సోయాబీన్ సాగులో మెళకువలు

Wed,June 13, 2018 10:42 PM

వానకాలం ప్రారంభమైంది. రైతులు ఎక్కువగా ఈ సీజన్‌లో పత్తి, సోయాబీన్, కంది, పెసర, మినుము, జొన్న తదితర పంటలను సాగు చేస్తారు. ఈ పంట సాగు చేసేందుకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు అత్యంత అనుకూలమైనవి. ఈ పంట సాగుచేసేందుకు నల్లరేగడి భూములు అత్యంత అనుకూలమైనవి. అయితే ఈ పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు కొన్ని మెళకువలు పాటించాలి. సోయాబీన్ పంట సాగు చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 10 లోపు విత్తడం పూర్తి చేసుకోవాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వ్యవసాయాధికారిణి లావణ్య సూచించారు. సోయా సాగులో రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వారు సూచించారు.
soya-chikkudu

విత్తనశుద్ధి తప్పనిసరి..

పంట విత్తడానికంటే ముందుగా ప్రతి కిలో సోయా విత్తనానికి 2 గ్రాముల థైర మ్,లేదా 1 గ్రాము కార్బండిజమ్ వాడాలి. దీంతో తెగుళ్ల సమస్య తగ్గుతుంది. అలా గే 5 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 3 గ్రాముల కార్బోసల్ఫాన్‌తో విత్తనశుద్ధి చేసుకుంటే రసం పీల్చే పురుగుల సమస్య తగ్గుతుంది. ప్రతి 8 నుంచి 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం జపానికం కల్చర్ కలిపి నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత విత్తుకోవాలి. నల్లరేగడి భూముల్లో అయితే వరుసలకు మధ్య 45 సెం.మీ వరుసలోని మొక్కల మధ్య 5 సెం.మీ దూరం, అలాగే తేలికపాటి నేలల్లో అయితే వరుసల మధ్య 30 సెం.మీ దూరం, వరుసల్లోని మొక్కల మధ్య 7.5 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. ఎకరానికి గింజ పరిమాణాన్ని బట్టి 25-30 కిలోల విత్తనం సరిపోతుంది.

ఎరువుల వాడకం...

సోయా సాగు చేసే భూముల్లో ఎకరానికి 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ చివరి దుక్కిలో వేయాలి. భాస్వరం ఎరువును సింగిల్ ఫాస్పేట్ రూపంలో వేస్తే గంధకం కూడా లభిస్తుంది. 50 శాతం నత్రజని విత్తేప్పుడు, పైరు నెల రోజులకు చేరిన తర్వాత మరో 50 శాతం నత్రజని వేయాలి.

కలుపు నివారణ చర్యలు...

సోయా విత్తిన 20-25 రోజుల్లో గొర్రుతో అంతర కృషి చేసి కలుపు నివారించాలి. గడ్డి జాతి మొక్కలను నివారించడానికి ఇమాజిథాపైర్ 10 శాతం ఈసీని ఎకరాకు 250 మిల్లీ లీటర్ల చొప్పున వాడాలి.

సస్యరక్షణ

పంటకు చిత్త పురుగులు, రసం పీల్చే పురుగులు ఆశిస్తాయి. నివారణకు 1 గ్రాము ఎసిఫేట్ లేదా 1 మి.లీ మోనోక్రోటోఫాస్,2.5 మి.లీ క్లోరోపైరిఫాస్‌ను లీటర్‌నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి 200 లీటర్ల పిచికారీ ద్రావణాన్ని వాడాలి.

అవసరాన్ని బట్టి నీటి తడులు

సోయాబీన్ వర్షధారపు పంట. ఈ పంట మొలక దశలో, పూత దశలో, కాయ దశ లో నీటి తడులివ్వాలి. అవసరాన్ని బట్టి సెప్టెంబర్ మాసంలో అవసరాన్ని బట్టి సోయా పంటకు 1-2 తడులిస్తే మంచి దిగుబడి పెరుగుతుందని వ్యవసాయాధికారిణి లావణ్య సూచించారు.
-గున్నాల విఠల్, న్యాల్‌కల్, 99661 48825

790
Tags

More News