YEAR ROUND UP 2018 JULY


Wed,January 2, 2019 12:39 AM

Telangana

EAST-VIEW

గిరిబాల వికాస్ ప్రోగ్రామ్

గిరిజన విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం కోసం తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ జూలై 6న గిరిబాల వికాస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్యక్రమంలో గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు ఏడాదిలో మూడుసార్లు వైద్యపరీక్షలు నిర్వహిస్తుంది.

స్వేచ్ఛా వ్యాపారంలో తెలంగాణకు రెండో స్థానం

దేశంలో స్వేచ్ఛా వ్యాపారానికి అనుకూలమైన రాష్ర్టాల జాబితాలో 98.33 శాతం మార్కులతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 98.42 శాతం మార్కులతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. హర్యానా, జార్ఖండ్, గుజరాత్‌లు 3, 4, 5 ర్యాంకులు పొందాయి. ఈ ర్యాంకులను జూలై 11న ప్రకటించారు.

స్థానిక విపత్తుల జాబితాలోకి పిడుగుపాటు

రాష్ట్రంలో పిడుగుపాటువల్ల మృతిచెందేవారి కుటుంబాలకు ఇక నుంచి రూ.6 లక్షల పరిహారం లభించనుంది. జాతీయ విపత్తుల జాబితాలో ఉన్న పిడుగుపాటును రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న స్థానిక విపత్తుల జాబితాలో చేర్చింది.

యాదాద్రి ఆలయానికి ఐఎస్‌వో ధృవీకరణ

యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ (వైటీడీఏ)కి, యాదాద్రి ఆలయానికి జూలై 21న ఐఎస్‌వో ధృవీకరణ పత్రం లభించింది. దేశంలో ఈ గుర్తింపు పొందిన తొలి ఆలయం యాదాద్రి.

మై బాడీ! వాట్ ఐ సే గోస్

వరల్డ్ విజన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ రూపొందించిన మై బాడీ! వాట్ ఐ సే గోస్ (నా శరీరం నేను చెప్పినట్లు నడుచుకుంటుంది) అనే పుస్తకాన్ని జూలై 25న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవిష్కరించారు. బాలికలను లైంగిక వేధింపుల నుంచి కాపాడటం ప్రతి పౌరుని బాధ్యత అనే ప్రచార ఉద్యమంలో భాగంగా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.

ఎంబీసీ కేటగిరీలోకి మరో 35 కులాలు

రాష్ట్రంలోని మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కేటగిరీలోకి మరో 35 కులాలను చేరుస్తూ ప్రభుత్వం జూలై 26న ఉత్తర్వులు జారీచేసింది. జీవనస్థితిగతులు, సామాజిక నేపథ్యం, సంక్షేమం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంబీసీ యాక్ట్-2013 కింద వీటిని చేర్చింది.


National

ISRO-july

క్రూ ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగం సక్సెస్

వ్యోమగాములను కాపాడేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను ఇస్రో తొలిసారి జూలై 5న విజయవంతంగా పరీక్షించింది. మానవ సహిత అంతరిక్ష నౌకలను ప్రయోగించే సమయంలో ఏదైనా ప్రమాదం తలెత్తితే క్రూ ఎస్కేప్ సిస్టమ్ వెంటనే అప్రమత్తమై వ్యోమగాములున్న మాడ్యూల్‌ను రాకెట్ నుంచి వేరుచేసి సురక్షితంగా దిగేలా చేస్తుంది. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా మాత్రమే సొంతంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాయి.

సీ-విజిల్ యాప్

ఎన్నికల సమయంలో డబ్బులు పంచడం, ఓటర్లను ప్రలోభపెట్టడం, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వంటి వాటి గురించి వీడియోలు, ఫొటోలు తీసి ఫిర్యాదు చేయడానికి వీలుగా ఎన్నికల కమిషన్ సీ-విజిల్ పేరుతో ఒక యాప్‌ను రూపొందించింది.

రాజ్యసభలో మరో ఐదు భాషలకు అవకాశం

రాజ్యసభలో సభ్యులు మరో ఐదు భాషలు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జూలై 10న ఉపరాష్ట్రపతి ప్రకటించారు. డొంగ్రి, కశ్మీరీ, కొంకణి, సంథాలీ, సింధి భాషల్లో మాట్లాడేందుకు వెసులుబాటు కల్పించారు.

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం

లోక్‌సభలో జూలై 20న ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి.

కుసుమ్ పథకం ప్రారంభం

వ్యవసాయదారులకు సౌర విద్యుత్ మోటార్లను సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కిసాన్ ఊర్జా సురక్షా ఏవమ్ ఉత్థాన్ మహాభియాన్ (కుసుమ్) పథకం జూలైలో ప్రారంభమైంది.

మహిళల కోసం సైబర్‌క్రైమ్ వెబ్‌సైట్

అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లు సహా మహిళలపై జరిగే సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం జూలై 24న కేంద్ర హోంశాఖ సైబర్‌క్రైమ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మహిళలు cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

మిషన్ సత్యనిష్ఠ ప్రోగ్రామ్

రైల్వే అధికారులు, సూపర్‌వైజర్లు విధుల్లో పారదర్శకత పాటించేందుకు ఉద్దేశించిన మిషన్ సత్యనిష్ఠ కార్యక్రమాన్ని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వినీ లోహని ఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియంలో జూలై 27న ప్రారంభించారు.


International

Alyssa-Carson-july

టోక్యోలో రసాయన దాడి దోషులకు ఉరి

జపాన్‌లో రసాయనిక దాడులకు పాల్పడిన ఓమ్ షిన్రిక్యో వర్గం నాయకుడు షోకో అసహారాతోపాటు అతడి ఆరుగురు అనుచరులను జపాన్ ప్రభుత్వం జూలై 6న ఉరితీసింది.

2033లో అంగారకుడిపైకి అలెసా

అంగారక గ్రహంపై కాలు పెట్టబోయే తొలి మహిళగా అమెరికాకు చెందిన 17 ఏండ్ల అలెసా కార్సన్ రికార్డు నెలకొల్పారు. 2033లో నాసా చేపట్టే మార్స్ ప్రయోగం కోసం .. నాసా పోలార్ ఆర్బిటల్ సైన్స్, జీరో గ్రావిటీ, అండర్‌వాటర్ సర్వైవల్‌లో అలెసా శిక్షణ తీసుకుంటున్నారు.

థాయ్‌లాండ్‌లో ఆపరేషన్ అడ్వాన్సుడ్

థాయ్‌లాండ్‌లోని తామ్ లుయంగ్ గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలలను ఆపరేషన్ అడ్వాన్స్‌డ్ పేరుతో రక్షించారు. ఈ ఆపరేషన్‌లో ప్రమాదవశాత్తు థాయి నేవి మాజీ సీల్ డైవర్ సమన్ నాన్ మరణించారు.

బ్రిక్స్ సదస్సు

బ్రిక్స్ దేశాధినేతల సమావేశం జూలై 25 నుంచి 27 వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మెక్సికో అధ్యక్షుడిగా ఓబ్రడార్

నేషనల్ రీజనరేషన్ మూవ్‌మెంట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ (ఆమ్లో) మెక్సికో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 53 శాతం ఓట్లు వచ్చాయి. ఆధునిక మెక్సికో చరిత్రలో ఓ వామపక్ష నాయకుడు అధ్యక్షుడు కావడం ఇదే తొలిసారి. ఆమ్లో.. 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు.


Sports

సాయ్ పేరు మార్పు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పేరును కేంద్ర క్రీడల శాఖ స్పోర్ట్స్ ఇండియాగా మార్చింది. 1984లో సాయ్‌ను ఏర్పాటు చేశారు.

దీపా కర్మాకర్‌కు స్వర్ణం

టర్కీలో జరిగిన ఎఫ్‌ఐజీ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ చాలెంజ్ కప్‌లో వాల్ట్ విభాగంలో త్రిపురకు చెందిన దీపా కర్మాకర్ స్వర్ణ పతకం సాధించింది. ఈ టోర్నీలో పసిడి నెగ్గిన భారత తొలి జిమ్నాస్ట్ దీపనే.

ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత ఫ్రాన్స్

ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేతగా ఫ్రాన్స్ నిలిచింది. జూలై 15న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో క్రొయేషియా ఓడిపోయింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై బెల్జియం విజయం సాధించింది.

వింబుల్డన్ సింగిల్స్ విజేతలు కెర్బర్, జకోవిచ్

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా జర్మనీ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్ నిలిచింది. కెర్బర్‌కు ఇదే తొలి వింబుల్డన్ టైటిల్. పురుషుల సింగిల్స్ విజేతగా సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ నిలిచాడు. జకోవిచ్‌కు ఇది 13వ గ్రాండ్‌స్లామ్.

రెజ్లింగ్‌లో బజరంగ్ పూనియాకు స్వర్ణం

అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీలో భారత రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణం సాధించాడు. ఇస్తాంబుల్‌లో జూలై 29న జరిగిన టోర్నీలో పురుషుల 70 కేజీల విభాగంలో బజరంగ్ విజేతగా నిలిచాడు.


Persons

steve_ditko

స్పైడర్‌మ్యాన్ సృష్టికర్త మృతి

స్పైడర్‌మ్యాన్ యానిమేషన్ సహ సృష్టికర్త స్టీవ్ డిట్కో జూలై 7న న్యూయార్క్‌లో మృతిచెందారు.

ఎన్జీటీ చైర్‌పర్సన్‌గా గోయల్

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్ నియమితులయ్యారు. ఆయన ఐదేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.

సామాజికవేత్త జంగుబాయి మృతి

ఆదివాసీల్లో చైతన్యానికి కృషిచేసిన సామాజికవేత్త సంత్‌శ్రీ మొస్రం జంగుబాయి జూలై 13న మృతిచెందారు. కుమ్రం భీమ్ జిల్లాకు చెందిన జంగుబాయి 2010లో గిరిజ్యోతి పురస్కారం అందుకున్నారు.

ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేశ్

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జూలై 13న రిలయ న్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీని ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ప్రకటించింది. రెండో స్థానం లో అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఉన్నాడు.

ప్రపంచ కుబేరుడు బెజోస్

బ్లూమ్‌బర్గ్ జూలై 17న వెల్లడించిన ప్రపంచ సంపన్నుల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రెండోస్థానం, మార్క్ జుకర్‌బర్గ్ మూడో స్థానంలో ఉన్నారు. ముఖేశ్ అంబానీ 15వ స్థానంలో నిలిచారు.

ఫోర్బ్స్ జాబితాలో అక్షయ్, సల్మాన్

ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న 100 మంది సెలబ్రిటీలతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో భారత్ నుంచి అక్షయ్‌కుమార్, సల్మాన్‌ఖాన్‌లకు చోటు దక్కింది. అక్షయ్ 76వ స్థానంలో ఉండగా, సల్మాన్ 82వ స్థానంలో నిలిచారు.


Awards

Ramon-Magsaysay

సింగరేణి సీఎండీకి అవార్డు

సింగరేణి సీఎండీ శ్రీధర్ అవుట్ స్టాండింగ్ లీడర్‌షిప్ అవార్డు అందుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజవంశ ప్రముఖుల నుంచి ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

ఇస్రో శాస్త్రవేత్తకు పయనీర్ అవార్డు

ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త బైరన నాగప్ప సురేష్‌కు పయనీర్ అవార్డు లభించింది. ది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ సిస్టం అనే సంస్థ అమెరికాలో జూలై 10న ఈ అవార్డును ప్రదానం చేసింది.

ఇద్దరు భారతీయులకు మెగసెసె అవార్డులు

ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె పురస్కారం ఈ ఏడాది ఇద్దరు భారతీయులకు లభించింది. మానసిక రోగులకు స్వాంతన చేకూర్చడంలో కృషిచేసిన మానసిక వైద్య నిపుణుడు భరత్ వట్వానీ, లదాఖ్ యువతలో విద్య, జీవన నైపుణ్యాలు మెరుగుపర్చడానికి కృషిచేసిన సోనమ్ వాంగ్‌చుక్‌కు ఈ గౌరవం దక్కింది.

కొలకలూరి ఇనాక్‌కు రావిశాస్త్రి అవార్డు

రాచకొండ విశ్వనాథ శాస్త్రి 97వ జయంతి సందర్భంగా రావిశాస్త్రి లిటరసీ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావిశాస్త్రి అవార్డును ప్రముఖ రచయిత కొలకలూరి ఇనాక్‌కు అందించారు.

ది ఇంగ్లిష్ పేషంట్‌కు బుకర్ ప్రైజ్

శ్రీలంక మూలాలు కలిగిన కెనడా రచయిత మైకేల్ ఆందాజీ రాసిన ది ఇంగ్లిష్ పేషంట్ పుస్తకానికి గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ లభించింది.

కవి వజ్జలకు దాశరథి పురస్కారం

2018 ఏడాదికిగాను దాశరథి కృష్ణమాచార్య అవార్డును కవి వజ్జల శివకుమార్‌కు ప్రదానం చేశారు. జూలై 22న జరిగిన కార్యక్రమంలో వజ్జలకు ఈ అవార్డు కింద రూ.1,01,116 నగదు, ప్రశంసాపత్రం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వజ్జల శివకుమార్ రాసిన పాలకంకులు రచనకు గతంలో సినారె పురస్కారం లభించింది.

575
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles