లేగదూడల్లో మరణాలు తగ్గాలంటే..

Wed,June 13, 2018 10:43 PM

మూడు నెలల వయస్సులోపు లేగదూడల్లో మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. అత్యధికంగా నెలలోపు వయస్సున్న దూడల్లో మరణాలుంటాయి. వయస్సు పెరుగుతున్నకొద్దీ మరణాల శాతం తగ్గిపోతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో లేగదూడల్లో మరణాల శాతం 10 లోపు ఉంటే, మన దగ్గర మాత్రం 20-40 శాతం వరకు ఉంటుంది. మరణాల వల్ల భవిష్యత్తులో కామధేనువులుగా తయారయ్యే పశువులను కోల్పోయి, కొత్త పశువులను ఎక్కువ ఖర్చుపెట్టి కొనాల్సి వస్తున్నది. పాడిపశువుల్లో దూడ లేనందున పాల దిగుబడి తగ్గిపోతుంది. అందువల్ల లేగదూడల్లో మరణాలు నివారించాలంటే మూడు మాసాల వయస్సు వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
baby-cow-drinking-milk
-దూడ పుట్టినప్పుడు ఎక్కువ శరీర బరువుతో జన్మిస్తే మరణించే ప్రమాదం తక్కువగా ఉంటుంది. పశువు చూడి చివరి మూడు నెలల్లో 70 శాతం పిండం అభివృద్ధి చెందుతున్నందున, చూడి చివరి మూడు నెలల్లో అదనంగా దాణా పశువులకు అందించాలి. రోజుకు 0.5-1 కిలో దాణా, పచ్చిమే త, ఖనిజ లవణ మిశ్రమం అందిస్తే, పుట్టే దూడలు ఎక్కువ శరీర బరువు కలిగి ఉంటాయి.
-పశువు ఈనడం కష్టమైనప్పుడు దూడ మరణించే ప్రమాదం పొంచి ఉంటుంది. సాధారణంగా పశువులు రాత్రిగాని, ఉద యం గాని ఈనుతుంటాయి. ఆ సమయంలో యజమాని అప్రమత్తంగా ఉండాలి. పశువు సక్రమంగా ఈనుతుందో లేదో గమనిస్తూ ఉండాలి. అలాగే ఈనే ప్రాంతం పరిశుభ్రం గా ఉంచాలి. అప్పుడు పుట్టే దూడ ఆరోగ్యంగా ఉంటుంది.
-దూడలు ఈనగానే చలిగాలులు, వర్షపు జల్లులు వంటి వాతావరణం క్లిష్ట పరిస్థితులకు గురికాకుండా శ్రద్ధ వహించాలి. బొడ్డును 1-2 సెం.మీ. వదిలి కత్తిరించి 4-5 రోజు లు టింక్చర్ అయోడిన్ అద్దాలి. శ్వాస సరిగ్గా పీల్చుకునేలా ముక్కు, నోటిపై ఉన్న మ్యూకస్ తొలిగించాలి.
-పుట్టిన దూడకు ఆంటిబాడిలు, విటమిన్ ఏ, ఐరన్, ఖనిజలవణాలు, శక్తి, మాంసకృత్తులు అధికంగా లభ్యమయ్యే జున్నుపాలు తాగించాలి. తద్వారా వ్యాధి నిరోధకశక్తి పెం పొంది దూడలు మరణించకుండా ఉంటాయి.
-పుట్టిన దూడలను తల్లి నుంచి వేరుచేసి ప్రత్యేకంగా కాఫ్ స్టార్టర్ లేదా మిల్క్ రిప్లేసర్ అందిస్తూ ఉండాలి. దీన్ని 15 రోజుల వయస్సు నుంచి దూడలకు అందివ్వాలి. ఈ రిప్లేసర్‌లో 20-24 శాతం జీర్ణమయ్యే మాంసకృత్తులుంటాయి. దీన్ని 38 డిగ్రీల సెం.గ్రే.ఉష్ణోగ్రత వద్ద పాత్రలో పోసి అం దించాలి. ఈ విధానం గేదెల్లో, దేశీయ ఆవుల్లో కంటే సంకరజాతి పశువుల్లో ఆచరించడం బాగుంటుంది.
-సాధారణంగా దూడ శరీర బరువులో 10వ వంతు చొప్పున పాలు రెండు నెలల వరకు అందిస్తూ, క్రమంగా మోతాదు తగ్గిస్తూ ఉండాలి.
-దూడలు ఒక నెల వయస్సు వచ్చేవరకు విడిగా కట్టి ఉంచి, మధ్యమధ్యలో తల్లి దగ్గర పాలు తాగకుండా జాగ్రత్త వహించాలి. దూడలుండే ప్రదేశం శుభ్రంగా, పొడిగా, పేలు, మిన్నల్లులు, గోమార్లు లేకుండా ఉండాలి.
-దూడలు 7-10 రోజుల వయస్సులో, తర్వాత మూడు వారల తర్వాత నట్టల మందు విధిగా తాగించాలి. ఆ తర్వా త ప్రతి మూడునెలకోకసారి నట్టల మందులు రెగ్యులర్‌గా తాగిస్తూ ఉండాలి. విరేచనాలు, దగ్గు వంటి సమస్యలు గమనిస్తే సత్వరమే చికిత్స చేయించాలి.
-ఈ విధంగా తల్లి చూడి దశ నుంచి దూడ మూడు నెలల వయస్సు వరకు పోషణ, ఆరోగ్యం, యాజమాన్యం విషయంలో శ్రద్ధ చూపాలి. దీనివల్ల దూడల్లో మరణాలు నివారించబడి మంద వేగంగా అభివృద్ధి చెందుతుంది. దూడలు భవిష్యత్తు ఆదాయానికి బాటలు వేస్తాయి.
dr-ch-ramesh

573
Tags

More News