సబ్బండ జన గానం-నరనరాన తెలంగాణం


Wed,March 6, 2019 02:48 AM

శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు
Andhra_pradesh
కేంద్రప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ ప్రకటించిన పది రోజులకు కేంద్ర హోంశాఖ విధివిధానాలు వెల్లడించింది. మొత్తం 7 అంశాలపై అధ్యయనం చేసి డిసెంబర్ 31 నాటికి అంటే 10 నెలల్లో నివేదిక అందించాలని కమిటీకి కేంద్రప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ విధివిధానాలు..
1) ప్రత్యేక తెలంగాణ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటిలాగే సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితిని పరీక్షించడం.
2) రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల పురోగతి అభివృద్ధిపై ఆ పరిణామాల ప్రభావాన్ని సమీక్షించడం.
3) సమాజంలోని వివిధ వర్గాలైన మహిళలు, పిల్లలు, విద్యార్థులు, మైనార్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలపై రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చూపిన ప్రభావాలను పరిశీలించడం.
4) పైన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తున్నప్పుడు తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన కీలకమైన అంశాలను గుర్తించడం.
5) పైన చెప్పిన అంశాలపై సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా రాజకీయ పార్టీలను సంప్రదించడం, వారి అభిప్రాయాలను సేకరించడం, ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితిని పరిష్కరించి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు రాజకీయ పార్టీలు, ఇతర సంస్థల నుంచి పలు పరిష్కారాలను రాబట్టడం, దానికోసం సర్వోత్తమ పరిష్కారాలను గుర్తించడం, వాటి సాధన కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను అందుకు తగిన మార్గసూచీ (రోడ్‌మ్యాప్)ని సిఫార్సు చేయడం.
6) పారిశ్రామిక, వాణిజ్య, కార్మిక, రైతు, మహిళ, విద్యార్థి సంఘాల వంటి పౌరసమాజంలోని ఇతర సంస్థలను పైన పేర్కొన్న విషయాలపై సంప్రదించడం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సమగ్రాభివృద్ధి అనే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ వారి అభిప్రాయాన్ని సేకరించడం.
7) వాటితోపాటు కమిటీ తగిన ఇతరత్రా సలహాలు, సిఫారసులు కూడా చేయవచ్చు.

అయితే శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షల అధ్యయనం పేరుతో ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని తెలంగాణ ప్రజా సంఘాల రాజకీయ జేఏసీ విమర్శించింది. జేఏసీ అత్యవసర సమావేశాన్ని జరిపి కాలయాపనకే శ్రీకృష్ణ కమిటీని కేంద్రప్రభుత్వం నియమించినందున కమిటీని బహిష్కరించాలని, ప్రజాప్రతినిధులు రాజీనామాల ద్వారా రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని జేఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అయితే తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీయే అయినందున తమ పార్టీ ప్రతినిధులు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదంటూ ఆ పార్టీ జేఏసీ నుంచి వైదొలగింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తేనే తాముకూడా రాజీనామాలు చేస్తామని టీడీపీ తిరకాసు పెట్టింది. అయితే టీడీపీ అధ్యక్షుడు తెలంగాణ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం, ఆయన సమక్షంలోనే తెలంగాణ న్యాయవాదులపై లాఠీచార్జి చేయించడంవల్ల టీడీపీని జేఏసీ నుంచి బహిష్కరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో జేఏసీ కార్యాలయంలో తీసుకున్న నిర్ణయం మేరకు 2010, ఫిబ్రవరి 14న 12 మంది ఎమ్మెల్యేలు (ఒకరు టీడీపీ, ఒకరు బీజేపీ, 10 మంది టీఆర్‌ఎస్) జేఏసీ కార్యాలయం నుంచి పాదయాత్రగా వెళ్లి అమరవీరుల స్మారకస్థూపం (గన్‌పార్క్) వద్ద నివాళులర్పించి స్పీకర్‌కు రాజీనామాలు అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ జేఏసీ, విద్యార్థి జేఏసీ, బీజేపీ శ్రీకృష్ణ కమిటీ సంప్రదింపులను బహిష్కరించాయి. అయితే తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి, ఉద్యమం గురించి కమిటీకి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని భావించి అనేక మంది ఉద్యమకారులు, సంఘాలు, పార్టీలు కమిటీకి లక్షలాదిగా నివేదికలు సమర్పించాయి.

telangana1
రాజకీయ పార్టీల నివేదికలు: సీపీఐ, న్యూడెమోక్రసీ, తెలంగాణ టీడీపీ, తెలంగాణ ప్రజారాజ్యం, తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు నివేదికలు ఇచ్చాయి.
తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఓయూ విద్యార్థి జేఏసీ 2010, ఫిబ్రవరి 21న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. తెలంగాణ రాజకీయ జేఏసీ దీనికి మద్దతునిచ్చింది. అయితే ప్రభుత్వం వేలాది పోలీస్ బలగాలను మోహరించి తీవ్ర నిర్బంధం విధించి ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులతో విద్యార్థులను కట్టడి చేసింది. దీంతో ఆవేదన చెందిన సిరిపురం యాదయ్య అనే యువకుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ర్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఓయూ క్యాంపస్‌లో వేలాది పోలీసులు చూస్తుండగానే తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. దీంతో శరీరంలో ఎక్కువ భాగం కాలిపోవ డంతో దవాఖానాలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని టీ జేఏసీ రెండు విడుతలుగా బస్సు యాత్రను నిర్వహించింది. మొదటి విడుత 2010, మార్చి 21 నుంచి 23 వరకు గన్‌పార్క్ నుంచి హన్మకొండ వరకు సాగింది. రెండో విడుత కొమురవెళ్లి నుంచి మంచిర్యాల వరకు 2010, ఏప్రిల్ 9 నుంచి 12 వరకు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచింది.
ఇదిలా ఉండగా ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని వైఎస్ జగన్ చేసిన కుట్రను టీ జేఏసీ వరంగల్ జిల్లాలోని మానుకోట వద్ద 2010, మే 28న వేలాది మంది పోలీస్ భద్రతా బలగాలు, వైఎస్ అనుచరుల దాడులను ఎదుర్కొని అడ్డుకుంది. ఈ సంఘటన సమైక్యవాదులకు, సమైక్యవాదానికి తెలంగాణలో చోటులేదని స్పష్టంచేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన 12 మంది ఎమ్మెల్యేలను పార్టీలకతీతంగా టీ జేఏసీ అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకుంది. టీడీపీ పోటీచేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీయే అన్న అధికార పార్టీకి సైతం కొన్నిచోట్లు డిపాజిట్లు దక్కలేదు. ఈ ఉప ఎన్నికల విజయంతో తెలంగాణ వాదం ప్రజల్లో ఎంత బలంగా ఉందో గల్లీ నుంచి ఢిల్లీ దాక తెలిసివచ్చింది.

తెలంగాణకు సీమాంధ్ర దళిత, బహుజన సంఘాల మద్దతు


telangana
తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర సంపన్న, పెట్టుబడిదారీ వర్గం అనుక్షణం అణచివేసే ప్రయత్నాలు చేసింది. కానీ సీమాంధ్ర దళిత, బహుజన సంఘాలతోపాటు పలు సీమాంధ్ర ఉద్యమ సంస్థలు, ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని బలపరచి ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాల సాధన కోసం ఉద్యమించారు. వాటిలో కొన్ని ముఖ్యమైన సంఘాలు
1) సామాజిక తెలంగాణ - ఆంధ్ర సమన్వయకర్త- ఉ. సాంబశివరావు
2) బీసీ మహాజన సమితి- శీనయ్య సాగర్
3) బహుజన కెరటాల వేదిక- పల్నాటి శ్రీరాములు
4) ముస్లిం రిప్రజంటేటివ్ ఫోరం- సయ్యద్ రఫీ
5) ఉత్తరాంధ్ర ప్రజాహక్కుల పోరాట వేదిక- గంటా పాపారావు
6) సామాజిక ఆంధ్ర దళిత మహిళా సభ- యూ పద్మావతి
7) సామాజిక రాయలసీమ ప్రజల సమితి- అన్నా రామచంద్రయ్య, శేషఫణి
8) రాయలసీమ హక్కుల వేదిక- భూమన్
ఇదే సమయంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు సీమాంధ్ర సంపన్నవర్గాలు చేసినా అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం అనే స్ఫూర్తితో తెలంగాణ-ఆంధ్ర కవులు, రచయితలు కావడి కుండలు అనే కవితా సంకలనాన్ని తెచ్చారు.

సీపీఎం, ప్రజారాజ్యం, సీమాంధ్ర కాంగ్రెస్, సీమాంధ్ర టీడీపీ సమైక్య రాష్ర్టానికి అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి. ఎంఐఎం పార్టీ రాష్ర్టాన్ని సమైక్యంగానే ఉంచాలని అది వీలుకాని పక్షంలో రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని పేర్కొంది. లోక్‌సత్తా పార్టీ తన నివేదికలో పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా కాని వ్యతిరేకంగా కాని స్పష్టత ఇవ్వలేకపోయింది. ఇలా మరోసారి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి.

అయితే కాలయాపన కోసం కేంద్రప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించి తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ కమిటీని పావుగా ఉపయోగించింది. ఇందుకు సీమాంధ్ర ఆధిపత్యంలోని మీడియా లోపాయికారిగా సంపూర్ణ సహకారం అందించింది. కమిటీ ఇచ్చే నివేదిక సర్వరోగ నివారిణిగా ప్రచారం చేసింది. కమిటీకి ఇచ్చిన గడువులోగా తెలంగాణలో ప్రజా ఉద్యమాన్ని బలహీనపరచాలని, ఉద్యమంలో సంఘటితమవుతున్న తెలంగాణ ప్రజానీకాన్ని విడదీయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ వ్యతిరేక శక్తులు అనేక ఎత్తుగడలను, వ్యూహాలను అమలు జరిపాయి. అయితే ఈ పరిణామాల ప్రభావాల నుంచి ఉద్యమాన్ని, ఉద్యమంలో మమేకమైన ప్రజానీకాన్ని, ఐక్యతను రక్షించుకునేందుకు తెలంగాణ జేఏసీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అంతేకాకుండా ఉద్యమాన్ని మహోద్యమంగా మార్చడానికి జేఏసీ పలు కార్యక్రమాలను నిర్వహించింది.
mallikarjun

697
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles