TSPSC Special-సీడీపీవో ప్రత్యేకం


Wed,November 15, 2017 02:31 AM

stMT

ఎస్టీలను అధికారికంగా గుర్తించిన ఆర్టికల్?

-తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న సీడీపీవో పరీక్ష పేపర్-2లో ఎక్కువ మార్కులు సాధించాలంటే ముందుగా సిలబస్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని విడివిడిగా, స్పష్టంగా తెలుసుకుంటూ వాటి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా అనుసంధానం చేసుకోవాలి. మొత్తం 10 యూనిట్లలో ఎక్కువ అంశాలు భావనలు (కాన్సెప్ట్) ఉన్నందున ముందుగా మౌలిక భావనల పై అవగాహన పెంచుకోవాలి. అనంతరం వాస్తవ అంశాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. సమాజంలో మహిళలు, శిశువులు, బాలలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల సంరక్షణకు సంబంధించిన రాజ్యాంగ రక్షణలు, చట్టాలు, విధానాలు, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.
stTT

షెడ్యూల్డ్ కులాల సంక్షేమం

-సమాజం విసిరే సవాళ్లను అధిగమించడానికిగాను ప్రభుత్వం అవలంబించే విధానాన్ని సామాజిక విధానం అంటారు.
-ప్రభుత్వాల అంతిమ లక్ష్యం అణగారిన వర్గాల అభ్యున్నతి. అందువల్ల ప్రభుత్వాలు అణగారిన వర్గాల కోసం ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలుచేస్తున్నాయి.
-చారిత్రకంగా పరిశీలిస్తే యూరప్‌లో సంభవించిన పారిశ్రామిక, ఫ్రెంచ్ విప్లవం, అమెరికాలో ఏర్పడిన మహా ఆర్థిక మాంద్యం ఫలితంగా దేశ ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వాలు బలమైన శక్తిగా అవతరించాయి.
-ప్రభుత్వాలు ఆర్థిక లక్ష్యాలతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం, సాధికారత వంటి సామాజిక లక్ష్యాలను రూపొందించుకొని అమలుచేస్తున్నాయి.
-1834లో ఇంగ్లండ్‌లో రూపొందించిన పూర్ లా సంక్షేమ యంత్రాంగానికి ఆధారంగా నిలిచింది.
-ఐరోపాలో ఉదయించిన సంక్షేమ రాజ్య భావన క్రమంగా భారత్‌తో సహా అన్ని దేశాలకు విస్తరించింది.
-1950వ దశాబ్దంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో ఏర్పడిన తృతీయ ప్రపంచ దేశాలు సంక్షేమ రాజ్యాన్ని నిర్మించుకున్నాయి. ఇందులో భారతదేశం కూడా ఒకటి కావడం విశేషం.
-దేశంలో సంక్షేమ యంత్రాంగానికి మూలం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలుషెడ్యూల్డ్ కులాల సంక్షేమం
-భారతీయ సామాజిక చరిత్రలో సామాజిక దోపిడీకి గురైన షెడ్యూల్డ్ కులాలను స్వాతంత్య్రానంతరం సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రక్షించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో 16.6 శాతం జనాభాను కలిగి ఉన్న షెడ్యూల్డ్ కులాలను 1108 రకాల పేర్లతో పిలుస్తున్నారు. భారత ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల సంక్షేమాన్ని మూడు మార్గాల ద్వారా కొనసాగిస్తున్నది.
1. రాజ్యాంగ రక్షణలు
2. విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు
3. ఆర్థిక సహాయం అందించడం

రాజ్యాంగ రక్షణలు

-ఆర్టికల్-14: చట్టం ముందు అందరూ సమానులే. సమన్యాయ పాలన అంటే షెడ్యూల్డ్ కులాలపరంగా సమాజం, ప్రభు త్వం సామాజిక సమానత్వం, భాగస్వామ్యం కల్పించాలి.
-ఆర్టికల్-15(4): ప్రభుత్వ అవకాశాలపరంగా ముఖ్యంగా సామాజిక, విద్య, ఆర్థికాంశాల పరంగా షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించవచ్చు.
-ఆర్టికల్-16 (4): ఉద్యోగాలు, ఇతర సర్వీసులలో షెడ్యూల్డ్ కులాలకు సరైన భాగస్వామ్యం లేనప్పుడు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు.
-ఆర్టికల్-17: అంటరానితనం నిషేధం
-ఆర్టికల్-23: వెట్టిచాకిరీ, కట్టు బానిసత్వం, జోగిని, దేవదాసీ మనుషుల అక్రమ రవాణా నిషేధం
-ఆర్టికల్-24: బాలకార్మిక వ్యవస్థ నిషేధం
-ఆర్టికల్-46: షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర బలహీనవర్గాల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
-ఆర్టికల్-330: లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్
-ఆర్టికల్-332: శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్
-ఆర్టికల్-338: ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగ రక్షణల అమలుతీరును, వారి సంక్షేమాన్ని సమీక్షించేందుకుగాను ప్రత్యేక కమిషన్ల ఏర్పాటు
-ఆర్టికల్-341: 1950లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్ కులాల గుర్తింపు
-షెడ్యూల్డ్ కులాలకు విద్య, ఉపాధిపరంగా రిజర్వేషన్లను కల్పించటం, వారి విద్యాభివృద్ధికి ఉపకారవేతనాలు, హాస్టల్ వసతులు, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణను అందిస్తున్నారు.
-ఎస్సీలకు ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో ఆరో పంచవర్ష ప్రణాళికలో స్పెషల్ కంటెంట్ ప్లాన్‌ను ప్రారంభించారు. చిన్న, సన్నకారు దళిత రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఆదాయ మార్గాలను పెంచుతారు.
-ఎస్సీలకు ఆర్థిక సహాయాన్ని అందించి వారు స్వయం ఉపాధిమార్గాలను ఎంచుకొనే ఉద్దేశంతో 1989లో జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.
-ప్రస్తుతం ఎస్సీలకు సంబంధించిన పరిపాలన, యంత్రాంగం సామాజికన్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్నది.
-స్వాతంత్య్రానంతరం భారతదేశంలో సంక్షేమ కార్యక్రమా లు 1952 నుంచి 1985 వరకు హోంశాఖ ఆధ్వర్యంలో కొనసాగాయి.
-1985లో సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు.
-1998లో దాని పేరును సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖగా మార్చారు.

షెడ్యూల్డ్ తెగలు/గిరిజన సంక్షేమం

-దేశంలో ఎస్టీలు ఆర్థికంగా దోపిడీకి గురైన వర్గం. అందువల్ల వీరి సంక్షేమంలో ఆర్థికపరమైన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల జనాభా 8.6 శాతం.
-దేశంలో అధికారికంగా 744 తెగలను గుర్తించారు. వీటిలో భిల్లులు, గోండ్, సంతాల్ తెగలకు చెందినవారు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నారు.
-దేశంలో ఎస్టీల సంక్షేమానికి మూడు మార్గాలను అవలంబిస్తున్నారు.
1. రాజ్యాంగ రక్షణలు
2. విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు
3. ఆర్థిక సహాయం అందించడం
-ఎస్సీల సంక్షేమానికి సంబంధించి రాజ్యాంగ రక్షణలోని 17, 341 ఆర్టికల్స్ తప్ప మిగతావి ఎస్టీలకూ రక్షణగా ఉంటాయి.
-ఆర్టికల్-19(5): గిరిజనుల ఆస్తుల రక్షణ
-ఆర్టికల్-164: జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో గిరిజన సంక్షేమానికి సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి.
-ఆర్టికల్-244: ప్రత్యేక ప్రాంతాల పరిపాలన కోసం 5, 6 షెడ్యూళ్లను ఏర్పాటు చేశారు.
-ఆరో షెడ్యూల్ ప్రకారం అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ర్టాల్లో గిరిజన పరిపాలన వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఆరో షెడ్యూల్‌లోని రాష్ర్టాల్లో కాకుండా మిగతా రాష్ర్టాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన అంశాలను ఐదో షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
-ఐదో షెడ్యూల్ పరిపాలనను గవర్నర్ నియంత్రణలో ఉంచుతుంది.
-ఆర్టికల్-342: షెడ్యూల్డ్ తెగలను అధికారికంగా గుర్తించారు.
-1999లో కేంద్రంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు.
-ఐదో ప్రణాళికలో గిరిజన ఉప ప్రణాళికను రూపొందించారు.
-గిరిజన ఉప ప్రణాళిక ప్రకారం గిరిజన ప్రాంతాల పరిపాలన, అభివృద్ధికి నాలుగు మార్గాలను ఎంచుకున్నారు.
-నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉన్న మొత్తం జనాభాలో గిరిజన జనాభా 50 శాతం. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 194.
-10 వేలు లేదా అంతకంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో మాడా ప్రాజెక్టులను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 259.
-5 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో గిరిజన జనాభా 50 శాతంపైబడి ఉన్న ప్రాంతాల్లో క్లస్టర్లను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య - 82
4. గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన తెగలను గుర్తించి వాటిని అభివృద్ధి చెందించే ఉద్దేశంతో ప్రాచీన గిరిజన సముదాయ ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రస్తుతం వీటి సంఖ్య 75.
-గిరిజనులకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థ ఉన్నందువల్ల వాటిస్థానంలో స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటుచేసే ఉద్దేశం తో 1996లో పెసా (Panchayathi Extension Scheduled Act)ను రూపొందించారు.
-గిరిజనుల అటవీ ఉత్పత్తులకు సరైన ధర, మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 1987లో గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్యను ఏర్పాటుచేశారు.
-ఎస్టీలకు ఆర్థిక సహాయాన్ని అందించి స్వయం ఉపాధి ద్వారా వారి ఆదాయమార్గాలను పెంచే లక్ష్యంతో 2001లో జాతీ య షెడ్యూల్డ్ తెగల ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.

వెనుకబడిన తరగతుల సంక్షేమం

-భారతీయ సామాజిక నిర్మాణంలో అగ్ర వర్ణాలకు, అస్పృశ్యులకు మధ్యస్థంగా ఉన్న మధ్య తరగతి వర్గాలను వెనుకబడిన తరగతులుగా గుర్తిస్తారు.
-ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలు కూడా ప్రాచీన కాలం నుంచి సామాజికంగా, ఆర్థికంగా దోపిడీకి గురయ్యారు.
-భారత రాజ్యాంగ రూపకల్పన దశలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని వీరికోసం ప్రత్యేకంగా రాజ్యాంగ నిబంధనలను రూపొందించారు.
-రాజ్యాంగంలోని ఆర్టికల్ 340లో వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన చర్యలను
-సమీక్షించేందుకుగాను రాష్ట్రపతి ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది.
-దీని ప్రకారం జాతీయస్థాయిలో రెండు కమిషన్లను ఏర్పాటుచేశారు.
1. 1953లో కాకా సాహెబ్ కాలేల్కర్ కమిషన్
2. 1978లో బీపీ మండల్ కమిషన్
-కాలేల్కర్ కమిషన్: ఇది 1953 జనవరిలో ఏర్పాటయ్యింది.
-కమిషన్ ప్రధాన విధి ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర వర్గాలకు చెందిన ప్రజల విద్యాపరమైన, సామాజికపరమైన వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ప్రమాణాలను నిర్ణయించడం.
-వీటి ఆధారంగా వెనుకబడిన తరగతుల జాబితాను గుర్తించడం
-ఈ కమిషన్ సామాజిక అంతస్తు, కుల క్రమశ్రేణి ఆధారంగా 2700 కులాలతో కూడిన జాబితాను తయారుచేసి 1955లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
-ఈ కమిషన్ మహిళలను కూడా బీసీలుగా గుర్తించింది.
-ఈ కమిషన్ తన నివేదికను 1956లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే వివిధ కారణాల వల్ల ఇది ఆమోదం పొందలేదు.
venkat

895
Tags

More News

VIRAL NEWS