YEAR ROUND UP 2018 MAY


Wed,January 2, 2019 12:48 AM

Telangana

2018-May-Telangana

రైతుబంధు పథకం ప్రారంభం

-రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని సీఎం కే చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి - ఇందిరానగర్‌లో మే 10న ప్రారంభించారు. రైతులకు ఎకరానికి సీజన్‌కు రూ. 4000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించారు. దీంతోపాటు కొత్త పాసుపుస్తకాలను ధర్మరాజుపల్లి గ్రామ రైతులకు అందించారు.

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు ధరణి

-వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, తహసీల్దార్ చేయాల్సిన మ్యుటేషన్ తదితర ప్రక్రియలన్నీ సింగిల్‌విండో విధానం ద్వారా చేపట్టనున్నారు. ఇందుకోసం ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

విజయలక్ష్మికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు

-అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మే 12న 35 మందికి ప్రతిష్ఠాత్మక ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఏఎన్‌ఎం బ్యాగరి విజయలక్ష్మి ఈ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు.

మూడు డిజిటల్ అవార్డులు

-తెలంగాణ రాష్ర్టానికి జాతీయ స్థాయిలో మూడు డిజిటల్ అవార్డులు లభించాయి. టీఎస్ ఆన్‌లైన్ కేసీఆర్ కిట్, టీ వ్యాలెట్, టీయాప్‌కు ఈ అవార్డులు లభించాయి.

క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్

-విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 29 క్రీడలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.

ఎయిర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం

-దేశంలోనే తొలిసారిగా ఎయిర్ అంబులెన్స్ సేవలను మే 16న హైదరాబాద్‌లో వింగ్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ప్రారంభించింది.

తెలంగాణ తొలి పీఆర్‌సీ ఏర్పాటు

-మే 18న తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 18న ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ సీఆర్ బిశ్వాల్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్‌లు సీ ఉమామహేశ్వరరావు, మహ్మద్ అలీ రఫత్‌లు సభ్యులుగా ఒక కమిషన్‌ను నియమించింది.

National

2018-May-national

మహిళల రైలుకు 26 ఏండ్లు

-మహిళల కోసం ప్రత్యేక రైల్వే సర్వీసును ప్రారంభించి 2018, మే 5 నాటికి 26 ఏండ్లు పూర్తయింది. ముంబైలోని చర్చిగేట్ నుంచి బోరివల్లి వరకు ప్రపంచంలోనే తొలిసారిగా ప్రత్యేక రైలును 1992, మే 5న ప్రారంభించారు.

ఎర్రకోట నిర్వహణ దాల్మియాకు

-ఎర్రకోట నిర్వహణ బాధ్యతలను దాల్మియా భారత్ గ్రూప్ చేజిక్కించుకుంది. జాతీయ స్థాయి స్మారక చిహ్నాన్ని ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

మయన్మార్‌తో భారత్ ఏడు ఒప్పందాలు

-భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మే 11న మయన్మార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏడు ఒప్పందాలపై ఇరుదేశాల మంత్రులు సుష్మాస్వరాజ్, ఆంగ్‌సాన్ సూకీ సంతకాలు చేశారు.

దేశవ్యాప్తంగా ఉద్దీపన కార్యక్రమం

-నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత కోసం అమలుచేసిన ఉద్దీపన కార్యక్రమం విజయవంతమైంది. దీన్ని అన్ని రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయించింది.

కిషన్‌గంగ ప్రాజెక్టు ప్రారంభం

-జమ్ముకశ్మీర్‌లోని గురజ్ ప్రాంతంలో నిర్మించిన 330 మెగావాట్ల సామర్థ్యంగల కిషన్‌గంగ జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రధాని మోదీ మే 19న ప్రారంభించారు.

కోల్ ఇండియా చైర్మన్‌గా అనిల్‌కుమార్

-2018, మే 18న కోల్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అనిల్‌కుమార్ ఝాను నియమించారు.

బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం

-ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ సూపర్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయోగించవచ్చు.

పూంఛీ కమిషన్‌కు ఆమోదం

-కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్‌మోహన్ పూంఛీ ఆధ్వర్యంలోని కమిషన్ నివేదికలోని 273 సిఫారసులపై అంతరాష్ట్ర మండలి స్థాయీ సంఘం ఆమోదముద్ర వేసింది.

బంగ్లాదేశ్ భవన్ ప్రారంభం

-పశ్చిమబెంగాల్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో బంగ్లాదేశ్ భవన్‌ను ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని హసీనా, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు.

నావికా సాగర్ పరిక్రమ యాత్ర పూర్తి

-నావికా సాగర్ పరిక్రమ పేరిట ఆరుగురు నావికాదళ మహిళాధికారులు ఎనిమిది నెలల్లో భూమిని చుట్టి వచ్చారు. వీరి సాహస యాత్రలో ఐదు దేశాలు, నాలుగు ఖండాలతోపాటు రెండుసార్లు భూమధ్యరేఖను దాటారు.

మణిపూర్‌లో క్రీడా విశ్వవిద్యాలయం

-దేశంలోనే తొలిసారిగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది.

International

2018-May-International

అంగారకుడి పైకి ఇన్‌సైట్

-అంగారక గ్రహ నేల లోతుల్లో చోటుచేసుకునే ప్రకంపనలను వినడం కోసం మే 5న అమెరికాకు చెందిన నాసా అట్లాస్-5 అనే భారీ రాకెట్ ద్వారా ఇన్‌సైట్ ల్యాండర్‌ను ప్రయోగించింది. ఇది 30 కోట్ల మైళ్ల దూరం ప్రయాణించి నవంబర్ 26న అరుణగ్రహంపైకి చేరుకుంటుంది. ఇన్‌సైట్ అంటే... ఇంటీరియల్ ఎక్స్‌ప్లొరేషన్ యూజింగ్ సైస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసీ అండ్ హీట్ ట్రాన్స్‌పోర్ట్.

మలేషియా ప్రధానిగా మహథిర్

-మలేషియా ప్రధానిగా 92 ఏండ్ల మహథిర్ మహ్మద్ ఎన్నికయ్యారు. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన వారిలో ప్రపంచంలోనే అత్యంత వయోధికుడిగా ఆయన రికార్డు సృష్టించారు.

పెరూ, భారత్ మధ్య 55 ఏండ్ల దౌత్యబంధం

-దక్షిణ అమెరికా దేశం పెరూ, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలకు 55 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ దేశంలో పర్యటించారు.

బంగబంధు-1 ప్రయోగం

-అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి శక్తిమంతమైన ఫాల్కన్-9లో బ్లాక్ శ్రేణి రాకెట్‌ను ప్రయోగించింది. రాకెట్ ద్వారా బంగ్లాదేశ్‌కు చెందిన బంగబంధు-1 ఉపగ్రహాన్ని 35 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర బదిలీ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.

అర్మేనియా ప్రధానిగా నికోల్

-అర్మీనియా దేశ నూతన ప్రధానిగా నికోల్ పషిన్యాన్ ఎన్నికయ్యారు.

అణుపరీక్ష కేంద్రం ధ్వంసం

-కొంతమంది విదేశీ మీడియా ప్రతినిధుల సమక్షంలో ఉత్తరకొరియాలోని దట్టమైన అటవీ ప్రాంతంలోగల పుంగ్వేరి అణుపరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేశారు.

Sports

2018-May-Sports

హీనా సిద్ధూకు స్వర్ణం

-జర్మనీలో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో హానోవర్ అంతర్జాతీయ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ హీనా సిద్ధూ స్వర్ణం గెలుచుకుంది.

నారంగ్‌కు స్వర్ణం

-జర్మనీలోని హనోవర్‌లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ టోర్నీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ గగన్ నారంగ్ స్వర్ణం గెలిచాడు.

హామిల్టన్‌కు స్పెయిన్ గ్రాండ్ ప్రి టైటిల్

-మే 13న జరిగిన స్పెయిన్ గ్రాండ్ ప్రి విజేతగా లూయిస్ హామిల్టన్ నిలిచాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది 64వ టైటిల్. భారత్‌కు చెందిన డ్రైవర్ ఫిరోజ్ 9వ స్థానంలో నిలిచాడు.

నాదల్‌కు వరుసగా 50 విజయాలు

-స్పెయిన్ టెన్నిస్ క్రీడాకారుడు రఫెల్ నాదల్.. జర్మనీ దిగ్గజం జాన్ మెకన్రో రికార్డును బద్దలు కొట్టాడు. క్లే కోర్టులో నాదల్ వరుసగా 50వ గెలుపు సాధించాడు. 1984లో మెకన్రో వరుసగా 49 విజయాలతో రికార్డు నెలకొల్పాడు.

ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్

-అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా శశాంక్ మనోహర్ ఎన్నికయ్యారు. దీంతో ఆయన మరో రెండేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.

ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్

-ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్.

మొరాకో గ్రాండ్‌ప్రి విజేత డానియల్

-మొరాకో గ్రాండ్‌ప్రి విజేతగా రెడ్‌బుల్ డ్రైవర్ డానియల్ రికియార్టో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ వెటెల్ రన్నరప్‌గా నిలిచాడు.

ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్

-దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. అత్యంత వేగవంతమైన 50, 100, 150 పరుగుల రికార్డులు అతని పేరుపైనే ఉన్నాయి.

తేజస్వినికి స్వర్ణం

-ఐఎస్‌ఎస్‌ఎఫ్ రైఫిల్ స్టేజ్ ప్రపంచకప్‌లో 50 మీ. రైఫిల్ ప్రోన్ విభాగంలో తేజస్విని సామంత్ బంగారు పతకం సాధించింది. భారత్‌కే చెందిన అంజుమ్ రెండోస్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది.

ఆసియా పవర్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకాలు

-ఆసియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. మహిళల 52 కేజీల విభాగంలో సాధియా అల్‌మాస్ నాలుగు స్వర్ణ పతకాలను సాధించింది. 72 కేజీల విభాగంలో శీరా చంద్రకళ కాంస్యం సాధించింది. పురుషుల 74 కిలోల విభాగంలో దయానంద్ స్వర్ణం, ప్రవీణ్‌యాదవ్ రజతం గెలుచుకున్నారు.

వింబుల్డన్ ప్రైజ్‌మనీ పెంపు

-వింబుల్డన్ ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. గత ఏడాదితో పోలిస్తే 7.6 శాతం పెరుగుదలతో మొత్తం రూ. 309 కోట్లకు చేరింది. పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు తలో రూ. 20.47 కోట్లు దక్కనున్నాయి.

Persons

2018-May-Persons

ఐఆర్‌డీఏ చైర్మన్‌గా సుభాష్

-ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) చైర్మన్‌గా సుభాష్ చంద్ర కుంతియా నియమితులయ్యారు.

సీఐఏ డైరెక్టర్‌గా హాస్పెల్

-అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డైరెక్టర్‌గా 61 ఏండ్ల హాస్పెల్ ఎంపికయ్యారు.

ఏడు శిఖరాల అధిరోహణ

-ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ ప్లెయిన్ అతితక్కువ రోజుల్లో (117 రోజులు) ఏడు ఖండాల్లోని, ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించారు.

కాళ్లు లేని వ్యక్తి ఎవరెస్ట్ అధిరోహణ

-కాళ్లు లేకున్నా చైనాకు చెందిన 69 ఏండ్ల షియాబోయు తన ఐదో ప్రయత్నంలో ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్టును అధిరోహించాడు.

కర్ణాటక సీఎంగా కుమారస్వామి

-కర్ణాటక 24వ సీఎంగా జేడీ(ఎస్) నేత కుమారస్వామి మే 23న ప్రమాణం చేశారు.

వెనెజులా అధ్యక్షుడిగా మదురో

-వెనెజులా అధ్యక్షుడిగా యునెటైడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజులాకి చెందిన నేత నికోలస్ మదురో ఎన్నికయ్యారు.

పీసీఐ చైర్మన్‌గా ప్రసాద్

-ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్‌గా వరుసగా రెండోసారి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీకే ప్రసాద్ నియమితులయ్యారు.

533
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles