ప్రతిభకే పట్టం


Wed,July 11, 2018 12:09 AM

GSR
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు అన్ని స్థాయిల్లో బయోమెట్రిక్ తప్పనిసరి.. ఈవెంట్స్‌లో పూర్తిగా టెక్నాలజీ వినియోగం
- తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు

ఈసారి రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డు, మహిళలు, ఎన్‌సీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంట్ అభ్యర్థులకు హారిజాంటల్ రిజర్వేషన్ విధానం అమలు చేస్తున్నాం. కమ్యూనిటీ రిజర్వేషన్లు పూర్తయిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్లలో అభ్యర్థులను ఎంపికచేస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ప్రక్రియను పూర్తిచేస్తాం.

రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద రిక్రూట్‌మెంట్. 18వేల పోస్టులు... ఏడులక్షల ఇరవైవేలమంది అభ్యర్థులు. మూడుదశల్లో ఎంపిక. ఒకవైపు పరీక్ష కోసం అభ్యర్థులు కఠోరశ్రమ, మరోవైపు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియామక ప్రక్రియలో నిమగ్నం. అభ్యర్థులకు రకరకాల సందేహాలు. మరికొందరికి అపోహలు, అనుమానాలు. లక్షలమంది రాసే పరీక్షపై అభ్యర్థులకు స్పష్టత కోసం, ఈసారి రిక్రూట్‌మెంట్‌లో మార్పులు, ప్రక్రియ వివరాలను అందించడం కోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావుతో
నిపుణ ప్రతినిధి చేసిన ఇంటర్వ్యూ..

రాష్ట్రంలో జరుగుతున్న భారీ పోలీస్ రిక్రూట్‌మెంట్. అభ్యర్థుల స్పందన ఎలా ఉంది?

-ఈసారి నోటిఫికేషన్ ద్వారా 18,428 పోస్టులను భర్తీ చేయనున్నాం. వీటి కోసం మొత్తం 7,10,840 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎస్‌ఐ పోస్టుకు 1,88,715. కానిస్టేబుల్ పోస్టులకు-4,79,166. ఐటీ ఎస్‌ఐ-13,944. ఏఎస్‌ఐ-7,700. కానిస్టేబుల్ (ఐటీ&సీ)-14,487. కానిస్టేబుల్ (డ్రైవర్)-13,458. కానిస్టేబుల్ (మెకానిక్)-1,871 దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా మహిళా అభ్యర్థుల నుంచి కూడా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా పరిశీలిస్తే ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య పెరిగింది. కానిస్టేబుల్ సంఖ్య కొంత తగ్గింది.

ఈసారి రిక్రూట్‌మెంట్‌లో ఎటువంటి మార్పులు చేశారు?

-పీఈటీ/పీఎంటీ విధానంలో పలు మార్పులు చేశాం. ఇక పరీక్ష విధానంలో లాంగ్వేజెస్ విషయంలో మార్పులు జరిగాయి.

VV-Srinivas

ఈవెంట్స్ విషయంలో ఏం మార్పులు చేశారు?

- ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో అర్హత సాధించినవారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. వీటిలో మొదట నిర్వహించేది శారీరక ప్రమాణాల పరీక్ష. దీనిలో ఎత్తు, ఛాతీ కొలతలు. వీటిని గతంలో టేప్‌తో కొలిచేవారు. సమయం ఎక్కువ పట్టేది. అంతేకాకుండా అక్కడక్కడ లోపాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈసారి నుంచి ఎత్తు, ఛాతీ రెండింటిని డిజిటల్ మీటర్ల ద్వారా సేకరిస్తున్నాం. దీని ద్వారా కచ్చితమైన రీడింగ్ వస్తుంది. వీటి కొలతలు వెంటనే కంప్యూటర్‌లో నమోదు కావడంతోపాటు ప్రధాన సర్వర్‌కు అనుసంధానమవుతాయి.

- ఇక ఫిజికల్ ఈవెంట్స్ విషయానికి వస్తే మొత్తం ఐదు/మూడు టెస్టులుంటాయి. వీటిని ఈసారి నుంచి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించనున్నాం. ఐదు ఈవెంట్లలో ఒక్క హైజంప్ తప్ప మిగిలిన అన్నింటిని ఆధునిక సాంకేతికత ఉపయోగించి రీడింగ్ నమోదు చేస్తాం. మొదట 100 మీటర్లు తర్వాత లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్‌లు నిర్వహించి చివరగా 800 మీటర్ల పరుగును నిర్వహిస్తాం. వీటికోసం ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ ఉపయోగించడంవల్ల ఆయా ఈవెంట్స్‌లో నమోదయ్యే రీడింగుల్లో కచ్చితత్వం ఉంటుంది. సాధారణంగా మ్యాన్యువల్ రీడింగ్ తీసినప్పుడు కొన్ని సెకన్లు వృథా అవుతుంది. ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీ ద్వారా ప్రతి అభ్యర్థికి 0.8 సెకన్ల సమయం ఆదా కావడంతోపాటు కచ్చితమైన సమయం నమోదవుతుంది. రన్నింగ్ ఈవెంట్‌లో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇక లాంగ్‌జంప్, షాట్‌పుట్‌లలో డిజిటల్ థియోడలైట్స్ అనే సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. దీన్ని సాధారణంగా సివిల్ ఇంజినీరింగ్‌లో ఉపయోగిస్తారు. దీనివల్ల అభ్యర్థి లాంగ్‌జంప్ చేయగానే అక్కడ లేజర్ గన్‌తో కట్‌చేస్తాం. వెంటనే ట్రాంగ్యులేషన్ మెథడ్‌లో రీడింగ్ కచ్చితంగా రికార్డు కావడంతోపాటు కంప్యూటర్‌లో నమోదవుతుంది. ఒక్క హైజంప్ మాత్రం పాతపద్ధతిలోనే నమోదు చేస్తున్నాం. రాబోయే పరీక్షల్లో దీనిలో కూడా ఆధునిక సాంకేతికతను ఉపయోగించేలా ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఈవెంట్‌కు సంబంధించిన రీడింగ్ నేరుగా కంప్యూటర్ ద్వారా ప్రధాన సర్వర్‌కు అనుసంధానమవుతుంది. దీనిలో మార్పులు చేయడానికి ఎటువవంటి ఆస్కారం ఉండదు.

ఈవెంట్స్ కోసం ఉదయం వచ్చిన అభ్యర్థులు సాయంత్రం/రాత్రి వరకు నిరీక్షించడంవల్ల సరైన ప్రతిభ చూపెట్టలేకపోతున్నారు. గత పరీక్షల్లో చాలామంది మెరిట్ స్టూడెంట్స్ విషయంలో ఇలా జరిగిందని విమర్శ?

- గతంలో ఈవెంట్స్‌లో పాల్గొనడానికి వచ్చిన అభ్యర్థులకు నమోదు ప్రక్రియలో జాప్యం జరిగేది. దీనివల్ల సమయం ఎక్కువగా తీసుకోవడమే కాకుండా మధ్యాహ్నం, రాత్రి లైట్స్ వేసి ఈవెంట్స్ నిర్వహించే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి నుంచి ప్రక్రియను సరళతరం చేశాం. మొదటి దశలో కేవలం ప్రాథమిక సమాచారమే తీసుకుంటున్నాం. కాబట్టి బయోమెట్రిక్‌తో గ్రౌండ్‌లోకి అనుమతిస్తారు. గతంలో ఒక అభ్యర్థిని గ్రౌండ్‌లోకి అనుమతించడానికి 21 నిమిషాలు సమయం పట్టేది. అంటే గంటకు ముగ్గురు ఇంకా వేగంగా చేస్తే నాలుగురిని మాత్రమే లోపలికి పంపిచేవారు. కానీ ఈసారి సాంకేతికత వల్ల చాలా సులువుగా అభ్యర్థులను గ్రౌండ్‌లోకి అనుమతించడం ఆ వెంటనే ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది.

- ఐదు ఈవెంట్స్‌ను కూడా ఒకే రోజులో పూర్తిచేస్తాం. దీనివల్ల అభ్యర్థుల అసలు ప్రతిభ తెలుస్తుంది. ఈవెంట్స్‌ను ఉదయం 6 నుంచి 10:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. రోజుకు 800 -1000 మంది అభ్యర్థులకు ఈవెంట్స్‌ను నిర్వహించేందకు ప్రయత్నిస్తున్నాం. మిట్ట మధ్యాహ్నం ఈవెంట్స్ నిర్వహించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

రెండు లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఈసారి పీఎంటీ ఒకేసారి నిర్వహిస్తున్నారా?

- అన్ని పోస్టులకు శారీరక ప్రమాణాలు ఒకేలా ఉన్నాయి. దీనివల్ల ఒక్కో పోస్టుకు ఒకసారి రీడింగ్ తీసుకోకుండా అన్నింటికి ఒకేసారి తీసుకుంటున్నాం. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ఆధునిక సాంకేతికతతో తీసుకున్న రీడింగ్‌వల్ల కచ్చితత్వం, సమయం కూడా ఆదా అవుతుంది. అందుకనే ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి రూ. 50/100 తగ్గించాం.

ప్రిలిమినరీ పరీక్షల్లో ఏమైనా మార్పులు చేశారా? ఎప్పుడు నిర్వహిస్తున్నారు?

- ప్రిలిమినరీ పరీక్షల్లో ఎటువంటి మార్పులు లేవు. ఈ పరీక్షను ఎస్‌ఐ పోస్టులకు ఆగస్టు 26న, టెక్నికల్ ఎస్‌ఐ పోస్టులకు సెప్టెంబర్ 2న ఉదయం, ఫింగర్‌ప్రింట్ పోస్టులకు సెప్టెంబర్ 2న మధ్యాహ్నం నిర్వహిస్తున్నాం. కానిస్టేబుల్ పోస్టులకు సెప్టెంబర్ 30న పరీక్ష నిర్వహిస్తున్నాం. పరీక్షలు ముగిసిన తర్వాత ఆక్టోబర్‌లో ఫలితాలను ప్రకటిస్తాం.

ఈవెంట్స్‌ను ఎప్పుడు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి?

- ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 30న ముగుస్తుంది. మొదట ఎస్‌ఐ ఫలితాలను ప్రకటించి అక్టోబర్ రెండు/మూడో వారం నుంచి ఈవెంట్స్‌ను నిర్వహిస్తాం. నవంబర్‌లో వీటిని పూర్తిచేస్తాం.

మెయిన్స్ ఎగ్జామ్‌ను ఎప్పుడు నిర్వహిస్తారు?

- మెయిన్స్ పరీక్షను డిసెంబర్/జనవరిలో నిర్వహిస్తాం. తుది ఫలితాలను ఫిబ్రవరిలో ప్రకటిస్తాం.

మెయిన్స్ ఎగ్జామ్‌లో ఏమైనా మార్పులు చేశారా?

- ఈసారి లాంగ్వేజెస్‌ను కేవలం అర్హత పరీక్షగా మార్చాం. ఇంగ్లిష్, ఎస్‌ఐలో తెలుగు/ఉర్దూలను కూడా కేవలం క్వాలిఫయింగ్ పరీక్షలుగా మార్చాం. ఇంగ్లిష్ విషయంలో 25 శాతం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, మిగిలిన 75 శాతం డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. లాంగ్వేజెస్ విషయంలో నెగెటివ్ మార్కింగ్ విధానం ప్రవేశ పెట్టాం. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తాం. ఇక్కడ ఒక విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.. లాంగ్వేజ్ పేపర్లు క్వాలిఫై అయితేనే మిగిలిన పేపర్లను వ్యాల్యుయేషన్ చేస్తారు. వీటిలో క్వాలిఫై కాకుంటే తదుపరి దశకు అనుమతించరు. అభ్యర్థులు వీటిని తక్కువ చేయకుండా శ్రద్ధ పెట్టి వీటిలో కనీస అర్హత మార్కులను సాధిస్తే మంచిది. గతంలో ఇంగ్లిష్ మార్కులను ఎస్‌ఐ పరీక్షలో తుది ఎంపికలో పరిగణలోకి తీసుకునేవారు. కానీ ఈసారి నుంచి కేవలం క్వాలిఫయింగ్ పరీక్షగా మార్చాం.

ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ ఒకేలా ఉంది. ప్రశ్నలు ఏ స్థాయిలో ఇస్తారు?

- కానిస్టేబుల్ పరీక్షలకు ఇంటర్, ఎస్‌ఐ పరీక్షలకు డిగ్రీస్థాయిలో ప్రశ్నలు ఇస్తాం. సిలబస్ ఒకేలా ఉన్నా ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో ప్రశ్నల తీరులో తేడా ఉంటుంది.

అభ్యర్థుల దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకునే అవకాశం ఉందా?

- అభ్యర్థుల్లో ఇప్పటికే సుమారు 2వేల మంది తప్పులను సరిచేసుకున్నారు. ప్రిలిమినరీ టెస్ట్‌పై ప్రభావం ఉన్న అంశాలు.. ముఖ్యంగా జనన తేదీ, జెండర్, ఎక్స్‌సర్వీస్‌మెన్, స్టేట్, పేరు, ఫొటో/సంతకం వంటి అంశాల్లో తప్పుగా నమోదైతే వీటిని జూలై 14లోగా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తే సవరిస్తాం. రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్‌తోపాటు తప్పు జరిగిన అంశాన్ని పేర్కొంటూ support@tsplrb.inకి మెయిల్ చేస్తే రిక్రూట్‌మెంట్ బోర్డు వాటిని సరిచేసి సమాచారాన్ని తెలియపరుస్తుంది.

పారదర్శకతకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అభ్యర్థుల్లో రకరకాల సందేహాలు ఉన్నాయి వీటిపై అభ్యర్థులకు మీరిచ్చే సందేశం?

పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. దరఖాస్తుల దగ్గర నుంచి తుది ఫలితాల ఎంపిక వరకు ప్రతి ఒక్క అంశాన్ని ఆధునిక సాంకేతికతతో జతచేస్తున్నాం. కాబట్టి ఎక్కడా పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈవెంట్స్‌లో డిజిటల్ పద్ధతిని ఉపయోగిస్తున్నాం. గతంలోలాగా కాకుండా ప్రిలిమ్స్ నుంచి ట్రెయినింగ్ సెంటర్‌కు వెళ్లేవరకు బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగిస్తున్నాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజున బయోమెట్రిక్, సంతకం, ఫొటో తీసుకుంటారు. ఈవెంట్స్ సమయంలో బయోమెట్రిక్‌తోనే గ్రౌండ్‌లోకి అనుమతిస్తారు. తర్వాత మెయిన్స్, ట్రెయినింగ్ సమయంలో కూడా వీటిని అనుసంధానిస్తున్నాం. దీనివల్ల ఒకరికి బదులుగా ఇంకొకరు పరీక్ష రాసే అవకాశం ఉండదు. నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపికైన అభ్యర్థుల మార్కులు, వివరాలను ప్రకటిస్తాం.

పోలీస్ ఉద్యోగాలపై ఆసక్తి పెరగడానికి కారణం?

- గతంలో పోలీస్ ఉద్యోగం అంటే కొంత విముఖత ఉండేది. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఉన్నత విద్యావంతులు కూడా కానిస్టేబుల్ పోస్టుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌శాఖ సంక్షేమానికి చేస్తున్న కార్యక్రమాలే ప్రధాన కారణం. ఇక జీతభత్యాల విషయానికి వస్తే దేశంలో అత్యున్నత వేతనం ఇచ్చే రాష్ర్టాల్లో మనదే అగ్రభాగాన ఉంది. కానిస్టేబుల్‌గా ప్రారంభ వేతనం అన్నీ కలిపి సుమారు రూ. 30 వేల వరకు, ఎస్‌ఐ పోస్టుకు రూ. 40 వేలకు పైగా వస్తుంది. సొంత జిల్లా, రాష్ట్రంలో మంచి జీతభత్యాలతో ప్రభుత్వ ఉద్యోగం కావడంవల్ల అభ్యర్థులు ఇటువైపు వస్తున్నారు.

ఎన్‌సీసీ సర్టిఫికెట్ విషయంలో మార్పులు చేశారా?

- ఎన్‌సీసీలో ఈసారి ప్రభుత్వ జీవో ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. గతంలో ఏ సర్టిఫికెట్‌ను అనుమతించేవారు. ఈసారి కేవలం బీ, సీ సర్టిఫికెట్స్ మాత్రమే అనుమతిస్తున్నాం. వీరికి సమానమైన మార్కులు వచ్చినప్పుడు సీ సర్టిఫికెట్‌కు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. మిగిలిన అంశాలను జీవో ద్వారా తెలుసుకోవచ్చు. క్రీడా విభాగంలో కూడా అంతర్జాతీయ, జాతీయస్థాయి క్రీడాకారులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నాం.

హారిజాంటల్ రిజర్వేషన్లు ...?

- ఈసారి రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డు, మహిళలు, ఎన్‌సీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంట్ అభ్యర్థులకు హారిజాంటల్ రిజర్వేషన్ విధానం అమలు చేస్తున్నాం. కమ్యూనిటీ రిజర్వేషన్లు పూర్తయిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్లలో అభ్యర్థులను ఎంపికచేస్తాం. నిబంధనల ప్రకారం ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ప్రక్రియను పూర్తిచేస్తాం.

ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్‌మెంట్ చేయడానికి క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉందా?

- పోలీస్ శాఖలో ఏటా 2వేలమంది పదవీ విరమణ చేస్తుంటారు. అయితే గతంలో రిక్రూట్‌మెంట్‌లో జాప్యం, ఇతర కారణాలవల్ల ఆలస్యం అయ్యేది. ప్రస్తుతం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఆరు నుంచి ఏడు నెలల్లో పూర్తిచేయనున్నాం. ఏటా క్యాలెండర్ ప్రకటించి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను చేపట్టాలన్నదే టీఎస్‌పీఎల్‌ఆర్‌బీ లక్ష్యం.

ఆర్ట్స్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న విమర్శ..?

- సిలబస్‌ను నిపుణుల కమిటీ తయారుచేసింది. ముఖ్యంగా అభ్యర్థులకు అర్థమెటిక్, రీజనింగ్ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు. పదోతరగతి స్థాయిలో అంశాలను మాత్రమే ఇస్తున్నాం.అర్థమెటిక్, రీజనింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాల్లో పట్టు సాధిస్తే చాలు ఈ పేపర్‌లో మంచి మార్కులు సాధించవచ్చు. ఆర్ట్స్ విద్యార్థులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరుగదు. గత రిక్రూట్‌మెంట్ డాటా పరిశీలిస్తాం. ఏవైనా తేడాలుంటే ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా సిలబస్ ప్రకారం, కొంత సరళతరంగా పేపర్లను రూపొందించేలా చూస్తాం.

అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు?

- అభ్యర్థులు ఎటువంటి పుకార్లను నమ్మవద్దు. ఎటువంటి సందేహం వచ్చినా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుంది. పరీక్షల సమయంలో ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు పనిచేస్తుంది. ఎవరు కూడా బ్రోకర్లను నమ్మవద్దు. పరీక్షలో కార్బన్ కాపీ ఇస్తున్నాం. కాబట్టి అభ్యర్థులకు ఏ సందేహం అక్కర్లేదు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల విషయంలో ఎంసెట్ ఏ పద్ధతిలో నిర్వహిస్తున్నామో ఆ విధంగానే పోలీస్ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తున్నాం. అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని ముందురోజే చూసుకుంటే మంచిది. సమయానికంటే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. మరో ప్రధాన విషయం దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌ను రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే వరకు మార్చకుండా ఉండాలి. అంతేకాకుండా పాస్‌వర్డ్, మొబైల్ నంబర్ వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. అభ్యర్థులు పోషక అహారాన్ని నిత్యం తీసుకోవడం, రెగ్యులర్‌గా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడం మంచిది. ఎటువంటి అపోహలకు, అనుమానాలకు తావు ఇవ్వకుండా పరీక్షకు సిద్ధం కావడం ముఖ్యం. కేవలం ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉంటుంది. లాంగ్వేజెస్‌ను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయవద్దు. వీటిలో అర్హత సాధిస్తేనే తర్వాతి దశకు ఎంపికవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
గడసంతల శ్రీనివాస్

1814
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles