కరెంట్ అఫైర్స్


Wed,October 10, 2018 12:58 AM

Telangana

సుద్దాల పురస్కారం

ప్రముఖ జానపద కళాకారుడు జయరాజ్‌కు 2018 ఏడాదికిగాను సుద్దాల హన్మంతు-జానకమ్మ జాతీయ అవార్డు ప్రకటించారు. ఈ నెల 14న ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
Jayraj

న్యూ ఎకానమీ ఫోరం

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు ఏర్పాటు చేయనున్న బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరం సమావేశాలకు రాష్ట్ర మంత్రి కే తారకరామారావుకు ఆహ్వానం అందింది. నవంబర్ 6, 7 తేదీల్లో సింగపూర్‌లో జరిగే ఈ సమావేశాలకు వ్యవస్థాపక ప్రతినిధిగా హాజరుకావాలని సమావేశాల నిర్వాహకులు కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు.

Persons
R-N-Ravi

పంకజ్ శర్మ

ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ కాన్ఫరెన్స్‌లో భారత రాయబారిగా పంకజ్ శర్మ నియమితులయ్యారు. ఆయన భారత శాశ్వత ప్రతినిధిగా కూడా ఉంటారు. అమన్‌దీప్ గిల్ స్థానంలో పంకజ్‌శర్మను నియమిస్తున్నట్లు విదేశాంగశాఖ అక్టోబర్ 5న ప్రకటించింది. నిరాయుధీకరణ కాన్ఫరెన్స్ (సీడీ) ఐరాస అనుబంధ సంస్థ కాదు. ఐరాస ప్రధానకార్యదర్శి వ్యక్తిగత ప్రాతినిధ్యం ద్వారా ఐరాసతో కలిసి పనిచేస్తున్నది. దీనిని 1979లో ఏర్పాటు చేశారు.

ఆర్‌ఎన్ రవి

జాతీయ భద్రత డిప్యూటీ సలహాదారుగా జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆర్‌ఎన్ రవిని కేంద్ర హోంశాఖ నియమించింది. రవి 1976 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం భారత్‌లో మూడంచెల భద్రతా విధానం ఉంది. ప్రధాని నేతృత్వంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ (ఎస్‌పీజీ), నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డు (ఎన్‌ఎస్‌ఏబీ) ఉన్నాయి.

జస్టిస్ సురేశ్‌కుమార్

హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్‌కుమార్ కెయిత్ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన బదిలీ కోసం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసును రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆమోదించారు.

National
mango

డాల్ఫిన్ రిసెర్చ్ సెంటర్

భారత్‌తోపాటు ఆసియాలోనే మొదటి జాతీయ డాల్ఫిన్ రిసెర్చ్ సెంటర్ (ఎన్‌డీఆర్‌సీ)ను బీహార్ రాజధాని పట్నాలోని పట్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేయనున్నారు. గంగా పరీవాహక ప్రాంతంలో నెలకొల్పిన ఈ కేంద్రంలో గంగా డాల్ఫిన్లను సంరక్షిస్తారు. అంతరించిపోయే దశలో ఉన్న గంగా డాల్ఫిన్లలో సగం వరకు బీహార్ రాష్ట్రంలోనే ఉన్నాయి. డాల్ఫిన్ డే సందర్భంగా అక్టోబర్ 5న కేంద్ర ప్రభుత్వం ఎన్‌డీఆర్‌సీ ఏర్పాటు ప్రకటన చేసింది.

అసోచామ్

దేశంలో ఐటీ పరిశ్రమల అత్యున్నత సంస్థ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్విసెస్ కంపెనీస్ (అసోచామ్) తన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని హర్యానాలోని గురుగ్రామ్‌లో ఏర్పాటుచేసింది. హర్యానా ప్రభుత్వం, కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది.

స్వచ్చ సర్వేక్షణ్ అవార్డ్స్

2018 ఏడాదికిగాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ రాష్ట్రంగా హర్యానా మొదటి స్థానంలో నిలిచింది. గుజరాత్, మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఉత్తమ జిల్లాగా మహారాష్ట్రలోని సతారా నిలిచింది. రెండో స్థానంలో హర్యానాలోని రెవారీ, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో అత్యధిక మంది పౌరులు పాల్గొన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది.

అల్ఫోన్సో మామిడికి జీఐ గుర్తింపు

మహారాష్ట్రలో పండించే అల్ఫోన్సో మామిడికి జియోగ్రాఫికల్ (జీఐ) ఇండికేషన్ గుర్తింపు లభించింది. రత్నగిరి, పాల్ఘాట్, సింధుదుర్గ్, థానె, రాయ్‌గఢ్ జిల్లాల్లో పండించే ఈ రకం మామిడికి జీఐ గుర్తింపు ఇచ్చినట్లు చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అండ్ ఇంటెలిజెన్స్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా సంస్థ అక్టోబర్ 5న ప్రకటించింది. అల్ఫోన్సో మామిడిని మహారాష్ట్రలో హపుస్ అని పిలుస్తారు. అల్ఫోన్సో చేరికతో జీఐ గుర్తింపు పొందిన భారతీయ ఉత్పత్తుల సంఖ్య 325కు చేరింది. జీఐ గుర్తింపు పదేండ్లపాటు చెల్లుబాటవుతుంది.

డిజీ యాత్ర

దేశంలోని విమానాశ్రయాల్లో ప్రయాణికులకు బయోమెట్రిక్ చెకప్‌కు ఉద్దేశించిన డిజీ యాత్ర కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయానశాఖ అక్టోబర్ 4న ప్రారంభించింది. విమానాశ్రయాల్లో పేపర్ రహిత సేవలకు, త్వరిత చెకప్ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను లక్నోలో అక్టోబర్ 6న నిర్వహించారు. శాస్త్ర సాంకేతికరంగంలో వేగవంతమైన అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పృథ్వీ-2

అణ్వాయుధాలను మోసుకెళ్లగిలిగే స్వల్పశ్రేణి క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్‌లో గల క్షిపణి ప్రయోగ కేంద్రం నుంచి అక్టోబర్ 5న విజయవంతంగా పరీక్షించారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై గల లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి పరిధి 350 కిలోమీటర్లు.

ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్

ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) 26వ వార్షిక వేడుకలను అక్టోబర్ 7న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రారంభించారు. 1991లో ప్రారంభించిన దీని బెటాలియన్లు హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, అలహాబాద్, ముంబై, అలీగఢ్, కోయంబత్తూరు, జంషెడ్‌పూర్, భోపాల్, మీరట్‌లలో ఉన్నాయి.

International
Modi-Putin

ఢిల్లీ డిక్లరేషన్

హిందూ మహాసముద్ర ప్రాంతంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఢిల్లీ డిక్లరేషన్‌ను హిందూ మహాసముద్ర పరివేష్టిత దేశాల కూటమి (ఐవోఆర్‌ఏ)లోని 21 దేశాలు స్వీకరించాయి. ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ఇటీవల రెండో గ్లోబల్ రీ ఇన్వెస్ట్ ఇండియా ఐఎస్‌ఏ పార్టనర్‌షిప్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా నిర్వహించిన రెండో ఐవోఆర్‌ఏ పునరుత్పాదక ఇంధన వనరులశాఖ మంత్రుల సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్‌ను స్వీకరించారు. ఐవోఆర్‌ఏను 1997లో ఏర్పాటు చేశారు.

సహ్యోగ్ హాప్ టీఏసీ-2018

భారత్, వియత్నాం తీర రక్షక దళాల సంయుక్త విన్యాసాలు సహ్యోగ్ హెచ్‌ఓపీ టీఏసీ 2018 పేరుతో బంగాళాఖాతంలోని చెన్నై తీరంలో నిర్వహించారు. ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి విన్యాసాలు జరుగడం ఇదే మొదటిసారి. సముద్రంలో పౌరుల ప్రాణ రక్షణ విషయంలో రెండు దేశాల కోస్ట్ గార్డ్స్ మధ్య సహకారం ఈ విన్యాసాల్లో ప్రధాన అంశం.

పుతిన్ పర్యటన

భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్టోబర్ 5న భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో జరిపిన చర్చల్లో రెండు దేశాల మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. రూ.36 వేల కోట్లతో ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థల కొనుగోలు ఇందులో అతి ముఖ్యమైనది. వచ్చే రెండేండ్లలో రష్యా భారత్‌కు ఐదు ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థలను సరఫరా చేస్తుంది.

Sports
Prithvi-shaw

జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్

ఫెనెస్టా ఓపెన్ జాతీయ చాంపియన్‌షిప్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన సామ సాత్విక మహిళల డబుల్స్ టైటిల్ సాధించింది. ఢిల్లీలో అక్టోబర్ 5న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక, మహక్‌జైన్ జంట షేక్ హుమేరా, సారా దేవ్ జంటను ఓడించి టైటిల్ నెగ్గింది.

పృథ్వీ షా

భారత క్రికెట్ జట్టు తరఫున అతిచిన్న వయసులో టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా పృథ్వీ షా రికార్డు సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. 18 ఏండ్ల 329 రోజుల వయసులో పృథ్వీ షా తన తొలి టెస్టు సెంచరీ చేశాడు. అతనికంటే ముందు (సచిన్ టెండూల్కర్ 17 ఏండ్ల 107 రోజులు) ముందున్నాడు. అంతేకాకుండా తొలి టెస్టులోనే సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా షా నిలిచాడు.

జపాన్ గ్రాండ్ ప్రి

జపాన్ గ్రాండ్ ప్రి ఫార్ములా 1 టైటిల్‌ను మెర్సిడెజ్ బెంజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 7న జరిగిన ఈ రేసును అతడు గంట 27 నిమిషాల 17.062 సెకన్లలో పూర్తిచేశాడు. ఈ ఏడాది హామిల్టన్‌కు ఇది తొమ్మిదో ఫార్ములా 1 టైటిల్

హర్షకు గ్రాండ్ మాస్టర్ హోదా

హైదరాబాద్ చెస్ క్రీడాకారుడు హర్ష భరత్‌కోటి (18) గ్రాండ్ మాస్టర్ హోదా సాధించాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న గుజరాత్ ఓపెస్ అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో వరుసగా నాలుగు విజయాలు తన ఖాతాలో వేసుకొని గ్రాండ్ మాస్టర్ హోదా సాధించాడు. భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్స్ హోదా పొందిన 56వ వ్యక్తి

ఆసియా కప్ అండర్ 19 క్రికెట్

ఆసియా కప్ అండర్ 19 చాంపియన్‌షిప్‌ను భారత్ గెలుచుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అక్టోబర్ 7న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టును సిమ్రన్‌సింగ్ నేతృత్వంలోని భారత జట్టు 144 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది.

పారా ఆసియా క్రీడలు

ఇండోనేషియా రాజధాని జకార్తాలో అక్టోబర్ 8న ప్రారంభమైన పారా ఆసియా క్రీడల్లో తొలిరోజు భారత్ 5 పతకాలు సాధించింది. 49 కేజీల పవర్ లిఫ్టింట్‌లో ఫర్మాన్ బాషా రజతం గెలుచుకోగా, పరంజీత్ కుమార్ కాంస్యం నెగ్గాడు. మహిళల స్విమ్మింగ్ బటర్‌ైఫ్లె 100 మీటర్ల విభాగంలో దేవాన్షికి రజతం లభించింది. పురుషుల 200 మీటర్ల మెడ్లేలో సుయశ్‌జాదవ్ కాంస్యం నెగ్గాడు.

అండర్ 16 స్నూకర్

అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య ప్రపంచ అండర్ 16 స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి కీర్తన పాండియన్ విజేతగా నిలిచింది. ముంబైలో అక్టోబర్ 7న జరిగిన మ్యాచ్‌లో బెలారస్‌కు చెందిన అల్బీనా సెల్‌చుక్‌పై 3-1 ఫ్రేమ్‌ల తేడాతో ఆమె విజయం సాధించింది.

ప్రో కబడ్డీ

ప్రో కబడ్డీ ఆరో సీజన్ అక్టోబర్ 7న ప్రారంభమైంది. చెన్నైలో ప్రారంభమైన సీజన్ తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు 42-26 తేడాతో పట్నా పైరేట్స్ జట్టును ఓడించింది.

యూత్ ఒలింపిక్స్

అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో అక్టోబర్ 7న యూత్ ఒలింపిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు పోటీల్లో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో తుషార్ మానే రజతం నెగ్గాడు. మహిళల జూడో 44 కేజీల విభాగంలో తబాబి దేవి తంగ్జామ్ వెనెజులాకు చెందిన మరియా జిమినెజ్ చేతిలో ఓడి రజతం సాధించింది.
VemulaSaidulu

930
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles