రైల్వేలో కొలువు భవితకు నెలవు


Mon,March 4, 2019 02:30 AM

దేశంలోనే అత్యధిక మందికి ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ)లో సుమారుగా 35,277 ఉద్యోగాలు ఉన్నాయి. క్లర్క్‌లు, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, స్టేషన్ మాస్టర్, కమర్షియల్ అప్రెంటిస్ తదితర ఉద్యోగాలు ఇందులో భాగం.
railway-jobs
- జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ టైం కీపర్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ టికెట్ క్లర్క్ తదితర ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత.
- ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కం టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ టైం కీపర్, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు కనీస అర్హత గ్రాడ్యుయేషన్.
ప్రిపరేషన్ విధానం
- అన్ని పరీక్షలకు అంశాలు అవే ఉన్నాయి. కాకపోతే రెండో దశలో ప్రశ్నల స్థాయి కఠినంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే విజయం సాధించవచ్చు.

అంశాలవారీగా ప్రిపరేషన్ జనరల్ అవేర్‌నెస్

- జనరల్ అవేర్‌నెస్ ప్రిపరేషన్‌లో మాతృసబ్జెక్టుతో అనుసంధానం చేస్తూ చదవాలి. అంటే కరెంట్ అఫైర్స్ అంశం ప్రాతిపదికగా ఆయా అంశాల లోతుల్లోకి వెళ్లాలి. ఉదాహరణకు ఇటీవల కశ్మీర్‌లో ఉగ్రదాడి (పుల్వామాలో) తదనంతర పరిణామాలతో భారత్-పాకిస్థాన్ సంబంధాల అంశం ప్రాతిపదికగా, పాలిటీ, జాగ్రఫీ అంశాలు తెరపైకి వచ్చాయి. వాటిని పూర్తిగా అధ్యయనం చేయాలి. ఎలాగంటే..
- కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370, 35A (ఇందులో పాలిటీ ప్రాతిపదికగా వీటిని చదవాలి).
- అలాగే భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించింది. ఈ నేపథ్యంలో సింధు, దాని ఉపనదులు (జీలం, చీనాబ్, బియాస్, రావి, సట్లేజ్), అవి ఎక్కడ ఆవిర్భవిస్తాయి, వాటిపై ఉన్న ప్రాజెక్టులు (ఉదాహరణ బాక్రానంగల్) ఇలా జాగ్రఫీకి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి.
- ఈ సందర్భంగా చరిత్రను కూడా చదవాలి. స్వదేశీ సంస్థానాల విలీనం-ప్రక్రియలు (క్యాబినెట్ మిషన్, మౌంట్‌బాటన్ ప్రణాళిక) అధ్యయనం చేయాలి.
- భారత్-పాకిస్థాన్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్థాయిని ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో ఎకానమీకి సంబంధించిన ప్రాథమిక అంశాలను అధ్యయనం చేయాలి. అసలు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏమిటి?, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దాని ప్రధాన కేంద్రం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పనితీరు ఇలా అన్ని అంశాలను సమగ్రంగా చదవాలి.
- పైన చెప్పిన ఉదాహరణలో కేవలం ఇటీవలి భారత్-పాకిస్థాన్ సంబంధాలు అన్న ఒక అంశం నుంచి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అంశాలను అధ్యయనం చేశాం. ఇంత సమగ్రత ఉంటేనే జనరల్ అవేర్‌నెస్‌పై పూర్తి స్థాయిలో పట్టు వస్తుంది.
- విశాఖపట్నం కేంద్రంగా భారత్‌కు రైల్వేజోన్: ఇందులో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అంశాలను ఎలా అధ్యయనం చేయవచ్చో చూడండి.
- జాగ్రఫీ: భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి. వాటి ప్రధాన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి.
- పాలిటీ: రైల్వేలు ఏ జాబితాలోని అంశం, కేంద్ర జాబితానా, రాష్ట్ర లేక ఉమ్మడి జాబితాలోనిదా? అసలు ఏ షెడ్యూల్‌లో ఈ జాబితాలను పేర్కొన్నారు (ఏడో షెడ్యూల్), ఆర్టికల్ నంబర్ ఎంత (246)?.
- హిస్టరీ: భారతదేశంలో తొలి రైల్వేలైన్ ఏ సంవత్సరంలో వచ్చింది (1853), ఎక్కడ నుంచి ఎక్కడికి (బాంబే నుంచి థానే), నాటి గవర్నర్ జనరల్ ఎవరు (డల్హౌసీ) ఇలా ప్రశ్నల పరంపర కొనసాగాలి. ఒక తాజా సంఘటన (కరెంట్ అఫైర్) నుంచి మొదలుకొని, దాని మాతృక సబ్జెక్టులోకి వెళితే అటు జనరల్ అవేర్‌నెస్‌తో పాటు జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్‌లపై కూడా పూర్తి స్థాయి పట్టు పెరుగుతుంది.

మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్

- ఇందులో నంబర్ సిస్టమ్‌తోపాటు అర్థమెటిక్‌ను కూడా పేర్కొన్నారు. ఇది చాలా కీలక విభాగం. అభ్యర్థులు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. ఒకటి బోడ్మాస్ (BODMAS- Bracket, Off, Division, Multiplication, Addition, Subtraction) ఆధారిత ప్రశ్నలు నిత్యం సాధన చేస్తూనే ఉండాలి. అలాగే అర్థమెటిక్‌లో భాగంగా ఉండే ప్రాఫిట్ అండ్ లాస్, టైం అండ్ వర్క్, సింపుల్ ఇంట్రస్ట్, కాంపౌండ్ ఇంట్రస్ట్, టైం అండ్ వర్క్ తదితర అంశాలు ఉంటాయి. అభ్యర్థులు ఇక్కడ కాన్సెప్ట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత సూక్ష్మీకరణాలను వేగంగా చేసేందుకు నిత్యం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. దీంతో ఈ విభాగంలో మంచి స్కోర్ చేయవచ్చు. సూత్రాలను నేర్చుకోవడం కంటే కాన్సెప్ట్‌కు ప్రాధాన్యం ఇవ్వడంవల్ల తేలికగా జవాబులు గుర్తించవచ్చు. 2016లో జరిగిన రైల్వే పరీక్షలో అడిగిన ప్రశ్నను పరిశీలిద్దాం..
- ఒక స్వీట్‌ను తయారు చేయడానికి అయిదు గ్లాసుల పాలు, మూడు గ్లాసుల చక్కెర అవసరం. అయితే మీకు 25 గ్లాసుల పాలు ఇచ్చి, వాటిని పూర్తిగా వినియోగిస్తూ స్వీట్‌ను తయారు చేయమంటే ఎన్ని గ్లాసుల చక్కెర అవసరం?
- ఈ ప్రశ్నకు సమాధానం సూత్రాల ఆధారంగా చేసుకుంటూ వెళితే చాలా ఎక్కువ సమయం పడుతుంది. అందుకు కామన్ సెన్స్‌తో ఆలోచించాలి. 5 గ్లాసుల పాలకు 3 గ్లాసుల చక్కెర కావాలి, కాని 25 గ్లాసులు ఇచ్చారు. అంటే ఐదు రెట్లు పాలు ఎక్కువ ఇచ్చారు. కాబట్టి చక్కెర కూడా అయిదు రెట్లు కావాలి. అంటే 3X5 =15 కాబట్టి అదే సరైన సమాధానం. అందుకే ముందుగా అధ్యాయాల వారీగా చదివి వాటిని ప్రాక్టీస్ చేయడం ఉత్తమం.

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్

- ఇందులో పజిల్ టెస్ట్, ఆల్ఫాబెట్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, కోడింగ్-డికోడింగ్, సిలాజిసం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ అంశంలో కూడా అభ్యర్థులు ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత సాధ్యమైనన్ని ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. 2016లో రీజనింగ్‌లో ఇచ్చిన ఒక ప్రశ్నను పరిశీలిద్దాం..
- In a family, X and Y are sisters. Y is the mother of A. C is the son of A. B is the son of X. Which of the following statements is true?
1. A is the son of X and Y
2. B and A are cousins
3. X is the father of B
4. X is Cs grand mother
- పై ప్రశ్నకు సమాధానం కావాలంటే లాజిక్‌గా ఆలోచించాలి. ఎక్స్, వైలు సిస్టర్స్ అన్నారు. అంటే వాళ్లిద్దరూ కచ్చితంగా మహిళలే. అలాగే సి అనే వ్యక్తికి ఎ కుమారుడు అని ఇచ్చారు. అంటే ఎ పురుషుడు, అలాగే ఎ అనే వ్యక్తికి వై తల్లి అని ఇచ్చారు. అంటే ఇక్కడ కచ్చితంగా సి, వైలు భార్యాభర్తలు అయి ఉండాలి. అలాగే ఎక్స్ అనే వ్యక్తికి బి కుమారుడు అని ఇచ్చారు. ఎక్స్, వైలు అక్కాచెల్లెళ్లు అయినందున ఎ, బిలు కచ్చితంగా అన్నదమ్ములు (కజిన్స్) అయి ఉండాలి. కాబట్టి సరైన సమాధానం బి.

మాక్‌టెస్టులు తప్పనిసరి

- పోటీ పరీక్షలు అకడమిక్ పరీక్షలకు పూర్తిగా భిన్నం. ఇక్కడ కచ్చితంగా పూర్తిస్థాయి మాక్‌టెస్టులు రాయాలి. అలాగే ఎప్పటికప్పుడు ఫలితాలను సరిచూసుకోవాలి. తరచూ తప్పు చేస్తున్న విభాగాలను పరిశీలించి, అందులో మరోసారి బేసిక్స్‌ను సరి చూసుకోవాలి. అలాగే సమయపాలన చాలా కీలకం. పరీక్షలో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. కాబట్టి వేగంగా సమాధానాలు గుర్తించడం అలవర్చుకోవాలి. ఇందుకు ప్రాక్టీస్ ఒక్కటే మార్గం.

ఎంపిక పరీక్షలోని దశలు

1. తొలి దశ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)
2. రెండోదశ (ఇది కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కొన్నింటికి మాత్రమే ఉంటుంది)
- టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (కొన్నింటికి మాత్రమే)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్

మొదటి దశ పరీక్షలోని అంశాలు

- జనరల్ అవేర్‌నెస్- 40
- మ్యాథమెటిక్స్- 30
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్- 30
- మూడు విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. సమయం 90 నిమిషాలు.

railway-jobs2

రెండో దశ పరీక్షలోని అంశాలు

- జనరల్ అవేర్‌నెస్- 50
- మ్యాథమెటిక్స్- 35
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్- 35
- మొత్తం 120 ప్రశ్నలు వస్తాయి. వీటిని 90 నిమిషాల్లో పూర్తిచేయాలి.
గమనిక: కొన్ని పోస్టులకు మాత్రమే రెండో దశ ఉంటుంది.
- నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులను తీసివేస్తారు.
- జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా వచ్చే అంశాలు పదో తరగతి సీబీఎస్‌ఈ సిలబస్ అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు (సైన్స్ అంశాలకు). కాబట్టి పదో తరగతి స్థాయి వరకు ప్రాథమిక అంశాలతో పాటు నిత్య జీవితంలో వాటి అనువర్తనాలను కూడా అధ్యయనం చేయాలి.
- క్రీడలు, అవార్డులు, భారత అంతరిక్ష కార్యక్రమం, పర్యావరణం తదితర అంశాల నుంచి కూడా ప్రశ్నలు ఇస్తారు.
- భారత ప్రభుత్వ పథకాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, భారత సహజ ఉద్బిజ్జ సంపద తదితర అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. వర్తమాన అంశాలకు వీటిని జోడిస్తూ చదవాలి.
rajendra-prasad

3057
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles