ఎన్‌పీఈ-2019


Mon,March 4, 2019 02:25 AM

ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం- 2019 (NPE-2019) కి కేంద్ర మంత్రివర్గం 2019, ఫిబ్రవరి 19న ఆమోదం తెలిపింది. ఎలక్ట్రానిక్స్, సిస్టం డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ (ESDM) రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా రూపొందించడమే ధ్యేయంగా ఈ విధానాన్ని రూపొందించారు.
npe-2019
-దేశంలో ESDM రంగ అభివృద్ధికి అవసరమైన సామర్థ్యాలను ప్రోత్సహించడం, చిప్‌సెట్ వంటి ప్రధాన భాగాలను అభివృద్ధి చేస్తూ, భారత్‌లో ప్రపంచస్థాయి మార్కెట్లలో ఉండే పోటీని తట్టుకునేలా దేశీయ పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం.

NPE-2019కి పూర్వస్థితి

-దేశంలో ESDM రంగం నుంచి ప్రభావవంతమైన ఉత్పత్తులు (IT, ITES ఆధారితమైనవి) తయారు చేయడానికి తగిన కార్యక్రమాలు, పథకాలను సంఘటితం చేసే లక్ష్యంతో నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ-2012 రూపొందించారు. ఫలితంగా దేశీయ ESDM రంగంలో ఉత్తేజకర వాతావరణం రూపొందించడానికి అవసరమైన పునాదులు ఏర్పడినాయి. ఈ పునాదుల నుంచే ESDM రంగాన్ని కొత్తపుంతలు తొక్కించే లక్ష్యంతో NPE-2019 రూపుదిద్దుకుంది.
-2012, నవంబర్-19 నుంచి అమలవుతున్న జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం-2012ను సమీక్షించడానికి 2017, సెప్టెంబర్ 25న ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది వర్కింగ్ గ్రూప్‌లను ఏర్పాటు చేశారు. ఇవి ప్రధానంగా మొబైల్ హ్యాండ్‌సెట్స్, వాటి విడిభాగాలు, ఎల్‌ఈడీ ఉత్పత్తులు, మెడికల్ ఎలక్ట్రానిక్స్, వివిధ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఫొటో ఓల్టాయిక్స్, చిప్‌సెట్స్ వంటి పలు రంగాల అభివృద్ధికి తగు సూచనలు అందిస్తుంది.

NPE-2019 లక్ష్యాలు

-దేశ ఆర్థికాభివృద్ధికి ESDM రంగ ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం దేశీయ ఉత్పాదకరంగం, ఎగుమతులకు సంబంధించి పలు గుణాత్మకమైన, పరిమాణాత్మకమైన లక్ష్యాలను నిర్ణయించారు. అవి..
1. ESDM రంగం నుంచి 2025 నాటికి సుమారు 400 బిలియన్ల అమెరికన్ డాలర్ల (రూ.26,00,000 కోట్లు) టర్నోవర్ సాధించాలి.
2. రూ.13,00,000 కోట్ల విలువైన (సుమారు 190 బిలియన్ల డాలర్లు) 100 కోట్ల మొబైల్ హ్యాండ్‌సెట్లను దేశీయంగా ఉత్పత్తి చేయాలి. వీటిలో రూ.7,00,000 కోట్ల (110 బిలియన్ల అమెరికన్ డాలర్లు) విలువైన 60 కోట్ల మొబైల్ హ్యాండ్‌సెట్లను ఎగుమతి చేయాలి.
-ఇవేగాక 2025 నాటికి ESDM రంగంలో 26 వేల కోట్ల ఎగుమతులను సాధించడం, ఇదే కాలానికి సుమారు కోటి ఉద్యోగాలు సాధించడం, ఇతర ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయి.

సమాచార ప్రసార సాంకేతికతలో మల్టీప్లెక్సింగ్ ప్రాధాన్యం

-టెలీకమ్యూనికేషన్స్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్‌లో మల్టీప్లెక్సింగ్ విధానంలో అనేక అనలాగ్ లేదా డిజిటల్ సంకేతాలను ఒకే సంకేతంగా మార్చి వివిధ మాధ్యమాల ద్వారా (ఉదా: కేబుల్ వైర్) ఒక చోటు నుంచి మరో చోటుకు సమాచారాన్ని ప్రసారం చేయవచ్చు.
-టెలీకమ్యూనికేషన్స్‌లో ఈ విధానం ద్వారానే అనేక టెలిఫోన్ కాల్స్ ఒక వైర్ మాధ్యమం ద్వారా సకాలంలో అందుతాయి.
-1870లలో మొదటిసారిగా టెలీగ్రఫీలో మల్టీప్లెక్సింగ్ అన్వయించారు. కాగా, 1910లో జార్జ్ ఓటెన్‌స్కివయర్ ద్వారా టెలిఫోన్ క్యారియర్ మల్టీప్లెక్సింగ్ ఆవిష్కరించారు.
-మల్టీప్లెక్సింగ్ విధానంలో ఒక కమ్యూనికేషన్ చానెల్ వివిధ లాజికల్ చానెల్స్‌గా విభజన చెందుతాయి. ఈ రకమైన ఒక్కో లాజికల్ చానెల్ ఏదైనా మెసేజ్ సిగ్నల్ లేదా సమాచార ప్రవాహాన్ని ఒకచోటు నుంచి మరో చోటుకి బదిలీ చేస్తుంది.
-రిసీవింగ్ ఎండ్‌లోని వినియోగదారుడు ఈ సిగ్నళ్లను డీ మల్టీప్లెక్సింగ్ విధానం ద్వారా అందుకోగలుగుతాడు. మల్టీప్లెక్సింగ్ చేసే ఉపకరణాలను మల్టీప్లెక్సర్లుగానూ, డీ మల్టీప్లెక్సింగ్‌కు వినియోగించే ఉపకరణాలను డీ మల్టీప్లెక్సర్లుగాను పరిగణిస్తారు.
-సమర్థవంతమైన వినియోగానికి, ప్రతి కమ్యూనికేషన్ చానెల్‌ను వివిధ రకాలుగా వినియోగదారునికి కేటాయిస్తారు. అవి..
1. కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ (CDMA)
2. ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ (FDMA)
3. టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ (TDMA)

కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ (CDMA)

-ఈ విధానంలో ప్రసారమయ్యే ప్రతి సమాచార సిగ్నల్‌కు ఒక నిర్దిష్టమైన కోడ్ అందజేయబడుతుంది. తదుపరి ఈ సమాచారం చిన్నచిన్న విభాగాలుగా విభజించబడి, ఈ నిర్దిష్ట కోడ్ ట్యాగ్ చేయబడుతుంది. ఈ కోడ్ ఆధారంగానే వినియోగదారుడు, డీ మల్టీప్లెక్సర్ల సాయంతో తిరిగి సమాచారాన్ని అందుకోగలుగుతాడు.
-డిమిట్రీ అజీవ్ (1935-సోవియట్ యూనియన్), లియోనిడ్ కుప్రియనోవిచ్ (1957-మాస్కో)ల కృషివల్ల CDMA

పరిజ్ఞానం అభివృద్ధిచెందింది.

-ఈ విధానంలో సమాచార ప్రసారం నిర్దిష్టమైన మొబైల్ హ్యాండ్‌సెట్ల ద్వారా మాత్రమే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం మొబైల్ కమ్యూనికేషన్ సేవలు ఈ విధానం ద్వారా అందించబడుతున్నాయి. దీనిలో సమాచారం 850 MHz ఫ్రీక్వెన్సీ బాండ్ రూపంలో ప్రసారమవుతుంది.
-CDMA టెక్నాలజీ అధికంగా అమెరికాలో అందుబాటులో ఉంది.
ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ (FDMA)
-ఈ విధానంలో మొత్తం బ్యాండ్ విడ్త్‌ను పలు సమాచార పౌనఃపున్యాలుగా విభజిస్తారు.
-వీటిని అధ్యారోహణం చెందని పౌనఃపున్యాల రూపంలో రెండు కమ్యూనికేటింగ్ ఉపకరణాలకు (ఉదా: మొబైల్ హ్యాండ్ సెట్లు) కేటాయిస్తారు.
-ఈ విధానాన్ని ప్రధానంగా అనలాగ్ సమాచార తరంగాల ప్రసారానికి వినియోగిస్తారు. ఇందుకు అధిక మొత్తం శక్తి వినియోగం జరగడం ప్రధాన అవరోధం.
-దీన్ని మొదటి తరం మొబైల్ ఫోన్ టెక్నాలజీలో విరివిగా వినియోగించారు.

టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ (TDMA)

-ఈ టెక్నాలజీలో సమాచార విభజన సమయ అంతరాలు (టైమ్ స్లాట్స్) రూపంలో జరుగుతాయి.
-సమాచారాన్ని ఒక రేడియో చానెల్ ద్వారా ప్రసారం చేసే ముందు దాన్ని డిజిటల్ సిగ్నళ్ల రూపంలోకి మార్చుతారు. ఇవి సెల్యులార్ చానెళ్ల నుంచి ప్రసారమయ్యేటప్పుడు ప్రతి చానెల్‌ను ఒకే ప్రీక్వెన్సీలో మూడు విభిన్న సమయ అంతరాలుగా విభజిస్తారు. ఫలితంగా ఒకే సమయంలో ముగ్గురు విభిన్న వినియోగదారులకు సమాచారాన్ని సంకేతరూపంలో అందించగలం.
-CDMA సాంకేతికతను రెండోతరం మొబైల్ టెక్నాలజీగా పరిగణిస్తారు. TDMA విధానంగా చానెల్‌ను కనిష్ట సామర్థ్యం మేరకు వినియోగించనున్నా, టైమ్ విభాగాల ఆధారంగా బహుళ ప్రసార చానెళ్లను వినియోగదారులకు అందుబాటులోకి తేవచ్చు.
-CDMA టెక్నాలజీని 1995లో హాంకాంగ్‌లో తొలిసారి వినియోగించారు. తర్వాత యూరప్‌లో ప్రవేశపెట్టారు.
-TDMA సాంకేతికతలో విశేషంగా ఆదరించబడుతున్న సాంకేతికతగా GSM (గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్)ను పేర్కొంటారు.
-GSM విధానంలో పూర్తి కవరేజీ ప్రాంతాన్ని షడ్భుజి ఆకారంలోని సెల్స్‌గా విభజిస్తారు. ప్రతి సెల్ పరిధిలో ఒక మొబైల్ టవర్‌ను కమ్యూనికేషన్ సేవలు అందించడానికి ఏర్పాటు చేస్తారు.
-ఈ టవర్ పరిధిలో సేవలు అందుకోవడానికి, ప్రతి మొబైల్‌లోనూ సబ్‌స్ర్కైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (SIM) కార్డును అమరుస్తారు.
-ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 శాతం కమ్యూనికేషన్ ప్రసారాలు GSM విధానంలోనే అందించబడుతున్నాయి.
-850/900/1800/1900 మెగాహెర్ట్ పౌనఃపున్యాల పరిధిలో GSM ప్రసారాలు జరుగుతున్నాయి.
-ప్రపంచవ్యాప్తంగా 1987 నుంచి GSM విధానంలో సేవలు అందించబడుతున్నాయి.

GSM Vs CDMA

-GSM అనేది సిమ్ ఆధారంగా పనిచేస్తుండగా CDMA అనేది హ్యాండ్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది.
-GSM విధానంలో ధ్వని, సమాచార ప్రసారం ఒకేసారి జరుగుతుండగా CDMA విధానంలో ఈ వెసులుబాటు లేదు.
-GSM విధానంలో రోమింగ్ ప్రపంచవ్యాప్తంగా అందుతుంది. కాగా CDMA విధానంలో ఈ సౌకర్యం చాలా పరిమితం.
-GSM విధానంలో డేటాను జీపీఆర్‌ఎస్ విధానంలో అందిస్తుండగా, CDMA విధానంలో ఎవల్యూషన్ డేటా ఆప్టిమైజ్డ్ (EVDO) ద్వారా అంతర్జాతీయ సేవలు కల్పించబడుతాయి.

NPE-2019లోని ప్రధాన అంశాలు

1.దేశీయ ఉత్పత్తి రంగం గ్లోబల్ మార్కెట్ స్థాయికి చేరుకునేలా అనువైన వాతావరణం సృష్టించడం.

2.ముఖ్యమైన ఎలక్ట్రానిక్ విడి భాగాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన మద్దతును, అదేవిధంగా తగు ప్రోత్సాహకాలను అందించడం.

3.ESDM రంగంలోని ఆధునిక భారీ మెగా ప్రాజెక్టులకు (ఉదా: సెమీకండక్టర్ పరిశ్రమలు, డిస్‌ప్లే పరికరాలు మొదలైనవి) ప్రత్యేక ప్యాకేజీలు అందించడానికి, ఆయా రంగాల్లోని ప్రఖ్యాత కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి తగు ప్రోత్సాహకాలు అందించడం.

4.భవిష్యత్ సాంకేతికతలుగా పరిగణించే ఎలక్ట్రానిక్స్ రంగ ఉప విభాగాలైన 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెన్సార్స్, కృత్రిమ మేధస్సు, వర్చువల్ రియాలిటీ, డ్రోన్స్, రోబోటిక్స్, ఫొటోనిక్స్, నానో ఆధారిత పరికరాలు మొదలైనవి పరిశ్రమలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు నవకల్పనలను తగురీతిలో ప్రోత్సహించడం.

5.నైపుణ్యం కలిగిన మానవవనరులను రూపొందించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం.

6.మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం.

7.ESDM రంగంలో మేధోసంపత్తి హక్కుల విషయంలో తగిన పురోగతి సాధించడానికి సావరిన్ పేటెంట్ ఫండ్‌ను రూపొందించి ప్రోత్సహించడం.

8.జాతీయ సైబర్ భద్రతను మెరుగుపర్చడానికి తగు కార్యక్రమాలను రూపొందించి అమలుపర్చడం.
npe2

satyanarayana

629
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles