలల్లో ఈ పంట వేయకపోవడమే మేలు.

నేల తయారీ: నేలలో నీరు ఇంకే విధంగా తయారు చేయాలి. ముందుగా వేసవిలో లోతు దుక్కి చేసి, ఆ తర్వాత రెండు, మూడుసార్లు దుక్కి చేయాలి. నీరు ఇంకే నేల తయారీ ఉండాలి. పప్పుధాన్యపు పంట కాబట్టి భూమిలో నత్రజనిని స్థాపించి భూసారాన్ని పెంచుతుంది.

విత్తనం నాటే సమయం: వర్షాధార ప్రాంతాల్లో జూలై చివరి నాటికి వేసుకోవాలి. నీటి వసతి ఉంటే ఆగస్టు వరకు నాటుకోవచ్చు. ఆ తర్వాత వేసే పంటలో దిగుబడి తగ్గిపోతుంది.

విత్తటం: చాలామంది రైతులు విత్తనం వెదజల్లుతుంటారు. అయితే సిఫార్సు మేరలో ఎకరాలో మొక్కల సాంద్రత ఉండేలా చేసేందుకు, మొలక శాతం పెరిగేందుకు, అంతర సేద్యపు పనులకు వరుసలలో నాటాలి. శాఖలు, కొమ్మలు ఉత్పత్తి చేసే రకాలను వరుసల మధ్య 50 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ దూరంతో నాటుకోవాలి. ఏక కాండం ఉండే రకాలయితే వరుసల మధ్య 30 సెం.మీ దూరంసరిపోతుంది. నాగలితో లేదా సీడ్ డ్రిల్‌తో విత్తనం వేయాలి.

విత్తన మోతాదు: ఎకరాకు 6 కిలోల చొప్పున విత్తనం వాడాలి. కిలోగ్రాము విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా లేదా 2 గ్రాముల కార్బండిజంతో శుద్ధి చేయా లి. ఆ తర్వాత రసం పీల్చే పురుగుల మందుతో శుద్ధి చేయాలి. సిఫార్సు చేసిన రైజోబియం జీవన ఎరువును కిలో విత్తనాలకు 40 గ్రాముల చొప్పున పట్టించాలి. 200 గ్రాముల బురువున్న రైజోబియం కల్చర్‌ను 250 గ్రాముల బెల్లం ద్రావకంతో కలిపి ఒక లీటరు నీటిలో ఉంచి ద్రావణం తయారు చేయాలి. అలాంటి రైజోబియం మిశ్రమ ద్రావణాన్ని విత్తనాలపై పొరగా ఏకరీతిగా పట్టించాలి. ఆ తర్వాత నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. 24 గంటలలోపు ఆరిన విత్తనాలను నేలలో విత్తాలి.
Gokarikaya1
ఎరువులు: పప్పుజాతి పంట కాబట్టి పంట తొలి దశలో కొద్దిమొత్తంలోనే ప్రారంభ సిఫార్సుగా నత్రజని అవసరం. హెక్టారుకు 20 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం అవసరం. వీటిని విత్తనం నాటేటప్పుడే వేయాలి. విత్తటానికి 15 రోజుల ముందు హెక్టారుకు 2.5 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వేయటం మేలు.

నీటి యాజమాన్యం: ఉష్ణ, ఉప ఉష్ణ ప్రాంతాలలో గోరు చిక్కుడును పూర్తిగా వర్షాధారంగా పండించవచ్చు. అయితే పూత, విత్తనంఏర్పడే దశలో నీటి ఎద్దడి ఉంటే ఒక నీటి తడినివ్వాలి. పంట వ్యర్థాలను హెక్టారుకు 3-5 టన్నుల చొప్పున వేస్తే నేలలో తేమ శాతం పెరుగుతుంది. వర్షాధార పరిస్థితులలో పంట విత్తిన 25, 45 రోజుల తర్వాత 0.1 శాతం థయోయూరియా పిచికారీ చేస్తే దిగుబడులు పెరుగుతాయి.
RAKAM
కలుపు యాజమాన్యం: గడ్డి జాతి, వెడల్పాటి ఆకు జాతి కలుపు సమస్య వానకాలంలో ఎక్కువ. పంట తొలి 30-35 రోజులలో కలుపు నివారణ చేపట్టాలి. 25,45 రోజులలో రెండుసార్లు చేతితో కలుపు తీయాలి. కూలీల కొరత ఉంటే హెక్టారుకు 2.5-3.3 లీటర్ల పెండిమిథాలిన్ కలుపు మందును 500 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు నాటిన రెండు రోజుల్లో పిచికారీ చేయాలి. లేదా పంట విత్తిన తర్వా త 20-25 రోజులకు హెక్టారుకు 400 గ్రాముల చొప్పున ఇమజితాపిర్ కలుపు మందును 500 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసి సైతం కలుపు నివారించవచ్చు.

విత్తనోత్పత్తి ఇలా

గోరుచిక్కుడు స్వతహాగా స్వపరాగ సంపర్కపు పంట. కాబట్టి రైతులు తమ స్థాయిలో సొంతం గా విత్తనోత్పత్తి చేయవచ్చు. అందుకు అంతకు ముందు కాలంలో గోరుచిక్కుడు పంట వేయని పొలాన్ని ఎన్నుకోవాలి. ఇతర రకాలకు కనీసం 10 మీటర్ల వేర్పాటు దూరం పాటించాలి. ఇతర రకాల మొక్కలు, తెగులు సోకిన మొక్కలు, కేళీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు కలుపు నివారణ చేపట్టాలి. కోత సమయంలో పంట చుట్టూ 5-10 మీటర్ల దూరం వది విత్తనాలు సేకరించాలి. బాగా ఆరబెట్టిన కాయలను నేరుగా శుభ్రపరుచాలి. విత్తన తేమ శాతాన్ని 8-9 శాతానికి తీసుకురావాలి. అందు కు నీడలో ఆరబెట్టాలి. కార్బండింజతో శుద్ధి చేసిన విత్తనాలను సంచులలో, డబ్బాలలో నిల్వ చేసుకుని, ఆ తర్వాత కాలంలో విత్తనాలుగా వాడుకోవచ్చు.


పంటను ఆశించే తెగుళ్లు-నివారణ

బ్యాక్టీరియా తెగులు: ఐదు గ్రాముల స్ట్రెఫ్టోసైక్లిన్ లేదా 50 గ్రాముల ప్లాంటామైసిన్ 100 గ్రాముల నీటిలో కలిపి 35-40 రోజుల పొలంలో హెక్టారుకు పిచికారీ చేయాలి.
అల్బర్‌నేరియా ఆకుమచ్చ: తెగులు లక్షణాలు గమనించిన వెంటనే హెక్టారుకు 2 కిలోల జినెబ్ 500 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
బూడిద తెగులు: దీని నివారణకు హెక్టారుకు 20-25 కిలోలు పొడి గంధకం పౌడర్ లేదా 2-3 కిలోల తడి గంధకం లేదా లీటరుకు 1.5 మి.లీ డినోక్యాప్ పిచికారీ చేయాలి.
దిగుబడి: వర్షాధార పంటలో హెక్టారుకు 7-8 క్వింటా ళ్లు. నీటి వసతిలో హెకార్టుకు 12-15 క్వింటాళ్లు. జిగురు పంట సాగు చేసే రైతులు ముందుగా కొనుగోలుదారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకోవడం మేలు.ఇప్పటికే పొలంలో పంట ఉంటే రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అసిఫేట్ లేదా ప్రొఫెనోపాస్ లీటరు నీటికి 2 మి.లీ చొప్పున లేదా వేప నూన లీటరుకు 5 మి.లీ చొప్పున కలిపి పిచికారీ చేసి నివారించాలి.

రకాలు

కాయగూరల కోసం :పూసా నవబాహార్, పూసా సదా బాహార్, దుర్గా బాహార్
విత్తనాల జిగురు కోసం :హెచ్‌జీ-365, హెచ్‌జీ-563, ఆర్‌సీజీ-1066, ఆర్‌సీజీ-1003
పశుగ్రాసాల కోసం :హెచ్‌ఎఫ్‌జీ-119, హెచ్‌ఎఫ్‌జీ-156
డాక్టర్ పిడిగెం సైదయ్య
శాస్త్రవేత్త,రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం7780509322

721
Tags

More News