మేధకు పదును కేవీపీవై


Wed,July 11, 2018 02:16 AM

Science
మనిషి దైనందిన జీవితంలో సైన్స్ నేడు అత్యంత కీలకంగా మారింది. భూగోళంపై ప్రతిక్షణం ఏదో ఒకచోట కొంగొత్త ఆవిష్కరణలు పురుడుపోసుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం మనిషి అవసరాలు తీర్చడంలో సైన్స్‌దే కీలకపాత్ర కావటంతో వివిధరకాల సాంకేతికతల అభివృద్ధికి ప్రభుత్వాలు అధికప్రాధాన్యం ఇస్తున్నాయి. మనదేశంలో కూడా వైజ్ఞానిక పరిశోధనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా సైన్స్ అనుబంధ రంగాల్లో ఉన్నత విద్యనభ్యసించే వారికోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ స్కీమే కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై). ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు. కేవీపీవై -2018 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వివరాలు నిపుణ పాఠకుల కోసం సంక్షిప్తంగా....

కేవీపీవై

- కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)ను భారత ప్రభుత్వ పరిధిలోని డీఎస్‌టీ 1999లో ప్రారంభించింది. బేసిక్ సైన్సెస్ చదివేవారిని, సైన్స్‌లో రిసెర్చ్ కెరీర్ తీసుకొనేవారిని ప్రోత్సహించి దేశంలో సైన్స్ పరిశోధనలను మరింత పెంచడానికి దీన్ని ప్రారంభించారు.
- ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు ప్రీ పీహెచ్‌డీ వరకు ఐదేండ్లపాటు ఉపకారవేతనాలు, కంటింజెన్సీ గ్రాంట్‌ను అందిస్తారు.
- కేవీపీవైని బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)తోపాటు మేనేజ్‌మెంట్ కమిటీ, నేషనల్ అడ్వైజరీ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తాయి.
- సమ్మర్ ప్రోగ్రామ్: కేవీపీవై ఫెలోషిప్‌లో సమ్మర్‌ప్రోగ్రామ్ చాలా ముఖ్యమైంది. సైంటిఫిక్ సెర్చ్ కోసం వీటిని వేసవి సెలవుల్లో నిర్వహిస్తారు. నిష్ణాతులైన ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు దీనిలో పాల్గొంటారు. సమ్మర్ క్యాంప్‌కు దగ్గర్లోని ప్రముఖ ల్యాబ్‌లు, సంస్థలను సందర్శించడం, అక్కడి పనితీరును గమనించడం వంటివి ఉంటాయి. సమ్మర్‌క్యాంప్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)- కోల్‌కతా, పుణె, భోపాల్, మొహాలి, త్రివేండ్రం ఒక వారం నిర్వహిస్తాయి. ఒక్కోసారి రెండు వారాలు ఉంటుంది.

ప్రత్యేక సౌకర్యాలు

- కేవీపీవై ఫెలోకు ప్రత్యేక ఐడెంటిటీకార్డు ఇస్తారు. దీంతో నేషనల్ ల్యాబొరేటరీలకు, యూనివర్సిటీల్లో ప్రత్యేక ప్రవేశం కల్పిస్తారు. వీటితోపాటు లైబ్రరీ, ల్యాబ్‌లను ఉపయోగించుకొనే అవకాశం కల్పిస్తారు.

కేవీపీవై లక్ష్యం

- కేవీపీవై ఫెలోషిప్ ద్వారా విద్యార్థులను మోటివేట్ చేయడం, బేసిక్ సైన్సెస్‌లో రిసెర్చ్ చేసేలా ప్రేరేపించడం ప్రధాన లక్ష్యం. భవిష్యత్‌లో విద్యార్థులు రిసెర్చ్‌ను కెరీర్‌గా ఎన్నుకొనే విధంగా సిద్ధం చేస్తుంది.

అర్హతలు

- స్ట్రీమ్ ఎస్‌ఏ: 2018-19 ఇంటర్ మొదటి సంవత్సరంలో (XI) సైన్స్ సబ్జెక్టు ఎన్‌రోల్ చేసుకొని, పదోతరగతిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 75 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ- 65 శాతం) తెచ్చుకున్నవారు అర్హులు. వీరికి ఫెలోషిప్ మాత్రం బేసిక్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను (బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బీమ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఎంఎస్) 2020-21లో చదివేవారికి ఇస్తారు. అదేవిధంగా ఇంటర్ సెకండియర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. మొదటి సంవత్సరంలో ఎంపికైనవారికి నేషనల్ సైన్స్ క్యాంప్‌లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించి ప్రయాణ ఖర్చులు, సౌకర్యాలను కేవీపీవై కల్పిస్తుంది.

స్ట్రీమ్ ఎస్‌ఎక్స్

- 2018-19 విద్యాసంవత్సరంలో సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు భవిష్యత్‌లో అండర్ గ్రాడ్యుయేట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి బేసిక్ సైన్స్ చదివేవారు. అయితే వీరు పదోతరగతి స్థాయిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి.

స్ట్రీమ్ ఎస్‌బీ

- బేసిక్ సైన్సెస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ మొదటి సంవత్సరం చదువుతున్నవారు. 2018-19 విద్యాసంవత్సరంలో ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు మొదటి సంవత్సరం కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన తర్వాతనే ఈ ఫెలోషిప్‌ను ఇస్తారు.

ఏ కోర్సులు చదివేవారికి ఇస్తారు

- బేసిక్ సైన్సెస్ అంటే.. బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బీమ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ ఇన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, సెల్ బయాలజీ, ఎకాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జియాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజియాలజీ, బయోటెక్నాలజీ, న్యూరోసైన్సెస్, బయోఇన్ఫర్మాటిక్స్, మెరైన్ బయాలజీ, హ్యూమన్ బయాలజీ, జెనెటిక్స్, బయోమెడికల్ సైన్సెస్, అప్లయిడ్ సైన్సెస్, జియోఫిజిక్స్, మెటీరియల్ సైన్సెస్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ చదివేవారు కేవీపీవైకి అర్హులు.

ఎంపిక విధానం

- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను స్క్రూటిని చేసి ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. దీన్ని 2018, నవంబర్4న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ టెస్ట్ ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది. ఆన్‌లైన్ మోడ్‌లో దీన్ని నిర్వహిస్తారు.

- ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో చూపించిన ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఎంపికకు ఇంటర్వ్యూ తుది దశ.

ఆప్టిట్యూడ్ టెస్ట్

- మల్టిపుల్‌చాయిస్ పద్ధతిలో ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి మూడుగంటలు.
- విద్యార్థుల అనలిటికల్ ఎబిలిటీని పరీక్షిస్తారు. స్ట్రీమ్‌లను బట్టి పదోతరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్/సెంకండియర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఆధారంగా దీన్ని నిర్వహిస్తారు.
- పరీక్ష పార్ట్- 1, 2లుగా ఉంటుంది. పార్ట్-1లో మ్యాథ్స్- 15, ఫిజిక్స్- 15, కెమిస్ట్రీ- 15, బయాలజీ- 15 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి 1 మార్కు. పార్ట్ - 2లో ప్రతి సబ్జెక్టు నుంచి 5 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు.

- దరఖాస్తు: జూలై 11 నుంచి ప్రారంభం
- చివరితేదీ: ఆగస్టు 31
- పరీక్షతేదీ: నవంబర్ 4
- వెబ్‌సైట్: http://kvpy.iisc.ernet.in
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1020
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles