పోషక లోపం - మహా ప్రమాదం


Wed,November 28, 2018 05:27 AM

ప్రపంచదేశాలు ఉత్పత్తి చేస్తున్న ఆహారంలో దాదాపు మూడోవంతు ప్రజల కంచాల్లోకి చేరకుండానే వృథా అయిపోతున్నది. ప్రతి ఏడాది దాదాపు 130 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలు ఉత్పత్తి అయితే, అందులో సుమారు 43 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారం వృథాగా పోతున్నది. ఒకవైపు ఇంత తీవ్రస్థాయిలో ఆహారం వృథా అవుతుంటే, మరోవైపు దాదాపు 300 కోట్ల మంది చాలినంత తిండి దొరకక ఆకలితో అలమటిస్తున్నారు.
food-waste
పోషకాహారలోపం మలేరియా, టీబీ వంటి ప్రాణాంతక వ్యాధుల కంటే ప్రమాదకరమని ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం ‘ఎఫ్ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్)’ హెచ్చరించింది. ‘ప్రివెంటింగ్ న్యూట్రియంట్ లాస్ అండ్ వేస్ట్ అక్రాస్ ద ఫుడ్ సిస్టమ్: పాలసీ యాక్షన్స్ ఫర్ హై క్వాలిటీ డైట్’ పేరుతో ఎఫ్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పోషకాహారలోపం తీవ్రత ఏ స్థాయిలో ఉంది? ఆహార నష్టాన్ని, వృథాను అరికట్టడానికి.. ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించడానికి ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆహార నష్టానికి, వృథాకు మధ్య తేడా ఏమిటి? అనే అంశాలను ఈ నివేదికలో వివరించింది. నివేదికలోని సమగ్ర సమాచారం నిపుణ పాఠకుల కోసం..

నివేదికలో ఏమున్నది?


-ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు మరణాల్లో ఒకటి పోషకాహారలోపం వల్లనే సంభవిస్తున్నది. మలేరియా, టీబీ వంటి వ్యాధులతో మరణించేవారి సంఖ్య కూడా ఈ స్థాయిలో లేదు. దీన్నిబట్టి పోషకాహారలోపం తీవ్రత ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
-ప్రపంచదేశాలు ఉత్పత్తి చేస్తున్న ఆహారంలో దాదాపు మూడోవంతు ప్రజల కంచాల్లోకి చేరకుండానే వృథా అయిపోతున్నది. ప్రతి ఏడాది దాదాపు 130 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలు ఉత్పత్తి అయితే, అందులో సుమారు 43 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారం వృథాగా పోతున్నది. ఒకవైపు ఇంత తీవ్రస్థాయిలో ఆహారం వృథా అవుతుంటే, మరోవైపు దాదాపు 300 కోట్ల మంది చాలినంత తిండి దొరకక ఆకలితో అలమటిస్తున్నారు.
-2030 నాటికి అదనంగా కనీసం 100 కోట్ల మందికి పోషక విలువలతో కూడా ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది ఐక్యరాజ్యసమితి సమగ్ర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. కొన్ని కోట్ల మెట్రిక్ టన్నుల్లో జరుగుతున్న ఆహార నష్టాన్ని, వృథాను క్రమంగా తగ్గించుకోకపోతే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. - ప్రతి ఏడాది 26 కోట్ల 30 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతున్నది. కానీ అందులో 25 శాతం తినకుండా మిగిలిపోతుంది. ఎక్కువ పోషక విలువలు కలిగిన ఇలాంటి ఆహార పదార్థాల నష్టాన్ని, వృథాను తగ్గించగిలిగితే పోషక విలువల ప్రయోజనాలు సమకూరడంతోపాటు స్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి వీలవుతుంది.
-ప్రపంచ స్థాయిలో ఉత్పత్తి అవుతున్న ఆహార పదార్థాల్లో మనకు కావాల్సిన దానికంటే 22 శాతం అధికంగా విటమిన్-A ఉంటున్నది. కానీ ఆహార నష్టం, వృథా అనంతరం విటమిన్-A శాతం మనకు కావాల్సిన దానికంటే 11 శాతం తక్కువకు పడిపోతున్నది.

వివిధ దేశాల్లో ఆహార నష్టం తీరు


-ఎఫ్ నివేదిక ప్రకారం.. తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో పంటకోత సమయాల్లో ఆహార పదార్థాల నష్టం ఎక్కువగా ఉంటుంది. నిలువ, ప్రాసెసింగ్, రవాణా సందర్భాల్లో కూడా నష్టం ఎక్కువగానే కనిపిస్తుంది. పై నాలుగు స్థాయిల్లో కలిపి 40 శాతం వరకు పంట నష్టం జరుగుతున్నది. కానీ అధిక ఆదాయ దేశాల్లో నష్టం రిటైల్, వినియోగ స్థాయిల్లో ఎక్కువగా ఉంటుంది. పై రెండు స్థాయిల్లోనే 40 శాతానికిపైగా ఆహారం వృథా అవుతున్నది.
-పండ్లు, కూరగాయల ఉత్పత్తులకు సంబంధించి జపాన్, చైనా, దక్షిణకొరియా మినహా అన్ని దేశాల్లో నష్టం ఎక్కువగా ఉన్నది. యూరప్, ఉత్తర అమెరికా & ఓషియేనియా దేశాల్లో వినియోగదారుల స్థాయిలో నష్టం ఎక్కువగా ఉండగా.. ఆఫ్రికా, సౌత్ & సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో రవాణా సందర్భంగా నష్టం ఎక్కువగా ఉన్నది.
-మాంసం ఉత్పత్తులకు సంబంధించి ఆఫ్రికా దేశాల్లో నష్టం ఎక్కువగా ఉన్నది.
-సముద్ర చేపల ఉత్పత్తికి సంబంధించి ఉత్తర అమెరికా & ఓషియేనియా దేశాల్లో నష్టం ఎక్కువగా ఉన్నది.
-పాలు, పాల సంబంధ ఉత్పత్తుల్లో నష్టం ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉన్నది.
-నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి ఆఫ్రికా, ఉత్తర అమెరికా, వెస్ట్ & సెంట్రల్ ఏషియా, సౌత్ & సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో నష్టం ఎక్కువగా ఉన్నది.

ఎలాంటి చర్యలు తీసుకోవాలి?


-పంటలు కోసింది మొదలు ఆయా ఆహార ఉత్పత్తులు వినియోగదారుల వంటిళ్లలోకి చేరడం వరకు ఎన్నో దశలుగా ఫుడ్ సప్లయ్ చైన్ కొనసాగుతుంది. ఇందులో రైతులు, చిరు వ్యాపారులు, బడా వ్యాపారులు, వినియోగదారుల వరకు ఎంతో మందికి భాగస్వామ్యం ఉంటుంది. ఆహార నష్టాన్ని, వృథాను తగ్గించడంవల్ల కలిగే ప్రయోజనాలపై వారందరిలో చైతన్యం తీసుకురావాలి.
-ఆహార వ్యవస్థలో పోషక విలువల నిలుపుదల కోసం ఆచరణాత్మక చర్యలు చేపట్టాలి. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం మొదలైన వాటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. కానీ త్వరగా పాడైపోతాయి. ఇలాంటి అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఎక్కువకాలం నాణ్యత కోల్పోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
-సమర్థవంతమైన ఆహారవ్యవస్థల నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలి. సౌకర్యవంతమైన మార్కెట్లు, గోదాముల నిర్వహణ ఆహార నష్టం, వృథాను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
-ఆహర ఉత్పత్తుల్లో పోషక విలువల నష్టాన్ని నిలువరించడం కోసం శాస్త్రవేత్తలు నూతన పరిష్కార మార్గాలు సూచించేలా పరిశోధనలను ప్రోత్సహించాలి. అధిక పోషక విలువలు కలిగిన ఆహార వృథాను తగ్గించడంలో నూతన సాంకేతిక ఆవిష్కరణలు ఉపయోగపడుతాయి.
-ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది నష్టపోతున్న, వృథా అవుతున్న ఆహారం విలువ ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో సుమారుగా 72 లక్షల కోట్ల రూపాయలు. ఈ వృథాను తగ్గించుకోవడంవల్ల ఆహార కొరత తీవ్రత తగ్గడమేగాక ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా బలోపేతమవుతాయి. ఇప్పటికే ఉత్పత్తి అయిన ఆహార పదార్థాలను వృథా చేయకుండా వినియోగించుకోవడంవల్ల.. ఆ మేరకు ఆహార ఉత్పత్తికి అవసరమయ్యే సాగునీరు, విద్యుత్తు, భూసారం వృథాను కూడా తగ్గించినట్లవుతుంది.

ఆహార నష్టం, వృథాకు మధ్య తేడా?


-ఆహార నష్టం: ఆహార పదార్థాల పరిమాణం, నాణ్యతలో తరుగుదలను ఆహార నష్టం అంటారు. పంటల సాగు, రవాణా, ప్యాకేజింగ్ వంటి సందర్భాల్లో పంట నష్టం వాటిల్లుంతుంది. పంటలు కోసినప్పుడు, మిల్లులకు, మార్కెట్లకు రవాణా చేసినప్పుడు, ప్రాసెసింగ్ అనంతరం బస్తాల్లో నింపేటప్పుడు పరిమాణం పరంగా ఆహారపదార్థాల్లో తరుగు ఏర్పడుతుంది. పై సందర్భాల్లో బ్యాక్టీరియా, శిలీంధ్రాల దాడులవల్ల ఆహార పదార్థాల నాణ్యత లోపిస్తుంది.
-ఆహార వృథా: ఆహార పదార్థాలు వివిధ కారణాలవల్ల తినడానికి పనికిరాకుండా చెడిపోవడాన్ని ఆహార వృథా అంటారు. ప్రాసెసింగ్ పూర్తయ్యి రిటైల్ మార్కెట్లకు చేరిన ఆహార పదార్థాలు వివిధ కారణాలవల్ల (సరిగా నిలువ చేయకపోవడం, ఎక్కువకాలం అమ్ముడుపోక నిలువ ఉండటం మొదలైనవి) వృథా అవుతాయి. ఇండ్లలో సరైన పద్ధతిలో నిలువ చేసుకోకపోవడం, అవసరానికి మించి వండుకుని పడేయడంవల్ల ఆహార వృథా జరుగుతుంది.
-అల్ప ఆదాయంగల దేశాల్లో పంటల సాగు, రవాణా, నిలువ కోసం సంతృప్తికరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆయా స్థాయిల్లో ఆహార నష్టం ఎక్కువగా వాటిల్లుతుంది. కానీ అధిక ఆదాయంగల దేశాల్లో మెరుగైన సదుపాయాలు ఉండటంవల్ల ఆహార నష్టం తక్కువగా ఉంటుంది. అధిక ఆదాయంగల దేశాల్లో రిటైల్, వినియోగదారుల స్థాయిలో ఆహార వృథా ఎక్కువగా జరుగుతుంది. అవసరానికి మించి ఆహార పదార్థాల నిలువ, తినడానికంటే ఎక్కువగా పారబోయడం వంటివి ఇందుకు కారణం. కానీ అల్ప ఆదాయంగల దేశాల్లో ఈ వృథా చాలా తక్కువగా ఉంటుంది.
తోట నాగరాజు

499
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles