తడబాటు వద్దు..


Mon,February 4, 2019 02:12 AM

ఇంటర్ ఎంఈసీ.. స్పష్టతతో ఈజీ
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మరో రెండువారాల్లో ప్రారంభం కానున్నాయి. ఉన్నత చదువులకు, కెరీర్ ఎంపికకు ఇంటర్ దశే ముఖ్యం కాబట్టి విద్యార్థులు ఈ పరీక్షలను చాలా సీరియస్‌గా భావిస్తారు. దాంతో చాలామంది విద్యార్థులు అనవసర ఆందోళనతో పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించాలంటే ముందునుంచే ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో చదివితే పరీక్షలు ఎదుర్కోవడం తేలికవుతుంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరాల పరీక్షలకు ఎంఈసీ కోర్సులో గణితం, అర్థశాస్త్రం, కామర్స్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్‌ను నిపుణ పాఠకుల కోసం మాస్టర్‌మైండ్స్ అకడమిక్ అడ్వైజర్ రాధ అందిస్తున్నారు.
mec

కామర్స్

- ఇంటర్ ఎంఈసీ గ్రూపులోని అన్ని సబ్జెక్టుల్లో కామర్స్ ప్రముఖమైనది. విద్యార్థి భవిష్యత్తులో కామర్స్ కోర్సులు చదవాలన్నా లేదా పోటీ పరీక్షలు రాయాలన్నా కామర్స్ వంటి ఆర్ట్స్ గ్రూపుపై పట్టు అవసరం.
- ప్రత్యేకించి భవిష్యత్తులో సీఏ, సీఎంఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు, బీకాం, ఎంకాం, ఎంబీఏ వంటి కోర్సులకు ఎంఈసీలోని సబ్జెక్టుల ఫౌండేషన్ తప్పనిసరి.
- పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తీసుకుంటే కామర్స్ అనే సబ్జెక్టు కొత్తగా పరిచయవుతుంది. దీంతో కొంతమంది విద్యార్థులు కామర్స్ అంటే భయపడతారు. కానీ మొదటి నుంచే అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకుంటే, ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చదివితే కామర్స్ సబ్జెక్టు పరీక్షను సులువుగా రాయడమే కాకుండా మంచి మార్కులు సాధించవచ్చు.
-వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించిన అనేక విషయాలను పరిచయంచేసే వేదిక కామ ర్స్. రకరకాల వ్యాపార సంబంధిత వ్యవహారాలు ఎలా నిర్వహిస్తారు. ఎలా నిర్వర్తిస్తారో విపులంగా వివరించే సబ్జెక్టు కామర్స్.
-కామర్స్ 50 మార్కులకు థియరీ, మరో 50 మార్కులకు అకౌంట్స్ మొత్తం కలిపి 100 మార్కులకు ఉంటుంది.
-కామర్స్ మొదటి ఏడాదిలో వ్యాపార భావనలు, వివిధ రకాల వ్యాపార సంస్థలు, కంపెనీ నిర్మా ణం, వ్యాపార ఆర్థిక వనరులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, వ్యాపారంలో ఉద్భవిస్తున్న ధోరణులు, బహుళ జాతీయ సంస్థలు వంటి అంశాలుంటాయి.
- కామర్స్ ద్వితీయ ఏడాదిలో వ్యవస్థాపకుడు, వ్యవస్థాపకత, స్వదేశీ, విదేశీ వర్తకం, వ్యాపార సేవలు, ఫైనాన్షియల్ మార్కెట్లు, వినియోగదారుల రక్షణ వంటి అంశాలుంటాయి.
- అకౌంటింగ్‌లో మొదటి ఏడాదిలో అకౌంటింగ్ భావనలు, ఖాతాల నిర్వహణ, జంటపద్దు విధానంలో ఖాతాల నిర్వహణ, చిట్టాలు, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ, ముగింపు లెక్కలు ఉంటాయి.
- సెకండియర్‌లో కన్‌సైన్‌మెంట్ ఖాతాలు, భాగస్వామ్య ఖాతాలు, కంపెనీ ఖాతాలు వంటివి ప్రధానంగా ఉంటాయి. అకౌంటింగ్‌లో ఒక అధ్యాయానికి ఇంకొక అధ్యాయానికి సంబం ధం ఉండదు కాబట్టి ప్రతి అధ్యాయానికి జాగ్రత్త వహించాలి.
1. ఎంఈసీలో ఉన్న అన్ని సబ్జెక్టుల్లో సులువుగా చదవగలిగిన మంచి మార్కులు సాధించగలిగిన పేపర్ కామర్స్.
2. కామర్స్, అకౌంట్స్ రెండు సబ్జెక్టులు ఒక్కొక్కటి 50 మార్కులు. రెండు కలిపి 100 మార్కులకు ఒకే పేపర్‌గా పరీక్షల్లో ఇవ్వడం జరుగుతుంది.
3. పార్ట్-ఏ కామర్స్, పార్ట్-బీ అకౌంట్స్.
4. పార్ట్-ఏ 50 మార్కులకు ప్రశ్నలు కింది విధంగా ఉంటాయి.
5. సెక్షన్-1 మొత్తం మూడు 10 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. వాటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. (Q.NO.. 1, 2, 3)
6. సెక్షన్-2లో ఐదు మార్కుల ప్రశ్నలు మొత్తం ఆరు ఇస్తారు. వాటిలో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
(Q.NO.. 4,5,6,7,8,9)
7. సెక్షన్-3లో మొత్తం ఎనిమిది 2 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. వాటిలో ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
(Q.NO.. 10, 11, 12, 13, 14, 15, 16, 17)
8. ఈ ప్రశ్నల్లో ముందుగా సెక్షన్-3 అంటే 2 మార్కుల ప్రశ్నలకు, తర్వాత 10 మార్కుల ప్రశ్నలకు, చివరగా 5 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాస్తే మంచిది.
9. 5, 10 మార్కుల ప్రశ్నలను పాయింట్ల వైజ్‌గా రాస్తే వ్యాల్యుయేషన్ సులువుగా అర్థం చేసుకోడానికి వీలవుతుంది.
10. 5, 10 మార్కుల ప్రశ్నలు రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్స్‌ను పెన్సిల్‌తో అండర్‌లైన్ చేస్తూ మధ్య మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు పెన్సిల్‌తో అండర్‌లైన్ చేయడం ద్వారా పేపర్‌ను నీటుగా ప్రజెంట్ చేయవచ్చు.
11. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వీలైనంతవరకు 5, 10 మార్కుల ప్రశ్నలకు ఇంట్రడక్షన్ రాయాలి.
12. ముందుగా అకౌంట్స్ ప్రశ్నలు రాసి తర్వాత కామర్స్ రాస్తే విద్యార్థి చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా ఉండవచ్చు.
13. సమాధాన పత్రంలో సాధ్యమైనంతవరకు కొట్టివేతలు లేకుండా రాయాలి.
14. విద్యార్థులు పాత ప్రశ్నపత్రాలను ఒకసారి చూసుకుని ఏయే ప్రశ్నలు రిపీటెడ్‌గా వస్తున్నాయో చూసుకుని వాటిపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
15. పరీక్ష హాల్లో సమయం ఉంటే అకౌంట్స్ చాయిస్ చేసి ఇంకా సమయం ఉంటే కామర్స్ 2 మార్కు ల ప్రశ్నల చాయిస్ రాయాలి.
16. ప్రశ్నలో డిఫైన్ అని అడిగితే ఆ ప్రశ్నకు డెఫినీషన్ తప్పనిసరిగా రాయాలి.
17. వ్యత్యాసాలకు సంబంధించిన ప్రశ్నలు రాసేటప్పుడు ఇంట్రడక్షన్ తప్పనిసరిగా రాయాలి.
18. ప్రశ్నకు ఎంత సమాధానం రాశామన్నదానికంటే ఎంత కరెక్ట్‌గా జవాబు రాశామన్నదే ముఖ్యం.

అకౌంట్స్‌లో ఎక్కువ మార్కులు..

- మెయిన్ పరీక్షలో కామర్స్ ప్రశ్నపత్రంలో పార్ట్-ఏగా కామర్స్ ప్రశ్నలు, పార్ట్-బీగా అకౌంట్స్ (18వ ప్రశ్న నుంచి) స్టార్ట్ అవుతాయి.
- అకౌంట్స్ సబ్జెక్టుతో పరీక్ష ప్రారంభించడం మంచిది. ఎందుకంటే కామర్స్ సబ్జెక్టు థియరీ కాబట్టి ఎక్కువ టైమ్ కావాలి. అకౌంట్స్ పార్ట్ గంటలో ముగించి కామర్స్ స్టార్ట్ చేయడం మంచిది.
- కొంతమంది సరైన అవగాహన లేక ముందుగా కామర్స్ పార్ట్‌తో స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఎక్కువ టైమ్ రాసి తర్వాత చివరి గంటలో అకౌంట్స్ పార్ట్ రాసేటప్పుడు క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ రావడానికి అవకాశం ఉంటుంది.
- ప్రశ్నపత్రంలో ప్రతి ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ చేసే ముందు జాగ్రత్తగా చదివి సరైన అవగాహన తెచ్చుకుని ఇంతకుముందు చేసిన తప్పులు జరుగకుండా చూడాలి.
-ప్రతి ప్రాబ్లమ్‌లో సొల్యూషన్ చేసేటప్పుడు అమౌంట్స్‌ను జాగ్రత్తగా రాసుకోవాలి. అంటే రాంగ్ అమౌంట్స్ రాయకుండా చూసుకోవాలి.
- అకౌంట్ పార్ట్‌లో బాగా పర్‌ఫెక్ట్‌గా ఉన్న ప్రాబ్లమ్‌తో స్టార్ట్ చేయాలి. 5 మార్కుల్లో ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయడానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 2 మార్కుల్లో ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేసి థియరీ ప్రశ్నలు రాయడం మంచిది.
- 20 మార్కుల ప్రాబ్లమ్ (జూనియర్ ఇంటర్ వారికి ఫైనల్ అకౌంట్స్, సీనియ ర్ ఇంటర్‌వారికి పార్ట్‌నర్‌షిప్ అకౌంట్స్) సొల్యూషన్ చేసేటప్పుడు పక్కపక్కన ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల చాలా టైమ్ సేవ్ అవుతుంది.
- ప్రతి ప్రాబ్లమ్‌కు పెన్సిల్‌తో నీట్‌గా ప్రొఫార్మాస్ గీసి, హెడ్డింగ్స్ కోసం బ్లాక్ పెన్, ప్రాబ్లమ్ చేయడానికి బ్లూపెన్ వాడాలి.
- అకౌంట్స్ పార్ట్‌లో ఎక్కువ మందికి క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో క్యాలిక్యులేటర్లను అనుమతించరు. కాబట్టి క్యాలిక్యులేషన్ల విషయంలో జాగ్రత్త వహించాలి.
- అమౌంట్స్ రాసేటప్పుడు ఒక ఆర్డర్‌లో రాసుకుంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటుంది, మిస్టేక్స్ తగ్గే అవకాశం ఉంటుంది.
- ప్రతి సెక్షన్‌లో రాయాల్సిన వాటిని
(చాయిస్ ప్రకారం) కచ్చితంగా రాయాలి. అంటే 50 మార్కులను కంప్లీట్‌గా అటెంప్ట్ చేయాలి.
- పరీక్ష పూర్తయ్యే ముందు చివరి 10 నిమిషాల్లో అన్ని సమాధానాలను, క్యాలిక్యులేషన్స్‌ను ఒకసారి సరిచూసుకోవాలి.
- అకౌంట్స్ 50 మార్కులు, కామర్స్ 50 మార్కులు రాయడం పూర్తయిన తర్వాత ఇంకా టైమ్ మిగిలితే అకౌంట్స్‌లో చాయిస్ రాయడం మంచిది. 10, 5, 2, మార్కుల ప్రశ్నల్లో డౌట్‌గా ఉన్నవాటికి చాయిస్ రాయాలి.
జూనియర్ ఇంటర్‌లో
- ఫైనల్ అకౌంట్స్ చాప్టర్‌లో రాని బాకీలు, రాని బాకీల నిధి, స్థిరాస్తులపై తరుగుదల వంటి సర్దుబాట్ల విషయంలో జాగ్రత్త వహించాలి.
- మూడు వరుసల నగదు చిట్టా చేసేటప్పుడు ఎదురు పద్దుల విషయంలో జాగ్రత్తగా రాయాలి.
- బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీలో నగదు పుస్తకంలో జరిగిన తప్పులను అలాగే పాస్‌బుక్‌లో జరిగిన తప్పులను లెక్కలో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి.
- సహాయక చిట్టాల తయారీ విషయంలో వర్తకపు డిస్కౌంట్‌ని లెక్కించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- వ్యక్తిగత ఖాతాను తయారుచేసేటప్పుడు ప్రారంభ నిల్వ విషయంలో అలాగే ఖాతా ముగింపు విషయంలో లెక్కలో ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా గమనించాలి.

సీనియర్ ఇంటర్‌లో

- భాగస్వామ్య ఖాతాలు తయారుచేసేటప్పుడు గుడ్‌విల్ ఖాతా విషయంలో, మూలధన ఖాతాల విషయంలో, పునర్‌మూల్యాంకన ఖాతా విషయంలో జాగ్రత్త వహించాలి.
- కన్‌సైన్‌మెంట్ ఖాతాల తయారీలో ముగింపు సరుకు లెక్కింపులో జాగ్రత్తగా ఉండాలి.
- వ్యాపారేతర సంస్థల ఖాతాల విషయంలో ఆదా య వ్యయాల ఖాతా తయారుచేసేటప్పుడు రాబడి అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. మూలధన అంశాలను వదిలివేయాలి.
- తరుగుదల ఖాతాల్లో ఆస్తి ఖాతా తయారుచేసేటప్పుడు తరుగుదల ఎన్ని నెలలకు లెక్కించాలనే విషయంలో, వర్తకపు బిల్లుల విషయంలో డిస్కౌంట్ లెక్కించే విషయం జాగ్రత్తగా పరిశీలించాలి.
- ఒంటిపద్దు విధానం చాప్టర్‌లో లాభనష్టాల నివేదిక తయారీలో ముగింపు మూలధనంతో ప్రారంభించాలి.

మ్యాథమెటిక్స్

- ఎంపీసీ గ్రూప్‌లో ఉండే మ్యాథ్స్, ఎంఈసీ గ్రూప్‌లో ఉండే మ్యాథ్స్ ఒకటే. ఇంటర్ ఎంఈసీ గ్రూప్‌లో మ్యాథ్స్ సబ్జెక్టు ఉండటంవల్లనే ఎంఈసీ కోర్సు చదివిన వారికి భవిష్యత్తులో ఏ కోర్సు అయినా చదువుకునే వీలు కలిగింది. ఎంఈసీలో మ్యాథ్స్ కీలకమైన సబ్జెక్టు. మొదటి ఏడాది 100 మార్కులకు రెండు పేపర్లు (1ఎ, 1బి) ఉంటాయి. రెండో ఏడాదిలోనూ ఇదేవిధంగా రెండు పేపర్లు ఉంటాయి.
-మ్యాథ్స్ పేపర్ మొత్తం మూడు విభాగాలుగా ఉంటుంది. అవి సెక్షన్-ఎ, సెక్షన్-బి, సెక్షన్-సి. ముందుగా 7 మార్కుల ప్రశ్నలు, తర్వాత నాలుగు మార్కుల ప్రశ్నలు, ఆ తర్వాత రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు ఇచ్చిన డాటా, కంక్లూజన్ రాసినందుకు ప్రత్యేక మార్కులు ఉంటాయి. కాబట్టి వీటిపై శ్రద్ధపెట్టాలి. డెఫినిషన్స్, థియరీకి సంబంధించిన ప్రశ్నలు బాగా చదవాలి. ఫార్ములాలు ఉన్న ప్రశ్నలకు తప్పనిసరిగా ఫార్ములా రాస్తూ, అవసరమైన ప్రతిచోట డయాగ్రమ్స్ గీస్తూ మంచి ప్రజంటేషన్ చూపితే మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కులు పొందవచ్చు.

జూనియర్ ఇంటర్

మ్యాథ్స్-1A లో ఎక్కువ మార్కులు సాధించాలంటే..
- ఫంక్షన్స్, వెక్టార్ ఆల్జీబ్రా, మ్యాట్రిక్స్, Trigonometric ratios వంటి చాప్టర్ల నుంచి రెండు మార్కుల ప్రశ్నలు వస్తాయి.
- మ్యాథమెటికల్ ఇండక్షన్ చాప్టర్లో వివిధ ఫార్ములాలపై పట్టు సాధించాలి. ఈ ప్రశ్న కంక్లూజన్ స్టెప్‌పై దృష్టిపెట్టాలి.
- ఫంక్షన్స్ థియరమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది థియరిటికల్ ప్రశ్న కాబట్టి ఏ తప్పు లేకుండా రాయాలి.
- మ్యాట్రిసెస్‌లో డెఫినిషన్స్, డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్, Consistant, Inconsistant Problems, CRAMERS రూల్, Matix Inversion Method, Gouss Jordan Problems బాగా ప్రాక్టీస్ చేయాలి.
- ఆడిషన్ ఆఫ్ వెక్టార్స్‌లో Collinear, Coplanarకు సంబంధించిన ప్రశ్నలపై పట్టు సాధిస్తూ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్‌లో Distance b/w Skew Lines Problems, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ థియరమ్ బాగా ప్రాక్టీస్ చేయాలి.
- Trigonometry ఫార్ములాలపై బాగా పట్టు సాధించాలి.
- ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చాప్టర్‌లో సైడ్స్ ఇచ్చినప్పుడు ఇన్ రేడియస్, ఎక్స్ రేడియస్, సర్కమ్ రేడియస్‌లు కనుగొనడం బాగా ప్రాక్టీస్ చేయాలి.

మ్యాథ్స్-1B లో ఎక్కువ మార్కులు సాధించాలంటే

- మ్యాథ్స్-1బి లో రెండు మార్కుల ప్రశ్నలు బాగా రాయాలంటే స్ట్రెయిట్ లైన్స్, లిమిట్స్ అండ్ కంటిన్యుటీ, డెరివేటివ్స్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలి.
- లోకస్, ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, లిమిట్స్ అండ్ కంటిన్యుటీ, Derivative of The Funtion using first Priniciple Problems పై శ్రద్ధ పెడితే నాలుగు మార్కుల సెక్షన్‌లో గరిష్ట మార్కులు సాధించవచ్చు.
- స్ట్రెయిట్‌లైన్స్‌లో సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ ప్రాబ్లమ్స్, ఫుట్ ఆఫ్ ద పర్‌పెండిక్యులర్, ఇమేజ్ థియరమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి.
- పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్‌లైన్స్ చాప్టర్‌లో థియరమ్స్, హోమోజెనిసింగ్ కాన్సెప్ట్స్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి.
- Angle b/w Two Lines by Using DRs & DCs పై శ్రద్ధపెట్టాలి.
- అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నందు టాంజెంట్ అండ్ నార్మల్ కాన్సెప్ట్‌లో Angle b/w Two Curves పై శ్రద్ధ పెడుతూ.. Maxima & Minima Concept కు సంబంధించిన కోన్, సిలిండర్, Sphere రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ చాప్టర్లోని సమాధానాలకు అవసరమైనచోట ప్రమాణాలు పెట్టాలి.
- జూనియర్ ఇంటర్ క్యాలిక్యులస్ ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే Trigonometry, డెరివేటివ్ ఫార్ములాలపై పట్టు సాధించాలి.

సీనియర్ ఇంటర్

మ్యాథ్స్-2A లో ఎక్కువ మార్కులు సాధించాలంటే..
- రెండు మార్కుల ప్రశ్నలు కాంప్లెక్స్ నంబర్స్, Permutations & Combinations మొదలైన చాప్టర్ల నుంచి ఎక్కువ వస్తాయి.
-క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్‌పై శ్రద్ధ పెట్టడంవల్ల నాలుగు మార్కుల విభాగంలో గరిష్ట మార్కులు సాధించవచ్చు.
- Permutations & Combinations చాప్టర్‌లో Sum of the digits, Rank of the given word problems పై శ్రద్ధ పెట్టాలి. కాంబినేషన్స్ కాన్సెప్ట్‌కు సంబంధించి టీమ్ సెలక్షన్ ప్రాబ్లమ్స్‌పై పట్టు సాధించాలి. ఈ చాప్టర్లోని ప్రశ్నలకు స్టెప్స్ రాయాలి. డైరెక్ట్ స్టెప్స్ రాయకూడదు. కొత్తగా ప్రవేశపెట్టిన Palindrome మొదలైన అంశాలపై లెక్కలు తప్పనిసరిగా చేయాలి.
- థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చాప్టర్‌లో relation between the roots and coefficients, మల్టిపుల్ రూట్స్, రెసిప్రోకల్ ఈక్వేషన్ కాన్సెప్ట్‌కు సంబంధించిన ప్రశ్నలపై పట్టు సాధించాలి.
- బైనామియల్ థియరమ్‌లో రేషనల్ ఇండెక్స్ ప్రాబ్లమ్స్‌పై పట్టు సాధించాలి. number of terms in a Binominal and Trinomial expansions, జనరల్ టర్మ్, ఇండిపెండెంట్ టర్మ్, మిడిల్ టర్మ్, Binomial Coefficientsకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌పై పట్టు సాధించాలి.
- ప్రాబబిలిటీ చాప్టర్‌లో ఆడిషన్ థియరమ్, మల్టిప్లికేషన్ థియరమ్, Bays థియరమ్ వాటికి సంబంధించిన అప్లికేషన్స్‌పై పట్టు సాధించాలి.
- De-moivres థియరమ్, రాండమ్ వేరియబుల్స్ చాప్టర్లలో చాలా సులభమైన ప్రశ్నలు అడుగుతారు. అందువల్ల వాటిపై శ్రద్ధపెట్టాలి.

మ్యాథ్స్-2B లో ఎక్కువ మార్కులు సాధించాలంటే..

- మ్యాథ్స్-2బి లో రెండు మార్కుల ప్రశ్నలు బాగా రాయాలంటే సర్కిల్స్, Consic Section, ఇంటిగ్రేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి.
- సర్కిల్స్, ఇంటిగ్రేషన్స్, డెఫినైట్ ఇంటిగ్రేషన్స్ చాప్టర్ల నుంచి 55 మార్కుల వరకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
- సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, కోనిక్ సెక్షన్‌పై శ్రద్ధపెట్టడం వల్ల సెక్షన్-బిలో గరిష్ట మార్కులు సాధించవచ్చు.
- సర్కిల్స్‌లో Concyclic Points, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, Transverse Common Tangents of given Two Circles పై దృష్టిపెట్టాలి.
-కోనిక్ సెక్షన్‌లో Parabola Standard Form, Properties of Ellipse, Hyper bola పై పట్టు సాధించాలి.
- డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్లో ఉన్న నాలుగు మెథడ్స్ (వేరియబుల్-సెపరేబుల్, హోమోజీనియస్, నాన్‌హోమోజీనియస్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్), Order & Degree of Differential Equations పై పట్టు సాధించాలి.
- సీనియర్ ఇంటర్ క్యాలిక్యులస్ ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే Trigonometry, డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్ ఫార్ములాలపై పట్టు సాధించాలి.

ఎకనామిక్స్

ఇంటర్మీడియట్‌లో ఎకనామిక్స్ అంటే చాలా కష్టమైన సబ్జెక్టు అనుకుంటారు. అయితే పాఠం చెప్పేటప్పుడు ప్రాథమిక అంశాలు అర్థమైతే ఎకనామిక్స్ అంత తేలికైన సబ్జెక్టు మరొకటి లేదు.
- ఫస్టియర్ ఎకనామిక్స్ సిలబస్‌లో 10 యూనిట్లు ఉన్నాయి. అవి ఉపోద్ఘాతం, వినియోగ సిద్ధాంతం, ఉత్పత్తి సిద్ధాంతం, విలువ సిద్ధాంతం, పంపిణీ సిద్ధాంతం, జాతీయ ఆదాయం, స్థూల ఆర్థిక అంశాలు, ద్రవ్యం-బ్యాంకింగ్-ద్రవ్యోల్బణం, ఆర్థికశాస్త్రం-గణాంకశాస్త్రం.
- సెకండియర్‌లో ఆర్థికాభివృద్ధి, ఆర్థికవృద్ధి, జనాభా, మానవ వనరుల అభివృద్ధి, జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, తృతీయ రంగం, సేవల రంగం, ప్రణాళిక-ఆర్థిక సంస్కరణలు, పర్యావరణం-సుస్థిర ఆర్థికాభివృద్ధి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ-లక్షణాలు వంటి అంశాలుంటాయి.
- పరీక్షలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే ప్రతి అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదవాలి. దేనిని చాయిస్‌గా వదిలివేయకూడదు.
- ఫస్టియర్‌లో వినియోగ సిద్ధాంతాలు, డిమాండ్, ఉత్పత్తి, విలువ సిద్ధాంతం, జాతీయాదాయం, స్థూల ఆర్థిక అంశాలు వంటి చాప్టర్లపై పట్టు సాధించాలి.
- సెకండియర్‌కు సంబంధించి ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, ప్రణాళికలు, పర్యావరణం, జనాభా మానవ వనరుల అభివృద్ధి, జాతీ యాదాయం, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి చాప్టర్లపై మంచి పట్టు ఉండాలి.
జూనియర్ ఇంటర్ విద్యార్థులకు..
- మంచి మార్కులు సాధించాలనుకునే విద్యార్థులు ముందుగా సమాధానాలపై పట్టు సాధించాలి.
- ఎస్సేలు రాసేటప్పుడు ఇంట్రడక్షన్, డెఫినిషన్లు తప్పులేకుండా రాయాలి. పట్టికలు, డయాగ్రమ్స్ తప్పుల్లేకుండా వేయాలి.
- 10 మార్కుల ప్రశ్నలు రాసిన తర్వాత రెండు మార్కులు, ఆ తర్వాత 5 మార్కుల ప్రశ్నలు రాస్తే సమయం కలిసి వస్తుంది.
- పటాలు ఉన్న ప్రశ్నలు రాస్తే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది.
- ప్రశ్నల సంఖ్య స్పష్టంగా కనబడేటట్లు వేయాలి.

ముఖ్యమైన ప్రశ్నలు (10 మార్కులు)

1. క్షీణోపాంత ప్రయోజన సూత్రం పరిమితులను పరిశీలించండి. దాని ప్రాధాన్యతను విశ్లేషించండి.
2. ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణద్వారా వినియోగదారుని సమతౌల్యాన్ని విపులీకరించండి.
3. సమోపాంత ప్రయోజన సూత్రం సహాయంతో వినియోగదారుని సమతౌల్యాన్ని విపులీకరించండి.
4. చరానుపాత సూత్రాన్ని విమర్శణాత్మకంగా పరిశీలించండి.
5. తరహాననుసరించి ప్రతిఫలాల సూత్రాన్ని వివరించండి.
6. అంతర్గత ఆదాలు, బహిర్గత ఆదాలను విశదీకరించండి.
7. మార్కెట్ల వర్గీకరణను విశదీకరించండి.
8. పరిపూర్ణ పోటీ మార్కెట్‌లో ధరనిర్ణయ విధానాన్ని వివరించండి.
9. ఏకస్వామ్యంలో ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో వివరించండి.
10. జాతీయాదాయాన్ని నిర్వచింది దాని వివిధ భావనలను వివరించండి.

ముఖ్యమైన ప్రశ్నలు (5 మార్కులు)

1. ప్రయోజనం అంటే ఏమిటి? అవి ఎన్ని రకాలు?
2. కోర్కెల లక్షణాలను విశ్లేషించండి.
3. కొరత నిర్వచనం గురించి వివరించండి.
4. ఉదాసీనత వక్రరేఖల లక్షణాలు వివరించండి.
5. డిమాండ్‌ను నిర్ణయించే కారకాలు ఏవి?
6. డిమాండ్ సూత్రాన్ని వివరించండి.
7. డిమాండ్ సూత్రానికి గల మినహాయింపులను విపులీకరించండి.
8. డిమాండ్ రేఖ రుణాత్మక వాలుకుగల కారణాలను విపులీకరించండి.
9. ధర-డిమాండ్ వ్యాకోచత్వంలోని రకాలను వివరించండి.
10. ధర-డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలు ఏవి?

సీనియర్ ఇంటర్ విద్యార్థులకు..

- పరీక్ష రాసేటప్పుటు పాఠ్యపుస్తకంలో ఉన్న సైడ్ హెడ్డింగ్స్ రాసి అండర్‌లైన్ చేయాలి.
- ముందుగా 10 మార్కులు ప్రశ్నలు రాసి, తర్వాత 2 మార్కులు, 5 మార్కుల ప్రశ్నలు రాయాలి.
- ఆర్థికవృద్ధి-ఆర్థికాభివృద్ధి, జనాభా మానవ వనరుల అభివృద్ధి, వ్యసాయరంగం, పారిశ్రామిక రంగం, జాతీయాదాయం చాప్లర్ల నుంచి ఎస్సే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
- మిగిలిన చాప్టర్ల నుంచి 5 మార్కుల ప్రశ్నలు వస్తాయి. అయితే ప్రశ్నపత్రం తయారీలో వెయిటేజీ కచ్చితంగా పాటిస్తారని చెప్పలేం. కాబట్టి అన్ని చాప్టర్లను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
-పట్టికలు, డాటా తప్పులు లేకుండా వేయాలి.

ముఖ్యమైన ప్రశ్నలు (10 మార్కులు)

1. ఆర్థికవృద్ధి-ఆర్థికాభివృద్ధి భావనలను గురించి వివరించండి. వాటి మధ్య తారతమ్యాలు ఏవి?
2. భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను విమర్శణాత్మకంగా విశ్లేషించండి.
3. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని వివరించండి.
4. భారతదేశంలో జనాభా వేగంగా పెరగడానికి కారణం ఏమిటి?
5. జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏవి?
6. ఆర్థికాభివృద్ధిలో విద్యకున్న పాత్రను పరిశీలించండి.
7. ఆదాయ-సంపద పంపిణీలోని అసమానతలను ఏ విధంగా తగ్గించవచ్చు?
8. భారతదేశంలో పేదరిక నివారణా చర్యలను వివరించండి.
9. వ్యవసాయరంగంలో తక్కువ ఉత్పాదకతకు గల కారణాలను విశదీకరించండి. ఉత్పాదకతను పెంచేందుకు చేపట్టవలసిన చర్యలు ఏవి?
10. గ్రామీణ రుణగ్రస్తతకు గల కారణాలు, వాటిని సరిదిద్దడానికి తీసుకునే చర్యలను పరిశీలించండి.
ముఖ్యమైన ప్రశ్నలు (5 మార్కులు)
1. జాతీయాదాయంలో రంగాల వారీ వాటాలను సంక్షిప్తంగా పరిశీలించండి.
2. ఆదాయ-సంపద పంపిణీలోని అసమానతలకు గల ప్రధాన కారణాలేవి?
3. వివిధ నిరుద్యోగిత రకాలను పరిశీలించండి.
4. నీతి ఆయోగ్‌పై లఘు వ్యాఖ్యను రాయండి.
5. సంతులిత ప్రాంతీయాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించండి.
6. వ్యవసాయ పరపతికి గల ఆధారాలను సంక్షిప్తంగా వివరించండి.
7. ఎన్‌ఏబీఏఆర్డీ విధులు వివరించండి.
8. భారతదేశంలో పంటల తీరును పరిశీలించండి.
9. ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్) భారతదేశ పారిశ్రామికాభివృద్ధికి ఎలా దోహదం చేస్తాయి?
10. తెలంగాణలోని విద్యా విధానాన్ని విపులీకరించండి.
radha-ca

1622
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles