పాలిథిన్ షీట్లపై నార్లు-వరి పంటకు లాభం

Wed,July 4, 2018 11:41 PM

రాష్ట్రంలో వానకాలం, యాసంగిల్లో రైతాంగం వరి సాగు చేస్తున్నారు. నానాటికీ పట్ణణ ప్రాంతాలకు తరలిపోతున్న గ్రామీణ జనాభాతో పాటు యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపక పోతున్నది. దీనివల్ల కూలీల సమస్య వ్యవసాయంలో రోజురోజుకూ పెరుగుతున్నది. ఎక్కువ శాతం వరిపంటను రైతులు నాటు పద్ధతిలో సాగు చేయడం పరిపాటి. ఈపద్ధతిలో వరి నాటుకు అనుకూలంగా దమ్ముచేయడం, నాట్లు బురదలో వేయడం తప్పనిసరి. చాలామంది కూలీలు బురద పొలంలో పని చేయడానికి ఇష్టపడక పోవడం వల్ల వరి రైతుల కష్టాలు మరింత పెరుగుతున్నాయి.
polythan-sheets
ఎకరం నాటు వేయడానికి 10 నుంచి 12 మంది కూలీలు అవసరం. కాబట్టి కూలీల డిమాండ్ తప్పని సరిగా మారింది. వారి కోసం రైతాంగం పడికాపులు కాయడం రోజు కు కేవలం ముగ్గురు, నలుగురు కూలీలు మాత్రమే రావడంతో అయిదారు ఎకరాల వరి సాగు చేసే రైతులు తమ నాట్లను 10, 15 రోజుల పాటు వేయడం పరిపాటుగా మారింది. దమ్ము చేసిన పొలంలో సరైన సమయంలో నాటు వేయకపోవడంతో మళ్లీ ఆ వరి పొలాలు గట్టి పడటం, గడ్డి మొలవ డం జరుగుతున్నది.దీంతో మళ్లీ దమ్ము చేయాల్సిన పరిస్థితి రావడం సాధారణంగా మారింది. దీనివల్ల అత్యంత విలువైన నీరు, సమయం, డబ్బులు వృథా అవుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు 2011లోనే మిషన్ల ద్వారా నాట్లు వేసేందుకు ప్రయత్నాలు చేశారు. జపాన్, చైనా ఇతర దేశాల నుంచి సాంకేతిక పరిఙ్ఙానాన్ని అందిపుచ్చుకుని రైతుల పొలాల్లో మిషన్ల ద్వారా వరి నాట్లు వేయడం జరిగింది. యూనివర్సిటీ వారే కాకుండ కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నారును పెంచి నాట్లు వేయడం జరిగింది. అయితే అనుకున్నంత వేగంగా ఈ పరిజ్ఞానం రైతుల వద్దకు వెళ్ల లేదు. దీంతో వరంగల్ వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలు కేరళతో ఇతర రాష్ర్టాల పద్ధతులను పరిశీలించి సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు.

polythan-sheets2
-మిషన్ నాటడానికి అనుకూలంగా పాలిథీన్ షీట్లపై నారు పెంచడం.
-రోడ్డు వేస్తున్నపుడు సిమెంటు మెటీరియల్ జారిపోకుండ కిందపరిచే తెల్లని పాలిథీన్ షీట్‌ను నారు పెంచేందుకు వాడాలి.
-షీటు 76 సెం.మీ.వెడల్పు , 26 మీటర్ల పొడవు ఉంటుంది.
-షీటు మందం 60 మైక్రాన్లుగా ఉండాలి. ఒక కేజీ పాలిథీన్ షీట్ ఖరీదు రూ.140 మాత్రమే. ఎకరాలకు అర కిలో షీటు సరిపోతుంది.
-ఆయా ప్రాంతానికి అనువైన రకాలను ఎంపిక చేసుకుని కార్బండిజంతో విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తనాలను 24 గంటలు నానా బెట్టిన తర్వాత 24 గంటలు మండె కట్టినట్లయితే సమానంగా మెలకెత్తుతాయి.
-విత్తనాలను చల్లే ముందు నీడలో ఆరబెట్టుకోవాలి. తేమ ఎక్కువగా ఉంటు ఒకదానికొకటి అంటుకుని సరిగా పడవు. పొడి విత్తనాలు చల్లు కోవడానికి వాడుకోవచ్చు. కాకాపోతే మొలక రావడానికి సమయం ఎక్కువగా పడుతుంది.
-నారు పెంచే మడిని గడ్డి లేకుండా దున్నుకుని 24 గంటల ముందుగా దమ్ము చేసుకోవాలి. దమ్ము చేసిన నేల గట్టి పడే ట్లు చూడాలి. లేనట్లయితే ఫ్రేములలో బురుదకు బదలు ఒండ్రు మాత్రమే వస్తుంది.
-నేలను చదును చేయడం తప్పనిసరి. పాలిథీన్ షీట్‌ను మడతలు లేకుండా సమానంగా పరుచాలి. ప్లాస్టిక్ ట్రే సైజ్‌తో తయారు చేసిన చెక్క లేదాఅల్యుమినియం ట్రేలను ఈ పాలిథీన్ షీట్‌పై ఎదురెదురుగా ఉంచాలి. ఈ ఫ్రేములలో ఇంచు మందంతో మట్టిని నింపాలి.
-మెలకెత్తిన వరి గింజలు ఒక్కో ఫ్రేములోని ఒక్కో కానాలో 120 గ్రాములు ఉండేట్లు చూడాలి. ఎకరాలకు 80 సీట్ల నారు అవసరం ఉంటుంది. కాబట్టి దొడ్డు రకాలైతే 14 కిలో లు, సన్నాలైతె 10 కిలోల విత్తనాలు సరిపోతాయి.
-వర్షాలకు దెబ్బతినకుండా, పక్షులు నాశనం చేయకుండా చూసుకోవాలి.
-నారు పెరుగుతున్న క్రమంలో ప్రతిరోజు తప్పనిసరిగా నీరు అందేటట్లు చూసుకోవాలి.
-అవసరాన్ని బట్టి నారుపై వ్యవసాయాధికారుల సూచనతో మందును పిచికారీ చేయాలి. జింకు, ఇనుము దాతు లోపా లు అప్పుడప్పుడు కనబడుతుంటాయి. వీటివల్ల లేత చిగురాకులు తెల్లగా మారుతుంది. నివారణకు ఫెర్రస్ సల్ఫేట్‌ను రెండుసార్లు పిచికారీ చేయాలి. జింకు లోపం కనిపిస్తే జింకు సల్ఫేట్‌ను పిచికారీ చేయాలి.
-14 నుంచి 17 రోజుల్లోనే నాటు వేయడానికి అనుకూలంగా ఉంటుంది.
-నాటు వేసే రోజు నారు మడి నుంచి గంట ముందు తీసి గట్టుపై ఉంచుకోవాలి.

ప్రధాన పొలం తయారు చేయడం: పంట కాలం పూర్తయిన తర్వాత ట్రాక్టర్ కల్టివేటర్‌తో ఒట్టి దుక్కి చేయాలి. వరి నాటడానికి మందుగా పొలాలన్ని రెండు మూడుసార్లు రోటవేటర్‌తో దమ్ము చేయాలి. మొదటిసారి లోడ్ గేర్‌తో, రెండోసారి హై గేర్‌తో ట్రాక్టర్‌ను నడపాలి. దీనివల్ల నీరు ఇంకకుండా ఉంటుంది. మిషన్‌తో నాటు వేసే పొలాన్ని ట్రాక్టర్‌తో ఎక్కువసార్లు దమ్ము చేయడం వల్ల భూమి కుంగే గుణం ఎక్కువై నాటు కష్టమవుతుంది. అందువల్ల ఎక్కువసార్లు దమ్ము చేయవద్దు.

యంత్రాలతో నాటడం: ప్రస్తుతం నాట్లు వేయడానికి యాన్‌మార్, కుబోటో, శక్తిమాన్, రెడ్‌ల్యాండ్ మొదలగు మిషన్లు అందుబాటులో ఉన్నాయి.

రెండు రకాలుగా వరి నాటు యంత్రాలు వాకింగ్ టైప్ మొదటిది దీంట్లో వెనుక నడుస్తూ నాటు వేసే యంత్రం, రొండోది రైడింగ్ మాదిరి దీనిపై కూర్చుని నాటు వేయవచ్చు.
-కొన్నె దేవేందర్ రెడ్డి, వరంగల్ సబర్బన్, 9182777509

టెక్నాలజీని పెంచుకోవాలి

వ్యవసాయంతో కూలీల కొరత తీవ్రంగా ఉన్నది. రైతాంగం తప్పనిసరిగా యంత్ర సహాయాన్ని పెంచుకోవాలి. ఇప్పుడే వ్యవసాయ యాంత్రీకరణ చేపట్టకపోతే భవిష్యత్తులో ఇనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేం ప్రవేశపెట్టిన పాలిథీన్ షీట్లలో నారు పెంచే పద్ధతి ద్వానా సులభంగా యంత్రంతో నాటు వేసుకోవచ్చు.
-డాక్టర్ రఘురాం రెడ్డి, ఏడీఆర్, వరంగల్,
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా క్షేత్రం

629
Tags

More News