కరెంట్ అఫైర్స్


Wed,June 13, 2018 12:13 AM

telangana


childLine

బాలల హెల్ప్‌లైన్ 1098

తెలంగాణలో బాలల రక్షణకు పోలీస్‌శాఖ 1098 హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. చిన్నారులు ఆపదలో ఉన్నారని ఈ నంబర్‌కు ఫోన్‌చేస్తే పోలీసులు తక్షణమే వారిని ఆదుకునే దిశగా చర్యలు చేపడుతారు. పిల్లలపై ఎవరైనా హింస, అఘాయిత్యం, బాల్య వివాహాలు, యాచన చేయించడం వంటి చర్యలకు పాల్పడినప్పుడు, తప్పిపోయినా లేదా అనాథ బాలలు ఎదురైనప్పుడు ఈ నంబరుకు ఫోన్ చేయవచ్చు.

ఫ్రేయర్ ఎనర్జీకి అవార్డు

హైదరాబాద్‌కు చెందిన ఫ్రేయర్ ఎనర్జీ సంస్థ స్మార్ట్ విలేజ్ అవార్డుకు ఎంపికైంది. గిరిజన ప్రాంతాల్లో సౌర విద్యుత్‌ను అందిస్తున్నందుకు కేంద్ర పరిశ్రమలశాఖ, ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీవో), నాస్కామ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించాయి.

Sports


Simona-Halep

విజేతలు హలెప్, నాదల్

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల టైటిల్‌ను రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ కైవసం చేసుకుంది. రన్నరప్‌గా అమెరికా క్రీడాకారిణి స్లోన్ స్టీఫెన్స్ నిలిచింది. 1978లో రొమేనియాకు చెందిన వర్జినా రుజుకి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచింది. 26 ఏండ్ల తర్వాత హలెప్ టైటిల్‌ను సాధించింది.
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల టైటిల్‌ను స్పెయిన్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు. రన్నరప్‌గా ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్ నిలిచాడు. ఇది నాదల్‌కు 11వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. మొత్తం కెరీర్‌లో 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సాధించాడు.

బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు పతకాలు

ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు లాల్బియాకిమా, సచిన్ కాంస్యం దక్కించుకున్నారు.
ఈ టోర్నీ కజకిస్థాన్‌లో జరిగింది.

విరాట్ కోహ్లీకి ఉమ్రిగర్ అవార్డు

బీసీసీఐ వార్షిక అవార్డులను ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాడికి ఇచ్చే పాలి ఉమ్రిగర్ అవార్డుకు 2016-17, 2017-18 సీజన్‌లకు కోహ్లీ ఎంపికయ్యాడు. వుమన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి 2016-17 సీజన్‌కుగాను హర్మన్‌ప్రీత్‌కౌర్, 2017-18 సీజన్‌కు స్మృతి మంధనను ఎంపికచేసింది. రంజీ ట్రోఫీ(2017-18)లో అత్యధిక పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, అత్యధిక వికెట్లు తీసిన జలజ్ సక్సేనా.. మాధవరావు సింధియా అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ ఆల్‌రౌండర్‌గా లాలా అమర్‌నాథ్ పురస్కారాన్ని జలజ్ సక్సేనా అందుకోనున్నాడు.

టుస్సాడ్స్‌లో కోహ్లీ మైనపు బొమ్మ

ఢిల్లీలో ఏర్పాటైన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఢిల్లీ టుస్సాడ్స్‌లో ఇప్పటికే కపిల్‌దేవ్, ఉసేన్ బోల్ట్, మెస్సీ వంటి దిగ్గజ క్రీడాకారుల బొమ్మలను ఏర్పాటు చేశారు.

National


virat-kohli

ఫోర్బ్స్ జాబితాలో విరాట్

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం ఆర్జించే టాప్-100 క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి 83వ స్థానం దక్కింది. తొలి ఐదు స్థానాల్లో మేవెదర్ (బాక్సింగ్), మెస్సి (ఫుట్‌బాల్), రొనాల్డో(ఫుట్‌బాల్), మెక్‌గ్రెగార్ (బాక్సింగ్), నెయ్‌మార్(ఫుట్‌బాల్) ఉన్నారు.

కొత్త గ్రహాన్ని కనుగొన్న ఇస్రో

భూమికి 600 కాంతి సంవత్సరాల దూరంలో కె2-236 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఓ గ్రహాన్ని అహ్మదాబాద్‌లోని ఇస్రో భౌతిక పరిశోధన ప్రయోగశాలకు చెందిన ప్రొఫెసర్ అభిజిత్ చక్రవర్తి బృందం కనుగొన్నది. ఈ గ్రహానికి కె2-236బి అని నామాకరణం చేశారు. తాజా ఆవిష్కరణతో కొత్తగా గ్రహాలను కనుగొన్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది. మౌంట్ అబూ గురుశిఖర్ అబ్జర్వేటరీలోని పారాస్ స్పెక్టోగ్రాఫ్ ద్వారా ఈ గ్రహాన్ని కనుగొన్నారు.

ప్రపంచ శాంతి సూచీ

ప్రపంచ శాంతి సూచీ - 2018ని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (ఐఈపీ) విడుదల చేసింది. మొత్తం 163 దేశాల్లోని పరిస్థితిని విశ్లేషించగా తొలి మూడు స్థానాల్లో ఐస్‌లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియాలు ఉన్నాయి. శాంతి లేని దేశంగా చివరి స్థానంలో సిరియా ఉంది. భారతదేశానికి 136వ స్థానం లభించింది. 2016లో 141వ స్థానం వచ్చింది.

చైనాతో రెండు ఒప్పందాలు

జూన్ 9న భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్... చింగ్‌డావ్‌లో సమావేశమయ్యారు. బ్రహ్మపుత్ర నదీ జలాల సమాచారం ఇవ్వడానికి చైనా అంగీకారం తెలుపగా, చైనాకు బాస్మతియేతర బియ్యం ఎగుమతి చేయడంపై ఒప్పందం కుదిరింది.

persons


Tilak

పుతిన్‌కు చైనా పురస్కారం

చైనా అత్యున్నత పురస్కారం ఫ్రెండ్‌షిప్ మెడల్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు జూన్ 8న బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రదానం చేశారు. శాంతియుతమైన ప్రపంచం కోసం పుతిన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. 2017లో రష్యా అత్యున్న పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూని జిన్‌పింగ్‌కు పుతిన్ ప్రదానం చేశారు.

మాజీ ఎంపీ తిలక్ మృతి

భారత్‌లో ఏర్పడిన మొదటి పార్లమెంట్ సభ్యుల్లో ఒకరైన కందాళ సుబ్రహ్మణ్య తిలక్ జూన్ 8న మృతిచెందారు. 1952 నుంచి 1957 వరకు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఆయన సోషలిస్ట్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు.

అనుపమ్‌ఖేర్‌కు అవార్డు

ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ (ఐఫా) జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్‌కు ప్రకటించారు. ఈ ఏడాది బ్యాంకాక్‌లో జరిగే ఐఫా వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

చిన్న వయసు రచయిత

అసోంలోని ఉత్తర లఖింపూర్ జిల్లాకు చెందిన నాలుగేండ్ల అయాన్ గగోయ్ గోహెయిన్ అనే బాలుడు అతిపిన్న వయసున్న రచయితగా గుర్తింపు పొందాడు. దీంతోపాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ అయాన్ చోటు సంపాదించుకున్నాడు. హనీకాంబ్ పేరుతో అయాన్ రాసిన పుస్తకం ఈ ఏడాది జనవరిలో ప్రచురితమైంది.

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా మహేశ్

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగో డిప్యూటీ గవర్నర్‌గా మహేశ్ కుమార్ జైన్ నియమితులయ్యారు. మూడేండ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.

International


Sco

ఎస్‌సీవో సదస్సు

జూన్ 9, 10 తేదీల్లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు - 2018ను చైనాలో ని క్వింగ్‌డావ్‌లో నిర్వహించారు. ఈ సదస్సులో సభ్యదేశాలైన చైనా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, రష్యా, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, భారత్, పాకిస్థాన్ దేశాల ప్రభుత్వాధినేతలు పాల్గొన్నారు. గత ఏడాది జూన్ 9న కజకిస్థాన్‌లోని ఆస్తానాలో జరిగిన ఎస్‌సీవో సదస్సులో భారత్, పాకిస్థాన్‌లు పూర్తికాల సభ్యదేశాలుగా చేరాయి.

ప్రవాసులకు ఎలిజబెత్ అవార్డులు

బ్రిటన్‌లోని 33 మంది ప్రవాస భారతీయులకు మహారాణి ఎలిజబెత్-2 జన్మదిన పురస్కారాలు ప్రకటించారు. వైద్యుడు సత్యజిత్ భట్టాచార్యకు లెఫ్టినెంట్ ఆఫ్ ద రాయల్ విక్టోరియన్ ఆర్డర్ పురస్కారం, మానసిక వైద్యుడు జస్వీందర్‌సింగ్ బామ్రాకు కమాండ్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్‌లెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ అంపైర్ అవార్డును ప్రకటించారు.

సూపర్ కంప్యూటర్ సమిట్

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ సమిట్‌ను అమెరికా ఆవిష్కరించింది. సెకనుకు 2 లక్షల ట్రిలియన్ల గణన చేసేలా దీన్ని రూపొందించారు. చైనాకు చెందిన సన్‌వే తైహులైట్ రికార్డులను సమిట్‌బద్దలుకొట్టింది. దీని గణన శక్తి సెకనుకు 93,000 ట్రిలియన్లు. అమెరికాకు చెందిన సూపర్ కంప్యూటర్ టైటన్ కంటే సమిట్ ఏడు రెట్లు వేగవంతమైంది. ఈ రెండు సూపర్ కంప్యూటర్లను ఓక్‌రిడ్జ్ నేషనల్ ల్యాబ్‌లో ఏర్పాటు చేశారు.

ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా మరియా

ఈక్వెడార్ విదేశాంగ మంత్రి మరియా ఫెర్నాండా ఎస్పినోసగార్సెస్ ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2018 సెప్టెంబర్ నుంచి ఏడాదిపాటు కొనసాగనున్న 73వ సెషన్‌కు ఆమె నేతృత్వం వహిస్తారు. సాధారణ అసెంబ్లీకి నేతృత్వం వహిస్తున్న నాలుగో మహిళగా మరియా గుర్తింపు పొందారు. మొదటిసారిగా 1953లో భారత్‌కి చెందిన విజయలక్ష్మి పండిట్ సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1969లో లైబీరియాకు చెందిన ఎలిజబెత్ బ్రూక్స్, 2006లో బహ్రెయిన్‌కు చెందిన షేకా హయా రషెద్ అల్ ఖలీఫ్‌లు అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో మొత్తం 198 సభ్య దేశాలు ఉన్నాయి.

జీ-7 దేశాల సదస్సు

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జీ-7 దేశాల సదస్సు కెనడాలోని లామాల్బెలో జూన్ 8, 9 తేదీల్లో జరిగింది. ఇందులో సభ్యదేశాలు కెనడా, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యూకే. ఇవి ప్రపంచ వాణిజ్యంలో 60 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో జీ-8గా వ్యవహరించేవారు. క్రిమియాను ఆక్రమించడంతో 2014లో రష్యాను బహిష్కరించారు.
Vemula-Saidulu

3580
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles