కరెంట్ అఫైర్స్


Wed,December 5, 2018 01:22 AM

Telangana
Telangana

పౌల్ట్రీ ఇండియా సదస్సు

పౌల్ట్రీ ఇండియా 12వ సదస్సును కేంద్ర పశుసంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఓపీ చౌదరి హైదరాబాద్‌లో నవంబర్ 28న ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో ఇజ్రాయెల్, చైనా, సింగపూర్, అమెరికా, జర్మనీ, బెల్జియం, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ తదితర 75 దేశాలకు చెందిన ప్రముఖ పౌల్ట్రీ పరిశ్రమలు, ఫీడ్, క్లీనింగ్, ఔషధ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి.

నా ఓటు యాప్ ఆవిష్కరణ

ఓటర్ల సౌలభ్యం కోసం రూపొందించిన నా ఓటు యాప్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ నవంబర్ 29న ఆవిష్కరించారు. ఈ యాప్‌లో పేరు లేదా ఎపిక్ నంబర్ టైప్ చేస్తే ఓటరకు సమీపంలో ఉన్న పోలింగ్ బూత్, అధికారుల వివరాలు కనిపిస్తాయి. ఈ యాప్ ద్వారా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

National
National
పీఎస్‌ఎల్వీ-సీ43 ప్రయోగం విజయవంతం ఇస్రో నవంబర్ 29న చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ43 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ (హైసిస్) అనే అత్యాధునిక భూ పర్యవేక్షక ఉపగ్రహంతో పాటు ఎనిమిది దేశాలకు చెందిన మరో 30 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా

మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా, ట్రాన్స్‌ఫార్మేషన్ అండర్ మోదీ గవర్నమెంట్ పుస్తకాన్ని న్యూఢిల్లీలో నవంబర్ 27న ఆవిష్కరించారు. విద్య, వైద్యం తదితర అంశాలపై 51 వ్యాసాలున్న ఈ పుస్తకాన్ని బిబేక్ దేబ్రాయ్, కిశోర్ దేశాయ్, అనిర్బన్ గంగూలీ రచించారు.

హాకీ ప్రపంచకప్ పోస్టల్ స్టాంప్

పురుషుల 14వ హాకీ ప్రపంచకప్ టోర్నమెంట్ స్మారకంగా తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక స్టాంప్‌ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నవంబర్ 28న విడుదల చేశారు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వద్ద వీటి విక్రయానికి స్టాల్ ఏర్పాటు చేశారు.

International
International

13వ జి-20 సదస్సు

13వ జి-20 సదస్సు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగింది. ఉగ్రవాదం, ఆర్థిక నేరగాళ్లకు వ్యతిరేకంగా అన్ని దేశాలు సహరించుకోవాలని చర్చించారు.

ఫోర్బ్స్‌లో భారత సంతతి మహిళలు

ఫోర్బ్స్ రూపొందించిన అమెరికాలో అగ్ర స్థాయి 50 మంది టెక్నాలజీ ప్రముఖులు-2018 జాబితాలో నలుగురు భారత సంతతికి చెందిన మహిళలకు చోటు దక్కింది. నవంబర్ 30న వెలువడిన ఈ జాబితాలో సిస్కో మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పదశ్రీ వారియర్, ఉబెర్ సీనియర్ డైరెక్టర్ కోమల్ మంగ్తాని, కన్‌ప్లూయంట్ సహ వ్యవస్థాపకురాలు నేహ నార్ఖడే, డ్రాబ్రిడ్జ్ వ్యవస్థాపకురాలు, సీఈవో కామాక్షి శివరామకృష్ణన్‌లకు చోటు లభించింది.

మ్యూజియంగా రిషికపూర్ పూర్వీకుల భవనం

బాలీవుడ్ నటుడు రిషికపూర్ పూర్వీకుల భవనాన్ని మ్యూజియంగా మార్చాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పెషావర్‌లోని కపూర్ హవేలీని మ్యూజియంగా మార్చారు. రిషికపూర్ తాత పృథ్వీరాజ్ కపూర్ 1924లో ఈ భవనంలో జన్మించారు.

అంతర్జాతీయ వాతావరణ సదస్సు

24వ అంతర్జాతీయ వాతావరణ సదస్సును డిసెంబర్ 1 నుంచి 7 వరకు పోలెండ్‌లోని కచ్‌విజ్‌లో నిర్వహిస్తున్నారు. 200 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. 1972లో UNEP ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం కెనడాలోని నైరోబీలో ఉంది.

మెక్సికో నూతన అధ్యక్షుడు

మెక్సికోకు నూతన అధ్యక్షుడిగా వామపక్షనేత అండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ డిసెంబర్ 1న ఎన్నికయ్యారు.

Awards
Awards

అజీం ప్రేమ్‌జీకి ఫ్రాన్స్ పురస్కారం

విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ (షెవాలీర్ డె లా లెజియన్) లభించింది. ఐటీ రంగ అభివృద్ధికి చేసిన కృషికిగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును నవంబర్ 28, 29 తేదీల్లో జరిగిన బెంగళూరు టెక్ సదస్సులో ఫ్రాన్స్ దౌత్యవేత్త అలెగ్జాండర్ జిగ్లర్ ఆయనకు అందజేశారు. 1802లో నెపోలియన్ బోనెపార్టీ ఈ అవార్డును స్థాపించారు.

అమితాబ్‌కు సాయాజీ రత్న

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు సాయాజీరావు రత్న-2019 అవార్డు నవంబర్ 21న లభించింది. బరోడా పాలకుడు సాయాజీరావు గైక్వాడ్-III పేరుతో ఈ అవార్డును 2013లో స్థాపించారు.

Sports
Sports

పుణె టెన్నిస్ టోర్నీ విజేతగా రామ్‌కుమార్ జోడీ

పుణె ఏటీపీ చాలెంజర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నీ విజేతగా భారత్‌కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్-విజయ్ సుందర్ ప్రశాంత్ జోడీ నిలిచింది. నవంబర్ 24న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఈ జోడీ తైపీకి చెందిన సుంగ్ హు యాంగ్-చెంగ్ పెంగ్ జోడీపై విజయం సాధించింది.

టాటా రెజ్లింగ్ నేషనల్స్ పోటీలు

టాటా మోటార్స్ రెజ్లింగ్ నేషనల్స్ పోటీలు ఉత్తర ప్రదేశ్‌లోని గోండాలో నవంబర్ 30న ప్రారంభమయ్యాయి. వివిధ విభాగాల్లో దేశంలోని 27 రాష్ర్టాల నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు.

కార్ల్‌సన్‌కు చెస్ చాంపియన్‌షిప్ టైటిల్

నార్వేకు చెందిన చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్‌సన్‌కు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ లభించింది. లండన్‌లో నవంబర్ 29న జరిగిన ఫైనల్లో కార్ల్‌సన్ అమెరికాకు చెందిన ఫాబియానో కరువానాపై విజయం సాధించాడు.

షూటింగ్‌లో ఇషాకు నాలుగు స్వర్ణాలు

జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్ 4 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్య పతకం సాధించింది. తిరువనంతపురంలో నవంబర్ 29న జరిగిన ఈ టోర్నీలో 13 ఏండ్ల ఇషా పలు విభాగాల్లో విజేతగా నిలిచి ఈ పతకాలను సొంతం చేసుకుంది.

అల్ట్రా రన్నింగ్‌లో భారత్‌కు తొలి పతకం

అల్ట్రా రన్నింగ్‌లో అథ్లెట్ ఉల్లాస్ నారాయణ్ భారత్‌కు తొలి అతర్జాతీయ పతకాన్నందించి చరిత్ర సృష్టించాడు. ఆసియా-ఓషియానియా చాంపియన్‌షిప్‌లో అతడు కాంస్యం సాధించి ఈ ఘనత సాధించాడు. ఈ పోటీలో యోషిహికో ఇషికావా (జపాన్) స్వర్ణం, తకహాషి (జపాన్) రజతం సాధించారు.

Persons
Persons

బింద్రాకు బ్లూ క్రాస్ పురస్కారం

ఒలింపిక్స్‌లో వ్యక్తిగత క్రీడల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ షూటర్ అభినవ్ బింద్రాకు అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) అత్యున్నత పురస్కారం బ్లూ క్రాస్ లభించింది. షూటింగ్ క్రీడకు బింద్రా చేసిన సేవలకుగాను ఐఎస్‌ఎస్‌ఎఫ్ నవంబర్ 30న ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

అమెరికా ఫోర్బ్స్ మేగజీన్‌లో మేఘన

అమెరికన్ ఫోర్బ్స్ మేగజీన్ నవంబర్ 29న ప్రకటించిన అండర్-30 శాస్త్రవేత్తల విభాగంలో భారతీయ విద్యార్థి బొల్లింపల్లి మేఘనకు చోటు దక్కింది. ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్ట్ (ఐసెఫ్) సంస్థ నిర్వహించిన సైన్స్‌ఫేర్ పోటీల్లో 75 దేశాలు పోటీ పడ్డాయి. ఈ పోటీల్లో మేఘన ఎలక్ట్రోడ్ మేడ్ విత్ ప్లాటినం అనే సైన్స్ సూపర్ కెపాసిటర్ ప్రయోగానికి అవార్డు లభించింది.

జీన్ ఎడిటింగ్ శాస్త్రవేత్తపై నిషేధం

జీన్ ఎడిటింగ్ చేసి ఇద్దరు చిన్నారుల్ని సృష్టించిన చైనా శాస్త్రవేత్త హీ జియాన్‌కుయ్‌పై చైనా ప్రభుత్వం నవంబర్ 30న నిషేధం విధించింది. జీన్ ఎడిటింగ్ ప్రయోగంపై దేశవిదేశాల నుంచి విమర్శలు తలెత్తడంతో కుయ్ ఎలాంటి శాస్త్రీయ పరిశోధన చేయకుండా చైనా ఆంక్షలు విధించింది.

సీఈసీగా సునీల్ అరోరా

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా సునీల్ అరోరా డిసెంబర్ 2న ఎన్నికయ్యారు. ఈయన రాజస్థాన్ ఐఏఎస్ కేడర్‌కు చెందిన అధికారి.

ఎన్‌ఎస్‌డీసీకి కొత్త చైర్మన్

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు నూతన చైర్మన్‌గా అనిల్ మునీభాయ్ నాయక్ ఎంపికయ్యారు. ఈయన 2009లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.

సీనియర్ బుష్ మృతి

అమెరికా మాజీ అధ్యక్షుడు, సీనియర్ బుష్‌గా పిలిచే జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్ నవంబర్ 30న మరణించారు. అమెరికాకు 41వ (1989-93) అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పార్కిన్సన్ వ్యాధితో మృతిచెందారు.

Vemula-Saidulu

322
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles