వరిలో విత్తనోత్పత్తి

Thu,June 21, 2018 03:03 AM

రైతు తన స్థాయిలో వరి విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. తర్వాతి కాలంలో అవే విత్తనాలను వాడుకుని అధిక దిగుబడులను పొందవచ్చు. తన స్థాయిలోనే విత్తనాలను తయారు చేసుకుంటాడు. కాబట్టి ప్రైవేటు విత్తన సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మరిన్ని వివరాలకు ఖమ్మం డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. శ్రీనివాసరావు 7893034800ను సంప్రదించవచ్చు. విత్తనోత్పత్తికి తీసుకునే మూల విత్తనం కచ్చితంగా ధృవీకరణ సంస్థల నుంచి గాని లేదా బ్రీడర్ పర్య వేక్షణలో ఉత్పత్తి చేసిన విత్తనాల నుంచి తీసుకో వాలి. అప్పుడే నాణ్యత బాగుంటుంది.
VARI

నారు పోసుకునే సమయం

సారవంతమైన నేల, నీటివసతి కలిగి ముంపునకు గురికాని నేలలు అనుకూలం. గత ఏడాది పండించిన మొక్కలను తీసివేయాలి. నీటి వసతి కింద దీర్ఘకాలిక రకాలకు మే చివరి వారం నుంచి జూన్20 వరకు నారు పోసుకోవచ్చు. మధ్యకాలిక రకాలకు జూన్ 20 నుంచి, జూలై 15 వరకు, స్వల్పకాలిక రకాలకు సంబంధించి జూలై చివరి వరకు నార్లు పోసుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. యాసంగి విషయానికి వస్తే అన్నిరకాల స్వల్పకాలిక విత్తనాలు సాగు చేసుకోవచ్చు.

విత్తన మోతాదు-శుద్ధి ఇలా

ఎకరానికి 20-30 కిలోలు అవసరం. చిన్న పరిమాణం కలిగిన విత్తనాలు ఎకరానికి 15 కిలోలు సరిపోతాయి. కిలో విత్తనానికి లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టిన తర్వాత మండె కట్టుకోవాలి. తర్వాత మొలకెత్తిన విత్తనాలను నారు మడుల్లో చల్లుకోవాలి. వరి విత్తనాలలో నిద్రావస్థను తొలి గించడానికి 6-10 మి.గ్రా నత్రికామ్లం లీటర్ నీటి లో కలిపి 24 గంటలు నానబెట్టాలి. తర్వాత నిద్రావస్థ విత్తనాలను నీటితో కడిగి మండెకట్టుకోవాలి.

ప్రధాన పొలం తయారీ-యాజమాన్య పద్ధతులు

నీరు పెట్టుకొని 2-3 సార్లు దున్ని మరుగబెట్టిన అనంతరం దమ్ము చేసుకోవాలి. మురగ దమ్ము చేసినైట్లెతే కలుపు మొక్కలు తగ్గి, మొక్కలకు ఎక్కువ పిలుకలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చదరపు మీటర్‌కు దీర్ఘ, మధ్యకాలిక రకాలకు 33 కుదుళ్లు, స్వల్సకాలిక రకాలకు 44 కుదుళ్లు ఉండాలి. వానకాలంలో సాళ్ల మధ్య 20 సెం.మీ, యాసాంగిలో 15 సె.మీ ఎడం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువుతో పాటు, నత్రజని, భాస్వరం ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువులు రెండు, మూడు దఫాలుగా సమభాగాలుగా చేసుకొని వాడుకోవాలి. భాస్వరం, పొటాష్ ఎరువులను ఆఖరి దమ్ములోవేయాలి.వీటితో పాటు మరో 20 కి, గ్రాముల జింక్ సల్ఫేట్‌ను సైతం వేసుకోవాలి.

కల్తీల ఏరివేత

వరిలో విత్తనోత్పత్తిలోఅత్యంత కీలకమైనది వేర్పా టు దూరం. ఒక విత్తన క్షేత్రం నుంచి మరో విత్తన క్షేత్రానికి కనీస దూరం ఉండేలా చూడాలి. సకా లంలో కల్తీల ఏరివేత కూడా చేపట్టాలి. శాఖీయ దశలో మొక్క ఎత్తు కాండం, ఆకుల రంగు ఆధా రంగా ఆ తర్వాత పూత దశలో, పూత వచ్చే రోజు లను బట్టి గింజ కట్టుకునే దశలో పరిమాణం, రంగును బట్టి కల్తీలను గుర్తించి ఎప్పటికప్పుడు ఏరివేయాలి. కనీసం మూడు దశల్లో విత్తన తనిఖీ చేపట్టాలి.

నీటి యాజమాన్యం- చీడపీడల నివారణ

నాట్లు వేసే సమయంలో పొలంలో నీరు పలుచగా ఉండాలి. తర్వాత దుబ్బు చేయడం పూర్తయ్యేంత వరకు 2 లేదా 3 సెం.మీ, చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడేంత వరకు ఐదు సెంటీమీటర్ల నీటి మట్టం ఉండాలి. కోతకు వారం పదిరోజుల ముందు నుంచి క్రమంగా నీటి మట్టం తగ్గించి ఆరబెట్టుకోవాలి. నాటిన మూడు నుంచి ఐదు రోజుల్లోపు బూటాక్లోర్ 1 లీటర్ లేదా ప్రెటీలక్లోర్ 500-600 మిల్లీ లీటర్లు ఎకరానికి 20-25 కిలో గ్రాముల పొడి ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే కలుపును నివారించవచ్చు. అలాగే వరిలో తరచు గా వచ్చే కాండం తొలిచే పురుగు నివారణకు మొదటిదశలో ఎకరానికి 8-10 కిలో గ్రాముల కార్బోప్యూరాన్‌ను ఇసుకలో కలిపి చల్లుకోవాలి. లేదా అసిఫేట్ 75 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. సుడిదోమ నివారణకు ఇతర చీడపీడలు, ఉల్లికోడు, తాటాకుతెగులు, వరిఈగ, తామరపురుగుల నివారణకు 1.6 మిల్లీ లీటర్ల క్లోరోపైరిఫాస్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మామిడిపండు, కాండంకుళ్లు తెగుళ్ల నివారణకు హెక్సాకొనజోల్ 2 మిల్లీమీటర్లు, వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే విధంగా పొట్టకుళ్లు, ఆకుపచ్చ తెగులు నివారణకు కార్బండిజం ఒక గ్రాము లేదా మాంకోజెబ్ 2 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

విత్తనం ఆరబెట్టు పద్దతి-నిల్వ

పొలం వెన్నుల్లో కనీసం 80-90 శాతం విత్తనాలు పక్వానికి వచ్చి పసుపురంగుకు మారినప్పుడు పంటకోత కోసుకుని రెండుమూడు రోజులపాటు పొలంలోనే ఆరనివ్వాలి. బల్లకట్టు పద్ధతిలో కాని, యంత్ర సహాయంతో కాని పగులకుండా నూర్చుకోవాలి. విత్తనం చేతికి వచ్చిన తర్వాత శుభ్రమైన గాలి చొరబడు గదులలో లేదా గోదాముల్లో నిల్వ చేయాలి. ఎలుకలు కన్నాలు వేయకుండా చూసుకోవాలి. సంచులపై రకంపేరు కనపడే విధంగా ముద్రించుకోవాలి. నిర్ధారించిన పరిణామం గల సంచులలో నింపి మూల విత్తనంకు తెలుపురంగు ట్యాగ్‌లను, ధ్రువీకరణ విత్తనాలకు నీలి రంగు ట్యాగ్‌లను జతపర్చి కుట్టుకోవాలి. విత్తనపు సంచులను గోదాముల్లో గోడకు తగలకుండా కిందిభాగంలో చెక్కతోకాని ఇనుముతో చేసిన ప్లేట్లను ఉంచుకోవాలి.

నారుమడి పెంపకం..

పొలంలో నీరుపెట్టి రెండు, మూడుసార్లు మొత్తగా దున్ని దమ్ము చేసి, చదును చేసుకోవాలి. 100 చదరపు మీటర్ల నారుమడికి అరకిలో యూరియాను విత్తనం చల్లే మందు మరొక అరకిలో యూరియాను విత్తిన 12-14 రోజుల్లో నారుమడిలో వేసుకోవాలి. అయితే అరకిలో భాస్వరం, అరకిలో పొటాష్‌ని చ్చే ఎరువులు నారుమడి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. జింకు లోపం గమనిస్తే 1 లీటర్ నీటికి 2.0 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిపై పిచికారీ చేయాలి. విత్తనం చల్లిన వారం రోజుల వరకు ఆరుతడులు ఇచ్చి తరువాత పలుచగా నీరు పెట్టుకోవాలి. నారు పీకే వారం రోజుల ముందు 2.5 సెంట్లు నారుమడికి 400 గ్రా కార్బోఫ్యూరన్ 3గ్రా గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అనంతరం పలుచగా నీరు పెట్టుకోవాలి.
మద్దెల లక్ష్మణ్, ఖమ్మం వ్యవసాయం
9010723131

539
Tags

More News