ఆకుకూరల్లో సస్యరక్షణ

Wed,July 4, 2018 11:46 PM

మనం నిత్యం వాడే ఆకుకూరల్లో ముఖ్యమైనవి మెంతికూర, తోటకూర, పాలకూర,గోంగూర, బచ్చలి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. అయితే ఆకుకూరలపై పురుగు మందులను తక్కువగా వాడటం మంచిది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మందులను కింద వివరించిన విధంగా వాడుకోవచ్చు. ఈ ఆకు కూరలను ప్రతిరోజూ గమనిస్తూ చీడపీడలు ఆశించిన వెంటనే సస్యరక్షణ చర్యలు పాటించాలి.
food-leafs

మెంతికూర

మొదలు కుళ్ళు తెగులు : ఈ తెగులు భూమిలో ఉండే రైజోక్టోనియా సొలాని అనే శిలీంధ్రం వల్ల సోకుతుంది. కాండం మొదలు భాగంలో మచ్చలు ఏర్పడి కుళ్ళిపోవడం వల్ల లేత మొక్కలు నేలపై వాలిపోతాయి.
నివారణ : ఒక కిలో విత్తనానికి ఒక గ్రాము చొప్పున కార్బండిజమ్ మందును ఉపయోగించి విత్తనశుద్ధి చేయాలి. తిరిగి అదే మందును లీటరు నీటికి ఒక గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి నేలను తడుపాలి. అయితే వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు వాడాలి.
Methi
బూడిద తెగులు : ఇది ఎరిసిఫే పోలిగోని, లేవెల్యులా టారికా అనే శిలీంధ్రాల వల్ల సోకుతుంది. ఈ తెగులు సాధారణంగా పంట చివరి దశ లో ఆశిస్తుంది. దీనివల్ల ఆకుకు రెండువైపులా తెల్లని పొడి వంటి పదార్థం ఏర్పడుతుం ది. ఇది కాండంపైన కూడా కన్పిస్తుంది. డిసెంబర్ నెలలో గాలి లో తేమ 60 నుంచి 70 శాతం ఉండి, ఉష్ణోగ్రత 15 నుంచి 25 డిగ్రీలు ఉన్నప్పుడు తెగులు తీవ్రత అధికంగా ఉంటుంది.
నివారణ : హెక్టారుకు 25 కిలోల గంధకం పొడిని చల్లడం ద్వారా కానీ లేదా లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున నీటిలో కరిగే గంధకపు పొడిని పిచికారీ చేయాలి. ఈ మందును 2-3 సార్లు వారం రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి.

సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు సర్కోస్పోరా అనే శిలీంధ్రం వల్ల సోకుతుంది. ఈ తెగులు ఆకులు, కాయలు, లేత కొమ్మలను కూడా ఆశిస్తుం ది. ఈ తెగులు వ్యాప్తికి తేమతో కూడిన చల్లని వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
నివారణ : ఈ తెగులు నివారణకు విత్తనశుద్ధి చాలా అవసరం. దీనికి కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజం అనే మందును వాడవచ్చు. పైరుపై తెగులు సోకిన తర్వాత కూడా ఈ మందును ఇదే మోతాదులో అంటే లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి వారం రోజుల వ్యవధితో 2-3సార్లు పిచికారీ చేసి ఈ తెగులును నివారించవచ్చు.
mint

పుదీనా :

పుదీనా పంటను కాండం కుళ్ళు తెగులు, ఆకుమచ్చతెగులు, ఆకులను తినే పురుగులు ఆశించి నష్టపరుస్తాయి. పైన తెలిపిన అన్నిరకాల ఆకుకూరల సస్యరక్షణ కోసం లీటరు నీటికి 2-5 గ్రాముల చొప్పున మాంకోజెబ్ లేదా ఒక గ్రాము చొప్పు న కార్బండిజం మందులను కలిపి పైరుపై పిచికారీ చేయాలి. వైరస్‌ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులను నివారించడానికి లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున డైమిథోయేట్ లేదా 1.5 మి.లీ.క్వినాల్ ఫాస్ లేదా.6 మి.లీ ఫిప్రొనిల్ మందులను పైరుపై పిచికారీ చేయాలి. అయితే కరివేపాకుపై మాత్రం గంధ కం కలిగి ఉన్న మందులను వాడకూడదు. దీనివల్ల ఆకు రాలిపోతుంది. పైన తెలిపిన ఆకుకూరల్లో కాండం కుళ్ళు తెగులు ఆశించినప్పుడు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి నేలను తడుపాలి.
Kottimeera

కొత్తిమీర :

దీని ఆకుకూరల్లో వాడటమే కాక పచ్చి ఆకును సలాడ్‌లో కూడా వాడతారు. కనుక దీనిపై వీలైనంత వరకూ పురుగు మందులను వాడకపోవడమే మంచిది. కానీ కొత్తిమీరను విత్తనపు పంటగా వదిలినప్పుడు మందులను కొంతవరకు వాడవచ్చు. కొత్తిమీరను ఆశించే బూడిద తెగులను నివారించడానికి లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున నీటిలో కరిగే గంధకపు పొడిని కలిపి పైరుపై పిచికారీ చేయాలి.
thotakura

తోటకూర

తుప్పు తెగులు : తోటకూరను ఆశించే తెగుళ్ళలో ముఖ్యమైనది తుప్పుతెగులు. ఈ తెగులు ఆల్బు గో క్యాండిడా అనే శిలీంధ్రం వల్ల సోకుతుంది. ఈ తెగులు ఆశించినపుడు ఆకుల అడుగుభాగాన తెల్లని బుడిపెల వలె కన్పిస్తాయి. దీనివల్ల ఆకుల పైభాగంలో పసుపురంగు మచ్చలు ఏర్పడుతాయి.

నివారణ : దీని నివారణకు మాంకోజెబ్ అనే మందును లీటరు నీటికి 2.5 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పైరు బాగా తడిసేలా పిచికారీ చేయాలి. పిచికారీ చేసేటప్పుడు ఆకుల అడుగు భాగం బాగాతడి సేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే దీంతోపాటు మలాథియాన్ అనే మందును కూడా లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపినట్లయితే ఆకు ముడత, ఆకులను కొరికి తినే గొంగళి పురుగులు కూడానివారించబడతాయి.
palak

ఆకుమచ్చ తెగులు

పాలకూర: పాలకూరను ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు ఆశిస్తుంది. ఆకులపై మచ్చలు ఏర్పడం వల్ల మార్కెట్లో రేటు బాగా తగ్గిపోతుంది. ఇదికాక దీన్ని ఎక్కువగా పేనుబంక, ఆకులను తినే గొంగళి పురుగులు కూడా ఆశిస్తాయి.
gongura

గోంగూర:

గోంగూరను కూడా ఎక్కువగా ఆకుమచ్చ తెగులు ఆశిస్తుంది. దీనివల్ల ఆకులకు మార్కెట్లో రేటు తగ్గిపోతుంది. దీంతోపాటు ఈ ఆకు కూరను రసం పీల్చే పురుగులు, ఆకులను తినే గొంగళి పురుగులు ఆశిస్తాయి.

బచ్చలి: బచ్చలిని ఎక్కువగా కుళ్ళు తెగులు, ఆకు మచ్చ తెగులు, వైరస్ తెగుళ్ళు ఆశిస్తాయి. అయితే దీనికి పురుగుల బెడద తక్కువే.
Karivepaku

కరివేపాకు :

కరివేపాకును ఎక్కువగా ఆకుమచ్చ తెగులు, గొంగళి పురుగులు, సిల్లిడ్ నల్లి, పిండి పురుగులు ఆశిస్తాయి. పిండి పురుగులను ఆశించిన కొమ్మలను తీసివేసే వాటి బెడద కొంత వరకూ తగ్గుతుంది. వర్షాలు ఆరంభమవుతూనే రైతులు నారుమళ్ళ తయారు చేసుకొని వివిధ కూరగాయల విత్తనాన్ని విత్తుకొంటారు. అయితే నారుమళ్ళు ఎత్తుపల్లాలుగా ఉండటం లేదా వర్షాలు ఎక్కువగా ఉండి నీరు బాగా నిలిచిన పరిస్థితుల్లో నారుమళ్ళలో మాగు డు తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు భూమిలో ఉండే ఒక రకమైన శిలీంధ్రం వల్ల ఆశిస్తుంది. మురుగునీటి సదుపాయం లేనప్పుడు ఈతెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుం ది. ఈ శిలీంధ్రం నేలలో ఉండటం వల్ల విత్తనాలను ఆశించి తెగులును కలుగ జేస్తుం ది. దీనివల్ల విత్తనాలు కుళ్ళి సరిగా మొలకెత్తవు. గింజలు మొలకెత్తిన తర్వాత కూడా నారు మొక్కల మొదళ్ళు మొత్తబడి గుంపులు గుంపులుగా మొక్కలు చనిపోతాయి.

నివారణ : ఎత్తైన నారుమళ్లను తయారుచేసుకుంటే నీరు నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు ఆరిపోవడానికి వీలుగా ఉంటుంది. దీనివల్ల శిలీంధ్రం ఉధృతి తగ్గిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను కలిపి తప్పక విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తనం మొలిచిన తర్వాత కూడా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి నారుమడిని వారం రోజుల వ్యవధితో 2-3 సార్లు బాగా తడుపాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ నారుకుళ్ళులేదా మాగుడు తెగులును సమర్థవంతంగా అరికట్టవచ్చు.

714
Tags

More News