పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యం

Wed,May 30, 2018 11:26 PM

గత కొన్నేండ్లుగా రైతులు రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల నేలలో సారం తగ్గి దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. రసాయన ఎరువుల వాడకం వల్ల పెట్టుబడి కూడా పెరుగుతున్నది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను రుతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి. దీనిద్వారా భూసారాన్ని పెంచుకొని పంట దిగుబడిని పెంచుకోవచ్చు. వర్షాకాలంలో భూమి కోతకు గురికాకుండా అరికట్టవచ్చు. అంతేగాకుండా భూమిలో తేమ శాతాన్ని, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యాన్ని రైతులు తెలుసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


pachi-rotte

పచ్చిరొట్ట పైర్లకు ఉండాల్సిన లక్షణాలు

-తక్కువరోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇచ్చేలా ఉండాలి. అన్నిరకాల నేలల్లో పెరుగాలి. పచ్చిరొట్టలో పీచు శాతం తక్కువగా ఉండి, ఎక్కువ ఆకు కలిగి ఉండాలి.
-నేలలో కలియ దున్నినప్పుడు త్వరగా కుళ్లి భూమిలో కలిసి పోయేలా ఉండాలి. పచ్చిరొట్ట పంటల వేర్లు భూమిలో లోతుకు పొయేలా ఉండాలి.
-త్వరగా పెరిగి కలుపు పెరుగుదలను అరికట్టే విధంగా ఉండాలి. పప్పుజాతికి చెందిన పచ్చిరొట్ట అయితే నత్రజనిని స్థిరీకరించి నేల సారాన్ని పెంచుతుంది.

పచ్చిరొట్ట ఎరువులకు వాడే మొక్కలు

జనుము, జీలుగ, సీమ జీలుగ, పిల్లిపెసర, నీలి, వెంపలి

ఈ ఎరువుల వల్ల లాభాలు:

నేల భౌతిక స్థితి (నేల ఆకృతి) మెరుగుపడి, భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రి య పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యల వల్ల నేల సారం పెరుగుతుంది. అంతేగాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకొంటుంది. నేలలో క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరుగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరుగకుండా నివారించవచ్చు. జీలుగ, సీమజీలుగ వంటి పైర్లు వేసినప్పుడు వాటి వేర్లు ఎక్కు వ లోతుకు వెళ్లడం వల్ల భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమైన అనే క పోషకాలను వెలికి తెచ్చి లభ్య రూపంలో పంట కు అందిస్తాయి. పప్పు జాతి హరిత పంటల వల్ల రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని వేర్ల బొడిపెల్లో ఎకరానికి 25నుంచి 50కిలోల నత్రజనిని స్థిరీకరిస్తాయి. భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది. సూక్ష్మ పోషకాలను పంట మొక్కలకు అందేలా చేస్తాయి. పచ్చిరొట్ట పైర్లు ఎరువులుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడుతాయి. ఉదాహరణకు జనుము, పిల్లి పెసర.

సాగులో ఉండే ఇబ్బందులు:

పచ్చిరొట్ట ఎరువులు వేసిన తర్వాత నేలలో వేసి కలియదున్నడానికి సుమారు 45 రోజుల వ్యవధి కావాలి. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది.

సాగులో మెళకువలు:

ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియో గం పరుచుకొని పచ్చిరొట్ట ఎరువులు విత్తకొవాలి. తేమ చాల ని ప్రాంతాల్లో వేసవిలో దుక్కులు దున్నుకొని తొలకరి వర్షా లు పడిన తర్వాత పొలంలో విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం. వరి, చెర కు పంటల సరళిలో రెండు పంటల మధ్య కాలవ్యవధిలో విత్తుకొని కలియ దున్నవచ్చు. పసుపు, కంది, చెరకు వంటి పంటల వరుసల మధ్య పచ్చిరొట్ట పెంచి పూతసమయంలో కలియదున్న వచ్చు. పచ్చిరొట్ట ఎరువులు పూత దశకు రాగానే నేలలో కలియదున్నితే అధిక పరిమాణంలో పోషకాలు అందుతాయి.

పచ్చి ఆకు ఎరువులు: చెట్ల ఆకులను వేరే ప్రాంతాల నుంచి తీసుకొనివచ్చి నేలపై పరిచి కలియదున్నే వాటినే హరిత ఎరువులు అంటారు. వర్షాధార ప్రాంతాల్లో పచ్చిరొట్ట పంటను వేయడానికి వీలులేని ప్రాంతాల్లో త్వరిగతిన పెరిగే వృక్షాలు, గట్టు మీద వేసుకొని వీటి లేత కొమ్మలను, ఆకులను, తీసుకువచ్చి ప్రధాన పంట విత్తడానికి 15నుంచి 20రోజుల ముందు కలి యదున్నా లి. దీనివల్ల చీడ పీడల సమస్య ఉండదు.

పచ్చిరొట్ట ఎరువుల వాడకంలో అవరోధాలు:

పొలం గట్లపై చెట్లను పెంచితే దాని నీడ, వేరు ప్రభావం పంట ఎదుగుదల, దిగుబడిపై ఉంటుంది. ఆకులు, లేత కొమ్మలు దొరికే ప్రాంతం నుంచి పొలానికి తీసుకురావడం ఖర్చుతో కూడిన పని. కావల్సినంత రొట్ట లభ్యం కాదు. అనుకున్న రొట్ట మొక్కలు లభ్యం కాకపోవచ్చు.
-గుండెల రాజు, మహబూబాబాద్ వ్యవసాయం
72889 85757

ఎరువులు వాడే పద్ధతి

పచ్చిరొట్ట ఎరువులు లేదా పచ్చిఆకు ఎరువులు ప్రధాన పంట విత్తడానికి 15-20రోజుల ముందు నేలలో కలియదున్నాలి. ఈ సమయంలో నేలలో తగినంత తేమ ఉం డాలి. కలియ దున్నేటప్పుడు తగినంత సూపర్‌ఫాస్పేట్ నేలపై వెదజల్లితే కుళ్లిపోయే ప్రక్రియ వేగవంతమవుతుంది.

అధిక దిగుబడులు పొందవచ్చు

రోజురోజుకు పెరుగుతున్న రసాయన ఎరువుల వాడకం వల్ల నష్టం కలుగడమే కాకుండా పెట్టుబడి కూడా అధికమవుతున్న ది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను వేసుకొని, భూసారాన్ని పెంచుకోవాలి. దీంతో పంట దిగుబడి అధికంగా వస్తుంది. అంతేగాకుండా భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుతుంది.
- బి.క్రాంతికుమార్, శాస్త్రవేత్త, కృషి విజ్ఞన్ కేంద్రం,
రుద్రూర్, 73374 11871

584
Tags

More News