పదిలో పదికి పది..!


Sun,January 6, 2019 11:13 PM

పదోతరగతి పరీక్షలు మార్చి 16న ప్రారంభం కానున్నాయి. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు విద్యార్థులకు పరీక్షలంటే భయం.. టెన్షన్ ఉంటుంది. అందుకే రాత్రింబవళ్లు ఆతృతతో చదువుతుంటారు. కానీ నిద్రపోకుండా అతిగా మేల్కొని ఉండటంతోపాటు సరైన టైం మేనేజ్‌మెంట్, ఆహార నియమాలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. పరీక్షలు బాగా రాసి మంచి గ్రేడ్ తెచ్చుకోవాలంటే.. కింద పేర్కొన్న సూచనలు పాటించండి.
tenth

విషయ అవగాహనకే అధిక ప్రాధాన్యం

-పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బట్టీ పట్టి అవగాహన లేకున్నా మార్కులు సాధించగల సాంప్రదాయ పరీక్షా విధానం నుంచి సమగ్ర మూర్తిమత్వం సాధించడానికి వీలుగా నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిలో జరుగుతున్నాయి. అందువల్ల ఈ విధానానికి అలవాటు పడటానికి బాగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సి గ్రేడ్ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండి ప్రత్యేక సూచనలను పాటించాలి. పరీక్షా విధానంపై ఇప్పటికే బాగా అవగాహన కలిగి ఉంటుంది. నూతన సిలబస్‌లో విషయ అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. పాఠ్యవిషయాన్ని తగ్గించి కేవలం ముఖ్యాంశాలను విశదీకరిస్తూ వాటిపై జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం, నిత్యజీవిత అన్వయానికి సంబంధించిన ప్రశ్నలను ఇచ్చారు. అందువల్ల విద్యార్థులు గతంలా కేవలం గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడంలోనే కాకుండా చేయడం(పని అనుభవం), స్వీయ రచన, బృందచర్చ ద్వారా నేర్చుకోవడం అనే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.

బట్టీ విధానానికి స్వస్తి

-కేవలం చదివి బట్టీ పడితే సరిపోతుందనుకోవద్దు. ప్రశ్నలను నిజ జీవితానికి అన్వయిస్తూ అడుగుతారు. ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఉండవు. విద్యార్ధి తన అవగాహనకు అనుగుణంగా సమాధానాలు రాసే వీలుంది. ప్రస్తుత విధానంలో అన్ని పాఠాలను విధిగా చదివి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది.

మూల్యాంకన విశ్లేషణ

-హిందీ మినహ మిగతా భాష, భాషేతర సబ్జెక్టులకు రెండు పేపర్లు. ఒక్కో పేపర్‌లో 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 40 మార్కులకు పబ్లిక్ పరీక్ష, 10 మార్కులకు నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిలో పాఠశాలలో ఫార్మటివ్ మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయులు మార్కులు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి 2 1/2 గంటలు అయితే ప్రశ్నపత్రాన్ని చదవడానికి 15 నిముషాల సమయం

నిర్మాణాత్మక (అంతర్గత) మూల్యాంకనం

-పాఠశాలలో నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకన పరీక్షలు నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనం నుంచి తీసుకునే 20 మార్కుల్లో కనీసం 7 మార్కులు సాధించాలి. ఒక నిర్మాణాత్మక మదింపునకు 50 మార్కులుంటాయి. ఇందులో వ్యక్తిగత ప్రతిస్పందనలకు 10 మార్కులు, పాఠ్య పుస్తక ప్రశ్నలకు (రాతపని) 10 మార్కులు, ప్రాజెక్ట్ వర్క్‌కు 10 మార్కులు, స్లిప్ టెస్ట్‌కు 20 మార్కులు ఉంటాయి. నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకన మొత్తాన్ని 5 కు కుదించి ఫలితం ఇస్తారు. 10 మార్కుల మొత్తాన్ని 8తో, 20 మార్కుల మొత్తాన్ని 16తో భాగించడం ద్వారా 5 కి కుదించి మొత్తం 20 మార్కుల ఫలితాన్ని అంతర్గత మదింపుగా బోర్డుకు అందచేస్తారు. ఇందులో కనీస మార్కుల నిబంధనలేదు. జీవ, భౌతిక శాస్ర్తాలకు కలిపి 20 మార్కులకు నిర్మాణాత్మక మూల్యాంకనం చేస్తారు. ఈ 20 మార్కుల్లో జీవ, భౌతిక శాస్ర్తాలకు 10 మార్కుల చొప్పున కేటాయించారు. 10 మార్కులకు గాను 3 1/2 మార్కులు పొందాలి. మొత్తం 7 మార్కులు సాధించాలి. మిగతా విషయాల్లో 20 మార్కులకుగాను 7 మార్కులు పొందాలి.

విద్యా ప్రమాణాలను గుర్తించగలగడం ముఖ్యం

-గతంలో ప్రశ్నపత్రాలను అధ్యాయాల వారీగా మార్కుల వెయిటేజీతో రూపొందించేవారు. ఫలితంగా ఏవో కొన్ని ముఖ్య అధ్యాయాలను చదివితే సరిపోయేది కాని ప్రస్తుతం ప్రశ్నపత్రాన్ని విద్యాప్రమాణాలకు అనుగుణంగా రూపకల్పన చేస్తున్నారు. దీనివల్ల ఏవో కొన్ని అధ్యాయాలను చదివితే సరిపోదు. అన్ని అధ్యాయాలను చదవాల్సిందే.

అవగాహనతోనే గణితంలో అందలం

-గణిత విద్యా ప్రమాణాలను అవగతం చేసుకుని పట్టుసాధిస్తే గణితంలో 10 గ్రేడ్ పాయింట్లు సాధించవచ్చు.
-ఏ అధ్యాయం నుంచైనా ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు. ప్రతి అధ్యాయం కీలకమే.
-ప్రతి అధ్యాయంలో సూత్రాలను, భావనలను వాటిద్వారా సాధించగలిగే సమస్యలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
-ప్రతి భావన మీద సమస్యలను స్వయంగా రూపొందించుకుని సాధనచేయాలి.
-పాఠ్యపుస్తకంలో ఉన్న సమస్యలు పరీక్షలో నేరుగా అడగరు. వాటిని మార్చి అవే స్వభావంగల ప్రశ్నలు ఇస్తారు.
-వ్యాసరూప ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది.
-సమితులు, శ్రేఢులు, సిద్ధాంతాలు, నిరూపక జ్యామితి, సాంఖ్యక శాస్త్రం, సరూప త్రిభుజాలు, క్షేత్రమితి, త్రికోణమితి అనువర్తనాల నుంచి వ్యాసరూప ప్రశ్నలు రూపొందించే అవకాశం ఉంది.
-గణితంలో పేపర్-1లో వాస్తవ సంఖ్యలు, సమితులు, శ్రేఢులు, నిరూపక జ్యామితి తేలికైనవి.
-పేపర్-2లో సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత తేలికైనవి.
-మాదిరి సమస్యల కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చూడండి.

tenth6
tenth2

గణిత విద్యాప్రమాణాలు

-సమస్యా సాధన - 40% - 32 మార్కులు
-కారణాలు విశ్లేంచి నిరూపించడం - 20 % - 16 మార్కులు
-వ్యక్త పరచడం - 10% - 8 మార్కులు
-అనుసంధానం - 15 % - 12 మార్కులు
-దృశ్యీకరణ - ప్రాతినిధ్య పర్చడం - 15% - 12 మార్కులు
తెలుగును తేలికగా తీసుకోకండి...
కొద్దిగా శ్రమిస్తే పదికి పది పాయింట్లు మీకే...
-తొలి పరీక్ష కావడంవల్ల భయాందోళన, ప్రాథమిక అంశాలు, వ్యాకరణం, పద్య రచనల్లో విద్యార్థులకు అభిరుచి లేకపోవడం, తేలికైన తెలుగులో తక్కువ మార్కులు రావడానికి కారణమవుతున్నాయి. మాతృభాషే కదా చాలా సులభమనే భావనతో విద్యార్థులంతా అతి ఆత్మవిశ్వాసంతో చివరికి ఫెయిల్ అయి బాధ పడుతుంటారు. తెలుగులో మంచి మార్కుల సాధనకు మార్గాలు అనేకం ఉన్నాయి. మాతృభాషపై మమకారం పెంచుకుని, చిన్నచిన్న మెళకువలను పాటిస్తూ, కొద్దిగా శ్రమిస్తే పదిలంగా పది పాయింట్లు దక్కించుకోవచ్చు.

తెలుగు విద్యాప్రమాణాలు - మార్కులు

పేపర్-1
-స్వీయ రచన - 30 మార్కులు
-పదజాలం - 10 మార్కులు

పేపర్-2

1. అవగాహన, ప్రతిస్పందన (పఠన అవగాహన) - 20 మార్కులు
2. సృజనాత్మక వ్యక్తీకరణ - 10 మార్కులు
3. వ్యాకరణాంశాలు - 10 మార్కులు
-పాఠ్యాంశాలను చదివేటప్పుడు శ్రద్ధ, సమయ పాలన, ఖచ్చితత్వం అవశ్యం.
-సంధులలో సవర్ణ దీర్ఘ, గుణ, త్రిక సంధుల ఉదాహరణలను బాగా చదవాలి.
-వ్యాసరచన ప్రశ్నల్లో ఎక్కువగా అడిగే అవకాశమున్న పండుగలు, సమకాలీన అంశాలు, ఎయిడ్స్ వ్యాధి, ప్రపంచీకరణ, ప్రకృతి విపత్తుల వంటి అంశాలపై బాగా అవగాహన పెంచుకోవాలి.
-ప్రకృతి వికృతులు, పద్య లక్షణాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు, అలంకారాలు, నానార్థాలు, చందస్సు, పరోక్ష వాక్యాలు, సంయుక్త వాక్యాలు, విగ్రహవాక్యాలు, సమాసానికి ఉదాహరణలపై అవగాహన పెంచుకుంటే మార్కులు సులభంగా పొందవచ్చు.
-ప్రతిపాఠం కవి- కవి పరిచయం, శతక పద్యాలు- భావాలు, పాఠ్య పుస్తకం వెనుక ఉన్న ఉదాహరణలు, వ్యాకరణాంశాలు ప్రాక్టీస్ చేయాలి.
-అర్థ సందర్భాలు సందర్భానికి తగినట్లుగా రాయాలి.
-జాతీయానికి, సొంత వాక్యాలకు ఉన్న తేడాను గమనించి సమాధానాలు రాయాలి.
-రెండవ పేపర్‌లో పఠన అవగాహనలో తెలిసిన, తెలియని గద్యపద్య అంశాలను చదివి అవగాహన చేసుకుని సమాధానాలు రాస్తే తేలికగా 20 మార్కులు పొందవచ్చు.
-గైడ్ కన్నా పాఠ్యపుస్తకానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
-దస్తూరి అందంగా ఉంటే మరిన్ని మార్కులు పొందవచ్చు.

ఆంగ్లం

రాసే అంశాలు తక్కువ - మార్కులు ఎక్కువ
అర్థాలు ... స్పెల్లింగ్‌పై పట్టు సాధించాలి
-ఆంగ్లభాషపై ఉన్న అపోహలు, ఆందోళలను విస్మరించి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో చదువుకుంటే గ్రామీణ విద్యార్థులు సైతం పదికి 10 గ్రేడ్ పాయింట్లు సాధించవచ్చు. ఆంగ్లంలో ప్రతి అంశంపై ప్రాథమిక అవగాహన ఉంటే అత్యధిక మార్కులు స్కోర్ చేయవచ్చు.

విద్యాప్రమాణాలు

పేపర్-1, పేపర్-2
ఎ) రీడింగ్ కాంప్రహెన్షన్ - 15 మార్కులు
బి) వొకాబులరీ, గ్రామర్ - 10 మార్కులు
సి) క్రియేటివ్ రైటింగ్ - 15 మార్కులు
-ఇంగ్లిష్ రీడర్‌లోని పాఠాలు, పోయమ్స్‌కు సంబంధించిన ముఖ్యాంశాలను అవగాహన చేసుకుని ముఖ్యమైన పాయింట్లు గుర్తుంచుకుంటే పేపర్-1లోని ఏ ప్రశ్నకైనా సులభంగా సమాధానం రాయవచ్చు.
-ప్రశ్నాపత్రంలో గద్య, పద్య భాగాలను చదివి అవగాహన చేసుకుని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తే తేలికగా 15 మార్కులు సాధించవచ్చు.
-వాక్య దోషాలను సరిచేయడం, ప్రిపోజిషన్స్, అర్టికల్స్‌పై ఇచ్చిన వ్యాసంలో ఉన్న ఖాళీలను పూరించడం ప్రాక్టీస్ చేయాలి.
-ఇచ్చిన గద్యభాగాన్ని చదివి స్వయంగా సంభాషణా రూపంలో గానీ, ప్రోఫైల్ రూపంలోగానీ, సందేశ రూపంలోగానీ రాయగలిగేలా సిద్ధమవ్వాలి.
-టెక్ట్స్ బుక్ లో ప్రతి యూనిట్ వెనుక ఉన్న గ్రామర్ ప్రాక్టీస్ చేయాలి.
-పేపర్-2లో ఉన్న అన్‌సీన్ ప్యాసేజ్, అన్‌సీన్ పోమమ్‌లను బాగా చదివి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తే తేలికగా 15 మార్కులు సాధించవచ్చు. అందుకు అనుగుణంగా ప్రిపేర్ కావాలి.
-వ్యాకరణాంశాల్లో పదాలకు అర్థాలు, సరైన సమాధానాలను గుర్తించగలగాలి.
-బిజినెస్, పర్సనల్ లెటర్స్ రాయడం నేర్చుకోవాలి. సందర్భోచిత లేఖలు, బయోగ్రాఫికల్ స్కెచ్, కన్వర్జెషన్, బయోడేటా తయారీ వంటి అంశాలపై దృష్టి పెడితే ఉపయోగకరం.
-ఏదైనా విషయంపై వ్యాసం లేదా రిపోర్టు రాయగలిగేలా సిద్ధం కావాలి. అందుకు పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలు చిల్డ్రన్స్‌డే, టీచర్స్‌డే, రిపబ్లిక్‌డే వంటి వాటిపై అవగాహనతో రాయగలిగేలా సిద్ధం కావాలి.
కాలం విలువైనది - సమయపాలన అవసరం
-బద్దకాన్ని, వాయిదా తత్వాన్ని వీడి చదువుపైనే పూర్తి దృష్టి సారించండి. కాలం ఎంతో విలువైనది. పరీక్షా సమయాల్లో ప్రతి క్షణం కీలకమైనది.
-మీకు అనుకూలమైన టైమ్ మేనేజ్‌మెంట్ రూపొందించుకుని చదవడానికి ప్రయత్నించండి.
-ఉదయం 4 నుంచి 6 గంటల వరకు కఠినమైన సబ్జెక్టు చదవడం, ఉదయం 6 నుంచి 7 గంటల వరకు సులభమైన సబ్జెక్టు చదవడం, ఉదయం 7 నుంచి 7.30 వరకు కాలకృత్యాలు, టిఫిన్, ఉదయం 8.00 నుంచి 12.30 వరకు పాఠశాలలో స్టడీ అవర్స్, మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు భోజనం, కొద్దిసేపు విశ్రాంతి,మధ్యాహ్నం 1.30 నుంచి 5.30 వరకు పాఠశాలలో స్టడీ ఆవర్స్,సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు రిఫ్రెష్ మెంట్, రాత్రి భోజనం, సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు కఠినమైన సబ్జెక్టు చదవడం, రాత్రి 8.30 నుంచి 11.00 వరకు సులభమైన సబ్జెక్టు చదవడం, రాత్రి 11.00కు నిద్రపోవడం చేయాలి.
-మధ్యలో ప్రతి గంటకోసారి 10 నిమిషాలు రిలాక్స్ అవుతూ చదువు కొనసాగిస్తే రోజులో కనీసం 14 గంటలు ప్రణాళికా బద్ధంగా కృషి చేసినట్లవుతుంది.

రివిజనే ముఖ్యం

-వివిధ సబ్జెక్టుల్లో ఇప్పటివరకు చదివి ఉన్న అంశాలనే మళ్లీమళ్లీ పునఃశ్చరణ చేయాలే తప్ప నూతన అంశాలను చదవకపోవడమే మంచిది. నూతన అంశాలతో తికమకపడే అవకాశం ఉంటుంది.

చేతిరాత కీలకం

-సరళమైన చేతిరాతతో ఎగ్జామినర్లను ఆకట్టుకోవచ్చు. చేతిరాత చదివేందుకు వీలుగా ఉండాలి. జవాబులను సరైన హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ పెట్టి పాయింట్‌వైజ్‌గా రాయాలి. ప్రధానాంశాలను అండర్‌లైన్ చేయాలి. కాగితంపై ఒత్తిపట్టి రాయవద్దు. పరీక్ష రోజే కొత్త పెన్నుతో రాయకుండా రెండురోజుల ముందుగానే ఆ పెన్నుతో రాస్తూ అలవాటు చేసుకోవాలి.

సమతుల ఆహారం అవశ్యం

-ఈ సమయంలో సమతుల ఆహారం చాలా ముఖ్యం.
-అరటి పండుతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
-స్వీట్లు, శీతల పానీయాలు, పానీపూరి, చాక్లెట్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. లేకపోతే అతి నిద్ర ఆవహించి చదువుకు భంగం కలుగుతుంది.

ఏకాగ్రత

-పరీక్ష హాల్లో మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఒత్తిడికి గురికాకుండా ప్రశ్నపత్రం తీసుకోగానే క్షుణ్ణంగా చదివి వెంటనే ఓ ప్రణాళిక రూపొందించుకోవాలి. బాగా వచ్చిన ప్రశ్నలు, కొద్ది లోపంతో వచ్చిన ప్రశ్నలు, రాని ప్రశ్నలను గుర్తించి.. మొదట బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాసి తర్వాత మిగతా వాటికి రాయాలి. నిర్ణీతకాలంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా జాగ్రత్తపడాలి.
-పరీక్షా సమయం: సాధారణంగా ఉదయం 9.30 నుంచి 12.15 వరకు

tenth5

జీవ, భౌతికశాస్ర్తాల్లో పటాలు కీలకం

-జీవ, భౌతికశాస్త్ర సబ్జెక్టుల్లో మార్కుల సాధనకు పటాలు కీలకమైనవి.
-విద్యార్థులు పటాలను ప్రత్యేక శ్రద్దతో ప్రాక్టీస్ చేయాలి. పటాల నిర్మాణం, పనిచేసే విధానాల గురించి బాగా చదవాలి.
-ఏ ప్రశ్నను ఎలా తిప్పి అడిగే అవకాశం ఉందో ముందే ఊహించుకుని చదువు కొనసాగించాలి.
-విద్యాప్రమాణాల ఆధారంగా ప్రశ్నపత్రం రూపకల్పన జరుగుతుంది కాబట్టి అన్ని అధ్యాయాలు ముఖ్యమైనవే.
-పాఠ్య పుస్తకంపై పూర్తి అవగాహన కలిగి ముఖ్య భావనలు, ఫార్ములాలను గుర్తుంచుకోవాలి.
-ఒకే ప్రశ్నను వివిధ రకాల ప్రశ్నలుగా మార్పు చేసుకుని సమాధానాలు రాయడం నేర్చుకోవాలి.
-విద్యార్థి తన అవగాహనను బట్టి సమాధానాలు రాయవచ్చు.
-అడిగే ప్రతి ప్రశ్న బహుళ సమాధానాలకు అవకాశం కల్పించేదిగా ఉంటుంది.
-పటాలను సాధన చేస్తూ, భావనలను పటాల ద్వారా వివరించడం, అసంపూర్తిగా ఉన్న పటాన్ని పూర్తిచేయడం, సందర్భాన్ని బట్టి పటాలను గీయ గలగడం సాధన చేయాలి.
-జీవశాస్త్రంలో మూసపద్ధతిలో బట్టీ పట్టకుండా శరీర భాగాలు-వ్యవస్థలు, పనితీరు, నియంత్రణ, ప్రకృతి అంశాలను బాగా అవగాహన చేసుకోవాలి.
-సీబీఎస్‌ఈ ప్రశ్న పత్రాలను సేకరించుకుని వాటిలో ఇచ్చిన ప్రశ్నల సరళి గమనించి సాధనచేస్తే మంచి గ్రేడ్ పొందవచ్చు.

జీవ, భౌతికశాస్త్ర విద్యాప్రమాణాలు - భారత్వం

AS 1 - విషయావగాహన - 40 % - 16 మార్కులు
AS 2 - ప్రశ్నించడం, పరికల్పన చేయడం - 10% - 4 మార్కులు
AS 3 - ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు - 15% - 6 మార్కులు
AS 4 - సమాచార సేకరణ నైపుణ్యం, ప్రాజెక్టు పనులు - 15% - 6 మార్కులు
AS 5 - బొమ్మలు గీయడం, నమూనాల తయారీ - 10% - 4 మార్కులు
AS 6 - అభినందన, సౌందర్యాత్మక స్పృహ, విలువలు పాటించడం, AS 7 - నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యాన్ని గుర్తించి కాపాడటం - 10% - 4 మార్కులు

-భౌతికశాస్త్రంలో ఉష్ణం, కాంతి, విద్యుత్ అధ్యాయాలు అతి ముఖ్యమైనవి.
-ప్రయోగాలు-క్షేత్ర పర్యటనలు అనే సామర్థ్యం నుంచి కచ్చితంగా 4 మార్కుల ప్రశ్న అడుగుతున్నారు. అందుకు ప్రయోగ కృత్యాలైన దర్పణాలు, ఓమ్ నియమ నిరూపణ, కటకాల నాభ్యంతరం కనుక్కునే విధానం, ఆమ్లద్రావణాల విద్యుత్ వాహకత ప్రయోగం, ఇనుము తుప్పుపట్టే విధానం వంటి ప్రయోగాలు, కృత్యాలు, పరికరాలు, ప్రయోగ విధానం, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి.
-సమాచార సేకరణ నైపుణ్యం అనే సామర్థ్యం నుంచి కొంత సమాచారం పట్టిక రూపంలో అడిగి దాని ఆధారంగా 4 మార్కులకు ప్రశ్నలు అడుగుతున్నారు. అలాగే బొమ్మలు గీయడం-నమూనాల తయారీ సామర్థ్యం నుంచి ఒక ఒక మార్కు, ఒక రెండుమార్కుల ప్రశ్నలు అడుగుతున్నారు. వీటి కోసం దర్పణాలు, కటకాలు వివిధ సందర్భాల్లో ఏర్పరిచే ప్రతిబింబాల గురించి, దృష్టిలోపాల గురించి, దండయస్కాంతం ఏర్పరిచే బలరేఖల గురించి, విద్యుత్ ప్రవాహ వలయాల గురించి అవగాహన కలిగి ఉండాలి.
-రసాయన శాస్త్రంలో పరమాణు నిర్మాణం, రసాయనబంధం, రసాయన చర్యలు, సమీకరణాలు, సమీకరణాలు తుల్యం చేయడం, ఆమ్లాలు-క్షారాలు, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, కార్బన్ దాని సమ్మేళనాలు, నూతన అధ్యాయం లోహ సంగ్రహణంపై ఎక్కువ దృష్టి సారించాలి.

సోషల్‌లో విషయ అవగాహనకే ప్రాధాన్యం

సోషల్‌లో విద్యాప్రమాణాలు - మార్కులు
విషయ అవగాహన - 16 మార్కులు
వ్యాఖ్యానించడం - 4 మార్కులు
సమాచార నైపుణ్యం - 6 మార్కులు
సమకాలీన అంశాలపై ప్రతిస్పందన - 4 మార్కులు
పట నైపుణ్యాలు - 6 మార్కులు
ప్రశంస, సున్నితత్వం - 4 మార్కులు
-ప్రశ్నలు విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న జ్ఞానాన్ని, అవగాహన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పరిక్షించేలా రూపొందిస్తారు.
-పేపర్-1లో మొదటి భాగమైన వనరుల అభివృద్ధి, సమానత (భూగోళం, అర్థశాస్త్రం), పేపర్-2 లో రెండవ భాగమైన సమకాలీన ప్రపంచం, భారతదేశం (చరిత్ర, పౌరశాస్త్రం) అనే పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-పట నైపుణ్యాన్ని బాగా సాధన చేయాలి. పాఠశాలలోనే కాకుండా ఇంటివద్ద కూడా ఇండియా, వరల్డ్ మ్యాప్‌లలో ప్రధాన ప్రాంతాల, అంశాల ఉనికిని స్వయంగా ప్రాక్టీస్ చేయాలి.
-పేపర్-1లో భారతదేశ పటం, పేపర్-2లో ప్రపంచ పటం ఇస్తారు.
-సమకాలీన అంశాలపై ప్రతిస్పందనకు ప్రతిరోజు దినపత్రికను చదవాలి.

హిందీ

రేటింగ్ పెంచే హిందీ
-హిందీ పరీక్ష ఒకే పేపర్ 80 మార్కులకు జరుగుతుంది. దీనికి సమయం 3 గంటలు ఉంటుంది. జాతీయభాష హిందీలో అధికశాతం మార్కులు సాధించడంలో పదవ తరగతి విద్యార్ధులు విఫలమవుతున్నారు. హిందీలో 10కి 10 సాధించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. భాషపై భయాన్ని వీడి అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుంటే హిందీలో కూడా 10కి 10 మార్కులు సులభంగా సాధించవచ్చు. హిందీ భాషపై అవగాహన లోపించడం, చిన్నచిన్న పదాలకు అర్థాలు తెలుసుకోలేకపోవడం, తప్పులతో కూడిన దస్తూరి విద్యార్థుల వైఫల్యానికి ప్రధాన కారణం. ఆరో తరగతి నుంచే భాషలో బలమైన పునాదులుపడేలా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విద్యాప్రమాణాలు

1. అవగాహన, ప్రతిస్పందన (పఠన అవగాహన) - 20 మార్కులు
2. అభివ్యక్తీకరణ సృజనాత్మకత - 40 మార్కులు
3. వ్యాకరణాంశాలు - 20 మార్కులు
-చిన్నచిన్న పదాలతో హిందీని తేలికగా రాయవచ్చు. ఇవే భాషకు మూలం. రాసేటప్పుడు అక్షర దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ఆ పదానికి అర్థమే మారిపోతుంది.
-ఎక్కువ మార్కులు సాధించగలిగే వ్యాసరూప ప్రశ్నలు, స్వీయ రచనలపై పట్టు సాధించాలి.
-పాఠ్య పుస్తక చివర ఉన్న బిట్లను చదివితే 30 మార్కులు తేలికగా సాధించుకోవచ్చు.
-చుక్క పద్యాలు కంఠస్థం చేయడమేకాక రాయడం, వాటి భావాలను చదివి రాయడం అభ్యాసం చేయాలి.
-లేఖల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ మిత్రునికి లేఖ, చుట్టీ పత్ ఎక్కువగా అడుగుతుంటారు. వీటిని బాగా చదువుకోవాలి.
-ప్రశ్నాపత్రంలో పార్ట్-ఏ లో గద్య, పద్య భాగాలను చదివి అవగాహన చేసుకుని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తే తేలికగా 20 మార్కులు సాధించవచ్చు.
-సంధి విచ్ఛేదనం, విశేషణం, ముహావరా (జాతీయాలు), లింగ్ బదల్‌నా, వచన్ బదల్‌నా వంటి శబ్ద, వాక్య సంబంధ వ్యాకరణాంశాలపై ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
tenth4

md-saleem-shreef

813
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles