సేంద్రియ ఉత్పత్తులే లక్ష్యంగా

Wed,July 18, 2018 11:34 PM

Compost-manure.jpg
ఆరుగాలం శ్రమించి అన్నదాతలు అనేక పంటలు పండిస్తున్నారు. అయితే పండించిన పంటలు నాటి రుచిని, బలవర్థకమైన ఆహారం ఇస్తున్నదా అన్నదే ప్రశ్న? రుచి సంగతి అటుంచితే నేడు పండించిన పంటలకు మార్కెట్లో సరైన ధరలు కూడా పలుకని పరిస్థితి. రైతుకు లాభం రావాలంటే నాణ్యమైన పంట ఉత్పత్తులను డించడమే ఏకైక మార్గం. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వ్యవసాయ ఉత్పత్తుల్లో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. ఇది పర్యావరణంపై, మన ఆరోగ్యాలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మన ఆరోగ్యం మెరుగుపడాలన్నా, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నా రైతులు సేంద్రియ సాగు వైపు అడుగులు వేయాలి.

ప్రస్తుత పరిస్థితిని అధిగమించి సేంద్రియ సాగు పద్ధతిని రైతుల దరి చేర్చేందుకు ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరంపరాగత్ కృషి వికాస్ యోజన(పీకేవీవై) పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. తద్వారా సేంద్రియ, కంపోస్టు, నాడెపు కంపోస్టు, వర్మీ కంపోస్టు ఎరువుల ఉత్పత్తి చేయిస్తూ అన్నదాతలకు అందిస్తున్నారు. అయితే ఈ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలి, వాటికి కావల్సిన వనరులు గూర్చి తెలుసుకుందాం.

సేంద్రియ ఎరువులకు మూలం పేడ


BIG.jpg
వ్యవసాయ వ్యర్థపదార్థాలైన మెక్కల అవశేషాలు, రాలిన ఆకులు, పూలు, పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పాతవరి గడ్డి, వేర్లు, పశువులు తొక్కిన చొప్ప, పనికి రాని, కుళ్లిన కాయగూరలు, పండ్లు అవసరం ఉంటాయి. వీటితోపాటు ప్రధానమైనది గోవుల పేడ. ప్రతి టన్ను వ్యర్థ పదార్థానికి 100 కిలోల పేడ అవసరం. ఒక సంవత్సర కాలంలో ఒక పశువుల ద్వారా వచ్చే పేడ, మూత్రంలో 60 కేజీల నత్రజని, (120 కిలోల యూరియా), 15 కేజీల భాస్వరం(100 కిలోల సూఫర్ ఫాస్పేట్), 50 కేజీల మ్యూరెట్ పొటాష్(65 కేజీల మ్యూరెట్ ఆఫ్ పొటాష్) లభ్యమవుతాయి. ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలే. కానీ దీనిపై ఒక్క పైసా ఖర్చు పెట్టకుండానే తయారు చేసుకోవచ్చు. పై వ్యర్థా లు, పశువుల పేడతోపాటు, సూపర్ ఫాస్పేట్ ప్రతి టన్నుకు 40-50 కిలోలు వాడినైట్లెతే కంపోస్టు త్వర గా కుళ్లిపోవడానికి దోహదం చేస్తుంది.

కంపోస్టు ఎరువుల తయారీ ఇలా..

కంపోస్టు తయారు చేసుకునే రైతులు తమ పశువుల కొట్టం దగ్గర కానీ, బావుల దగ్గర కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ పెద్ద పెద్ద చెట్లు అందుబాటులో ఉంటే వాటి కింద ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిది. తద్వారా పొలంలో ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. గుంతను తవ్వుకునేటప్పుడు ఎరువులను తిరుగతోడటానికి అనువుగా ఉండే విధంగా తవ్వుకోవాలి. గుంటకు, గుంటకు మధ్య 12 అడుగుల స్థలం వదిలి, 2 మీటర్ల వెడల్పు, 1 మీటర్ లోతు ఉండే విధంగా తవ్వుకోవాలి. ఇలా తవ్వుకున్న గుంటలలో సేకరించిన చెత్తను ఒక అడుగు మందం వరకు వేసుకోవాలి. అనంతరం పేడ, నీరు లేదా మూత్రాన్ని మట్టితో కలిపి చెత్త పూర్తిగా తడిసే విధంగా చల్లాలి.

ఈ విధంగా 30 సెం.మీ మందం గల వరుసలను పొరలుగా వేసుకుంటూ, భూమట్టానికి 1/2 మీటర్ ఎత్తు వచ్చే వరకు గుంటను నింపాలి. తరువాత మట్టితో అలకాలి. ప్రతి పొరపై బూడిదను కానీ, సూపర్ ఫాస్పేట్‌ను గానీ గుప్పెడంత చల్లుకోవాలి. మూడు నెలల తరువాత నాణ్యమైన చీకిన ఎరువులను బయటకు తీసి, శంఖం ఆకారంలో పోసి పెట్టాలి. చాలావరకు రైతులు ఈ విధానం పాటిస్తుంటారు. అయితే గుంటపైన అలకటం చేయరు. దీంతో గుంటలోని ఎరువు, ఎండకు ఎండి, వానకు తడిసి సారం లేకుండాపోతుం ది. కొంత సమయం వెచ్చించి గుంతను అలికినైట్లెతే సారవంతమైన ఎరువును ఉత్పత్తి చేసుకోవచ్చు.

ఈ ట్యాంక్‌ను సైతం పొలంబావి దగ్గర కట్టుకున్నైట్లెతే అన్నింటికి ఉపయోగకరంగా ఉంటుంది. వ్యర్థపదా ర్థం, ఎరువులను పొలం సమీపంలో ఎత్తైన ప్రదేశం లో నిల్వ ఉంచుకోవాలి. ఆ ప్రదేశంలో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. అవసరమైతే ఒక వరుస ఇటుక, మట్టి సిమెంట్‌తో టాంక్‌ను కట్టుకోవాలి. ట్యాంక్ గోడల కింద వరుసలను మట్టితోనే కట్టుకోవా లి. ప్రతి రెండు మూడు వరుసలకు ఒక 10 సె.మీ పరిమాణం గల రంధ్రాలు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కట్టుకున్న ట్యాంక్ అడుగుభాగాన, గోడలను ఆవుపేడ, నీరు కలిపి చిక్కగా చల్లుకోవాలి. కత్తిరించిన వ్యర్థపదార్థాలను ఆకులు, వేరు కాండం, గడ్డి, ఇతర వ్యర్థపదార్థాలు 15 సెం.మీ మందంలో ట్యాంక్ అడుగుభాగాన వేసుకోవాలి.

దీని పైన నాలుగు కిలోల ఆవుపేడను 125 లీటర్లలో కలిపి చల్లాలి. అనంతరం 50-60 కిలోల ఎండబెట్టిన మట్టిని వేసుకోవాలి. తరువాత 400-500 కిలోల మట్టిని నీరు,పేడతో ముద్దగా కలిపి ట్యాంక్ పైన 5-7 సె.మీ మందంలో వేసుకోవా లి. 15 రోజుల తరువాత ట్యాంక్‌లో వేసిన వ్యర్థపదార్థాలు 20-25 సెంటీమీటర్ల లోతుకు కుంగిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో మళ్లీ వ్యర్థపదార్థాలు వేసుకొని పేడ, మట్టితో అలుక్కోవాలి. తేమ శాతాన్ని కాపాడుకునేందుకు నీరు చల్లుకోవాలి. మూడు నెలల తరువాత పోషకవిలువ లు గల ఎరువు తయారవుతుంది. ఈ టాంక్‌లో ప్రతి మూడు నెలలకు ఒకసారి దాదాపు 2.5 టన్నుల ఎరువులను తయారు చేసుకోవచ్చు. తద్వారా ఒక ఎకరానికి సరిపడ ఎరువులను వినియోగించుకోవచ్చు.

వర్మీకంపోస్టు ఎరువుల తయారీ..

వానపాములు అంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న రసాయనక ఎరువు ల వాడటం వల్ల వానపాములు కూడా అంతరిస్తున్నా యి. పనికి రాని వ్యర్థపదార్థలను ఉపయోగించి ఈ ఎరువును తయారుచేసుకోవచ్చు. వానపాములు నేల లో ఉండి మట్టిని తిరగతోడి నేలను గుల్లబారేటట్లు చేస్తాయి. ఇది విస్తర్జించే వ్యర్థపదార్థాల ద్వార సారవంతమైన మంచి ఎరువు తయారు అవుతుంది. వానపాముల విషయానికి వస్తే రెండు రకాలు. ఒకటి భూమి పై పొరల్లో సంచరించే రకం అయితే, మరొకటి నేలను గుల్లచేసి భూమిలో ఉండే రకం. మొదటి రకం వానపాముల ఎరువులను తయారు చేసుకోవాడానికి పనికి వస్తాయి. ఈ రకాలు భూమిపై ఉండే ఆకు అలములు, చెత్త, చెదారాన్ని సేంద్రియ పదార్థంగా మారుస్తాయి. దీన్ని తయారు చేయడానికి కావలిన పదార్థాలు .
PDF2.jpg
వర్మీకంపోస్టు తయారు చేసుకునేందుకుగాను 300 చదరపు అడుగులు లేదా, 10 చదరపు మీటర్ల వైశా ల్యం గల పాకను నిర్మించుకోవాలి. దానిలో 15X 3X 1.5 అడుగుల మూడు బెడ్‌లను నిర్మా ణం చేసుకోవాలి. ఈ బెడ్‌ల అడుగుభాగంలో గట్టిగా ఉండేందుకు 15 సె.మీ మందంలో రాళ్లు, కంకర, ఇటుక ముక్కలను వేసుకొని చదును చేయాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న బెడ్‌లపై సుమారు 45 సెం.మీ మందం వరకు పాక్షికంగా కుళ్లిన వ్యర్థపదార్థా లు పరుచుకోవాలి. వాటిపై 5-10 సె.మీ మందం వరకు కుళ్లిన పేడను వేసి బెడ్ మొత్తం తడుపాలి. బెడ్‌లలో ఎప్పుడూ 50-60 శాతం తేమ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా వారంరోజుల వరకు తేమ సరిపోయే నీటిని చల్లుతూ వారం తరువాత వానపాములను బెడ్‌లపై వేయాలి. ఇవి తమ ఆహారాన్ని తేమను వెతుక్కుంటూ లోపలికి వెళ్లి ప్రతిరోజూ ఆహారాన్ని తీసుకుంటాయి. గుంటలోని పదార్థాలకు గాలి అందేవిధంగా పలుచని గోనె సంచులతో కప్పి తేమ ఉండేటట్లు చూసుకోవాలి. తద్వారా 60-70 రోజుల తరువాత సారవంతమైన ఎరువు తయారవుతుంది. ఇది నల్లరంగులో చాలా తేలికగా ఉండి టీ పొడిలాగ ఉంటుంది. వానపాములు గోనె సంచికి అంటుకుని ఉన్నప్పుడు కంపోస్టు ఎరువు తయారైనట్టు గుర్తించాలి.

తయారీలో జాగ్రత్తలు- వాడుకునే పద్ధతి

బెడ్‌లను తయారు చేసుకునే సమయంలో ఇనుప, గాజు ముక్కలు, ప్లాస్టిక్ సంచులాంటివి కుళ్లిపోని పదార్థాలు లేకుండా చూసుకోవాలి. వానపాములను పక్షు లు, కప్పలు, పాములు, చీమలు, కోళ్ల బెడద లేకుండా చూసుకోవాలి. ఎకరానికి ఒక టన్ను వర్మీకంపోస్టును మాత్రమే వాడుకోవాలి. మోతాదు మించి నైట్లెతే పంటకు ప్రమాదం. తోటలలో ఒక్కో చెట్టుకు 100-200 గ్రాముల ఎరువును వేసుకోవాలి. ఒకవేళ చెట్టు మొదట్లో సగం మగ్గిన ఆకులు, చెత్తతో పాటు పేడను కూడా ఉపయోగించి ఎరువుకు అక్కడే అందేవిధంగా చేసుకోవచ్చు. కూరగాయల్లాంటి మొక్కలకు ఒక్కో మొక్కకు 50 గ్రాముల చొప్పున వాడుకోవాలి.
-మద్దెల లక్ష్మణ్, ఖమ్మం వ్యవసాయం, 9010723131

నాడెపు కంపోస్టు ఎరువు తయారీ..

పశువులు లేని రైతులు సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవడానికి ఈ విధానం దోహదం చేస్తుంది. ఇది సాధారణ కంపోస్టు ఎరువుల కంటే మూడింతలు ఫలితాన్నిస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది గాలి, వెలుతురు పద్ధతిలో తయారయ్యే కంపోస్టు ఎరువు. వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో పాటు, గ్రామ పరిసరాల్లో దొరికే చెత్తా, చెదారం వాడటం వల్ల మంచి ఎరువులను తయారు చేసుకోవచ్చు.
PDF.jpg


నేలకు సారం రైతుకు లాభం

Jhansi-Lakshmi-Kumari.jpg
సేంద్రియ ఎరువుల వాడకంతో నేలకు సారం దొరుకుతుంది దీంతోపాటు రైతుకు లాభం చేకూరుతుంది. వినియోగదారులకు నాణ్యమైన అహారం అందించేందుకుగాను ఈ విధానం ప్రతి రైతు పాటించాలి. ఈ పద్ధతిలో రైతులు సాగు చేపడితే వ్యవసాయశాఖ ప్రోత్సాహం అందిస్తుంది. దీనివల్ల పెట్టుబడి భారం తగ్గడమే కాకుండా, ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను దిగుబడి చేయవచ్చు.
-అత్తోట ఝాన్సీలక్ష్మీకుమారి
(ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్)

669
Tags

More News