జీవాల్లో వ్యాధులు-నివారణ

Thu,August 2, 2018 12:01 AM

Sheep
వానకాలంలో జీవాలకు (గొర్రెలు, మేకలు) వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నది. వీటిని సకాలంలో గుర్తించి స్థానిక పశు వైద్యులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు నివారణ చర్యలు పాటించాలి.

కాలిపుండ్ల వ్యాధి (పుట్‌రాట్)

గిట్టల పుండ్లుగా పిలుస్తారు. ఇది బురద నేలలో తిరిగినప్పుడు, వరి కోతల తర్వాత పొలాల్లో తిరిగినప్పుడు ఎక్కువగా సోకుతుంది.

లక్షణాలు:

-గిట్టల మధ్య చర్మం మెత్తబడి, వాచి, చిట్లిపోతుంది. చీము పట్టిపోయి నొప్పి తో ముందు కాళ్లపై కుంటుతుంటాయి.
-వ్యాధి తీవ్రంగా సోకితే గిట్టలూడిపోవడంతో జీవాలు నడువలేకపోతాయి. వ్యాధిగ్రస్త జీవాలు కుంటుతూ, నడువలేక మంద వెనుకబడిపోవడం గమనిస్తాం.

చికిత్స:

-కాళ్లను 10 శాతం మైలతుత్తం లేదా 10 శాతం జింక్ సల్ఫేట్ లేదా 5 శాతం ఫార్మలిన్ ద్రావణంతో శుభ్రం చేసి ఏదైనా ఒక ఆయింట్‌మెంట్ పూయాలి. యాంటిబయోటి ఇంజక్షన్లను వరుసగా 3-5 రోజులు వేయించాలి.

నివారణ:

-జీవాల్ని చిత్తడి నేలల్లో ఎక్కువ సేపు తిరుగనీయకూడదు.
-పొడిగా ఉన్న ప్రదేశంలో మేపాలి. సిమెంట్ ఫుట్‌బాల్ ఏర్పాటు చేసి, అందులో 8 శాతం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం కాని, 5 శాతం ఫార్మాలిన్ ద్రావణం కాని పోసి అందులో నుంచి జీవాల్ని ప్రతిరోజు 3-5 నిమిషాలు నడిపించాలి.

దొమ్మవ్యాధి (ఆంత్రాక్స్)

-ఎక్కువగా వరదల సమయంలో, కరువు సమయాల్లో బాసిల్లస్ ఆంత్రసిస్ బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది. బ్యాక్టీరియా లేదా వాటి స్పోరులచే కలుషితమైన మేత, నీరు ద్వారా, వీటి మాసం తినడం వల్ల జీవాలకు, మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది.

లక్షణాలు:

-ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ జీవాలు అకస్మాత్తుగా చనిపోతాయి. చనిపోయిన గొర్రెల ముక్కు, చెవులు, బాహ్య రంధ్రాల నుంచి నురగతో కూడి న నల్లని గడ్డకట్టని రక్తం స్రవిస్తుంది. నాలుక, గొంతు కింద వాపు వల్ల శ్వాస కష్టమౌతుంది.
-కడుపు నొప్పి, రక్త విరోచనాలుంటాయి. జ్వరం 106-107 ఫారన్ హీట్ డిగ్రీలుగా ఉంటుంది. జీవాలు ముడుచుకొని ఒకచోట నిలబడుతాయి.

పోస్టుమార్టం చేసి చూస్తే

-ప్లీహం నల్లగా మారి సైజు పెరుగుతుంది. కాలేయం, మూత్రపిండాలు ఎర్రగా ఉంటాయి. కాలేయం పెద్దగా అవుతుంది. మరణించిన కళేబరం త్వరగా కుళ్లిపోతుంది. పొట్ట త్వరగా ఉబ్బుతుంది. దీనికి చికిత్స చేసే వ్యవధి ఉండదు.

నివారణ:

-టీకాలు (వ్యాధి తరుచుగా ప్రబలే ప్రాంతాల్లో) ఏటా సెప్టెంబ ర్‌లో వేయించాలి. ఈ టీకాలు వేసే సమయంలో పశువైద్య సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
-ఈ బ్యాక్టీరియా స్పోరులు నేలలో 20-30 ఏడ్ల వరకు జీవించి ఉండి వ్యాధిని కలిగిస్తాయి. కాబట్టి చనిపోయిన జీవాల్ని ఎట్టి పరిస్థితుల్లో కోయకూడదు. లోతైన గొయ్యిలో సున్నం వేసి పాతిపెట్టాలి. వ్యాధిగ్రస్త జీవాలు తినగా మిగిల్చిన గడ్డి, దాణాను కాల్చివేయాలి. కళేబరాల చర్మం, మాంసం, కొమ్ములు వినియోగించకూడదు.

సర్రావ్యాధి (ట్రపనజోమియాసిస్):

-దీన్నే తిరుగుడు రోగం వ్యాధి అని వ్యవహరిస్తారు. వానకాలం లో, తొలకరి జోరిగిల ఉధృతి ఉన్నప్పుడు ట్రిపనజోయా ఇవా న్సి) అనే ఏక కణ పరాన్న జీవి ద్వారా గొర్రెలు, మేకలకు ఈ వ్యాధి సోకుతుంది.

లక్షణాలు:

-తీవ్ర దశలో జ్వరం, కళ్లు ఎర్రబడటం, గుండ్రంగా తిరుగడం, వణకడం, వెర్రిచూపులు చూడటం, దీర్ఘకాలిక దశలో అప్పుడప్పుడు జ్వరం, రక్తహీనత, మేత తినకపోవడం, దృష్టి లోపం సంభవిస్తాయి. పలుచటి జిగురుతో కూడిన పేడ వేస్తాయి.

చికిత్స:

-బెరినిల్ ట్రిక్పిన్-యస్, టివాన్సి, ప్రొజిమిన్, మందుల్లో ఒకదానిని తగిన మోతాదులో పశువైద్యుల సలహాపై జాగ్రత్తగా వాడాలి.
-రక్తక్షీణత నివారణ ఫెరిటాస్, ఇమ్‌ఫెరాన్ వంటి ఇంజక్షన్ల వాడాలి. లేదా షార్కా ఫెరాల్ వెట్ మందు రోజు 10 గ్రాముల చొప్పున తాగించాలి. డెక్ట్రోజ్ రక్తనాళాల్లో ఎక్కించాలి.

నివారణ:

క్రిమిసంహారక మందులతో పాకలను శుభ్రం చేస్తూ శుభ్రత పాటిస్తుండాలి. జోరీగలను నివారించాలి.

డాక్టర్ కాటం శ్రీధర్, ఎం.వీ.ఎస్సీ
ప్రాథమిక పశువైద్య కేంద్రం (వేలూరు) వర్గల్, సిద్దిపేట
9491547148

610
Tags

More News