దేశంలో ఉరిశిక్షలు- విచారణలు


Wed,January 9, 2019 01:28 AM

Hanging

- సిక్కుల ఊచకోత (1984 ) కేసులో 34 ఏండ్ల విచారణ అనంతరం ఢిల్లీ పాటియాల హైకోర్టు యశ్‌పాల్‌సింగ్‌ను దోషిగా పేర్కొంటూ మరణశిక్ష విధించింది. మరో కేసులో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని అత్యంత కిరాతకంగా హత్యచేసిన చన్నూలాల్ వర్మ అనే వ్యక్తికి దిగువ న్యాయస్థానాలు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్పుచేస్తూ జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.
- చన్నూలాల్ వర్మ కేసులో తీర్పును మరణశిక్ష నుంచి జీవితఖైదుగా మార్చిన విషయంలో న్యాయమూర్తులు అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తపర్చగా.. మరణశిక్ష, దాని సమకాలీన ఔచిత్యంపట్ల భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా జస్టిస్ కురియన్ జోసెఫ్ తీర్పు ఇచ్చే సమయంలో భారత న్యాయ కమిషన్ 262వ నివేదికను ఉటంకిస్తూ.. బచ్చన్‌సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసులో మరణశిక్ష విధించడం అనే విషయంలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును, దాని రాజ్యాంగ స్ఫూర్తిని న్యాయస్థానాలు మరణశిక్ష విధించడంలో ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు కనిపించడం లేదని, పైగా శిక్షల విధింపులో రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ ఉండాలనే లక్ష్యాన్ని మరణశిక్షల విషయంలో కూడా పాటించాలని, సదరు లక్ష్యాన్ని సాధించలేక వైఫల్యం చెందుతున్నామని పేర్కొన్నారు. కాబట్టి నేటి సమకాలీన పరిస్థితిలో మరణశిక్ష అవసరం, ఉద్దేశం, అమలు, ఔచిత్యం వంటి అంశాలను సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అంతేకాకుండా చట్టాల్లో ఈ మరణశిక్ష ఉన్నంతకాలం దాన్ని విధించడానికి తగిన పరిస్థితులు, ఆధారాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడమేగాక, తమ తీర్పుల ఔచిత్యాన్ని ఆంతర్మథనం చేసుకుని సమర్థించుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీద ఉందని జస్టిస్ జోసఫ్ పేర్కొన్నారు. దీనికి తోడు న్యాయమూర్తులు తిరిగి రద్దు చేయలేని మరణశిక్షను విధించినప్పుడు.. దాన్ని రద్దు చేయగలిగే లేదా మార్పుచేసి క్షమాభిక్షపెట్టే అధికారం ఉన్న రాష్ట్రపతి నిర్ణయం తెలిపేవరకు శిక్షపడిన వ్యక్తి జీవన్మరణాల మధ్య అస్థిరస్థితిలో ఊగిసలాడుతూ అనుభవించే మనోవేదనను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. కానీ మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం.. 1980లో బచ్చన్‌సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయాన్ని పునరుద్ఘాటిస్తూ జస్టిస్ కురియన్ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దీంతో నేర న్యాయవ్యవస్థలో మరణశిక్ష, దాని అవశ్యకత, మానవహక్కులు, సంక్షేమరాజ్య యుగంలో దాని ఔచిత్యంపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది.

- మానవ సంక్షేమం, సుఖజీవనం, రక్షణను గరిష్ఠం చేసుకోవడానికి ఏర్పర్చుకున్న అత్యున్నత సాంఘిక వ్యవస్థే సమాజం. ఈ సమాజానికి నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం అయిన మానవుడిని.. సమాజంలో ప్రజలందరూ తమ సమష్ఠి ఏకాభిప్రాయం ఫలితంగా రూపొందించిన చట్టం ద్వారా అతని మానవీయ ఉనికిని, సాంఘిక ఉనికిని అంతం చేయడమే మరణశిక్షగా చెప్పవచ్చు.
- సాంఘిక జీవనంలో సమాజం గర్హించే చర్యలు చేసే వ్యక్తులను శిక్షించినప్పుడు శాంతిభద్రతలు రక్షించబడి ప్రజాసంక్షేమం సుస్థాపితం అవుతుంది. అయితే అలా విధించే శిక్షలు ఎలా ఉండాలి? వాటి అంతిమ ఉద్దేశం ఏమిటి? అనే విషయంలో వివిధ సిద్ధాంతాలను పరిశీలిస్తే...
- సిద్ధాంతాలు ఏం పేర్కొన్నప్పటికీ ఉదార ప్రజాస్వామ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేటి ప్రపంచ దృక్కోణం నుంచి పరిశీలించినట్లయితే.. బాగా అభివృద్ధి చెందిన దేశాలతోపాటు స్కాండినేవియన్ దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు మరణశిక్షను రద్దుచేశాయి. మరోవైపు అమెరికా, జపాన్ వంటి దేశాలు మాత్రం మరణశిక్షను ఇంకా విధిస్తూనే ఉన్నాయి.

- అభివృద్ధి చెందుతున్న మెక్సికో, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, ఫిలిప్పీన్స్, ఉరుగ్వే, పరాగ్వే, తుర్కెమెనిస్థాన్, కొలంబియా వంటి దేశాలు మరణశిక్షను పూర్తిగా రద్దు చేశాయి. కానీ బ్రెజిల్, చిలీ, పెరూ, కజకిస్థాన్ వంటి దేశాలు యుద్ధకాలంలో జరిగే నేరాలు, జాతుల సంఘర్షణలలో జరిగే ఊచకోతలకే మరణశిక్షలను పరిమితంచేసి అమలు చేస్తున్నాయి. అయితే ప్రధాన వర్ధమానదేశాలైన భారత్, చైనా, ఇండోనేషియా, పాకిస్థాన్, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలు, అరేబియా ద్వీపకల్పంలోని అన్ని అరబ్ దేశాలు, ఇరాన్, ఇరాక్, ఈశాన్య ఆఫ్రికా ఖండ దేశాలు మాత్రం మరణశిక్షను విధించడం కొనసాగిస్తున్నాయి.
- 21వ శతాబ్దంలో మరణశిక్షకు స్థానం లేదని, ఉండరాదని దీనికోసం ప్రపంచ దేశాలు కృషిచేయాలని ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ పిలుపునిచ్చారు. యూఎన్‌వో మానవహక్కుల హైకమిషనర్ కార్యాలయం సూచన మేరకు ఐక్యరాజ్యసమితి సాధారణసభ 2007లో మొదటిసారి మరణశిక్షల విధింపుపై మారిటోరియం విధించే వార్షిక తీర్మానాన్ని సైతం ఆమోదించింది. 2018, అక్టోబర్ 10న 16వ ప్రపంచ మరణశిక్షల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరణశిక్షలను రద్దు చేయాలని ప్రస్తుత యూఎన్‌వో సెక్రటరీ జనరల్ ఆంటోని గుటరెస్ పిలుపునిచ్చారు. దీంతోపాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్‌రైట్స్ వాచ్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా మరణశిక్ష అనాగరికం అని పేర్కొన్నాయి.

- ప్రాచీన భారతీయ సమాజంలో రాజ్యం ఆవిర్భవించినప్ప టి నుంచి బ్రాహ్మణ, వైదిక ధర్మాలు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్కృతి, ఇతర మత న్యాయసూత్ర గ్రంథాలు, సూత్రాల ఆధారంగా జరిగిన రాజ్యపాలనలో మరణశిక్ష అత్యంత సహజమైన విషయం.
- మధ్యయుగాల్లో రాజ్యపాలకులైన ముస్లిం రాజుల రాజ్యం లో, దక్షిణ భారతదేశంలో సైతం మతగ్రంథాల ఆధారంగా న్యాయపాలన జరిగింది. ఫలితంగా మరణశిక్షలు ఈ యుగంలో కూడా కొనసాగాయి. మధ్యయుగాలలో మరణశిక్ష పడిన ఖైదీలను నరబలులు ఇవ్వడానికి వినియోగించిన అమానవీయ చర్యలు విజయనగర సామ్రాజ్య చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నాయి.
- ఆధునిక యుగంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులు నేరన్యాయ విధానంలో చట్టాలను క్రోడీకరించి, భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), పౌర శిక్షాస్మృతి (సీపీసీ), క్రిమినల్ పీసీ, నేర విచారణలో దివ్యపద్ధతుల స్థానంలో జ్యూరీ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ తమ వలసపాలనను ప్రశ్నించినవారికి, ఎదిరించినవారికి మరణశిక్షలు రాజద్రోహం పేరుతో అమలు చేశారు. నేటికి భారతీయ శిక్షా సృ్మతి సెక్షన్ 302 (హత్య), 396 (దోపిడి హత్య) వంటి నేరాలకు బ్రిటిష్ వారి చట్టం ద్వారానే మరణశిక్షలు విధిస్తున్నారు.

- స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, పూర్వ బ్రిటిష్ చట్టాల ప్రకారం మరణశిక్ష విధింపు రాజ్యాంగ ఔచిత్యాన్ని పరిశీలించాల్సిన పరిస్థితులు దేశ న్యాయవ్యవస్థ ముందుకు వచ్చాయి.
- మానవ సంక్షేమం, ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడిన సమాజం అనే సాంఘిక వ్యవస్థను పాలించడానికి ఉద్భవించిన రాజ్యానికి.. సమాజానికి నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణంగా ఉన్న మానవుడి జీవించే హక్కు ను హరించే అధికారం లేదని మానవతావాదులు, మానవహక్కుల ఉద్యమకారుల వాదన. నేటి కాలంలో ఇంకా మరణశిక్షలను కొనసాగిస్తే అది తిరిగి ప్రాచీన, మధ్యయుగాల్లో మానవుడి జీవించే హక్కును హరించడానికి పాలకులు వినియోగించిన రాబిన్ స్పియర్ గిలెటన్ సాధనంవలె ఆధునిక రాజ్యం వ్యవహరిస్తున్నట్లు అవుతుంది.
- సమాజంలో ఏదైనా నేరం జరిగితే ఆ నేరం చేసిన వ్యక్తి మాత్రమే దానికి బాధ్యుడు కాదు. ఆ వ్యక్తిని పురికొల్పిన కాలమాన పరిస్థితుల పాత్ర కూడా ఉంటుందని రాబర్ట్ కె మర్టన్ అనే సామాజిక శాస్త్రవేత్త తన సాంఘిక వ్యవస్థ సిద్ధాంతంలో శాస్త్రీయంగా వివరించారు. కాబట్టి ఒక నేరానికి శిక్ష పేరుతో అదేవిధమైన నేరాన్ని చట్టం ద్వారా అధికారంగా జరిపించడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
- భారత్ వంటి వర్తమాన దేశాల్లో నేర న్యాయవ్యవస్థ, పోలీస్ విచారణ వ్యవస్థల సామర్థ్యం, ప్రభావశీలత ఆశించినస్థాయిలో లేదు. పైగా న్యాయం ఎంతో ఖరీదైన, అధిక సమయాభావంతో కూడుకున్న విషయం. కాబట్టి భారత్‌లో మరణశిక్ష విధింపువల్ల పేద, బడుగు, బలహీన వర్గాలవారే ప్రతికూల ప్రభావానికి గురవుతారు.

World-Coalition-Agains
- ప్రతిబంధన సిద్ధాంతం (Deterrant Theory): నేరాగాళ్లను శిక్షించడం ద్వారా సమాజంలోని ఇతరులకు నేరం, దానికి విధించే శిక్ష, పర్యవసానాలను తెలియజేయడ.., భవిష్యత్‌లో నేరం జరిగే అవకాశమున్న పరిస్థితులు, ఆ నేరం చేసే స్వభావంగల వ్యక్తులను ప్రతిబంధీకరించడం ఈ సిద్ధాంతం ముఖ్య ఉద్దేశం.
- నిరోధక సిద్ధాంతం: నేరం చేసిన వ్యక్తులను, నేరం చేసే అవకాశం ఉన్న వ్యక్తులను నిర్బంధించడం ద్వారా నేరాలు జరిగే అవకాశాన్ని నిరోధించడమే శిక్షల అంతిమ ధ్యేయంగా ఉండాలని ఇది పేర్కొంటుంది.
- సంస్కరణ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం.. సమాజంలో నేరం జరగడానికి, దానికి కారకుడైన మానవుడి వ్యక్తిత్వం, ఆ నేరానికి మానవుడిని పురికొల్పిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మధ్య సంఘర్షనే కారణం. అలాంటి ప్రతికూల పరిస్థితులను, దాని ప్రభావానికిలోనైన వ్యక్తులను సంస్కరించి తిరిగి వారి కి సాంఘిక జీవనంలో అవకాశం కల్పించడమే శిక్షల విధింపు పరమావధిగా ఉండాలని తెలుపుతుంది.
- ప్రతీకార న్యాయసిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం నేరం చేసిన వ్యక్తి ఆ నేరం ప్రతికూల ప్రభావాన్ని అతను అనుభవించే విధంగా శిక్ష విధించడం, కొన్ని ప్రతీకార చర్యల ద్వారా బాధితులకు న్యాయం చేకూర్చడం అంతిమ ఉద్దేశంగా ఉంటుంది. కానీ ఇది గతించిన ఆటవిక సమాజ లక్షణం.
- నష్ట పరిహార సిద్ధాంతం: శిక్ష ఉద్దేశం కేవలం నేరాలను నిరోధించడమే కాదు, ఆ నేరంవల్ల బాధితులకు జరిగిన నష్టానికి పరిహారాన్ని సైతం కల్పించడం. దీనివల్ల నేరం చేయడం ద్వారా వ్యక్తులు పొందాలనుకున్న ప్రయోజనాలను కనిష్ఠం చేస్తారు. ఈ సిద్ధాంతం ప్రకారం నేరం చేయాలనే ఆలోచనను నశింపచేయడమే శిక్ష లక్ష్యం.

- అనంతర కాలంలో 1980 బచ్చన్‌సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు.. అత్యంత అరుదైన కేసులోనే మరణశిక్ష విధించాలి అని మరణశిక్ష విధింపు విషయంలో ఒక ప్రామాణికతకు పునాదిరాయి వంటి తీర్పును ఇచ్చింది.
- ఈ తీర్పు తదనంతర కాలంలో దేశంలో మానవహక్కులు, పౌరహక్కుల పరిధి విస్తృతం అవుతూ రాజ్యాంగ అధికరణ 21 కింద జీవించే హక్కు పరిధి సునిశితమైన గోప్యత హక్కు, శుభ్రమైన వాతావరణం, తాగునీరు, చివరకు నిద్రించడం కూడా ఒక హక్కు అనేంతటి లోతైన అర్థాన్ని అన్వయిస్తున్న తరుణంలో మరణశిక్ష ఔచిత్యం తగ్గుతూ వస్తుంది. గత 13 ఏండ్లలో భారత్‌లో అమలైన మరణశిక్షలు కేవలం నాలుగు మాత్రమే అనేది దీనికి నిదర్శనం. భారత న్యాయ కమిషన్ 35వ నివేదికలో మరణశిక్షలను కొనసాగించాలని సూచించగా.. అదే న్యాయకమిషన్ తన 262వ నివేదికలో మాత్రం సాధారణ నేరాలకు మరణశిక్ష నిరపేక్షంగా అమలు చేయరాదని, అలా అని దాని అమలును పూర్తి నిరపేక్షంగా రద్దు చేయరాదని సూచించింది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదికల ప్రకారం 1990 ఏడాది నుంచి క్రూరహత్యల తగ్గుదల నమోదువుతుండగా.. మరోవైపు ఉరిశిక్షల అమలు సంఖ్యలో కూడా తగ్గుదల నమోదవుతూ ఉంది. ఇది కూడా మరణశిక్ష ఔచిత్యం తగ్గడాన్ని సూచిస్తుంది. అంటే ఉరిశిక్షలు విధించడం వల్లనే క్రూరనేరాలు తగ్గుతాయి అనడంలో శాస్త్రీయత లేదని, నేరానికి ఎన్నో కారణాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.

gavel-scale-book
- జగన్‌మోహన్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేసులో మొదటిసారి ఐపీసీ సెక్షన్ 302 కింద విధించిన మరణశిక్షతో వ్యక్తికి రాజ్యాంగ అధికరణ 19 (1) (ఎ) నుంచి (జి) వరకు కల్పించిన హక్కులు హరించవేయబడతాయని, పైగా ఇలా హరించడానికి ప్రజా ప్రయోజనరీత్యా రాజ్యాంగం విధించగల హేతుబద్ద పరిమితుల్లో ఏ విషయం కూడా సమర్థనీయంగా లేదని, న్యాయమూర్తులు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 ప్రకారం ఒకే నేరం చేసిన వ్యక్తులకు తమ విచక్షణ ప్రకారం జీవితఖైదు లేదా మరణశిక్ష విధిస్తున్నారు కాబట్టి ఇది రాజ్యాంగ అధికరణ 14కు వ్యతిరేకమని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టం కేవలం నేరం జరిగిందా లేదా, దాన్ని ఎవరు చేశారు అనే విషయం వరకే పరిమితం అయ్యిందని, పైగా క్రిమినల్ ప్రొసీజర్‌కోడ్‌లో కానీ, భారతీయ శిక్షాస్మృతిలో కానీ రాజ్యాంగ అధికరణ 21లో పేర్కొన్నట్లు వ్యక్తి జీవితాన్ని హరించడానికి ఎలాంటి చట్టం లేదని, ఈ తీర్పు రాజ్యాంగ అధికరణ 21ని సైతం ఉల్లంఘిస్తుందని వాదన వినిపించారు. అయితే ఈ విషయంపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పులో.. రాజ్యాంగ నిర్మాతలు మరణశిక్షను విధించడం ద్వారా ఒకరి జీవితాన్ని హరించే వ్యవస్థను ఏర్పర్చారని అంటే దాని ఉద్దేశం వ్యక్తి జీవించే హక్కును చట్టబద్దంగా హరించడం రాజ్యాంగ నిర్మాతలు ఆమోదయోగ్యమైన శిక్షగా భావించారని, కాబట్టి మరణశిక్ష రాజ్యాంగ వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. పైగా రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగబద్దంగా ఏర్పడిన వ్యవస్థలు చట్టంతో నిర్దేశించిన పద్ధతి ద్వారా మాత్రమే వ్యక్తి జీవితాన్ని హరించాలని, ఇతర పద్ధతుల్లో కాదని పేర్కొన్నారు. హత్య అనేది రాజ్యాంగ వ్యతిరేక చర్య అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Ballatha

850
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles