విత్తనోత్పత్తి చేస్తూ.. రైతులకు అందజేస్తూ

Wed,July 11, 2018 11:27 PM

కాల్వశ్రీరాంపూర్‌లో సొంతంగా విత్తనోత్పత్తి చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న సత్యనారాయణ
వానకాలం, యాసంగి కాలానికి రైతులు అనువైన వరి విత్తనాలను సేకరించి, సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన యువరైతు కొప్పుల సత్యనారాయణ తానే సొంతంగా వరి విత్తనాలు తయారు చేస్తున్నట్లు వివరించారు. రైతులు విత్తనాల ఎంపికలో సరైన అవగాహన లేక అధిక దిగుబడి సాధించ లేకపోతున్నారని చెప్పారు. అందుకే కొంతకాలంగా చుట్టుపక్కల గ్రామాల్లో విత్తనాలు కావాల్సిన రైతులకు అందజేస్తున్నారు. వానకాలం, యాసంగి కాలాలకు తన వద్ద ఉన్న వరి విత్తనాల గురించి వివరించారు.
sadanandam

శాస్త్రవేత్తల సందర్శన

సత్యనారాయణ తయారుచేస్తున్న వరి వంగడాలను పలువురు భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా సంస్థ హైదరాబాద్ శాస్త్రవేత్తలు డాక్టర్ షేక్ ఎన్‌మీరా, డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ అరుణ్‌కుమార్, డాక్టర్ మదన్‌మోహ న్ , జమ్మికుంట కృషి విజ్ఞాన వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రావు ఇటీవల పరిశీలించారు. సదరు శాస్త్రవేత్తలు సత్యనారాయణ పొలంలో 18 రకాల వరి వంగడాలను ఉత్పత్తి చేసేందుకు పంటల ప్రదర్శన చేపట్టా రు. సత్యనారాయణ తయారుచేస్తున్న వరి వంగడాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

sadanandam2

తయారుచేసిన వరి వంగడాలివే..

ఎంఎస్-5 : సత్యనారాయణ సొం తం గా తయారుచేసిన వరి విత్తనం. వానకాలం, యాసంగికి అనుకూలం. పంట కాలం 135 నుంచి 140 రోజులు. ఎంటీయూ 1010 రకాన్ని పోలి ఉంటుంది. గింజ రాలదు. అగ్గి తెగులు, మెడవిరుపు, తట్టుకునే శక్తి కలిగి ఉన్నది. అతితక్కువ నత్రజని అవసరం. పంట సాగు విధానంలో అతి తక్కువ ఎరువులు అవసరం.

90డేస్ ఎమర్జెన్సీ: వానకాలం, యాసంగికి అనుకూలం. అతి సన్న గింజ, సూపర్ ఫైన్ క్వాలిటీ. పంట పడిపోదు. పొట్టి రకం. నాణ్యత బాగుంటుంది. మెడవిరుపు, తెగుళ్లు రావు. ఎకరాకు 45 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తుంది. నారుపోసిన రోజు నుంచి పంట కాలం 90 రోజులు.

కే-6: 1010 గింజ రకాన్ని పోలి ఉంటుంది. పొట్టి రకం. చలి తట్టుకుంటుంది. గింజ రాలదు. 1010 కంటే దుబ్బు (పిలుకల) సంఖ్య ఎక్కువ. పంట కాలం 125 నుంచి 135 రోజులు. వానకాలం, యాసంగి కాలాలకు అనుకూలం.

వెంకటాద్రి: పంట కాలం 135 రోజు లు. వానకాలం, యాసంగి అనుకూలం. సన్న గింజ, పంట పడిపోదు. గింజ పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి ఉన్న తట్టుకొని, గింజ నూక కాకుండా ఉంటుంది. గింజ రాలదు. బలమైన కాండం కలిగి ఉంటుంది. గొలుసులో (వెన్ను) గింజల సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంటుంది. దోమ పోటు, అగ్గితెగులు తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు 50 నుంచి 55 బస్తాల దిగుబడి వస్తుంది.

నారాయణి: తెలంగాణ సోనాకు దీటుగా ఉంటుం ది. పంట పడిపోదు. గింజ రాలదు. ఉల్లికోడు, అగ్గితెగులు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. గింజల సంఖ్య ఎక్కువ. పంట కాలం 120 -135 రోజులు. వానకాలం, యాసంగికి అనుకూలం. పిలుకల సంఖ్య ఎక్కువ. తక్కువ ఎరువులు తీసుంటుంది.

ఈజీ డైట్: పంట కాలం 130 నుంచి 135 రోజు లు. అతి సన్న రకం వరి గింజ. నాణ్యత మన్నికగా ఉంటుంది. దోమపోటు, మెడవిరుపు, అగ్గితెగులును తట్టుకుని, మంచి దిగుబడి ఇచ్చే వరి రకం. ఇవే కాకుండా మరో 350 రకాల వరి విత్తనాలు ఉత్పత్తిలో ఉన్నాయని సత్యనారాయణ చెబుతున్నారు. జేజీఎల్ 24423, జేజీఎల్20171, కేషర్, తెలంగాణ సోనా, ఎంటీయూ 1156 తదిరత విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు రకరకాల విత్తనాలను బ్రీడర్, సైంటిస్టుల సలహాలు పాటించి తయారు చేస్తున్నానని వివరించారు.

దిగుబడి ఎక్కువ

రైతులు మేలు రకాల విత్తలనాలను ఎంపిక చేసుకొని పంట సాగులో వాడుకోవాలి. విత్తనాల తయారీలో బ్రీడర్, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తున్నా ను. పొలంలో మేలైన వరివంగడాలను తీసుకొని, సంకరణం చేసి, అందులో మేలు రకా న్ని తీసుకొని విత్తనం తయారు చేస్తున్నాను. ఒక రకం విత్తనం తయారు కావాలంటే సుమారు 6 నుంచి 7 ఏండ్లు పడుతుంది. ఇంకా నూతన వరి విత్తనాలు తయారు చేయాలనేది తన ఆలోచన. విత్తనాలు కావాల్సిన రైతులు తనను 9908608696లో సంప్రదించాలని సత్యనారాయణ తెలిపారు.
-సిద్ధం సదానందం,
కాల్వశ్రీరాంపూర్ మండలం, 9949889750

693
Tags

More News