భారతదేశ అభివృద్ధి వ్యూహాలు


Wed,June 13, 2018 12:14 AM

-పారిశ్రామికీకరణ సాధించడం, ఆదాయ ఆస్తుల్లో అసమానతలను తగ్గించడం, ఆర్థికశక్తిని వికేంద్రీకరించడం ద్వారా సామ్యవాద దిశగా త్వరతగతిన ఆర్థికాభివృద్ధిని సాధించడం దేశ ప్రణాళికల ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యాలను సాధించడానికి భారత ప్రణాళికా సంఘం వివిధ వ్యూహాలను అనుసరించింది.

మహలనోబిస్ వృద్ధి నమూనా

-మొదటి పంచవర్ష ప్రణాళికను ఎలాంటి వ్యూహాన్ని ఆధారం చేసుకోకుండా ప్రారంభించారు. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఒక వ్యూహాన్ని అనుసరించారు. భారత ప్రణాళిక రచనకర్తగా భావించే మహలనోబిస్ రష్యా ప్రణాళిక ఆధారంగా రెండో పంచవర్ష ప్రణాళికకు వ్యూహాన్ని రూపొందించారు. దీన్ని భారీ పరిశ్రమల వ్యూహం (హెవీ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ) అంటారు. నెహ్రూ కూడా త్వరితగతిన పారిశ్రామికీకరణ సాధించాలంటే యంత్రాలను నిర్మించే పారిశ్రామికీకరణ అవసరమన్నారు.
industry

మహలనోబిస్ వ్యూహంలో లాభాలు

1) దేశంలో పుష్కలంగా లభించే సహజవనరులు, మానవ వనరులు పారిశ్రామికీకరణ చేపట్టడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తాయి.
2) జనాభాలో ఎక్కువ భాగం వ్యవసాయంపై ఆధారపడి ఉండటంతో ఈ రంగంలో శ్రామికుల ఉత్పాదకత తక్కువ లేదా శూన్యంగా ఉంటుంది. పారిశ్రామికీకరణ సాధించి శ్రామికులను పారిశ్రామిక రంగానికి తరలించినట్లయితే వారి ఉత్పాదకత పెరుగుతుంది.
3) వ్యవసాయ రంగంలో కంటే పారిశ్రామిక రంగంలో శ్రామికుల ఉత్పాదకత హెచ్చుగా ఉంటుంది. అందువల్ల జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం త్వరితగతిన పెరుగుతాయి.
4) వ్యవసాయ వస్తువుల కంటే పారిశ్రామిక వస్తువులకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం హెచ్చుగా ఉంటుంది.
-మహలనోబిస్ ప్రతిపాదించిన భారీ పరిశ్రమల నమూనా త్వరితగతిన మూలధన సంచయనాన్ని సాధించడానికి, శ్రామిక ఉత్పాదకతను పెంచడానికి, ఆర్థిక వ్యవస్థలో స్వావలంబన సాధించడానికి దోహదం చేస్తుంది.
-నెహ్రూ-మహలనోబిస్ వ్యూహం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరించి ప్రైవేట్ రంగానికి కూడా అభివృద్ధిలో తగినంత పాత్రను కల్పించింది.
-జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న (1977-80) కాలం మినహాయించి మిగిలిన అన్ని కాలాల్లో మహలనోబిస్ ప్రతిపాదించిన భారీపరిశ్రమల వ్యూహాన్ని దేశ పంచవర్ష ప్రణాళికల్లో అమలుపర్చారు.
-దీనివల్ల దేశం గాఢమైన ఆర్థిక వ్యవస్థను సాధించగలిగింది. అయినప్పటికీ ఈ వ్యూహం అనేక ప్రతిబంధకాలకు దారితీసింది. ద్రవ్యోల్బణ అదుపుతప్పింది. ప్రభుత్వరంగ పరిమాణం పెరిగినప్పటికీ సమర్థతను పెంచుకోలేదు. అధిక మూలధన ఉత్పత్తి నిష్పత్తి కలిగిన ఆర్థిక వ్యవస్థగా మారింది. దేశంలో నిరుద్యోగులు, పేదరికం, ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగాయి.

గాంధేయ వృద్ధి నమూనా

-ప్రొ. ఎస్‌ఎన్ అగర్వాల్ 1944లో గాంధేయ వృద్ధి నమూనాను ప్రతిపాదించారు. దేశ బహుజనావళికి మూలాధార వసతులను కల్పించి వారి భౌతిక, సాంస్కృతిక జీవన ప్రమాణాన్ని పెంపొందించడమే గాంధేయ వ్యూహం ముఖ్య ఉద్దేశం. వ్యవసాయాన్ని, చిన్నతరహా కుటీర పరిశ్రమలను అభివృద్ధిచేసి దేశ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది ఈ వృద్ధి నమూనా లక్ష్యం.
-మూలాధార కీలక పరిశ్రమలను భారీతరహా పరిశ్రమలుగా స్థాపించి మిగిలిన అన్నింటినీ చిన్నతరహా రంగంలో స్థాపించాలనేది గాంధేయ వ్యూహం. దీనిప్రకారం ఆర్థికశక్తి కేంద్రీకృతం కాకుండా ఆదాయాన్ని ఆస్తులను సమానంగా పంపి ణీ చేయాలి.
-1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఈ నమూనాను అమలుపరిచింది. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలను ఇచ్చింది. ప్రతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుచేసింది.

సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వ్యూహం (LPG)

-1991లో ప్రవేశపెట్టిన ఈ ప్రక్రియను ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవలంబించే మరో వ్యూహంగా భావించవచ్చు.
-ఆర్థిక సంస్కరణలు మూడు ప్రతిపాదనలకు సంబంధించిన అంశం.
1) ప్రైవేటీకరణ: ప్రభుత్వరంగ సంస్థలను, వాటి విధులను ప్రైవేటు రంగం పరం చేయడం
2) సరళీకృత విధానాలు: ప్రభుత్వ ఆంక్షలు, నియంత్రణలు సడలించి పారిశ్రామిక ద్రవ్య, విత్త, విదేశీ విధానం, విదేశీ పెట్టుబడుల్లో ఉదార వైఖరి పాటించడం
3) ప్రపంచీకరణ: మూలధనం, సాంకేతిక విజ్ఞానం, శ్రామిక గమనశీలతపై ఆంక్షలు తొలగించి స్వేచ్ఛావిధానం ద్వారా గ్లోబల్ గ్రామానికి మార్గం సుగమం చేయడం

-ప్రైవేటీకరణ ప్రక్రియ కింది అంశాల పరిధిలో జరుగుతుంది.
1) స్వల్పకాల రాబడులు, ఆదాయం పెంచడానికి ప్రైవేటీకరణ చేపట్టరాదు. ఫలితంగా వినియోగదార్లకు నష్టాలు కలగవచ్చు.
2) ఆస్తుల అమ్మకం, లంచగొండితనం, వ్యక్తిగత లాభాలు, ఒత్తిడులు లేకుండా పోటీ ద్వారా ధర నిర్ణయం జరగాలి.
3) ప్రైవేటీకరణ ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు ప్రజాసంక్షేమం, జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించకూడదు.
4) నూతన యాజమాన్యం నుంచి శ్రామికుల భద్రత గురించి తగిన హామీ పొందడం తప్పనిసరి.
5) ప్రైవేటీకరణ రాజ్యాంగ విధానాలకనుగుణంగా అందరికీ ఆమోదయోగ్యంగా జరగాల్సిన రాజకీయ ప్రక్రియ.

ప్రపంచీకరణ నాలుగు అంశాల పరిధిలో జరుగుతుంది

1) వివిధ దేశాల మధ్య వస్తుసేవలు స్వేచ్ఛగా ప్రవహించడానికి ఉన్న అవరోధాలను తగ్గించడం
2) ప్రపంచ దేశాల మధ్య మూలధనం స్వేచ్ఛగా ప్రవహించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడం
3) రాజకీయ సరిహద్దులు దాటి సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచమంతా ప్రవహించడానికి అనుమతించడం
4) ప్రపంచ దేశాల మధ్య శ్రామికుల గమనశీలత జరగడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించడం

పురా నమూనా

-మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పట్టణ ప్రాంతాల సదుపాయాలను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించేలా పురా (ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ అమెనిటీస్ ఇన్ రూరల్ ఏరియా) నమూనా ప్రతిపాదించాడు.
-2004, ఫిబ్రవరి 5న ఈ నమూనాకు సంబంధించిన వ్యూహాన్ని వెలిబుచ్చాడు. 2020 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ చేరడానికి దీన్ని తీసుకువచ్చారు.
-గ్రామాలు సమగ్ర అభివృద్ధి సాధించడంలో 5 అంశాలను సూచించారు.
1) ఆహారధాన్యాల ఉత్పత్తిని 360 మిలియన్ టన్నులకు చేర్చాలి.
2) నమ్మదగిన, నాణ్యమైన విద్యుచ్ఛక్తిని దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేయాలి.
3) ప్రజలందరికీ విద్య, ఆరోగ్యం అందించాలి.
4) విద్యను పెంచడానికి, జాతీయ సంపదను సృష్టించడానికి సమాచారం, సంచార వసతులను గ్రామీణ ప్రాంతాలకు విస్తృతపరచాలి.
5) అణుశక్తి రంగం, అంతరిక్ష పరిజ్ఞానం, రక్షణరంగం వంటి వ్యూహాత్మక రంగాలను అభివృద్ధి చేయాలి.
-గ్రామీణ ప్రాంతాల సముదాయాల మధ్య అనుసంధానం పెంచి, వాటిని ప్రగతిపథంలో నడిపించడానికి నాలుగు రంగాల మధ్య అనుసంధానాన్ని పెంపొందించాలి. అవి..
1) భౌతిక అనుసంధానం
2) ఎలక్ట్రానిక్ అనుసంధానం
3) పరిజ్ఞాన అనుసంధానం
4) ఆర్థిక అనుసంధానం

పురా నమూనా అమలు

-2003లో ఆనాటి ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇస్తూ దేశంలో 5000 పురా బ్లాకులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి బ్లాక్‌లో లక్ష జనాభా ఉంటుంది.
-10వ పంచవర్ష ప్రణాళికలో ప్రతి బ్లాకుకు రూ. 20,000 కేటాయించారు. ఇందులో ప్రభుత్వ వాటా 50 శాతం ఉంటుంది. అంటే మొత్తం 5000 పురా బ్లాకులకు ప్రభుత్వరంగ కేటాయింపు సుమారు రూ. 50,000 కోట్లు ఉంటాయి.
-పురా నమూనా 2020 సంవత్సరానికి ఒక దీర్ఘ ప్రణాళిక. సమగ్ర సాంఘిక, ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి, గ్రామీణ పట్టణాల మధ్య ఉండే అంతరాన్ని తగ్గించాలని ఉద్దేశించిన ఈ పురా నమూనాకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం 2004, జనవరి 20న లభించింది. 2004-05లో ఒక పురా బ్లాకుకు రూ. 3 కోట్ల వంతున 4000 పురా బ్లాకులకు రూ. 12,000 కోట్లు కేటాయించారు.
-ఏఎం ఖుస్రో కూడా కలాం లాగానే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ అవస్థాపనా సౌకర్యాలు లభించే పట్టణ ప్రాంతాలకు ప్రజలు వలస వెళ్లడాన్ని నివారించడానికి గ్రామీణ ప్రాంతాలకే అవస్థాపనా సౌకర్యాలను తరలించడం ఉత్తమం అని చెప్పారు.

మాదిరి ప్రశ్నలు

1. సంతులిత వృద్ధిని బలపర్చినవారు? (4)
1) రోడాన్ 2) మాథుర్
3) రగ్నార్ నర్క్స్ 4) మహలనోబిస్
2. ఒక దేశం ఆర్థికంగా వెనుకబడి ఉండటానికి ముఖ్య కారణం? (1)
1) మూలధన సంచయనం 2) అధిక జనాభా
3) సహజ వనరులు 4) పెట్టుబడి లోపం
3. జవహర్‌లాల్ నెహ్రూ ప్రణాళికల్లో కింది వాటిలో దేనికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు? (3)
1) నూతన పరిజ్ఞానం ద్వారా వ్యవసాయం
2) శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు
3) భారీ, మౌలిక వసతులు
4) చిన్నతరహా పరిశ్రమలు
4. మహలనోబిస్ అభివృద్ధి వ్యూహంవల్ల సంభవించిన దుష్పరిణామాలేవి? (4)
ఎ. మూలధన సాంద్ర పరిశ్రమలకు పెద్దపీట వేయడంతో నిరుద్యోగ సమస్య పెరిగింది
బి. అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి ఉపాధి కల్పనకు ఆస్కారం లేకపోవడంతో నిరుద్యోగం, దారిద్య్రం పెరిగాయి
సి. యంత్ర పరికరాలను దిగుమతి చేసుకోవడంతో చెల్లింపుల శేషం లోటు పెరిగిపోయింది
డి. మూలధన సాంద్ర విధానాలవల్ల సంపద
కేంద్రీకరణ జరిగింది
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పట్టణ ప్రాంతాల సదుపాయాలను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించేలా పురా (ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ అమెనిటీస్ ఇన్ రూరల్ ఏరియా) నమూనా ప్రతిపాదించాడు. 2004, ఫిబ్రవరి 5న ఈ నమూనాకు సంబంధించిన వ్యూహాన్ని వెలిబుచ్చాడు. 2020 నాటికి అభివృద్ధిచెందిన దేశాల జాబితాలో భారత్ చేరడానికి దీన్ని తీసుకువచ్చారు.
girder

897
Tags

More News

VIRAL NEWS

Featured Articles