నిజాం రాష్ట్రంలో దళితోద్యమాలు


Wed,May 16, 2018 06:00 AM

జాయిన్ ఇండియా ఉద్యమం

-ఈ ఉద్యమ నాయకులు స్వామి రామానందతీర్థ. ఈయన అసలు పేరు వెంకటరావు ఖడ్గేకర్. 1932లో స్వామి నారాయణ అనే గురువు ఈయనకు సన్యాస దీక్ష ఇచ్చి స్వామి రామానందతీర్థ అని పేరు పెట్టారు. ఈయన గుల్బర్గా జిల్లాలోని ఝావర్గీ తాలుకా సింధీ గ్రామంలో జన్మించారు. స్వామి రామానందతీర్థ రాజకీయాల్లోకి ప్రవేశించి తన నివాసాన్ని మోమినాబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్చారు. 1938, సెప్టెంబర్‌లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్‌ను స్థాపించారు. దీన్ని నిజాం ప్రభుత్వం నిషేధించింది. ఇందుకు నిరసనగా రామానందతీర్థ 1938, అక్టోబర్ 27న నిరాహార దీక్ష చేసి అరెస్టు అయ్యారు.
-1947 భారత స్వాతంత్రోద్యమ సమయంలో నిజాం రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని జాయిన్ ఇండియా లేదా విలీనోద్యమం నిర్వహించారు. నిజాం సంస్థానంలోని మూడు భాషా ప్రాంతాలకు వేర్వేరు కార్యనిర్వాహక సమితులను ఏర్పరిచిన తర్వాత స్వామి రామానందతీర్థ హైదరాబాద్‌కు చేరుకుని జాయిన్ ఇండియా యూనియన్ పేరిట సత్యాగ్రహాన్ని 1947, ఆగస్టు 7న ప్రారంభించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ.. స్వామి రామానందతీర్థకు అందజేసిన భారత జాతీయ పతాకాన్ని ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు సుల్తాన్‌బజార్‌లో మంత్రి మోతీలాల్ ఎగురవేశారు. ఈ సందర్భంలో స్వామితోపాటు డాక్టర్ జీఎస్ మేల్కోటే, కృష్ణాచారి జోషి, జమలాపురం కేశవరావులను అరెస్టు చేశారు.

ఆదిహిందూ, దళితోద్యమాలు

-ఆదిహిందూ ఉద్యమం భారతదేశ పెద్ద సంస్థానాల్లో ఒకటైన హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన అస్థిత్వ ఉద్యమం. హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలన కింద ఉండేది. నిజాం రాజ్యంలో జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు తమ ప్రాంతాల్లో విస్తృతమైన అధికారాలు చెలాయించేవారు. సమాజంలో వెట్టిచాకిరి, అస్పృశ్యత, దేవదాసీ వ్యవస్థ, బాల్యవివాహాలవల్ల అనేక సమస్యలు ఉండేవి.
-తెలంగాణ ప్రాంతంలో జాగీర్దార్లకు ప్రజలు, ముఖ్యంగా అణగారిన కులాలవారు వెట్టి చేసేవారు. కమ్మరి, కుమ్మరి, కోమటి, గొల్ల, కురుమ, మాల, మాదిగలు ఉచితంగా వీరికి సేవలందించే ఆచారం ఉండేది. దళితులు బేగారీలుగా, నీరడిలుగా కట్టెలు కొట్టడం, బండ్లు పట్టణాలకు చేరవేయడం వంటి పనులు అధికారులకు ఉచితంగా చేయాలనేవారు. ఈవిధంగా వెట్టి, భగేలా పద్ధతి దళితుల పరిస్థితిని చాలా దుర్భరం చేసింది. తెలంగాణ పల్లెల్లో దళిత శ్రామిక స్త్రీల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తరతరాలుగా దళిత స్త్రీలపై అమలు చేస్తున్న జోగినీ వ్యవస్థ, దేవుడి పేరిట స్త్రీలపై జరిగే అగ్రకుల దౌర్జన్యానికి పరాకాష్ఠ. ఇవేకాక అనేక మూఢాచారాలు పల్లెల్లో ప్రబలంగా ఉండేవి. బాణామతి, చిల్లంగి, చేతబడి వంటివి చేస్తున్నారనే నెపంతో దళిత స్త్రీలను చిత్రహింసలకు గురిచేసేవారు. వ్యవసాయ మహిళా కూలీలపై లైంగిక దోపిడీ భూస్వామ్య విధానంలో భాగమై ఉండేది.
-దళితులపై వివక్షకు వ్యతిరేకంగా ఆర్యసమాజ్, ఆంధ్రమహాసభలు తమవంతు కృషిచేశాయి. బలవంతంగా దళితులను ఇస్లాంలోకి మార్చడాన్ని ఆర్యసమాజ్ నిలువరించి శుద్ధి కార్యక్రమాల ద్వారా తిరిగి వారిని హిందూమతంలోకి తీసుకువచ్చారు. ఇదేకాక అనేక మంది ఆర్యసమాజ సేవకులు రాయ్‌బాల్ ముకుంద్, కేశవరావు కొరాట్కర్, లాల్‌జీ మేఘ్‌జీలు సంఘ సంస్కరణలో భాగంగా హరిజనోద్యమం ప్రధానంగా చేపట్టారు.
1930లో మొదలైన ఆంధ్ర మహాసభల్లో అస్పృశ్యత, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. ఒక సమావేశంలో వెట్టిచాకిరీ అనే లఘు పుస్తకం వెట్టికి వ్యతిరేకంగా ప్రచురించబడింది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వెట్టికి వ్యతిరేకంగా ఫర్మానా తీసుకువచ్చాడు. దీనిలో వెట్టి పనులు చేసినవారికి ఇనాంలు ఇచ్చాడు. ప్రతిఫలం లేకుండా పని చేయించరాదని ఫర్మానా స్పష్టంచేసింది. కానీ, ఈ ఫర్మానా కాగితం వరకే పరిమితమైంది. ఈ విధానం చాలాకాలం కొనసాగింది.
Kavi

ఆదిహిందూ ఉద్యమం - భాగ్యరెడ్డి వర్మ పాత్ర

-హైదరాబాద్ రాజ్యంలో దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ అంటరానితనానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆదిహిందూ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి ఆద్యుడు మాదరి భాగ్యరెడ్డి వర్మ.
-1888, మే 22న హైదరాబాద్‌లో రంగమాంబ, మాదరి వెంకయ్య దంపతులకు భాగ్యరెడ్డి వర్మ జన్మించాడు. ఇతని అసలు పేరు భాగయ్య.
-దేశంలో తామే మూల వాసులమని, ఆ మూలవాసులే రేడులు అంటే రెడ్లు అని తన పేరుకు రెడ్డి అనే పదాన్ని చేర్చుకున్నాడు.
-1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించాడు. విద్యకు నోచుకోని దళితులకు విద్యాబుద్ధులు నేర్పడం, క్రమశిక్షణ, వ్యాయామం, దళితులను సంఘటితపర్చడం జగన్ మిత్రమండలి కార్యక్రమాలు.
-1910లో దళితుల్లో ధార్మిక నైతిక ప్రబోధ కోసం వైదిక ధర్మ ప్రచారిణి సభను స్థాపించాడు.
-1911లో జగన్ మిత్రమండలి పరిధిని విస్తృతపరిచి మన్య సంఘాన్ని ఏర్పరిచాడు. 1913లో దీన్ని ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్‌గా మార్చాడు.
-1913లో ఆర్యసమాజ సేవకుడు బాజీ కృష్ణారావు భాగ్యరెడ్డికి ఆర్యసమాజ దీక్ష ఇచ్చి వర్మ బిరుదు ఇచ్చాడు.
-సికింద్రాబాద్‌లో జరిగిన సమావేశంలో భాగ్యరెడ్డి వర్మ అనేక మంది దళితులను బ్రహ్మ సమాజంలో చేర్పించాడు.
-1913లో బౌద్ధం వైపు ఆకర్షితులైన భాగ్యరెడ్డి వర్మ వైశాఖ పౌర్ణమి రోజు మొదటిసారిగా బుద్ధజయంతి నిర్వహించాడు.
-బుద్ధ జయంతిని ప్రతి సంవత్సరం నిర్వహించేవారు. వర్మ నేతృత్వంలో చివరి బుద్ధ జయంతి 1937, మే 25న జరిగింది. దీనికి నిజాం ప్రభుత్వ న్యాయశాఖ సభ్యుడు రాజా బహద్దూర్ రాయ్ బిశ్వేశ్వరనాథ్ అధ్యక్షత వహించగా, గౌతమ బుద్ధుడి పంచశీలను ఆచరించాల్సిందిగా సభికులను కోరుతూ వర్మ ఉపన్యసించాడు.
-భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ రాష్ట్రంలోనే కాక ఆంధ్ర ప్రాంతంలో కూడా దళితుల ఆత్మగౌరవ ఉద్యమానికి ఆద్యుడయ్యాడు.
-విజయవాడలో 1917లో జరిగిన పంచమ సదస్సుకు అధ్యక్షత వహించి తన అధ్యక్షోపన్యాసంలో పంచమ శబ్దాన్ని ఖండించాడు. పంచమ శబ్దం వేదాల్లో, పురాణాల్లో లేదని, అగ్రకుల హిందూ ప్రయోజనాల కోసమే దాన్ని సృష్టించారని చెప్పాడు. పంచమ, వరయలుగా పిలిచే దళితులను ఆది ఆంధ్రులుగా పిలువాలని తీర్మానించారు.
-దళితులు హిందూవర్గంలో భాగం కాదని భాగ్యరెడ్డి వర్మ భావించారు. ఇతని నిరంతర కృషివల్ల మద్రాస్ ప్రభుత్వం స్పందించి 1922, మార్చి 25న జీవో 817ను విడుదల చేసింది.
-దీని ప్రకారం దక్షిణ భారతంలో నివసించే ప్రాచీన జాతులను పంచమ, వరయలుగా పిలువడం ఆపివేయాలని, ఆ పదాలను ప్రభుత్వ రికార్డుల నుంచి తొలిగించాలని, తమిళ ప్రాంతాల్లో ఆది ద్రావిడ, తెలుగు ప్రాంతాల్లో ఆది ఆంధ్రులుగా పిలువాలని స్పష్టం చేసింది.
-హైదరాబాద్‌లోనూ వర్మ చేసిన ప్రయత్నంవల్ల నిజాం ప్రభుత్వం 1931 జనాభా లెక్కల్లో అంటరాని వర్గాలను ఆది హిందువులుగా పేర్కొంది.
-భాగ్యరెడ్డి వర్మ 1911లో స్థాపించిన మన్య సంఘాన్ని 1922లో ఆదిహిందూ సామాజిక సేవా సమాఖ్య అని మార్చి దాని మొదటి సదస్సును ఏటీజే పాపన్న అధ్యక్షతన హైదరాబాద్‌లో నిర్వహించారు.
-ఈ సమావేశంలో బొంబాయి, పుణె, కరాచీ, అకోలా, అమరావతి, నాగ్‌పూర్, మద్రాస్, కోస్తా ప్రాంతాల నుంచి దళిత ప్రతినిధులు పాల్గొన్నారు.
-ఈ సమావేశంలో అగ్రవర్ణ సంస్కర్తలైన జస్టిస్ రాయ్, సీ బాలముకుంద్, పండిత్ కేశవరావ్ కొరాట్కర్, ఘోష్, సేఠ్ లాల్జీ, మేఘ్‌జీ, ప్రొఫెసర్ వెల్లివర్, ఆర్‌ఈ రిపోర్టర్ పాల్గొని ప్రసంగించారు.
-రెండోరోజు అన్ని కులాలకు చెందిన 900 మంది సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
-ఈ సమావేశంలో కుసుమ ధర్మన్న మాకొద్దీ నల్ల దొరతనము అని పాటలు పాడారు.

అరిగె రామస్వామి

-ఇతడు భాగ్యరెడ్డి వర్మ సమకాలికుడు. హైదరాబాద్ రాష్ట్రంలో దళితుల చైతన్యానికి, కుల వివక్షతకు వ్యతిరేకంగా కృషి చేశాడు.
-రామస్వామి సికింద్రాబాద్‌లోని కుమ్మరివాడలో సునీత బాల సమాజాన్ని, నాంపల్లిలో మాతంగి మహాసభను ప్రారంభించాడు.
-ఇతడు మద్యపాన నిషేధం, జోగినీ వ్యవస్థ నిర్మూలన కోసం ఉద్యమించాడు.
-దళితుల్లో ఉన్న మూఢ విశ్వాసాలు, జంతుబలులు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు.
-రామస్వామి అచల సిద్ధాంతాన్ని ఆచరించాడు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాన్ని నమ్మాడు. అయినా దళితులు, హిందువులు వేర్వేరు అని భావించాడు.
-1922లో ఆదిహిందూ జాతీయోన్నతి సభను స్థాపించాడు. దీనికి రామస్వామి ఉపాధ్యక్షుడిగా, కొండా వెంకటస్వామి అధ్యక్షుడిగా జే పాపయ్య మరో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
-సేవా భావంతో స్థాపించిన ఈ సంస్థ ఆదిహిందూ సమాజోద్ధరణకు కృషిచేసింది. అంతేకాక దేవాదాసీ వ్యవస్థ నిర్మూలనకు పనిచేసింది.
-అరిగె రామస్వామి మాల బాలికను దేవదాసీగా చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టి మాదిగ అబ్బాయితో వివాహం జరిపించి రెండు కులాల మధ్య సయోధ్య కాంక్షించాడు.
-తర్వాతి కాలంలో అరుంధతీయ మహాసభను స్థాపించి మాదిగ కులాల్లో చైతన్యాన్ని కలిగించాడు. అరిగె రామస్వామి సంస్కర్తే కాదు కవి కూడా.
-ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ తరఫున పోటీచేసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఎన్నికైన తొలి దళితుడు అరిగె రామస్వామి.

1262
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles