కరెంట్ అఫైర్స్


Wed,March 6, 2019 02:30 AM

Telangana
Narasimha-Reddy

బౌరాపూర్ జాతరకు ప్రభుత్వ గుర్తింపు

రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు జిల్లాలో చెంచు తెగలు ప్రతి ఏటా నిర్వహించే బౌరాపూర్ భ్రమరాంబ జాతరకు ఫిబ్రవరి 27న ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. శివరాత్రి సందర్భంగా నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న బౌరాపూర్‌లో ఈ జాతర నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో చెంచుల సాంప్రదాయం ప్రకారం ఉత్సవాలు నిర్వహిస్తారు.

నరసింహారెడ్డికి పురస్కారం

ప్రముఖ కవి, విమర్శకుడు, అనువాదకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. ఏనుగు నరసింహారెడ్డికి ప్రతిష్ఠాత్మక సామల సదాశివ స్మారక సాహితీ పురస్కారం లభించింది. ఫిబ్రవరి 28న కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.

ఏసీపీ రంగారావుకు అవార్డు

హైదరాబాద్ పోలీసు విభాగంలోని ఏసీపీ ఎస్ రంగారావుకు ఉత్తమ దర్యాప్తు అధికారి అవార్డు లభించింది. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మార్చి 1న ఈ అవార్డును అందజేశారు.

సతీశ్‌రెడ్డికి అంతర్జాతీయ అవార్డు

డీఆర్‌డీవో చైర్మన్ జీ సతీశ్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన మిసైల్ సిస్టమ్-2019 అవార్డు లభించినట్లు మార్చి 2న ది అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ (ఏఐఏఏ) ప్రకటించింది. ఈ అవార్డును అమెరికన్లకే ఇస్తుండగా తొలిసారి ఇతర దేశపు నిపుణుడికి ఇవ్వడంతో ఆయన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు.

National
bhagavad-gita

800 కేజీల భగవద్గీత

ఎనిమిది వందల కేజీల అతిభారీ భగవద్గీత గ్రంథాన్ని ప్రధాని మోదీ ఫిబ్రవరి 26న ఢిల్లీలోని ఇస్కాన్ ఆలయంలో ఆవిష్కరించారు. 2.8 మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్రంథంలో 670 పేజీలు ఉన్నాయి. ఇటలీలోని మిలాన్ నగరంలో ఈ గ్రంథాన్ని అచ్చువేశారు. దీనిలోని పేజీలను యుపో (YUPO) సింథటిక్ కాగితంతో తయారు చేశారు. గ్రంథలో 18 పెయింటింగ్‌లను పొందుపరిచారు.

క్యూఆర్ సామ్ పరీక్ష విజయవంతం

భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (క్యూఆర్ సామ్)ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్‌లో ఫిబ్రవరి 26న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లో ట్రక్కుపై నుంచి ఈ క్షిపణులను పరీక్షించారు. డీఆర్‌డీవో, బీఈఎల్, బీడీఎల్ సహకారంతో రూపొందించిన ఈ క్షిపణులు 30 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.

యూత్ పార్లమెంట్ ఫెస్టివల్

న్యూఢిల్లీలో నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్-2019 ఫిబ్రవరి 27న నిర్వహించారు. ఈ ఫెస్టివల్‌కు హాజరైన ప్రధాని మోదీ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ జాతీయ స్థాయి ఫైనల్స్ విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలోనే మోదీ ఖేలో ఇండియా యాప్‌ను ఆవిష్కరించారు.

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్

ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (ఎస్‌సీఆర్) పేరుతో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 27న వెల్లడించారు. దీంతో దేశంలో రైల్వే జోన్‌ల సంఖ్య 18కు చేరనున్నది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి కొత్త జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

Persons
ambani-mukesh

ప్రపంచ సంపన్నుల్లో ముకేశ్

ప్రపంచ సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 54 బిలియన్ డాలర్ల (రూ.3.83 లక్షల కోట్లు) సంపదతో మొదటిసారి పదో స్థానంలో నిలిచారు. ది హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2019ను ఫిబ్రవరి 26న విడుదల చేసింది. ఈ జాబితాలో 147 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వరుసగా రెండోసారి మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (96 బిలియన్ డాలర్లు), బెర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్ వారెన్ బఫెట్ (86 బిలియన్ డాలర్లు), ఎల్‌వీఎంహెచ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ (84 బిలియన్ డాలర్లు), ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (80 బిలియన్ డాలర్లు) ఉన్నారు.

అమెజాన్ డైరెక్టర్‌గా ఇంద్రానూయి

అమెజాన్ కంపెనీ రెండో డైరెక్టర్‌గా భారత సంతతి మహిళ ఇంద్రానూయి నియమితులయ్యారని అమెజాన్ ఫిబ్రవరి 26న ప్రకటించింది. దీంతో అమెజాన్‌లో డైరెక్టర్ అయిన రెండో మహిళగా ఇంద్రానూయి నిలిచారు. ఆమె ఆడిట్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించనున్నారు.

ఆదిత్యపురికి టాటా లీడర్‌షిప్ అవార్డు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్యపురికి 2018కు గాను ప్రతిష్ఠాత్మక ఏఐఎంఏ-జేఆర్‌డీ టాటా కార్పొరేట్ లీడర్‌షిప్ అవార్డు లభించింది. ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఫిబ్రవరి 27న కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ఈ అవార్డును ప్రదానం చేశారు.

విమాన ప్రమాదంలో నేపాల్ మంత్రి మృతి

నేపాల్‌లో కొండను ఢీకొట్టి కూలిన విమాన ప్రమాదంలో ఆ దేశ మంత్రి రబీంద్ర అధికారి ఫిబ్రవరి 27న మరణించారు. ఆయన ఆ దేశ పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

నైజీరియా అధ్యక్షుడిగా బుహారి

నైజీరియా అధ్యక్షుడిగా ముహమ్మదు బుహారి రెండోసారి ఎన్నికయ్యారని ఫిబ్రవరి 27న ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో సైనిక పాలకుడిగా వ్యవహరించిన బుహారి 2015లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా అధ్యక్షుడయ్యారు.

సినీ నటి శారదకు కలైమామణి అవార్డు

సినీ నటి శారదకు కలైమామణి-2018 అవార్డు లభించింది. 2018కు గాను కలైమామణి అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 28న ప్రకటించింది. శారదతోపాటు కాంచన, కుట్టి పద్మినిలకు కూడా ఈ అవార్డు దక్కింది. ప్రముఖ నటి వైజయంతిమాల బాలి.. బాలసరస్వతి అవార్డుకు ఎంపికయ్యారు.

బీడీఎల్ సీఎండీగా సిద్ధార్థ మిశ్రా

రక్షణ మంత్రిత్వ శాఖ సారథ్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) నూతన చైర్మన్, ఎండీ (సీఎండీ)గా సిద్ధార్థ మిశ్రా మార్చి 1న నియమితులయ్యారు. నౌకాదళంలో పదవీ విమరణ తర్వాత హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేశారు.

International
SUSHMA

ట్రంప్, కిమ్ భేటీ

వియత్నాం రాజధాని హనోయ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య ఫిబ్రవరి 27, 28 తేదీల్లో భేటీ జరిగింది. అమెరికా, ఉత్తర కొరియా న్యూక్లియర్ సమ్మిట్‌లో భాగంగా వీరు సమావేశమయ్యారు.

ఓఐసీ సదస్సు

అరబ్ దేశాల ప్రతిష్ఠాత్మక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) సదస్సు యూఏఈలోని అబుదాబిలో మార్చి 1న ప్రారంభమైంది. రెండు రోజులు జరిగిన ఈ సదస్సుకు భారత్ తరఫున విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. దీంతో ఈ సమావేశంలో పాల్గొన్న తొలి భారత మంత్రిగా సుష్మాస్వరాజ్ గుర్తింపు పొందారు.

బ్లాక్‌లిస్టులో హమ్జాబిన్ లాడెన్

యూఎన్‌వో భద్రతా మండలి అల్‌ఖైదా ఉగ్రవాది హమ్జాబిన్ లాడెన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టింది. అతడి ఆచూకీ లేదా సమాచారం ఇచ్చినవారికి 1 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.06 కోట్లు) అందిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన మార్చి 1న భద్రతామండలి ఈ నిర్ణయం తీసుకుంది. హమ్జాకు సౌదీ అరేబియా పౌరసత్వాన్ని రద్దుచేసింది. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్‌గా హమ్జా పనిచేస్తున్నాడు.

sports
manubhaker

షూటింగ్‌లో సౌరభ్-మను జంటకు స్వర్ణం

ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు సౌరభ్ చౌధరీ-మను భాకర్ జంటకు స్వర్ణ పతకం లభించింది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 27న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో సౌరభ్-మను జోడీ రాన్‌జిన్ జియాన్-బోవెన్ జాంగ్ (చైనా) జంటను ఓడించింది.

మాక్రాన్ కప్‌లో దీపక్ సింగ్‌కు స్వర్ణం

ఇరాన్‌లో జరుగుతున్న మాక్రాన్ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ దీపక్ సింగ్‌కు స్వర్ణ పతకం లభించింది. ఇరాన్‌లోని చాబహార్ నగరంలో ఫిబ్రవరి 28న జరిగిన 49 కేజీల కేటగిరీ ఫైనల్లో దీపక్ సింగ్.. జాఫర్ నసెరిపై విజయం సాధించాడు. 91 కేజీల విభాగంలో సతీశ్ కుమార్, 69 కేజీల విభాగంలో దుర్యోధన్ సింగ్, 60 కేజీల విభాగంలో మనీశ్ నేగి, 52 కేజీల విభాగంలో లలితాప్రసాద్‌లు రజత పతకాలు సాధించారు.

100వ ఏటీపీ టైటిల్ విజేత ఫెదరర్

స్విట్జర్లాండ్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ మార్చి 2న జరిగిన దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో గ్రీస్ ఆటగాడు సిట్సిపాస్‌ను ఓడించి కెరీర్‌లో 100వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. దీంతో అత్యధిక సింగిల్స్ టైటిళ్లు సాధించిన అమెరికా టెన్నిస్ క్రీడాకారుడు జిమ్మీ కానర్స్ (109 టైటిళ్లు) తర్వాత రెండో ఆటగాడిగా ఫెదరర్ గుర్తింపుపొందాడు.

బజరంగ్‌కు స్వర్ణం

బల్గేరియాలో మార్చి 3న ముగిసిన డాన్ కొలోవ్ అంతర్జాతీయ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో బజరంగ్ పూనియా స్వర్ణం సాధించాడు. 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్‌లో బజరంగ్ జోర్డాన్ మైకేల్ ఒలివర్ (అమెరికా)పై గెలుపొందాడు. మహిళల 53 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ కియాన్‌యు పాంగ్ (చైనా)పై ఓడి రజత పతకం గెలుపొందింది.
vemula-saidulu

పుస్తక సమీక్ష


book
ఏ పోటీపరీక్షలో అయినా జీకే కరెంట్‌అఫైర్స్ తప్పనిసరిగా ఉంటుంది. పోటీపరీక్షల విద్యార్థులకు జీకే కరెంట్‌అఫైర్స్ బోధనలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న వేముల సైదులు ఉద్యోగార్థుల సౌకర్యం కోసం కరెంట్‌అఫైర్స్ పుస్తకాన్ని రూపొందించారు. గత ఆరునెలల కాలంలో జరిగిన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంఘటనలను సమగ్రంగా ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఈ పుస్తకం ఉద్యోగార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.
ఎంసీరెడ్డి పబ్లికేషన్స్
పేజీలు: 225
వెల: రూ.200
ప్రతులు అన్ని పుస్తక విక్రయ కేంద్రాల్లో లభ్యం

746
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles