నూతన పద్ధతిలో పసుపు సాగు

Thu,June 28, 2018 12:03 AM

పసుపు విస్తీర్ణం, ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నది. దేశంలో పండించే పసుపు సగానికి సగం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోనే ఉత్పత్తి అవుతుంది. పసుపు దుంపల్లోని పసుపు పచ్చదనం, సుగంధ తైలం(2-6శాతం) వల్ల దీన్ని ఆహార పదార్థలకు రంగు, రుచి, వాసనలు చేర్చడానికి, ఔషధాల్లోనూ, చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే పరిమళ ద్రవ్య తయారీలో, రంగుల పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
Pogaku
పసుపులో నూతన పద్ధతులు అవలంభించి తక్కువ ఖర్చు తో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. ఇందుకోసం వేసవి దుక్కులు లోతుగా దున్నుకోవాలి. తర్వాత కల్టివేటర్‌తో దున్ని ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువు, టన్ను వర్మికంపోస్టు వాడాలి. కల్టివేటర్‌తో దున్నడం వల్ల పశువుల ఎరువు, వర్మికంపోస్టు భూమిలో కలిసిపోతుంది. రెండు లేదా మూడేండ్లకు ఒకసారి ఎకరానికి కనీసం 40 ట్రాక్టర్ల చెరువు మట్టి తోలాలి. ఎకరానికి 25 కిలోల జింక్ సల్ఫేట్ దుక్కిలో తప్పకుండా వేయాలి.

అడుగు మందుగా ఎకరానికి ఆరుబస్తాల సింగిల్ సూప ర్ ఫాస్పేట్ చల్లి, బెడ్ మేకర్‌తో బోదెలు 4 ఫీట్ల వెడల్పు, 9 ఇంచుల ఎత్తు, రెండు బోదెల మధ్య 120 సెం.మీ ఉండేట్లు బెడ్స్ తయారు చేసుకోవాలి. ఎకరానికి నాలుగు క్వింటాళ్ల విత్తనం మాత్రమే వాడి విత్తనం మీద రూ. 20వేలు ఆదా చేయవచ్చు. దీనికి విత్తనం పసుపులో ఒకటి లేదా రెండు కణుపులు ఉండేట్లు ఒక అంగుళం సైజు ఉండే విధంగా చిన్న ముక్కలుగా కత్తిరించుకోవడం వల్ల నాలుగు క్వింటాళ్ల విత్తనం సరిపోతుంది. దాదాపు ఒక్కొక్క ముక్క 6-8 గ్రాములు బరువు ఉండేట్లు కత్తిరించుకుంటే ఒక ఎకరానికి 30వేల మొక్కలు నాటుకోవచ్చు.
Farmars

విత్తనశుద్ధి:

పసుపు పంట సాగులో విత్తనశుద్ధి చాలా ముఖ్యం. విత్తన ముక్కల్ని లీటరు నీటికి 3గ్రాముల చొప్పున మ్యాట్‌కో (మ్యాంకోజెబ్+మెటాలాక్ట్‌ల్) కలిపి తయారుచేసిన ద్రావణంలో 30-40నిమిషాలు శుద్ధి చేసి నీడకు ఆరబెట్టాలి. పలుసు పురుగు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మెనోక్రోటోపాస్ 250మి.లీ. 200లీటర్ల నీటిలో కలుపాలి. తర్వాత 2 కేజీల ట్రెకోడెర్మావిరిడి100 లీటర్ల నీటిలో కలిపి ఈ మిశ్రమంలో విత్తన ముక్కల్ని 30నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత నేరుగా పొలంలో కొద్ది వరకు తేమ ఉన్నప్పుడు నాటుకుంటే మంచి ఫలితం వస్తుంది.

తర్వాత బెడ్లపై ఎకరానికి మూడు సంచుల వేప పిండి, ఒక బస్తా యూరియా, ఒక బస్తా పొటాష్ కలిపి చల్లాలి. విత్తనాన్ని బెడ్‌పై రెండు లైన్ల మధ్యలో 45 సెం.మీ దూరం ఉం డేలా విత్తన ముక్కల్ని సుమారు 9అంగుళాలు దూరం ఉండే విధంగా రెండు అంగుళాల లోతులో విత్తి మటితో కప్పాలి. తర్వాత డ్రిప్ పైపులు పరిచి బెడ్ అంతా బాగా తడిచే విధంగా చూడాలి. ఈ పద్ధతిలో చేసినప్పుడు సాధ్యమైనంత వరకు అంతర పంటగా మక్కజొన్న వేయకపోవడం మంచిది. విత్తనం వేసి మరుసటి రోజు ఎకరానికి ఒక కిలో చొప్పున అట్రాజిన్ అనే కలుపు మందును 200 లీట ర్లు కలిపి బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. విత్తిన 40,60,80,100,120 రోజులకు ఒకసారి ఎకరాకు అర బస్తా యూరియా, అర బస్తా కాంప్లెక్స్, ఒక బస్తా వేప పిండి కలిపి బెడ్‌పై వరుసల మధ్య వేసి మట్టిలో కలుపాలి. ఎరువులు వేసేముందు కలుపు లేకుండా తీయించాలి. దుంప కుళ్లు, ఆకుపచ్చవంటి రోగాలను నియంత్రించడానికి సమయానుకూలంగా మందులు పిచికారీ చేయాలి. దీంతోపాటు సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి నివారణకు ఫార్ములా-4, అగ్రోమినిమాక్స్ లేదా సూక్ష్మ పోషకాల మిశ్రమం లీటర్‌నీటికి 5గ్రాముల చొప్పున దీంతోపాటు అరమీటర్ సబ్బునీరు లేదా స్టిక్కింగ్ ఏజెంటుగానీ కలిపి పిచికారీ ప్రతీ 40, 60, 80 రోజుల వ్యవధిలో మూడు లేదా నాలుగుసార్లు పిచికారీ చేయాలి. దీనివల్ల సూక్ష్మపోషకాలు లోపాలను సవరించవచ్చు.

పసుపు సంప్రదాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల దుంప కుళ్లు ఆశిస్తుంది. దీంతో సాగు ఖర్చులు పెరుగుతాయి. కాబ ట్టి రైతులు కొత్త విధానం అయిన బోదె పద్ధతిలో చిన్న చిన్న కొమ్ములుగా చేసి సాగు చేయాలి. దీనివల్ల సాగు ఖర్చు తగ్గుతుంది. అంతేగాకుండా అధిక, నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు.
Rates

ఎత్తైన మడుల వల్ల ఉపయోగాలు:

1)మరుగు నీటి సౌకర్యం పెరిగి వేరు వ్యవస్థను చీడపీడలు ఆశించకుండా ఉంటుంది. 2) కలుపు యాజమాన్యం సమర్థవంతంగా ఉంటుంది. 3) నేల గుల్లబారడం వల్ల మెత్తటి నేలలో వేర్లు బాగా విస్తరించి నీటిని, పోషకాలను పీల్చుకునే సామర్థ్యం పెరిగి మొక్కలు బాగా వృద్ధి చెందుతాయి. 4) నేల కాలుష్యాన్ని అధిగమించి పెరుగుదలకు కావాల్సిన వాతావరణం ఏర్పడుతుంది. 5) వర్షాకాలంలో మరుగు నీటి సౌకర్యం, బెట్ట/కరువు/ఎండాకాలంలో తేమను నిలుపుకునే సామర్థ్యం ఎత్తైన మడుల ద్వారా సాధ్యమవుతుంది.6) ఎత్త యిన మడుల్లో సేంద్రియ ఎరువు లు వాడటంవల్ల వినియోగ సామ ర్థ్యం పెరిగి మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. 7) ఈ పద్ధతి ద్వారా అల్లం, పసుపు, ఉల్లి, వెల్లుల్లి, క్యారెట్, ముల్లంగి, మిరప పంటలు పండించొచ్చు.

ఎత్తైన బెడ్‌ల తయారీ విధానం:

భూమి నాగలితో 2-3 సార్లు బాగా దుక్కిదున్ని చదును చేయా లి. ఆఖరి దుక్కిలో రోటవేటర్‌తో బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో బాగా కుళ్లిన పశువుల ఎరువు ఎకరానికి సుమారు 10-15 టన్ను లు కలుపాలి. దీంతోపాటు జీవన ఎరువులు/జీవ శిలీంధ్రాలు వాడ టం మంచిది.

1. అజోటోబాక్టర్ -2 కిలోలు/ఎకరానికి2.పీఎస్‌బీ -2 కిలోలు/ఎకరానికి3.పొటాష్ ఎస్‌బీ -2 కిలోలు / ఎకరానికి4. ట్రైకోడెర్మా విరిడి -2 కిలోలు/ఎకరానికి5.సూడోమోనాస్ -2కిలోలు/ఎకరానికి వీటిని పశువుల ఎరువులో కలిపి సుమారు 15 రోజులు నీడలో ఉంచి ప్రతీ 2-3 రోజులకొకసారి నీరు చల్లి కలియతిప్పి బెడ్‌లు తయారు చేసుకున్నాక బెడ్‌ల మీద చల్లాలి.బెడ్ సుమారు 10-15 సెం.మీ ఎత్తు, 3 అడుగులు వెడ ల్పు గల ఎత్తైన బెడ్లను తయారు చేయాలి.
- గుండెల రాజు, మహబూబాబాద్ వ్యవసాయం
72889 85757

తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి

తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేందుకు పసుపు సాగు ఎంతో సులభం. దేశంలోఈ పంటకు మంచి డిమాండు ఉన్నది. రైతులు మేలైన పద్ధతులను అవలంబిస్తే అధికంగా దిగుబడి వస్తుంది. బిందు సేద్యంతో నీరు కూడా తక్కువ ఉపయోగించే అవకాశం ఉన్నది. ఇందుకు ప్రభుత్వం రాయితీపై ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న పసుపు సాగుపై ప్రతీ రైతు అవగాహనతో సాగు చేసేందుకు ముందుకు రావాలి.
- కే సూర్యనారాయణ, ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ
జిల్లా అధికారి, 8374449066

1942
Tags

More News