గ్రూప్-1లో ఎకానమీ


Tue,June 12, 2018 11:33 PM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఇప్పుడు వచ్చే గ్రూప్-1లో ఎన్నో మార్పులు, చేర్పులు, కొత్త పద్ధతులు ఉండే అవకాశం ఉంది. గ్రూప్-1 సిలబస్‌ను యూపీఎస్సీ పరీక్షకు అనుగుణంగా మార్చే ప్రక్రియలో ఇది తొలిమెట్టు కావొచ్చు. ఒకవేళ సిలబస్‌ను యథావిధిగా కొనసాగించినా.. ప్రశ్నలు అడిగే తీరు, దాని పర్యవసానాల్లో మాత్రం కచ్చితంగా సమూల మార్పులు ఉండవచ్చు. అంటే ఈసారి గ్రూప్-1 ఎంతో ప్రతిష్ఠాత్మకమే కాకుండా ఎంతో వైవిధ్యంగా ఉండబోతుంది. మరి ఇలాంటి అత్యున్నత పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి? అందునా అత్యంత కష్టమనుకునే ఎకనామీలాంటి ముఖ్యమైన సబ్జెక్టులో ఎలా పట్టు సాధించాలి? ఏం చదవాలి? ఏం చదవద్దు? మొదలైన అంశాలన్నింటిని కూలంకషంగా చర్చించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

గ్రూప్-1 సిలబస్ - ఎకానమీ పాత్ర

-150 మార్కుల ప్రిలిమినరీలో ఎకానమీకి ప్రాధాన్యం ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో మొత్తం 150 మార్కులకు 13 అంశాలు ఉంటాయి. అంటే ఒక్కో అంశానికి దాదాపు 10 నుంచి 12 మార్కులు ఉంటాయి. ఈ 13 అంశాల్లో మూడు అంశాలు ప్రత్యక్షంగా మరో మూడు అంశాలు పరోక్షంగా ఎకానమీకి సంబంధించినవి.
ప్రత్యక్ష అంశాలు
1. కరెంట్ అఫైర్స్ - ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ఎకానమీ అంశాలు
2. భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి
3. తెలంగాణ రాష్ట్ర విధానాలు

పరోక్ష అంశాలు

1. అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు (దాదాపు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, రిపోర్టులు, వర్తమాన సమావేశాల గురించే ఎక్కువ అంశాలు ఉంటాయి)
2. భారతదేశంలో ప్రభుత్వ విధానాలు
3. లింగ, కుల, తెగ, వికలాంగుల హక్కులు, సమ్మిళిత విధానాలు
-పై అంశాలన్నీ ఎకానమీకి సంబంధించినవే. అంటే దాదాపు 30 నుంచి 40 మార్కులకు ఎకానమీ గురించి అడిగే అవకాశం ఉంది.

ప్రిలిమినరీ ప్రిపరేషన్

-ప్రిలిమినరీకి ఎకానమీలో ఉన్న మొదటి అంశం కరెంట్ అఫైర్స్. ఎకానమీలో జీడీపీ వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం, బడ్జెట్, ప్రభుత్వ పథకాలు, కరెంట్ ఖాతాలోటు, ద్రవ్యలోటు, డిమానిటైజేషన్, రేటింగ్ సంస్థలు మొదలైనవి.
-భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి అంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు, వృద్ధి పర్యవసానాలు, ప్రభుత్వ పథకాలు, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక సదుపాయాలు మొదలైనవి చదవాలి.
-ఇక మూడో అంశం : తెలంగాణ రాష్ట్ర విధానాలు అంటే తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ పథకాలైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, టీఎస్-ఐపాస్, ఐటీఐఆర్ మొదలైనవి. ఇక భారతదేశంలో ప్రభుత్వ విధానాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను అధ్యయనం చేయాలి.

మెయిన్స్‌లో ఎకానమీ పాత్ర

-గ్రూప్-1 మెయిన్స్ పేపర్-1లో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. అందులో సెక్షన్-1లోని రెండో అంశం ఆర్థిక వృద్ధి, న్యాయం వంటివి పూర్తిగా ఎకానమీకి సంబంధించినవి. ఇది 50 మార్కులకు ఉంటుంది.
-పేపర్-2 సెక్షన్-1లో మూడో చాప్టర్‌లో బ్రిటిష్ ఇండియాలో భూమిశిస్తు విధానాలు, వ్యవసాయ వ్యాపారీకరణ, దుర్భిక్షాలు, పేదరికం, డి-ఇండస్ట్రియలైజేషన్, సంపద తరలింపు, వర్తక వాణిజ్యాల వృద్ధి, భారతదేశ ఆర్థిక రూపాంతరం, రైలు, రోడ్లు, రవాణా, కమ్యూనికేషన్ నెట్‌వర్క్- టెలిగ్రాఫ్, పోస్టల్ సేవలు. పై అంశాలన్నీ చరిత్ర ఎకానమీ కలగలిపి చదవాలి. అంటే దాదాపు 10 మార్కులు పూర్తిగా ఎకానమీకి సంబంధించినవే.
-ఇక సెక్షన్-2లో మూడో అంశం సాలార్‌జంగ్ సంస్కరణలు, నిజాం పాలనలో సామాజిక-ఆర్థిక అభివృద్ధి, భూ విధానాలు, ఏడో నిజాం కాలంలో సామాజిక ఆర్థిక అభివృద్ధి, రైల్వేలు, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ ఎదుగుదల, పరిశ్రమలు, విద్యా సంస్థ స్థాపన మొదలైనవన్నీ ఎకానమీ అంశాలే.

ఏం చదవాలి?

-ఎస్సేకి సంబంధించి- వర్తమాన అంశాలు, న్యూస్‌పేపర్, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ రిపోర్టులు
-ఇక పేపర్-2లో బ్రిటిష్ ఇండియాలో భారత ఆర్థిక వ్యవస్థ అనే టాపిక్‌పై బిపిన్ చంద్ర బుక్, ఎన్‌సీఈఆర్‌టీ- 11వ తరగతి, ఇగ్నో బుక్స్ చదవాలి.
-ఇక మూడో అంశం తెలంగాణ చరిత్ర, సాలార్జంగ్ సంస్కరణలు, భూ అంశాలు మొదలైన వాటికోసం తెలుగు అకాడమీ- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పోటీ పరీక్షల ప్రత్యేకం చదవాలి.
-ఇక పేపర్-2 సెక్షన్ -3లో భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ అంశాలన్నీ వర్తమాన ఎకానమీ అంశాలతోపాటు చదవాలి. ప్రతి చాప్టర్ ఎకానమీపై అవగాహన లేకుండా చదవడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు. అందుకోసం సెక్షన్-3 మొత్తం భారతదేశం, తెలంగాణ ఆర్థిక సర్వే, తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వేలను క్షుణ్ణంగా చదవాలి.

పేపర్-3

-పేపర్-3 సెక్షన్-1లో మూడో అంశం, ఐదో అంశం, సెక్షన్-2లో రెండో అంశం, సెక్షన్-3- గవర్నెన్స్‌లో మూడో, నాలుగో అంశాలను కూడా ఎకానమీ అంశాలతో కలిపే చదవాలి.

పేపర్-4

-ఇక గ్రూప్-1 మెయిన్స్‌లో ఎకానమీ ఒక ప్రత్యేక పేపర్‌గా 150 మార్కులు కేటాయించారు. ఇందులో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. అవి..
సెక్షన్-1 - భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
సెక్షన్-2 - తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
సెక్షన్-3 - అభివృద్ధి, పర్యావరణ సమస్యలు

పేపర్-5

-పేపర్-5లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావంలో తెలంగాణ ఎకానమీ ప్రధాన పాత్ర వహిస్తుంది. అందులో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎకానమీ, 1969కి ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితి, లలిత్ కుమార్ కమిటీ, వశిష్ఠ భార్గవ కమిటీ, 1980లో ఆర్థిక సంస్కరణలు, 1991లో ఎల్‌పీజీ సంస్కరణలు మొదలైనవి ఆర్థిక వ్యవస్థకు సంబంధించివే అని గమనించాలి.

పేపర్-4 ఎకానమీ ఎలా చదవాలి?

-ప్రత్యేకంగా ఎకానమీ కోసమే ఉన్న పేపర్ ఇది. ఇది 150 మార్కులకు సంబంధించి మిగతా ఎకానమీ అంశాలన్నింటిపై పట్టు సాధించడానికి ఎంతో అవకాశం ఉన్న అత్యంత ముఖ్యమైన పేపర్.

సెక్షన్-1 - భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి

-మొత్తం ఐదు చాప్టర్లలో జాతీయ ఆదాయ భావనలు, దాని లెక్కింపు ధోరణులు, పేదరికం, నిరుద్యోగిత, వాటి వివిధ భావనలు, ద్రవ్యం, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు, నీతి ఆయోగ్‌కి సంబంధించిన అంశాలు.
-పై అంశాలన్నీ ఆర్థికశాస్త్ర మౌలిక ప్రాథమిక భావనలపై ఆధారపడిన అంశాలు కాబట్టి ఎకానమీ బేసిక్స్ మొత్తం చదవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి తెలుగు అకాడమీ- బీఏ మొదటి సంవత్సరం పుస్తకం, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పుస్తకంతో పాటు వివిధ రచయితల ప్రైవేట్ పబ్లికేషన్స్ పుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నా అవి సంపూర్తిగా మాత్రం లేవు.

సెక్షన్-2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ

-ఈ సెక్షన్‌లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎకానమీ, హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఎకానమీ, మానవ వనరులు, భూ సంస్కరణలు, వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల గురించి, తెలంగాణ ప్రభుత్వ విధానాల గురించి సమగ్ర సిలబస్ ఇచ్చారు. దీనిలో తెలంగాణ చరిత్ర, ఉద్యమంపై పూర్తి అవగాహనతోపాటు నూతన తెలంగాణలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవలరంగం పరిస్థితిని పూర్తిగా చదవాలి.
-ఈ సెక్షన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావ అంశాల కోసం తెలుగు అకాడమీ పుస్తకాలను, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పోటీ పరీక్షల ప్రత్యేకం, తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం -2016, తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ఎకానమీ చట్టాలు- భూ సంబంధ, ఐటీ సంబంధ, టీఎస్ ఐ-పాస్, ప్రభుత్వ పథకాలు మొదలైనవన్నీ సమగ్రంగా చదవాలి.

సెక్షన్-3 - అభివృద్ధి-పర్యావరణ సమస్యలు

-ఈ సెక్షన్‌లో పర్యావరణం వర్సెస్ అభివృద్ధి, సహజ వనరులు, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ కాలుష్యం, ప్రపంచ పర్యావరణ సమస్యలు అనే అంశాలు ఇచ్చారు.
-ఈ సెక్షన్‌కి సంబంధించి పర్యావరణ అంశాల నిర్వచనాలు, దాని వివిధ అంశాలు, దానితో అభివృద్ధికి ఉన్న సంబంధం, అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు చదవాలి.
-ఈ అంశం కోసం తెలుగు అకాడమీ బీఏ మొదటి సంవత్సరం ఎకానమీ, శంకర్ ఐఏఎస్ ఎన్విరాన్‌మెంట్, తెలంగాణ పర్యావరణ శాఖ వెబ్‌సైట్, భారత పర్యావరణ శాఖ వెబ్‌సైట్, వర్తమాన రిపోర్ట్స్ బేసిక్స్‌పై సంపూర్ణ అవగాహన ఉండే పుస్తకాలను చదవాలి.
-నాలుగో పేపర్‌లో ఉన్న మూడు సెక్షన్లకు మార్కెట్‌లో ఏది సమగ్రమైన పుస్తకం లేకపోవడం, ఉన్న వాటిలో కాన్సెప్ట్స్, స్టాటిస్టిక్స్ సరైన విధంగా ఇవ్వకపోవడం, తెలుగు మీడియం పుస్తకాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పేపర్ కొంత కఠినంగా అనిపిస్తుంది. కానీ, ఒక పద్ధతి ప్రకారం పై అంశాలన్నింటిని వివిధ సోర్సుల నుంచి సేకరించి ఇవ్వగలిగితే ఈ పేపర్‌లో పూర్తి మార్కులు సాధించవచ్చు. అందుకోసమే నిపుణ ఈ ప్రయత్నాన్ని అతి త్వరగా మొదలు పెట్టింది.
-ముగింపు: మొత్తంగా ప్రిలిమ్స్‌లో 40-50 మార్కులు, మెయిన్స్‌లో పేపర్-1లో 50 మార్కులు, పేపర్-2లో 40 మార్కులు, పేపర్-3లో 40 మార్కులు, పేపర్-4లో 150 మార్కులు, పేపర్-6లో మరో 40 మార్కులు కలుపుకుని దాదాపు 300 మార్కులు ఎకానమీ మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎకానమీపై పట్టు సాధించడం అత్యంత అవశ్యకమని అభ్యర్థులు ఇప్పటి నుంచే గమనించి ప్రిపేర్ అవ్వడం గ్రూప్-1 విజయానికి తొలిమెట్టు. వచ్చేవారం పేపర్-4, సెక్షన్-1లో ఉన్న భారత ఆర్థికవ్యవస్థ గురించి, ఎకానమీ ప్రాథమిక భావనలపై వివరణ ఉంటుంది.

ప్రిలిమినరీకి చదవాల్సిన పుస్తకాలు

-ప్రిలిమినరీ ఎకానమీలో అతి తక్కువ కోర్ అంశాలు, అతి ఎక్కువ వర్తమాన అంశాలు ఉంటాయి కాబట్టి న్యూస్ పేపర్‌ను ఫాలో కావడం తప్పనిసరి. న్యూస్‌పేపర్‌తోపాటు ప్రభుత్వ ప్రకటనలు, పథకాల సమగ్ర సమచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను దర్శించడం, ప్రభుత్వ రిపోర్టులు, అంతర్జాతీయ సంస్థల రిపోర్టులు- ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, డబ్ల్యూటీవో, యూఎన్‌వో మొదలైనవి, బడ్జెట్, ఆర్థిక సర్వే, కుల గణన, మౌలిక భావనలు.
రిఫరెన్స్ పుస్తకాలు
1. ఎకానమీ కీ కాన్సెప్ట్స్- శంకర్ గణేషన్ (ఇంగ్లిష్ మీడియం)
2. తెలుగు అకాడమీ బీఏ మొదటి సంవత్సరం- మైక్రో ఎకానమీ (సూక్ష్మ అర్థశాస్త్రం)
3. తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం - ఎకనామిక్స్ (తెలుగు, ఇంగ్లిష్ మీడియం)
4. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనవర్సిటీ- సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం- ఎంఏ
5. ఎన్‌సీఈఆర్‌టీ- 12వ తరగతి స్థూల అర్థశాస్త్రం

ఎకానమీ ఎందుకంత ముఖ్యం

-గ్రూప్-1 ప్రిలిమినరీ, మెయిన్స్ కలిపి కేవలం ఎకానమీ నుంచే 350కిపైగా మార్కులు ఉండటం. ప్రత్యేకంగా ఉన్న 150 మార్కుల పేపర్ కాకుండా అదనంగా హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ ఎస్సే మొదలైనవి కలుపుకొని ఎకానమీకి ప్రాధాన్యం ఉండటం.
-ఎకానమీ స్టాటిస్టిక్స్ ప్రిపరేషన్ కాకుండా వర్తమాన అంశాలన్నింటిని కలిపి చదవాలనే కాన్సెప్ట్ ఉండటం.
-ఉదాహరణకు బ్యాంకింగ్ రీక్యాపిటలైజేషన్ గురించి చదవాలంటే దాని నేపథ్యం, ప్రస్తుతం జరుగుతున్న అంశాలన్నీ కలిపి చదవాలనే నియమం ఉండటం.

పరీక్ష విధానం

-గ్రూప్-1లో మొత్తం మూడు దశలు ఉంటాయి.
1. ప్రిలిమినరీ
2. మెయిన్స్
3. ఇంటర్వ్యూ
-ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష.
-ప్రిలిమినరీలో 150 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నల్లో దాదాపు 100-120 మార్కులు సాధించినవారు మెయిన్స్‌కి అర్హత సంపాదించవచ్చు.
-మెయిన్స్‌లో ఆరు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున 900 మార్కులు ఉన్నాయి.
-అదనంగా 150 మార్కులకుగాను ఇంగ్లిష్ క్వాలిఫయింగ్ పరీక్ష ఉంటుంది.
-ఇంటర్వ్యూకు 100 మార్కులు.
-1000 మార్కుల్లో దాదాపు 50 నుంచి 60 శాతం మార్కులు సంపాదించినవారికి విజయం లభిస్తుంది.
-900 మెయిన్స్ మార్కుల్లో దాదాపు 350కిపైగా మార్కులు ఎకనామీకి సంబంధించినవే ఉన్నాయి.
ఎకానమీపై పట్టున్నవారే విజేతలు
-గ్రూప్-1లో విజేతలైన ప్రతి ఒక్కరూ ఎకానమీలో పట్టున్నవారే. ఎందుకంటే ఎకానమీ కోర్ అంశాలు, వర్తమాన అంశాలు బాగా తెలిసినవారే అన్ని పేపర్లను బాగా రాయగలరు.
-ఉదాహరణకు జనరల్ వ్యాసంలో మహిళా సాధికారత గురించి కానీ, పేదరికం గురించి కానీ, నిరుద్యోగం గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ రాయాలంటే కచ్చితంగా ఎకానమీ నుంచి నిర్వచనాలు రాయాలి. అంటే ఎకానమీ తెలిసినవారు మాత్రమే జనరల్ ఎస్సే బాగా రాయగలరు.
-తెలంగాణకు నిధులు, నీళ్లు, నియామకాల్లో జరిగిన అన్యాయాలు ఎకానమీ తెలిసినవారు మాత్రమే రాయగలరు.
-అలాగే భారత ఎకానమీ చరిత్ర, సమకాలీన అంశాలు, అంతర్జాతీయ పరిణామాలు ఇలా ఏ అంశం తీసుకున్నా ఎకానమీతోపాటుగానే చదవాలి.

ప్రిలిమ్స్‌లో 40-50 మార్కులు, మెయిన్స్‌లో పేపర్-1లో 50 మార్కులు, పేపర్-2లో 40 మార్కులు, పేపర్-3లో 40 మార్కులు, పేపర్-4లో 150 మార్కులు, పేపర్-6లో మరో 40 మార్కులు కలుపుకుని దాదాపు 300 మార్కులు ఎకానమీ మీదనే ఆధారపడి ఉన్నాయి.
prabhakar

1326
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles