కరెంట్ అఫైర్స్


Wed,February 6, 2019 12:37 AM

Telangana
Pocharam1

హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్ మిషన్

హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్ మిషన్ ఉన్నత పురస్కారం లభించింది. హైదరాబాద్‌కు ఓడీఎఫ్++ (ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ) గుర్తింపును జారీచేస్తూ స్వచ్ఛభారత్ మిషన్ జనవరి 28న ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 4,041 నగరాలు దరఖాస్తు చేసుకోగా ఇందులో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, వికారాబాద్ నగరాలున్నాయి.

ఏఐబీఎంఎంఎస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్

అఖిల భారతీయ బీడీ మజ్దూర్ మహా సంఘ్ (ఏఐబీఎంఎంఎస్) అధ్యక్షుడిగా కలాల్ శ్రీనివాస్ ఫిబ్రవరి 3న ఎన్నికయ్యారు. ఒడిశాలోని అంగుల్ జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరిగిన బీడీ కార్మికుల మహాసభలో సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్‌ను మహాసంఘ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

పుస్తకావిష్కరణ

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రచించిన తెలంగాణలో సుస్థిర వ్యవసాయం పుస్తకాన్ని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఫిబ్రవరి 3న ఆవిష్కరించారు.

మౌనశ్రీ మల్లిక్‌కు సినారె పురస్కారం

రచయిత మౌనశ్రీ మల్లిక్‌కు సినారె పురస్కారం ఫిబ్రవరి 3న లభించింది. ఆయన రచించిన తప్త స్పృహ గ్రంథానికి ఈ అవార్డు దక్కింది.

Persons
Aparna-kumar

దక్షిణ ధృవం చేరిన తొలి మహిళా ఐపీఎస్

అంటార్కిటికా ఖండంలో దక్షిణ ధృవంలో భూగ్రహం చిట్టచివరి భూభాగమైన సౌత్ పోల్ సూచీ బోర్డును చేరిన తొలి మహిళా ఐపీఎస్‌గా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఆఫీసర్ అపర్ణ కుమార్ రికార్డులకెక్కారు. 2002 బ్యాచ్ యూపీ క్యాడర్ ఐపీఎస్ అయిన ఆమె సౌత్‌పోల్‌ను చేరుకునేందుకు ఎనిమిది రోజులపాటు ట్రెక్కింగ్ చేసి జనవరి 13న ఎనిమిది మంది బృందంతో కలిసి అక్కడికి చేరుకున్నారు.

జార్జి ఫెర్నాండెజ్ మృతి

సోషలిస్ట్ నేత, మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్ అల్జీమర్స్, స్వైన్‌ఫ్లూ కారణంగా న్యూఢిల్లీలో జనవరి 29న మరణించారు. 1930, జూన్ 3న కర్ణాటకలోని మంగళూరులో గోవా మూలాలున్న రోమన్ క్యాథలిక్ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన రాంమనోహర్ లోహియా నాయకత్వంలోని సోషలిస్ట్ పార్టీలో చేరి కార్మికోద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1967లో దక్షిణ బొంబాయి నుంచి సంయుక్త సోషలిస్ట్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

పాకిస్థాన్‌లో హిందూ సివిల్ జడ్జి

పాకిస్థాన్‌లో మొదటిసారి జనవరి 29న సుమన్ కుమారి అనే హిందూ మహిళ సివిల్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈమె ఖంబర్-షాదద్‌కోట్ జిల్లాకు చెందినవారు. పాకిస్థాన్ జనాభాలో 2 శాతం మంది హిందువులున్నారు.

కార్పొరేషన్ బ్యాంక్ సీఈవోగా భారతి

కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పీవీ భారతి కార్పొరేషన్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఫిబ్రవరి 3న నియమితులయ్యారు. ఈ బ్యాంక్ చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళ ఆమె.

పద్మశ్రీ అవార్డు వెనక్కి

మణిపూర్‌కు చెందిన ప్రఖ్యాత సినీ దర్శకుడు అరిబమ్ శ్యామ్ శర్మ తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఫిబ్రవరి 3న ప్రకటించారు. పౌరసత్వ సవరణ బిల్లు-2016కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

National
Train

మదురైలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన

తమిళనాడులో మదురై సమీపంలోని థోప్సూర్‌లో నిర్మించ తలపెట్టిన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు ప్రధాని మోదీ జనవరి 25న శంకుస్థాపన చేశారు. 750 పడకలతో నిర్మిస్తున్న ఈ వైద్యశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల కూడా ఉండనుంది.

ఆక్స్‌ఫర్డ్ హిందీ పదంగా నారీ శక్తి

నారీ శక్తిని 2018 ఏడాది హిందీపదంగా ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. జైపూర్‌లో జరిగిన జైపూర్ సాహితీ వేడుకలో జనవరి 26న ఆక్స్‌ఫర్డ్ ఈ ప్రకటన చేసింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా ట్రైన్-18

దేశీయంగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలు ట్రైన్-18కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేసినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ జనవరి 27న తెలిపారు. వారణాసి-ఢిల్లీ మధ్య ఈ రైలును నడపనున్నట్లు వెల్లడించారు. 16 బోగీలున్న ఈ ఎక్స్‌ప్రెస్‌ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూ.97 కోట్లతో తయారుచేసింది. 18 నెలల్లోనే పూర్తి ఏసీ సౌకర్యం ఉన్న ఈ రైలును అభివృద్ధి చేశారు.

త్రిపుర శకటానికి ప్రథమ బహుమతి

భారత 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో గాంధేయ మార్గంలో గ్రామీణ ఆర్థిక సాధికారతను ప్రదర్శించిన త్రిపుర శకటానికి ప్రథమ బహుమతి లభించింది. అలాగే జాతీయ ఆస్తుల రక్షణలో 50 ఏండ్లు థీమ్‌తో రూపొందించిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం శకటం, కిసాన్ గాంధీ పేరుతో భారత వ్యవసాయ పరిశోధన మండలి రూపొందించిన శకటం ప్రభుత్వ విభాగాల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. ఢిల్లీలో జనవరి 28న జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డులను అందజేశారు.

స్ట్రాటజిక్ హెచ్‌ఆర్ కోర్సు ప్రారంభం

సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ (ఎస్‌హెచ్‌ఆర్‌ఎం), చండీగఢ్ యూనివర్సిటీలు సంయుక్తంగా రెండేండ్ల స్ట్రాటజిక్ హెచ్‌ఆర్ కోర్సును ప్రారంభించాయి. చండీగఢ్‌లోని సీఐఐ కార్యాలయం లో జనవరి 28న జరిగిన కార్యక్రమంలో చండీగఢ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆర్‌ఎస్ బవా, ఎస్‌హెచ్‌ఆర్‌ఎం సీఈవో అచల్ ఖన్నా ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఉత్తర భారతదేశంలో ఎంబీఏలో ఇలాంటి ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
Saidulu

ఉప్పు సత్యాగ్రహ స్మారకం ప్రారంభం

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలోని దండిలో ఏర్పాటు చేసిన జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకం, మ్యూజియాన్ని ప్రధాని మోదీ జనవరి 30న ప్రారంభించారు.

Sports
Pro-Wreslting

పిన్న వయస్సులో రోహిత్ అర్ధ సెంచరీ

అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపిన్న వయస్సులో అర్ధసెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా నేపాల్‌కు చెందిన రోహిత్ పౌదల్ రికార్డు నెలకొల్పాడు. దుబాయ్‌లో జనవరి 26న యూఏఈ-నేపాల్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో 16 ఏండ్ల 146 రోజుల వయస్సు రోహిత్ 58 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ 16 ఏండ్ల 213 రోజుల వయస్సులో పాకిస్థాన్‌పై టెస్టు క్రికెట్‌లో చేసిన అర్ధ సెంచరీ రికార్డు తెరమరుగైంది. మహిళల్లో దక్షిణాఫ్రికాకు చెందిన జొమరి లాగ్టెన్‌బర్గ్ 14 ఏండ్ల వయస్సులోనే టెస్టు, వన్డేల్లో అర్ధసెంచరీలు చేసిన అతిపిన్న క్రికెటర్‌గా రికార్డులకెక్కింది.

అగ్రస్థానంలో ఒసాకా

మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) జనవరి 28న ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకోవడంతో ఆమె మూడు స్థానాలు ఎగబాకి టాప్ ప్లేస్‌కు చేరుకుంది. దీంతో ఆసియా నుంచి టాప్‌ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది.

చెస్‌కు క్రామ్నిక్ వీడ్కోలు

అంతర్జాతీయ చెస్‌కు ప్రపంచ మాజీ చాంపియన్, రష్యా స్టార్ ప్లేయర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ జనవరి 29న వీడ్కోలు పలికాడు. 2000లో గ్యారీ కాస్పరోవ్‌ను ఓడించి క్లాసికల్ విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన క్రామ్నిక్ ఆ తర్వాత రెండుసార్లు ప్రపంచ టైటిళ్లను నిలబెట్టుకున్నాడు. 1996లో నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న క్రామ్నిక్ ప్రస్తుతం ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు.

ప్రొ రెజ్లింగ్ లీగ్ విజేత హర్యానా

ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడ్ల్యూఎల్) నాలుగో సీజన్ విజేతగా హర్యానా హ్యామర్స్ జట్టు నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జనవరి 31న జరిగిన ఫైనల్లో హర్యానా హ్యామర్స్ గతేడాది విజేత పంజాబ్ రాయల్స్‌పై విజయం సాధించింది.

International

మ్యాన్ బుకర్ ప్రైజ్‌కు మ్యాన్ గ్రూప్ వీడ్కోలు

ఆంగ్ల నవలారంగంలో బ్రిటన్ అందించే అత్యున్నత పురస్కారం మ్యాన్ బుకర్ ప్రైజ్‌కు మ్యాన్ గ్రూప్ వీడ్కోలు పలుకుతున్నట్లు ఆ సంస్థ జనవరి 27న వెల్లడించింది. బుకర్ ప్రైజ్‌కు 18 ఏండ్లుగా స్పాన్సర్‌గా కొనసాగుతున్న హెడ్జ్ సంస్థ మ్యాన్ గ్రూప్.

గతించిన ఆపర్చునిటీ రోవర్

అంగారక గ్రహానికి సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని పంపిస్తూ వచ్చిన రోవర్ ఆపర్చునిటీ గతించినట్లు భావిస్తున్నామని నాసా జనవరి 28న ప్రకటించింది. పర్‌సెవరెన్స్ లోయలో ఏడు నెలల క్రితం సంభవించిన తుఫాను కారణంగా ఈ రోవర్ దెబ్బతిని ఉంటుందని తెలిపింది. 2004, జనవరి 24న ఈ రోవర్ అంగారకుడిపై దిగింది.

అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా దుబాయ్

ప్రపంచంలో అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వరుసగా ఏడోసారి నిలిచింది. 2018లో 8.91 కోట్ల మంది తమ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారని దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సీఈవో పాల్ గ్రిఫిత్స్ జనవరి 28న తెలిపారు. ఈ ప్రయాణికుల్లో ఎక్కువ మంది (1.22 కోట్ల మంది) భారతీయులు ఉన్నారు. అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా దుబాయ్ ఎయిర్‌పోర్ట్ 2014 నుంచి రికార్డులకెక్కుతుంది.

అవినీతి సూచీలో భారత్‌కు 78వ స్థానం

ప్రపంచ అవినీతి సూచీ (కరప్షన్ పర్‌సెప్షన్ ఇండెక్స్-సీపీఐ)-2018లో భారత్‌కు 78వ స్థానం దక్కింది. 180 దేశాలతో కూడిన ఈ జాబితాను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ జనవరి 30న విడుదల చేసింది. ఈ జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉండగా, న్యూజీలాండ్ రెండో స్థానంలో ఉంది. సోమాలియా చివరి స్థానంలో నిలిచింది. సిరియా, దక్షిణ సూడాన్ సంయుక్తంగా చివరి నుంచి రెండోస్థానంలో నిలిచాయి.

ఇంటర్ ఫెయిత్ కాన్ఫరెన్స్

దుబాయ్‌లో మూడు రోజుల పాటు జరుగనున్న ఇంటర్ ఫెయిత్ కాన్ఫరెన్స్ ఫిబ్రవరి 4న ప్రారంభమైంది. ఈ సదస్సుకు క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ హాజరయ్యారు. ఒక సదస్సుకు ఒక క్రైస్తవ మత గురు హాజరుకావడం ఇదే తొలిసారి. అబుదాబి యువరాజు షేక్ మహ్మద్ బిన్ జైద్ అల్ నహ్యాన్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.

1575
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles