ఒలంపియాడ్స్ ఇవి విద్యార్థుల దంగల్స్


Sun,February 10, 2019 11:48 PM

హైస్కూల్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ మొదలైన కోర్సుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడానికి ఏటా సబ్జెక్టుల వారీగా అనేక సంస్థలు ఒలంపియాడ్ పరీక్షలు నిర్వహిస్తుంటాయి. మొదట రీజినల్, తర్వాత నేషనల్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిల్లో ఈ పరీక్షలు ఉంటాయి. మన దేశంలో ఒలంపియాడ్ పరీక్షలకు కేంద్ర బిందువు హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (HBCSE). ఒలంపియాడ్ పరీక్షల నిర్వహణకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని కేంద్రప్రభుత్వ విభాగాలైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, కేంద్ర మానవవనరుల శాఖ అందిస్తాయి. దేశంలో నిర్వహించే పలు ఒలంపియాడ్‌ల వివరాలు నిపుణ పాఠకుల కోసం..
Olympiads
-ప్రతి సబ్జెక్టులోనూ ఐదు అంచెల్లో ఒలంపియాడ్ పరీక్షలు నిర్వహిస్తారు. మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో మాత్రం ఆరు దశలు ఉంటాయి. అన్ని సబ్జెక్టులకు స్టేజ్-1 పరీక్షలను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (IAPT) నిర్వహిస్తుంది. స్టేజ్-2 నుంచి స్టేజ్-4 వరకు హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (HBCSE) నిర్వహిస్తుంది. స్టేజ్-5 పరీక్ష అంతర్జాతీయ వేదికపై జరుగుతుంది. ఈ పరీక్ష నిర్వహణకు ఒక్కో ఏడాది ఒక్కో దేశం ఆతిథ్యం ఇస్తుంది.

Olympiads2

మ్యాథమెటికల్ ఒలంపియాడ్ ప్రోగ్రామ్

-గణితంపై ఆసక్తి, భిన్నంగా ఆలోచించే సామర్థ్యం, పట్టుదల ఉంటే మ్యాథ్స్ ఒలంపియాడ్ రాయవచ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మ్యాథమెటిక్స్ (NBHM) మ్యాథ్స్ ఒలంపియాడ్ నిర్వహిస్తున్నది. దీనికి HBCSE మార్గనిర్దేశనం చేస్తుంది.
-మ్యాథ్స్ ఒలంపియాడ్ పరీక్షల కోసం శిక్షణ ఇచ్చి, ప్రతిభగల విద్యార్థులను ఎంపిక చేయడం కోసం దేశాన్ని 25 రీజియన్లుగా విభజించారు. ఒక్కో రీజియన్‌కు ఒక్కో రీజనల్ కోఆర్డినేటర్‌ను నియమించారు. వీటికి అదనంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), నవోదయ విద్యాలయ సమితి (NVS), కేంద్రీయ విద్యాలయ సంఘటన (KVS)లకు ఒక్కో రీజనల్ కోఆర్డినేటర్ ఉంటారు.

మ్యాథ్స్ ఒలంపియాడ్‌కు నమోదు ఎలా?

-మ్యాథ్స్ ఒలంపియాడ్ తొలి దశ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ముందుగా రీజినల్ కోఆర్డినేటర్ల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలి. 9, 10వ తరగతి విద్యార్థులతోపాటు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. రీజినల్ కోఆర్డినేటర్ అనుమతితో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా తొలి దశ మ్యాథ్స్ ఒలంపియాడ్‌కు పేర్లు నమోదు చేసుకోవచ్చు.
-ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో మొత్తం ఆరు దశలు ఉంటాయి.

స్టేజ్-1

ప్రి-రీజినల్ మ్యాథమెటికల్ ఒలంపియాడ్ (PRMO)
-ఈ పరీక్షను IAPT సహకారంతో మ్యాథ్స్ టీచర్స్ అసోషియేషన్ (MTA) నిర్వహిస్తుంది. విద్యార్థుల దగ్గరలో ఉండే పాఠశాలల్లో పరీక్ష జరుగుతుంది. పరీక్షలో మొత్తం 30 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.
-ఈ పరీక్ష ద్వారా ఒక్కో రీజియన్ నుంచి 300 మంది విద్యార్థులను రీజినల్ మ్యాథ్స్ ఒలంపియాడ్‌కు ఎంపిక చేస్తారు.

స్టేజ్-2

రీజినల్ మ్యాథ్స్ ఒలంపియాడ్ (RMO)
-ఈ పరీక్షను HBCSE మార్గనిర్దేశనంలో రీజినల్ కోఆర్డినేర్లు నిర్వహిస్తారు. రీజియన్లలోని కొద్దిపాటి సెంటర్లలో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్షలో మొత్తం ఆరు డిస్క్రిప్టివ్ ప్రశ్నలుంటాయి.
-ఒక్కో రీజియన్ నుంచి 30 మంది విద్యార్థుల చొప్పున దాదాపు 900 మందిని స్టేజ్-3కి ఎంపిక చేస్తారు.

స్టేజ్-3

ఇండియన్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలంపియాడ్ (INMO)
-ఈ పరీక్షలో కూడా డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉంటాయి. రీజినల్ మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో ఎంపికైన 900 మంది విద్యార్థులు INMOకు అర్హులు. దేశవ్యాప్తంగా 30 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రతిభచూపిన వారి నుంచి సుమారు 35 మందిని స్టేజ్-4కు ఎంపిక చేస్తారు.

స్టేజ్-4

ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్ ట్రెయినింగ్ క్యాంప్ (IMOTC)
-INMO లో అర్హత సాధించిన 35 మంది విద్యార్థులకు ఈ దశలో శిక్షణ ఇస్తారు. ఏప్రిల్, మే నెలల్లో HBCSE లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది.
-శిక్షణ అనంతరం వారిలో అత్యంత ప్రతిభ కనబర్చిన ఆరుగురిని దేశం తరఫున ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్‌కు ఎంపికచేస్తారు.

స్టేజ్-5

ప్రి-డిపార్చర్ ట్రెయినింగ్ క్యాంప్ (PDTC)
-స్టేజ్-4లో ఎంపికైన ఆరుగురు విద్యార్థులకు ఈ దశలో IMO కోసం 8 నుంచి 10 రోజులపాటు అత్యంత కఠినమైన శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కార్యక్రమం కూడా HBCSE లోనే ఉంటుంది.

స్టేజ్-6

ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్ (IMO)
-వివిధ దేశాల నుంచి తుది దశకు ఎంపికైన విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొంటారు. IMO భాగస్వామ్య దేశాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష రాయడానికి ఎంపికైన ఆరుగురు విద్యార్థులతోపాటు నలుగురు టీచర్ల బృందం IMOకు హాజరవుతుంది.

ప్రోత్సాహకాలు

-నేషనల్ మ్యాథమెటికల్ ఒలంపియాడ్‌లో ఎంపికైన విద్యార్థులు చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే బీఎస్సీ (ఆనర్స్) మ్యాథమెటిక్స్ కోర్సులో ఎలాంటి ఎంట్రెన్స్ రాయకుండానే ప్రవేశం పొందవచ్చు.
-ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే బిట్ శాట్, బి మ్యాథ్ కోర్సుల్లో చేరడానికి నిర్వహించే ప్రవేశపరీక్షలు కూడా రాయనవసరంలేదు.
-కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహక్ యోజన (KVPY)కు వీరు అర్హులు.
-పరీక్షలో చూపిన ప్రతిభను బట్టి నగదు బహుమతులు కూడా ఉంటాయి.
-మ్యాథ్స్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు NBHM ఉపకార వేతనాలు ఇస్తుంది.

సైన్స్ & ఆస్ట్రానమీ ఒలంపియాడ్ ప్రోగ్రామ్స్

-సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతోపాటు ఆస్ట్రానమీ విభాగంలో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి సైన్స్ ఒలంపియాడ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1400 స్కూళ్లలో పరీక్ష నిర్వహణ ద్వారా నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ ప్రారంభమవుతుంది.
-ప్రతి సబ్జెక్టుకు ఐదు దశల్లో పరీక్షలు ఉంటాయి. స్టేజ్-1 పరీక్షలను IAPT, స్టేజ్-2 నుంచి స్టేజ్-5 వరకు పరీక్షలను HBCSE నిర్వహిస్తాయి. 9, 10వ తరగతి విద్యార్థులతోపాటు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలు రాయడానికి అర్హులు. అయితే పరీక్షకు హాజరవుతున్న ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి విద్యార్థి వయస్సు 19 ఏండ్లకు మించకూడదు. జూనియర్ సైన్స్ ఒలంపియాడ్ పరీక్షలకు 9, 10వ తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులు. పరీక్షకు హాజరుకానున్న ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి వీరి వయస్సు 15 ఏండ్లకు మించరాదు.
-సైన్స్ ఒలంపియాడ్స్‌లో స్టేజ్-1 పరీక్షలకు దేశవ్యాప్తంగా ఒక్కో సబ్జెక్టుకు సుమారు 20,000 నుంచి 60,000 మంది విద్యార్థులు హాజరవుతారు. సబ్జెక్టుల వారీగా సైన్స్ ఒలంపియాడ్‌లకు సంబంధించిన వివరాలను పరిశీలిద్దాం..

ఫిజిక్స్

-ఫిజిక్స్ ఒలంపియాడ్ 38 ఏండ్లుగా నిర్వహిస్తున్నారు. భారత్ 1998 నుంచి ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్‌లో పాల్గొంటున్నది. ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.

స్టేజ్-1

నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ ఫిజిక్స్ (NSEP)
-విద్యార్థులకు దగ్గరలో ఉన్న పాఠశాలల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో 300 నుంచి 500 మందిని స్టేజ్-2కు ఎంపికచేస్తారు. వీరికి ఐఏపీటీ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తుంది.

స్టేజ్-2

ఇండియన్ నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్ (INPhO)
-స్టేజ్-1లో ఎంపికైన వారికి HBCSE దేశవ్యాప్తంగా 18 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా 35 నుంచి 50 మంది విద్యార్థులను స్టేజ్-3కి ఎంపిక చేస్తారు.

స్టేజ్-3

ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ (OCSC)
-స్టేజ్-2లో ఎంపికైన విద్యార్థులు ఈ క్యాంప్ కు అర్హులు. వీరికి HBCSEలో శిక్షణ ఉంటుంది. ఫిజిక్స్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 4-6 మంది విద్యార్థులను స్టేజ్-4కు ఎంపికచేస్తారు.

స్టేజ్-4

ప్రి-డిపార్చర్ ట్రెయినింగ్ క్యాంప్ (PDT)
-స్టేజ్-3లో ఎంపికైన వారికి HBCSEలో ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

స్టేజ్-5

ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్ (IPhO)
-దేశం తరఫున ఎంపికైన విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయుల బృందం అంతర్జాతీయ ఒలంపియాడ్‌కు హాజరవుతుంది.

జూనియర్ సైన్స్

-సెకండరీ స్కూల్ విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. సైన్స్ సబ్జెక్టులకు సమప్రాధాన్యం ఇచ్చి ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలంపియాడ్ (IJSO) ఏర్పాటు చేశారు. ఇందులోనూ 5 స్టేజ్‌లు ఉంటాయి.

స్టేజ్-1

నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ జూనియర్ సైన్స్ (NSEJS)
-సీబీఎస్‌ఈ పదోతరగతి స్థాయిలో సిలబస్ ఉంటుంది.300 నుంచి 500 మందిని స్టేజ్-2కు ఎంపికచేస్తారు.

స్టేజ్-2

ఇండియన్ నేషనల్ జూనియర్ సైన్స్ ఒలంపియాడ్ (INJSO)
-స్టేజ్-1లో అర్హత సాధించిన విద్యార్థులకు HBCSE దేశవ్యాప్తంగా 18 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించి.. ప్రతిభ ఆధారంగా 35 నుంచి 50 మందిని స్టేజ్-3కి ఎంపిక చేస్తుంది.

స్టేజ్-3

ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ (OCSC)
-పరీక్షలో ప్రతిభ ఆధారంగా 4-6 మంది విద్యార్థులను స్టేజ్-4కు ఎంపికచేస్తారు.

స్టేజ్-4

ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలంపియాడ్ (IJSO)
-స్టేజ్-4లో శిక్షణ పొందిన విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయులు ఒలంపియాడ్‌కు హాజరవుతారు.

స్టేజ్-5

ప్రి-డిపార్చర్ ట్రెయినింగ్ క్యాంప్
-స్టేజ్-3లో ఎంపికైన విద్యార్థులకు ఒలంపియాడ్ కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

కెమిస్ట్రీ

-కెమిస్ట్రీ అంతర్జాతీయ ఒలంపియాడ్‌ను 1968 నుంచి నిర్వహిస్తున్నారు. రసాయనశాస్త్రంలో పరిజ్ఞానం పెంపొందించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. భారత్ 1999 నుంచి ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలంపియాడ్‌లో పాల్గొంటున్నది.

స్టేజ్-1

నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ కెమిస్ట్రీ (NSEC)
-విద్యార్థులకు దగ్గరలో ఉన్న పాఠశాలల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో 300 నుంచి 500 మందిని స్టేజ్-2కు ఎంపికచేస్తారు.

స్టేజ్-2

ఇండియన్ నేషనల్ కెమిస్ట్రీ ఒలంపియాడ్ (INChO)
-స్టేజ్-1లో ఎంపికైన వారికి HBCSE దేశవ్యాప్తంగా 18 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా 35 నుంచి 50 మంది విద్యార్థులను స్టేజ్-3కి ఎంపిక చేస్తారు.

స్టేజ్-3

ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ (OCSC)
-స్టేజ్-2లో ఎంపికైన విద్యార్థులు ఈ ఓరియంటేషన్ క్యాంప్‌కు అర్హులు. వీరికి HBCSEలో శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కెమిస్ట్రీ థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 4-6 మంది అత్యంత ప్రతిభగల విద్యార్థులను స్టేజ్-4కు ఎంపికచేస్తారు.

స్టేజ్-4

ప్రి-డిపార్చర్ ట్రెయినింగ్ క్యాంప్ (PDT)
-స్టేజ్-3లో ఎంపికైన వారికి HBCSEలో ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

స్టేజ్-5

ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలంపియాడ్ (IChO)
-దేశం తరఫున ఎంపికైన విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయుల బృందం అంతర్జాతీయ ఒలంపియాడ్‌కు హాజరవుతుంది.

ఆస్ట్రానమీ

-ఫిజిక్స్, మ్యాథ్స్ విభాగాల్లో ప్రాథమికాంశాలపై మంచి పట్టుండి ఖగోళశాస్త్రంలో విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థుల కోసం ఆస్ట్రానమీ ఒలంపియాడ్ నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ ఒలంపియాడ్ (IAO)తోపాటు 2007 నుంచి ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ ఇన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (IOAA)లో కూడా భారత్ పాల్గొంటున్నది.

స్టేజ్-1

నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ ఆస్ట్రానమీ (NSEA)
-దీనిలో జూనియర్, సీనియర్ అని రెండు లెవల్స్ ఉంటాయి. పదిలోపు విద్యార్థులు జూనియర్ లెవల్‌కు, ఇంటర్ విద్యార్థులు సీనియర్ లెవల్‌కు అర్హులు. ఈ దశలో జూనియర్ లెవల్‌లో 300 నుంచి 500 మందిని, సీనియర్ లెవల్‌లో 300 నుంచి 500 మందిని స్టేజ్-2కు ఎంపికచేస్తారు.

స్టేజ్-2

ఇండియన్ నేషనల్ ఆస్ట్రానమీ ఒలంపియాడ్ (INAO)
-స్టేజ్-1లో ఎంపికైన జూనియర్, సీనియర్ విభాగాల విద్యార్థులకు HBCSE పరీక్ష నిర్వహిస్తుంది. జూనియర్ లెవల్ నుంచి 20 మందిని, సీనియర్ లెవల్ నుంచి 35 నుంచి 50 మందిని స్టేజ్-3కి ఎంపికచేస్తారు.

స్టేజ్-3

ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ (OCSC)
-ఈ దశలో వివిధ రకాల ప్రతిభా పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా మెరిట్‌లిస్ట్ తయారు చేస్తారు. ఒక్కో లెవల్‌లో 4-6 మంది విద్యార్థులను స్టేజ్-4కు ఎంపికచేస్తారు.

స్టేజ్-4

ప్రి-డిపార్చర్ ట్రెయినింగ్ క్యాంప్ (PDT)
-స్టేజ్-3లో ఎంపికైన జూనియర్, సీనియర్ విద్యార్థులను IAO, IOAAకు సన్నద్ధం చేస్తారు.

స్టేజ్-5

ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ ఒలంపియాడ్ (IAO) ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ ఇన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (IOAA)
-స్టేజ్-4లో శిక్షణ పొందిన జూనియర్, సీనియర్ లెవల్ విద్యార్థులతోపాటు ఒక్కో లెవల్‌కు నలుగురు టీచర్ల చొప్పున ఒలంపియాడ్స్‌కు హాజరవుతారు.

బయాలజీ

-ఇంటర్నేషనల్ బయాలజీ ఒలంపియాడ్ 1990లో ప్రారంభమైంది. భారత్ మాత్రం 2000 నుంచి ఇందులో పాల్గొంటున్నది.

స్టేజ్-1

నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ బయాలజీ (NSEB)
-విద్యార్థులకు దగ్గరలో ఉన్న పాఠశాలల్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో 300 నుంచి 500 మందిని స్టేజ్-2కు ఎంపికచేస్తారు.

స్టేజ్-2

ఇండియన్ నేషనల్ బయాలజీ ఒలంపియాడ్ (INBO)
-స్టేజ్-1లో ఎంపికైన వారికి HBCSE దేశవ్యాప్తంగా 18 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తుంది. ప్రతిభ ఆధారంగా 35 నుంచి 50 మందిని స్టేజ్-3కి ఎంపిక చేస్తారు.

స్టేజ్-3

ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ (OCSC)
-స్టేజ్-2లో ఎంపికైన విద్యార్థులు ఈ క్యాంప్‌కు అర్హులు. వీరికి HBCSEలో శిక్షణ ఉంటుంది. బయాలజీ థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కుల ఆధారంగా 4-6 మంది విద్యార్థులను స్టేజ్-4కు ఎంపికచేస్తారు.

స్టేజ్-4

ప్రి-డిపార్చర్ ట్రెయినింగ్ క్యాంప్
-స్టేజ్-3లో ఎంపికైన వారికి HBCSEలో ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

స్టేజ్-5

ఇంటర్నేషనల్ బయాలజీ ఒలంపియాడ్ (IBO)
-ఎంపికైన విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయుల బృందం అంతర్జాతీయ ఒలంపియాడ్‌కు హాజరవుతుంది.

సైన్స్ ఒలంపియాడ్స్‌కు నమోదు ఎలా?

-సైన్స్ ఒలంపియాడ్ తొలిదశ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన నేషనల్ సైన్స్ ఎడ్యుకేషన్ (NSE) సెంటర్లలో పేర్లు నమోదు చేసుకోవాలి.

ప్రోత్సాహకాలు

-సైన్స్‌కు సంబంధించి వివిధ సబ్జెక్టుల్లో ఇంటర్నేషనల్ ఒలంపియాడ్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు స్పెషల్ మెరిట్ అవార్డు కింద పుస్తకాలు, నగదు రూపంలో రూ.5000 అందిస్తారు. అన్ని సబ్జెక్టుల ఒలంపియాడ్ పరీక్షల్లో థియరీ, ప్రాక్టికల్స్‌లో విభాగాలవారీగా మంచి ప్రతిభ కనబర్చిన వారికి స్పెషల్ ప్రైజ్‌లు ఇస్తారు.

గమనిక: పైన పేర్కొన్న ఒలంపియాడ్‌లతోపాటు ఏషియన్ ఫిజిక్స్ ఒలంపియాడ్ (APhO), ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలంపియాడ్ (IESO), ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ ఇన్ ఇన్ఫర్మాటిక్స్ (IOI) గుర్తింపు పొందిన సైన్స్ ఒలంపియాడ్‌లు.

HBCSE

స్టేజ్-3, స్టేజ్-4 శిక్షణ ఎలా ?


స్టేజ్-3

-ప్రతి సబ్జెక్టులో స్టేజ్-3 శిక్షణను HBCSE నిర్వహిస్తుంది. ఏ సబ్జెక్టులో ఎంపికైనా నెల రోజులు శిక్షణ ఇస్తారు. థియరీ ఎక్స్‌పరిమెంటల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగాల్లో ఓరియంటేషన్ తరగతులు ఉంటాయి. సబ్జెక్టులో పేరొందిన సైంటిస్టులతో ఉపన్యాసాలు ఇప్పిస్తారు. పరీక్షలో థియరీకి 60 శాతం, ప్రాక్టికల్స్‌కు 40 శాతం వెయిటేజీ ఉంటుంది.

స్టేజ్-4

-స్టేజ్-3లో ఎంపికైన వివిధ సబ్జెక్టులకు చెందిన విద్యార్థులకు వారి సబ్జెక్టులో పదిరోజులపాటు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. HBCSEలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. థియరీ, ప్రాక్టికల్స్‌పై ప్రయోగశాలల్లో శిక్షణ ఇస్తారు. HBCSE నిపుణులే కాకుండా ఆయా సబ్జెక్టుకు సంబంధించి దేశవ్యాప్తంగా పేరొందిన సంస్థలకు చెందిన ప్రముఖులు కూడా శిక్షణలో పాల్గొంటారు.

గమనిక: IMO తోపాటు యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటికల్ ఒలంపియాడ్ (EGMO), ఏషియా పసిఫిక్ మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్ (APMO) కూడా గుర్తింపు పొందిన మ్యాథ్స్ ఒలంపియాడ్‌లు.
-తోట నాగరాజు

1215
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles