కరెంట్ అఫైర్స్


Wed,July 11, 2018 02:00 AM

Narasimha-Reddy
Telangana

జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్‌సీయూ చాన్స్‌లర్‌గా
(హెచ్‌సీయూ) చాన్స్‌లర్‌గా పాట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నియమితులయ్యారు. ఆయన మూడేండ్లపాటు పదవిలో కొనసాగుతారు. ఇప్పటివరకు హెచ్‌సీయూ చాన్స్‌లర్‌గా ఆర్బీఐ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ ఉన్నారు.

ట్రాన్స్‌కో సీఎండీకి పురస్కారం

తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుకు ఎకనమిక్ టైమ్స్ వార్షిక అవార్డు ప్రకటించింది. జూలై 5న ది ఎకనమిక్స్ టైమ్స్ ఐదో వార్షిక విద్యుత్ సదస్సులో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బబుల్ సుప్రియో ఈ అవార్డును అందజేశారు.

కేటీపీఎస్‌లో ఏడో దశ విద్యుత్పత్తి ప్రారంభం

తెలంగాణలోని 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఏడో దశలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. దేశంలో వేగంగా నిర్మితమైన విద్యుత్ ప్రాజెక్టు, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రారంభించి, పూర్తిచేసిన మొదటి ప్రాజెక్టుకుగా ఇది గుర్తింపు పొందింది.

గిరిజన వికాస్ ప్రారంభం

గిరిజన విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం కోసం తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ గిరిజన వికాస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు పరిధిలోని గిరిజన పాఠశాలల్లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ కార్యక్రమాన్ని జూలై 6న ప్రారంభించారు.

తెలంగాణ పోస్టల్‌కు అవార్డులు

ఆధార నమోదులో సమర్థంగా పనిచేసిన పోస్టల్ విభాగాలకు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఇండియా (యూఐడీఏ) మూడు కేటగిరీల్లో 66 అవార్డులను ప్రకటించగా తెలంగాణ సర్కిల్‌కు మూడు అవార్డులు లభించాయి. ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటులో వేగవంతంగా పనిచేసిన కేటగిరీలో తెలంగాణ పోస్టల్ సర్కిల్‌కు మూడో ర్యాంకు వచ్చింది. తొలి రెండు స్థానాల్లో పంజాబ్, బీహార్ నిలిచాయి. ఈ నెల 11న న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
Q-escape
National

క్రూ ఎస్కేప్ సిస్టమ్ విజయవంతం

వ్యోమగాములను కాపాడేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను ఇస్రో తొలిసారి జూలై 5న విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. మానవ సహిత అంతరిక్ష నౌకలను ప్రయోగించే సమయంలో ఏదైనా ప్రమాదం తలెత్తితే క్రూ ఎస్కేప్ సిస్టమ్ వెంటనే అప్రమత్తమై వ్యోమగాములున్న మాడ్యూల్‌ను రాకెట్ నుంచి వేరుచేసి సురక్షితంగా దిగేలా చేస్తుంది. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా మాత్రమే సొంతంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాయి.

నౌకాదళ మాజీ అధిపతి మృతి

నౌకాదళ మాజీ అధిపతి నాదకర్ణి మృతిచెందారు. 1961లో గోవా విముక్తి పోరాటం, 1971లో భారత్, పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్నారు.

ఎన్జీటీ చైర్‌పర్సన్‌గా ఏకే గోయల్

నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆదర్శకుమార్ గోయల్ నియమితులయ్యారు. ఐదేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఒడిశా, గువాహటి, పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. జూలై 6న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంతర్‌కుమార్ 2017, డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు.

రామస్వామికి బాలమురళీకృష్ణ అవార్డు

మంగళంపల్లి బాలమురళీకృష్ణ జాతీయ పురస్కారాన్ని వయోలిన్ విద్యాంసుడు అన్నవరపు రామస్వామి అందుకున్నారు. పురస్కారం కింద రూ. 10 లక్షల నగదు, జ్ఞాపిక, ధ్రువపత్రం అందజేశారు.

అత్యుత్తమ వర్సిటీ జేఎన్‌యూ

మార్కెటింగ్ అండ్ డెవలప్‌మెంట్ రిసెర్చ్ అసోసియేట్స్ సహకారంతో ఇండియాటుడే దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థలను ఎంపిక చేసింది. ఇందుకోసం విద్యాప్రమాణాలు, వ్యక్తిత్వ, పరిశోధనల నాణ్యత, నాయకత్వ లక్షణాల అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. 700 యూనివర్సిటీలను పరిశీలించగా మొదటి స్థానంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, రెండో స్థానంలో ఢిల్లీ యూనివర్సిటీ, మూడో స్థానంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నాలుగో స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీ నిలిచింది.

ట్రంప్ యంత్రాంగంలో భారతీయుడు

భారత సంతతికి చెందిన ఉత్తమ్ ధిల్లాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలోని డ్రగ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. అమెరికాలో మత్తు పదార్థాల వాడకాన్ని నిరోధించడానికి ఈ ఏజెన్సీ పనిచేస్తుంది. రాబర్ట్ పాటర్సన్ పదవీ విరమణతో ఆయన స్థానంలో ధిల్లాన్‌ను ప్రభుత్వం నియమించింది.

ఎన్నికల కమిషన్ కొత్తయాప్ సీవిజిల్

ఎన్నికల సమయంలో డబ్బులు పంచడం, ఓటర్లను ప్రలోభపెట్టడం, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వంటి వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను పంపించేందుకు ఎన్నికల కమిషన్ యాప్‌ను రూపొందింది. ఈ యాప్‌కు సీవిజల్ అని పేరు పెట్టారు. ఈ ఏడాది ఆఖరులో జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని అందుబాటులోకి తేనున్నారు.
Keisuke-Honda
Sports

కీసుకె హోండా వీడ్కోలు

ఫుట్‌బాల్ అంతర్జాతీయ కెరీర్‌కు జపాన్ కీలక ఆటగాడు కీసుకె హోండా వీడ్కోలు పలికాడు. ఫిఫా ప్రపంచ కప్‌లో ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం చేతిలో జపాన్ ఓడిపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జపాన్ తరఫున అత్యధికంగా 98 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హోండా 37 గోల్స్ చేశారు.

18వ ఆసియా క్రీడలు

2018, ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఇండోనేషియా రాజధాని జకర్తాలో 18వ ఆసియా క్రీడలను నిర్వహించనున్నారు. 36 క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పోటీ పడనున్నారు. భారత్ నుంచి 524 మంది క్రీడాకారుల బృందం పాల్గొనున్నది. 1951, 1982లో రెండు సార్లు ఢిల్లీలో ఆసియా క్రీడలను నిర్వహించారు.

సాయ్ పేరు మార్పు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పేరును కేంద్ర క్రీడల శాఖ స్పోర్ట్స్ ఇండియాగా మార్చింది. 1984లో సాయ్‌ను ఏర్పాటు చేశారు.
Modi
International

నవాజ్ షరీఫ్‌కు జైలు

అక్రమ సంపాదన కేసులో పాకిస్థాన్ పదవీచ్యుత ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఇస్లామాబాద్‌లోని అవినీతి నిరోధక కోర్టు పదేండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆయన కుమార్తె మరియమ్‌కు ఏడేండ్ల కఠిన కారాగార శిక్ష, 20 లక్షల పౌండ్ల జరిమానా, అల్లుడు సఫ్దర్‌కు ఏడాది జైలుశిక్ష విధించారు.

భూటాన్ ప్రధాని భారత్ పర్యటన

జూలై 6, 7 తేదీల్లో భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్‌గేలు భారత్‌లో పర్యటించారు. రక్షణ, విదేశీ విధానం, ఆర్థిక, సామాజిక, భద్రత సహకారం తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు.

ఓమ్ షిన్రిక్యో నాయకుడి ఉరితీత

రసాయనిక దాడులకు పాల్పడిన ఓమ్ షిన్రిక్యో వర్గం నాయకుడు షోకో అసహారాతోపాటు అతడి ఆరుగురు అనుచరులను జపాన్ ప్రభుత్వం జూలై 6న ఉరితీసింది. 1995 మార్చిలో టోక్యోలోని సబ్‌వేలో ఆరు రైళ్లల్లో ఒకేసారి ప్రమాదకర సారిన్ వాయువును వదలడంతో 13 మంది మృతిచెందారు. 5800 మంది అస్వస్థతకు గురయ్యారు.

పాకిస్థాన్ ఎన్నికల్లో హిందూ మహిళ

పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్స్ శాసనసభ ఎన్నికల్లో తొలిసారి హిందూ మహిళ సునీత పర్‌మార్ పోటీచేస్తున్నారు. థార్‌పాకర్ జిల్లా సింధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

స్పైడర్‌మ్యాన్ సృష్టికర్త మృతి

స్పైడర్‌మ్యాన్ యానిమేషన్ సహా సృష్టికర్త స్టీవ్ డిట్కో న్యూయార్క్ నగరంలో జూలై 7న మృతిచెందారు. భారత సంతతి పరిశోధకుడు రవీందర్ రహియాకు రూ. 13.35 కోట్ల ప్రోత్సాహక బహుమతి లభించింది. స్పర్శ జ్ఞానం కలిగిన రోబో చర్మం అభివృద్ధి కోసం రవీందర్‌కు ఈ బహుమతి అందజేశారు.

మలేషియా మాజీ ప్రధాని అరెస్టు

జూలై 4న మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ అరెస్టయ్యారు. రాష్ర్టాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల నుంచి 700 బిలియన్ డాలర్లను తన సొంతానికి వినియోగించారన్న ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు.
Mexico
Persons

మెక్సికో అధ్యక్షుడిగా ఆమ్లో

నేషనల్ రీజనరేషన్ మూవ్‌మెంట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ (ఆమ్లో) మెక్సికో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 53 శాతం ఓట్లు వచ్చాయి. ఆధునిక మెక్సికో చరిత్రలో ఓ వామపక్ష నాయకుడు అధ్యక్షుడు కావడం ఇదే తొలిసారి. ఆమ్లో.. 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు.

ఎస్బీఐ ఎండీగా అరిజిత్ బసు

జూలై 2న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీ) ఎండీగా అరిజిత్ బసు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం బీ శ్రీరామ్‌ను.. ఐడీబీఐ మేనిజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమించడంతో ఆయన జూన్ 28న ఎస్బీఐ ఎండీ పదవికి రాజీనామా చేశారు.

యునైటెడ్ ఇండియా డైరెక్టర్‌గా విజయ్

జూలై 2న యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్టర్, జనరల్ మేనేజర్‌గా కేబీ విజయ్ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, జనరల్ మేనేజర్‌గా పనిచేశారు.

సెయిల్ చైర్మన్‌గా సరస్వతి ప్రసాద్

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సరస్వతి ప్రసాద్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉక్కు మంత్రిత్వశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా ప్రసాద్ పనిచేశారు. సెయిల్ సీఎండీ పీకే సింగ్ ఇటీవల పదవీ విరమణ చేశారు.
Vemula-Saidulu

2250
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles