పంట మార్పిడితో మంచి ఫలితాలు

Wed,July 11, 2018 11:21 PM

రైతులు తమ పంట పొలాల్లో ఒకే రకమైన పంటలను సాగు చేయవద్దు. దీనివల్ల వాటిపై రోగాలను కలిగించే పురుగుల సంఖ్య బాగా పెరిగిపోయి రోగాల బెడద తీవ్రంగా ఉంటుంది. అలాగే పంట మొక్కలు భూమిలోని ఒకే లోతు పొరల నుంచి పోషకాలను స్వీకరిస్తాయి. కాబట్టి పోషకాలు తగ్గుతాయి. పంటల దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. అందుకే ఒకే రకమైన పంటలను వరుసగా సాగు చేయవద్దు. దీనికి బదులు పంట మార్పిడి చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. తద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త టి.యాదగిరిరెడ్డి తెలిపారు. పంట మార్పిడి ప్రాధాన్యం, తద్వారా కలిగే ప్రయోజనాలను గురించి ఆయన వివరించారు. దీనికి సంబంధించిన అదనపు సమాచారం కోసం 9440481279 నెంబర్ ద్వారా వారిని సంప్రదించవచ్చు.
raithubadi
-ఒక పంటను ఒకే పొలంలో వరుసగా పండించడం వల్ల చీడపీడల ఉధృతి అధికమయ్యే పరిస్థితులు ఏర్పడుతాయి. పురుగు జీవిత చక్రం నిరాటంకంగా ముగించుకొని తీవ్రమైన హాని కలిగించే స్థితికి చేరుకుంటుంది. పంట మార్పిడి చేసినప్పుడు పురుగు జీవిత చక్రం ఛేదించబడుతుంది. ఒక పంటపై ఆశించే పురుగులు మరో పంటపై ఆశించడం సాధారణంగా జరుగదు. వేగంగా వృద్ధి చెందే కొన్నిరకాల పురుగులను పంట మార్పిడి వల్ల అదుపులో పెట్టవచ్చు.
-ఒకే లోతు వ్యవస్థ కలిగిన పంటలను ఉదాహరణకు పత్తి, మిరప మొదలైన పంటలను మార్పిడి చేయాలి. మార్పిడి చేయకుంటే ఒకే లోతు పొరల నుంచి పోషకాలు తీసుకోవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వరి, వేరుశనగ, జొన్న, మక్కజొన్న వంటి పైర్లు నేల పై పొరల నుంచి పోషకాలను తీసుకుంటాయి. నేల భౌతిక లక్షణాలు, స్వభావం దెబ్బతినకుండా ఉండటానికి, చీడపీడల అభివృద్ధిని నిరోధించడానికి పంట మార్పిడి తప్పకుండా చేయాలి.
-పంట మార్పిడి క్రమంలో ఆహార, వాణిజ్య పంటలను పంట జాతి పైర్లతో పంట మార్పిడి చేయాలి.

ప్రయోజనాలు:

-వరి తర్వాత మినుము, పెసర, శనగ వేయడం వల్ల సుడిదోమ, టుంగ్రో వైరస్‌ను నివారించవచ్చు. చెరకు తర్వాత వరిని వేయడం వల్ల వేరు పురుగును నివారించవచ్చు. అలాగే వరిలో దోమపోటు నివారించవచ్చు. పత్తి వేసిన పొలంలో జొన్న, మక్కజొన్న, నువ్వులు, మినుము వేస్తే లద్దె పురుగు, పచ్చ పురుగులను నివారించవచ్చు. జొన్న, మక్కజొన్న తర్వాత కందిని సాగు చేస్తే కాయతొలిచే పురుగు ఉధృతి తగ్గుతుంది. వరిని సాగు చేసే పొలాల్లో ముందుగా పప్పుధాన్యాలను సాగు చేయడం వల్ల నేల సారవంతమవుతుంది.
-వేరుశనగలో ఆకుముడుతను నివారించేందుకు పప్పుజాతికి చెందిన పైర్లతో మార్పిడి చేయాలి. కంది, మిరప పంటల్లో ఎండు తెగులు నివారణకు జొన్న, మక్కజొన్న పంటలతో మార్పిడి చేయాలి. నులి పురుగు సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ, మిరప, పొగాకు, వంగ పైర్లను కొన్ని పంట కాలాల వరకు సాగును ఆపాలి.
-ఆహార పంటలైన వరి, జొన్న, మక్కజొన్న, సజ్జ పైర్లను పప్పుజాతి పైర్లయిన పెసర, మినుము, వేరుశనగ పంటలతో మార్పిడి చేయాలి. ఆహార, వాణిజ్య పంటలను పశు గ్రాస పైర్లతో ఒకసారి, పప్పుజాతి పైర్లతో మరోసారి మార్పిడి చేయ డం లాభదాయకం.
-నట్టె కోటేశ్వర్‌రావు, గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా
9989944945

572
Tags

More News